న్యూఢిల్లీ: దేశ రాజధాని ఢిల్లీలో వాయు కాలుష్యం అంతకంతకూ పెరిగిపోతూ, గాలి నాణ్యత అధ్వానంగా మారడంపై సుప్రీంకోర్టు తీవ్ర అగ్రహం వ్యక్తం చేసింది. ఢిల్లీ, ఎన్సీఆర్ పరిధిలో కాలుష్యాన్ని నివారించేందుకు కఠిన చర్యలు అమలు చేయడంతో ఎందుకు ఆలస్యం చేస్తున్నారంటూ ఆప్ ప్రభుత్వంపై మండిపడింది.
గాలి నాణ్యత సూచీ (AQI) 300 కంటే ఎక్కువ పెరిగిపోతుంటే ఏం చేస్తున్నారని ప్రశ్నించింది. అంత దాటే వరకు ఎందుకు వేచి చూశారని ప్రశ్నించింది. అలాగే.. స్టేజ్-4 ఆంక్షల అమలులో ఆలస్యంపై నిలదీసింది. మూడు రోజులు ఆలస్యం ఎందుకు అయిందని అడిగింది.
గాలి నాణ్యత 'సీవియర్ ప్లస్' కేటగిరీకి చేరిన దేశ రాజధానిలో.. గ్రేడెడ్ రెస్పాన్స్ యాక్షన్ ప్లాన్ (జీఆర్‌ఏపీ) అమలులో జాప్యం చేయడంపై ఢిల్లీ ప్రభుత్వంతోపాటు కేంద్ర కమిషన్‌ను (ఎయిర్ క్వాలిటీ మేనేజ్‌మెంట్ కమిషన్)పై సుప్రీంకోర్టు తీవ్రంగా మందలించింది. కోర్టు నుంచి తదుపరి ఆదేశాలు వచ్చే వరకు స్టేజ్-4 ఆంక్షలు అమలులో ఉంటాయని అత్యున్నత న్యాయస్థానం తెలిపింది.
దేశ రాజధానిలో వాయు కాలుష్యాన్ని అరికట్టేందుకు చర్యలు తీసుకోవాలని కోరుతూ దాఖలైన పిటిషన్‌పై విచారణ సందర్భంగా సర్వోన్నత న్యాయస్థానం ఈ వ్యాఖ్యలు చేసింది. చాలా ప్రాంతాల్లో ఏక్యూఐ 400 దాటిందని.. 400 దిగువన ఉన్నా ఆంక్షలు అమలు చేయాలని సుప్రీంకోర్టు చెప్పింది.
కాగా ఢిల్లీలో వాయు నాణ్యత ప్రమాదకర స్థాయికి దిగజారింది. ఈ సీజన్‌లో తొలిసారి 'సీవియర్ ప్లస్'కి పడిపోయింది. దీంతో ప్రభుత్వం కాలుష్య నియంత్రణ మండలి నాలుగో దశ గ్రేడెడ్ రెస్పాన్స్ యాక్షన్ ప్లాన్‌ను (జీఆర్‌పీఏ) అమలు చేస్తోంది. ఈ కాలుష్య నివారణ ప్రణాళిక సోమవారం ఉదయం 8 గంటల నుంచి అమలులోకి వచ్చింది.
దీని ప్రకారం నగరం పరిధిలో ట్రక్కుల ప్రవేశంపై నిషేధాన్ని విధిస్తారు. అలాగే ప్రభుత్వ నిర్మాణాలను తాత్కాలికంగా నిలిపివేస్తారు. ఉద్యోగుల్లో సగం మంది మాత్రమే విధులకు హాజరవ్వాలని, మిగిలిన వారు వర్క్ ఫ్రం హోం చేయాలని అధికారులు ఆదేశించారు. 10, 12 తరగతులు మినహా మిగిలిన తరగతులకు ఆన్‌లైన్‌లో తరగతులు నిర్వహించాలని స్పష్టంచేశారు.
సిస్టం ఆఫ్ ఎయిర్ క్వాలిటీ అండ్ వెదర్ ఫోర్‌కాస్టింగ్ అండ్ రీసెర్చ్ డేటా ప్రకారం.. ఢిల్లీ ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్ సోమవారం ఉదయం 481గా ఉంది. దేశ రాజధానిలోని 35 మానిటరింగ్ స్టేషన్‌లలో అత్యధికంగా 400 ఏక్యూఐ నమోదైంది, ద్వారకలో అత్యధికంగా 499గా నమోరైంది.
Comments
Please login to add a commentAdd a comment