ఢిల్లీలో కాలుష్య కట్టడికి అదొక్కటే మార్గం: కేంద్రానికి మంత్రి లేఖ | Artificial rain needed: Delhi flags air emergency seeks Centre nod | Sakshi
Sakshi News home page

ఢిల్లీలో కాలుష్య కట్టడికి కృత్రిమ వర్షమే ఏకైక పరిష్కారం: కేంద్రానికి మంత్రి లేఖ

Published Tue, Nov 19 2024 3:40 PM | Last Updated on Tue, Nov 19 2024 4:50 PM

Artificial rain needed: Delhi flags air emergency seeks Centre nod

న్యూఢిల్లీ:  దేశ రాజధాని ఢిల్లీలో వాయు కాలుష్యం ప్రమాదకర స్థాయికి చేరిన నేపథ్యంలో.. పర్యావరణశాఖ మంత్రి గోపాల్‌ రాయ్‌ కేంద్రానికి ఓ లేఖ రాశారు. వాయు కాలుష్యాన్ని కట్టడి చేసేందుకు కృత్రిమ వర్షం కురిపించడం ఒక్కటే ఏకైక పరిష్కారమని ఆయన పేర్కొన్నారు.రాజధానిలో కృత్రిమ వర్షం కురిపించేలా ప్రధాన మంత్రి నరేంద్ర మోది జోక్యం చేసుకోవాలని కోరారు.

కేంద్రానికి రాసిన లేఖను చూపుతూ విలేఖరుల సమావేశంలో మంత్రి మాట్లాడారు. ‘ఉత్తర భారతాన్ని పొగ పొరలు కమ్మేశాయి. దీని నుంచి విముక్తికి కృత్రిమ వర్షమే ఏకైక పరిష్కారం. ఇది మెడికల్‌ ఎమర్జెన్సీ. ఈ విషయమై కేంద్ర పర్యావరణ శాఖ మంత్రి భూపేంద్ర యాదవ్‌కు అనేక సార్లు లేఖలు రాశాను. అయినా వారు పట్టించుకోలేదు. కాలుష్య నియంత్రణకు కేంద్రం చర్యలు తీసుకోవాలి. ఈ విషయంలో ప్రధాన మంత్రి మోదీ జోక్యం చేసుకోవాలి. వాయు కాలుష్యాన్ని కట్టడి చేయడానికి ఓ అత్యవసర సమావేశం ఏర్పాటు చేయాలి. ఇది ఆయన నైతిక బాధ్యత.

ఢిల్లీలో కృత్రిమ వర్షంపై కృత్రిమ వర్షంపై గత ఆగస్టు, సెప్టెంబర్, అక్టోబర్‌లోనూ లేఖలు రాశాం. ఈ రోజు వరకు నాలుగు లేఖలు పంపినప్పటికీ కేంద్ర పర్యావరణ మంత్రి భూపేంద్ర యాదవ్‌ఒక్క సమాశం కూడా ఏర్పాటు చేయలేదు. ఈ సమస్యకు స్పష్టమైన పరిష్కారం చూపాలి. లేనిపక్షంలో మంత్రి పదవికి రాజీనామా చేయాలి’ అని డిమాండ్‌ చేశారు.

కాగా దేశ రాజధాని ఢిల్లీ తీవ్రమైన వాయుకాలుష్యం, పొగమంచుతో ఉక్కిరిబిక్కిరవుతోంది. ఎయిర్‌ క్వాలిటీ ఇండెక్స్‌ (ఏక్యూఐ) 494కు పడిపోయింది. చాలా ప్రాంతాల్లో ఇది ఏకంగా 500 మార్క్‌ను దాటిపోయింది. ఆరేళ్లలో కాలుష్యం ఈస్థాయికి చేరడం ఇది రెండోసారి మాత్రమే.  తీవ్రమైన వాయుకాలుష్యంతో కళ్లలో మంటలు, గొంతులో గరగర, శ్వాస ఆడకపోవడం తదితర సమస్యలతో ఢిల్లీ వాసులు అవస్థలు పన్నారు. పొగమంచు కారణంగా ఎదురుగా వస్తున్న వాహనాలు కన్పించని పరిస్థితి నెలకొంది.

కృత్రిమ వ‌ర్షం అంటే..?
కృత్రిమ వ‌ర్షాన్ని క్లౌడ్ సీడింగ్ అని కూడా అంటారు. ఈ విధానంతో వాతావరణంలో మార్పును తీసుకువ‌స్తారు. గాలిలో నీటి బిందువులు ఏర్పడేలా ఈ ప్రక్రియ‌ను కొన‌సాగిస్తారు. సిల్వర్ ఐయోడైడ్‌, పొటాషియం ఐయోడైడ్ లాంటి ప‌దార్థాల‌ను గాలిలోకి వ‌దులుతారు. దీని కోసం విమానాన్ని కానీ హెలికాప్టర్‌ను కానీ వాడే అవ‌కాశం ఉంటుంది. అయితే ఈ ప్రక్రియ స‌క్సెస్ కావాలంటే, ఆ ప‌రీక్ష స‌మ‌యంలో వాతావ‌ర‌ణంలో తేమ చాలా అవ‌స‌రం అవుతుంది. గాలి కూడా అనుకూలంగా ఉంటేనే ఈ ప్రయోగం స‌క్సెస్ అయ్యే అవ‌కాశాలు ఉన్నాయి. కృత్రిమ వ‌ర్షం వ‌ల్ల గాలిలో ఉన్న దుమ్ము, ధూళి సెటిల్ అవుతుంది. నీటితో ఆ డ‌స్ట్ కొట్టుకుపోయి.. ప‌ర్యావ‌ర‌ణం క్లీన్ అవుతుంది.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement