దేశ రాజధానిగా ఢిల్లీ ఇంకా కొనసాగాలా?: శశి థరూర్‌ | Should Delhi even remain India capital: Shashi Tharoor | Sakshi
Sakshi News home page

తీవ్ర వాయు కాలుష్యం.. ఢిల్లీ దేశ రాజధానిగా కొనసాగాలా?: శశి థరూర్‌

Published Tue, Nov 19 2024 12:45 PM | Last Updated on Tue, Nov 19 2024 1:24 PM

Should Delhi even remain India capital: Shashi Tharoor

న్యూఢిల్లీ: దేశ రాజధాని ఢిల్లీ తీవ్రమైన వాయుకాలుష్యం, పొగమంచుతో ఉక్కిరిబిక్కిరవుతోంది. ఎయిర్‌ క్వాలిటీ ఇండెక్స్‌ (ఏక్యూఐ) 494కు పడిపోయింది. చాలా ప్రాంతాల్లో ఇది ఏకంగా 500 మార్క్‌ను దాటిపోయింది. ఆరేళ్లలో కాలుష్యం ఈస్థాయికి చేరడం ఇది రెండోసారి మాత్రమే. 

దేశ రాజధానిలో వాయు కాలుష్యంపై కాంగ్రెస్‌ ఎంపీ శశిథరూర్‌ ఆందోళన  వ్యక్తం చేస్తూ కేంద్రంపై విమర్శలు గుప్పించారు  ఇలాంటి పరిస్థితుల్లో  దేశ రాజధానిగా ఢిల్లీ ఇంకా కొనసాగాల్సి ఉందా అని సందేహం వ్యక్తం చేశారు. ఈ మేరకు ఎక్స్‌లో ఆయన స్పందిస్తూ.. ‘ప్రపంచంలో రెండవ అత్యంత కలుషితమైన నగరమైన ఢాకా కంటే ఢిల్లీలో పరిస్థితి దాదాపు ఐదు రెట్లు అధ్వాన్నంగా ఉంది. ప్రపంచంలోనే అత్యంత కాలుష్య నగరంగా ఢిల్లీ మారింది. ఇక్కడ ప్రమాదకర కాలుష్య కారకాలు నాలుగు రెట్లు పెరిగాయి. 

ఈ పరిస్థితిని ఏళ్ల తరబడి చూస్తున్నా. కేంద్ర ప్రభుత్వం మాత్రం సమస్యను పరిష్కరించడంలో విఫలమవ్వడం విడ్డూరం. దేశ రాజధానిని ఎవరూ పట్టించుకోవడం లేదు. నవంబరు నుంచి జనవరి మధ్య ఈ నగరం నివాసయోగ్యంగానే ఉండట్లేదు. మిగతా సమయాల్లోనూ అంతంతమాత్రంగానే జీవనం సాగించగలం. ఇలాంటి పరిణామాల మధ్య ఢిల్లీని ఇంకా దేశ రాజధానిగా కొనసాగించాలా?’ అని పేర్కొన్నారు.

తీవ్రమైన వాయుకాలుష్యంతో కళ్లలో మంటలు, గొంతులో గరగర, శ్వాస ఆడకపోవడం తదితర సమస్యలతో ఢిల్లీ వాసులు అవస్థలు పన్నారు. పొగమంచు కారణంగా ఎదురుగా వస్తున్న వాహనాలు కన్పించని పరిస్థితి నెలకొంది. తీవ్ర వాయు కాలుష్యంతో ఢిల్లీ ఇప్పటికే పలు విమానాలు, రైళ్ల రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. 

ఈ క్రమంలో వాయు కాలుష్యంపై విచారణ జరిపిన సుప్రీంకోర్టు ఢిల్లీ ప్రభుత్వంపై మండిపడింది. రోజురోజుకు వాయు నాణ్యత క్షీణిస్తున్నా అధికారులు అలసత్వం ప్రదర్శించడం వల్ల తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తోందని ఆందోళన వ్యక్తంచేసింది. పరిస్థితి విషమించినా గ్రాప్‌–4 నిబంధనల అమలులో అధికారులు జాప్యం చేస్తున్నారంటూ ఆగ్రహం వెలిబుచ్చింది. ఏక్యూఐ 450 దిగువకు వచ్చినా గ్రాప్‌–4 నిబంధనలనే కొనసాగించాలని ఆదేశించింది. 

వాయు కాలుష్య తీవ్రతను దృష్టిలో పెట్టుకొని 10, 12వ తరగతులకు కూడా ఆన్‌లైన్‌లోనే క్లాసులు నిర్వహించాలని ఢిల్లీ ప్రభుత్వం నిర్ణయించింది. మంగళవారం నుంచి 10, 12 తరగతులకు కూడా ఆన్‌లైన్‌ కాస్టులనే నిర్వహిస్తామని ఢిల్లీ సీఎం ఆతిశి ‘ఎక్స్‌’లో వెల్లడించారు. వీరితో పాటు మిగతా కాస్లులకు ఇదివరకే అమలవుతున్నట్లుగా ఆన్‌లైన్‌ క్లాసులు ఉంటాయని తెలిపారు.

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement