న్యూఢిల్లీ: దేశ రాజధాని ఢిల్లీ కాలుష్య కోరల్లో చిక్కుకుంది. గత కొన్ని రోజులుగా ఢిల్లీ ఎన్సీఆర్ పరిధిలో వాయు కాలుష్యం తీవ్రస్థాయిలో నమోదవుతోంది. గడిచిన 24 గంటల్లో గాలి నాణ్యత సూచీ తీవ్రంగా పడిపోయింది. ఈ ఏడాది తొలిసారి ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్ 400 మార్క్‌ను అధిగమించి ‘తీవ్రమైన కేటగిరి’లోకి చేరింది. దీంతో నగర వాసులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. శ్వాస తీసుకోవడం వంటి అనారోగ్య సమస్యలు ఎదుర్కొంటున్నారు.
కేంద్ర కాలుష్య నియంత్రణ మండలి ప్రకారం.. బుధవారం ఢిల్లీలో గాలి నాణ్యత 429గా నమోదైంది. అయితే మంగళవారం సాయంత్రం AQI 334 వద్ద ఉండగా కేవలం 24 గంటల్లోనే కాలుష్యం తీవ్ర స్థాయిలో పెరిగింది. సెంట్రల్ పొల్యూషన్ కంట్రోల్ బోర్డ్ (సీపీసీబీ) ప్రకారం ఢిల్లీలోని 36 మానిటరింగ్ స్టేషన్లలో బుధవారం 30 'తీవ్రమైన' కేటగిరీలో ఉన్నాయి.
మంగళవారం సాయంత్రం వరకు వరుసగా 14 రోజుల పాటు నగరం యొక్క గాలి నాణ్యత 'చాలా పేలవంగా' ఉంది. వాహనాల నుంచి వెలువడే పొగ కాలుష్యానికి అతిపెద్ద కారణంగా( 15.4 శాతం) మారింది. దీనికితోడు పంజాబ్, హర్యానా వంటి చుట్టుపక్కల రాష్ట్రాలలో పంట వ్యర్థాలను తగలబెట్టడం పరిస్థితిని మరింత తీవ్రతరం చేసింది, నగరాన్నికాలుష్యపు పొగమంచులో కప్పేసింది.
కాగా గాలి నాణ్యత సున్నా నుంచి 50 మధ్య ఉంటే బాగా ఉన్నట్టు అర్ధం. 51 నుంచి 100 వరకు ఉంటే సంతృప్తికరమైనదని, 101 నుంచి 200 వరకు ఉంటే మధ్యస్థం, 201 నుంచి 300 ఉంటే తక్కువ నాణ్యత అని, 301 నుంచి 400 వరకు ఉంటే చాలా పేలవమైనదని, 401 నుంచి 450 వరకు ఉంటే తీవ్రమైనదని.. ఇక 450 కంటే ఎక్కువఉంటే ప్రమాదకరస్థాయిగా పరిగణిస్తారు.
Comments
Please login to add a commentAdd a comment