న్యూఢిల్లీని ముంచెత్తిన వాయుకాలుష్యం, పొగమంచు
దారుణంగా పడిపోయిన వాయునాణ్యత
ఢిల్లీలోని జహంగీర్‌పురీలో 500 దాటిన ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్
విమానాలు, రైళ్ల రాకపోకలపై ప్రభావం
ఆన్‌లైన్ మోడ్‌లోకి ఢిల్లీ ప్రైమరీ స్కూల్ క్లాసులు
సాక్షి, న్యూఢిల్లీ: అత్యల్ప ఉష్ణోగ్రతలకు దట్టంగా కమ్ముకున్న వాయుకాలుష్యం తోడవడంతో న్యూఢిల్లీలో గాలి గరళంగా మారుతోంది. రోజు రోజుకూ వాయు నాణ్యత క్షీణిస్తోంది. కేంద్ర వాతావరణ కాలుష్యనియంత్రణ మండలి గణాంకాల ప్రకారం విపరీతమైన వాయుకాలుష్యాన్ని సూచించే వాయునాణ్యతా సూచీ(ఏక్యూఐ) ఢిల్లీలో ఏకంగా 500 దాటింది. గురువారం ఢిల్లీలో 32 ప్రాంతాల్లో వాయుకాలుష్యం తీవ్రస్థాయికి చేరింది.
గురువారం ఢిల్లీవ్యాప్తంగా సగటున ఏక్యూఐ 428 కాగా జహంగీర్‌పురీలో 567, ఆనంద్‌విహార్, పంజాబీ బాగ్‌ల్లో 465గా నమోదైంది. ఢిల్లీలో గురువారం ఉష్ణోగ్రత కేవలం 16.1 డిగ్రీ సెల్సియస్‌గా నమోదైంది. శీతాకాలం కావడంతో జనాలకు రోడ్లపై వెళ్తుంటే ముందు ఏముందో కనిపించనంతగా దట్టంగా పొగమంచు కమ్ముకుంది. దట్టమైన పొగ కారణంగా ఢిల్లీ అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి 300లకు పైగా విమానాలు ఆలస్యంగా నడుస్తున్నాయి. 10 విమానాలను దారిమళ్లించారు.
రన్‌వేపై 400 మీటర్ల తర్వాత ఏముందో కనిపించనంతగా దృశ్యగోచరత(విజిబిలిటీ) తగ్గిపోయింది. దీనికారణంగా విమానాల టేకాఫ్, ల్యాండింగ్ చాలా కష్టంగా మారింది. దీంతో మీరు ప్రయాణించబోయే విమానాల రాకపోకలకు సంబంధించిన తాజా సమాచారాన్ని సంబంధిత ఎయిర్‌లైన్స్ నుంచి ఎప్పటికప్పుడు తెలుసుకోవాలని ఢిల్లీ అంతర్జాతీయ విమానాశ్రయం గురువారం తన ‘ఎక్స్’ ఖాతా ద్వారా ప్రయాణికులకు సూచించింది. పలు రైళ్ల రాకపోకలపైనా పొగమంచు, వాయుకాలుష్యం ప్రభావం పడింది. వాయునాణ్యత దారుణంగా పడిపోవడంతో ఢిల్లీవ్యాప్తంగా ఏక్యూఐను ఇంకా మూడో ‘తీవ్రం’ కేటగిరీలోనూ కొనసాగిస్తున్నారు.
గ్రాప్–3 నిబంధనలు అమల్లోకి
వాయుకాలుష్యం విపరీతంగా పెరగడంతో కట్టడి చర్యల్లో భాగంగా గ్రేడెడ్ రెస్పాన్స్ యాక్షన్ ప్లాన్(గ్రాప్)–3 నియమనిబంధనలను కాలుష్య నియంత్రణ మండలి అమల్లోకి తెచి్చంది. శుక్రవారం నుంచి ఢిల్లీ–ఎన్‌సీఆర్ పరిధిలో వీటిని కఠినంగా అమలుచేస్తామని వాయునాణ్యతా నిర్వహణ కమిషన్(సీఏక్యూఎం) గురువారం తెలిపింది. విద్యుత్, సీఎన్‌జీ, భారత్–6 ప్రమాణాల డీజిల్ బస్సులు మినహా ఇతర అంతర్రాష్ట బస్సులను ఎన్‌సీఆర్ రాష్ట్రాల నుంచి ఢిల్లీలోకి అనుమతించబోరు.చదవండి: ఢిల్లీని కమ్మేసిన పొగమంచు.. 300 విమానాల రాకపోకలపై ప్రభావం
నిర్మాణ, కూల్చివేత కార్యకలాపాలపై నిషేధం అమల్లో ఉంటుంది. గనుల తవ్వకాన్నీ ఆపేస్తారు. ఢిల్లీసహా గురుగ్రామ్, ఫరీదాబాద్, ఘజియాబాద్, గౌతమ్‌బుద్ధ్ నగర్ జిల్లాల్లో భారత్–3, భారత్–4 ప్రమాణాల డీజిల్ వాహనాల రాకపోకలను నిషేధించారు. అత్యధిక రద్దీ సమయాల్లో రోడ్లపై నీటిని చిలకరించనున్నారు. ఎవరికి వారు బైకులు, సొంత కార్లలో కాకుండా ప్రజారవాణా వ్యవస్థను వాడుకోవాలని సీఏక్యూఎం సూచించింది. ప్రైమరీ పాఠశాల విద్యార్థుల ఆరోగ్యంతోపాటు తరగతులను కోల్పోకూడదనే ఉద్దేశంతో ఐదోతరగతి వరకు ప్రైమరీ పాఠశాల క్లాసులను ఆన్‌లైన్‌లో చేపట్టాల్సి ఉంటుందని ఢిల్లీ ముఖ్యమంత్రి అతిశి చెప్పారు.
Comments
Please login to add a commentAdd a comment