Artificial rain
-
ఢిల్లీలో కాలుష్య కట్టడికి అదొక్కటే మార్గం: కేంద్రానికి మంత్రి లేఖ
న్యూఢిల్లీ: దేశ రాజధాని ఢిల్లీలో వాయు కాలుష్యం ప్రమాదకర స్థాయికి చేరిన నేపథ్యంలో.. పర్యావరణశాఖ మంత్రి గోపాల్ రాయ్ కేంద్రానికి ఓ లేఖ రాశారు. వాయు కాలుష్యాన్ని కట్టడి చేసేందుకు కృత్రిమ వర్షం కురిపించడం ఒక్కటే ఏకైక పరిష్కారమని ఆయన పేర్కొన్నారు.రాజధానిలో కృత్రిమ వర్షం కురిపించేలా ప్రధాన మంత్రి నరేంద్ర మోది జోక్యం చేసుకోవాలని కోరారు.కేంద్రానికి రాసిన లేఖను చూపుతూ విలేఖరుల సమావేశంలో మంత్రి మాట్లాడారు. ‘ఉత్తర భారతాన్ని పొగ పొరలు కమ్మేశాయి. దీని నుంచి విముక్తికి కృత్రిమ వర్షమే ఏకైక పరిష్కారం. ఇది మెడికల్ ఎమర్జెన్సీ. ఈ విషయమై కేంద్ర పర్యావరణ శాఖ మంత్రి భూపేంద్ర యాదవ్‌కు అనేక సార్లు లేఖలు రాశాను. అయినా వారు పట్టించుకోలేదు. కాలుష్య నియంత్రణకు కేంద్రం చర్యలు తీసుకోవాలి. ఈ విషయంలో ప్రధాన మంత్రి మోదీ జోక్యం చేసుకోవాలి. వాయు కాలుష్యాన్ని కట్టడి చేయడానికి ఓ అత్యవసర సమావేశం ఏర్పాటు చేయాలి. ఇది ఆయన నైతిక బాధ్యత.ఢిల్లీలో కృత్రిమ వర్షంపై కృత్రిమ వర్షంపై గత ఆగస్టు, సెప్టెంబర్, అక్టోబర్‌లోనూ లేఖలు రాశాం. ఈ రోజు వరకు నాలుగు లేఖలు పంపినప్పటికీ కేంద్ర పర్యావరణ మంత్రి భూపేంద్ర యాదవ్ఒక్క సమాశం కూడా ఏర్పాటు చేయలేదు. ఈ సమస్యకు స్పష్టమైన పరిష్కారం చూపాలి. లేనిపక్షంలో మంత్రి పదవికి రాజీనామా చేయాలి’ అని డిమాండ్ చేశారు.కాగా దేశ రాజధాని ఢిల్లీ తీవ్రమైన వాయుకాలుష్యం, పొగమంచుతో ఉక్కిరిబిక్కిరవుతోంది. ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్ (ఏక్యూఐ) 494కు పడిపోయింది. చాలా ప్రాంతాల్లో ఇది ఏకంగా 500 మార్క్‌ను దాటిపోయింది. ఆరేళ్లలో కాలుష్యం ఈస్థాయికి చేరడం ఇది రెండోసారి మాత్రమే. తీవ్రమైన వాయుకాలుష్యంతో కళ్లలో మంటలు, గొంతులో గరగర, శ్వాస ఆడకపోవడం తదితర సమస్యలతో ఢిల్లీ వాసులు అవస్థలు పన్నారు. పొగమంచు కారణంగా ఎదురుగా వస్తున్న వాహనాలు కన్పించని పరిస్థితి నెలకొంది.కృత్రిమ వర్షం అంటే..?కృత్రిమ వర్షాన్ని క్లౌడ్ సీడింగ్ అని కూడా అంటారు. ఈ విధానంతో వాతావరణంలో మార్పును తీసుకువస్తారు. గాలిలో నీటి బిందువులు ఏర్పడేలా ఈ ప్రక్రియను కొనసాగిస్తారు. సిల్వర్ ఐయోడైడ్, పొటాషియం ఐయోడైడ్ లాంటి పదార్థాలను గాలిలోకి వదులుతారు. దీని కోసం విమానాన్ని కానీ హెలికాప్టర్‌ను కానీ వాడే అవకాశం ఉంటుంది. అయితే ఈ ప్రక్రియ సక్సెస్ కావాలంటే, ఆ పరీక్ష సమయంలో వాతావరణంలో తేమ చాలా అవసరం అవుతుంది. గాలి కూడా అనుకూలంగా ఉంటేనే ఈ ప్రయోగం సక్సెస్ అయ్యే అవకాశాలు ఉన్నాయి. కృత్రిమ వర్షం వల్ల గాలిలో ఉన్న దుమ్ము, ధూళి సెటిల్ అవుతుంది. నీటితో ఆ డస్ట్ కొట్టుకుపోయి.. పర్యావరణం క్లీన్ అవుతుంది. -
ఢిల్లీ కాలుష్యం తగ్గించడానికి కృత్రిమ వర్షం?
ఢిల్లీ: ఢిల్లీలో వాయు నాణ్యత అడుగంటిపోతోంది. పొరుగు రాష్ట్రాల్లో పంట వ్యర్థాల దహనం, వాహన ఉద్గారాల వల్ల గత ఏడు రోజులుగా కాలుష్య స్థాయిలు విషమంగానే కొనసాగుతున్నాయి. గాలి నాణ్యత పెంచడానికి తక్షణ ఉపాయం ఆలోచించాలని సుప్రీంకోర్టు కూడా ప్రభుత్వాన్ని ఆదేశించింది. ఈ నేపథ్యంలో ఢిల్లీ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకునేలా కనిపిస్తోంది. నవంబర్ 20-21లో రెండు రోజుల పాటు ఢిల్లీలో కృత్రిమ వర్షం కురిపించాలని యోచిస్తోంది. ఐఐటీ కాన్పూర్ బృందంతో ఢిల్లీ పర్యావరణ మంత్రి గోపాల్ రాయ్, ఆర్థిక మంత్రి అతిషి సమావేశమయ్యారు. కాలుష్యాన్ని నియంత్రించడానికి కృత్రిమ వర్షం కురిపించవచ్చని ప్రతిపాదించారు. కృత్రిమ వర్షానికి సంబంధించిన ప్రణాళికను ఢిల్లీ ప్రభుత్వం ఐఐటీ కాన్పూర్ నిపుణులను కోరింది. ఈ ప్రణాళికను సుప్రీంకోర్టులో శుక్రవారం సమర్పించనుంది. ఢిల్లీలో కాలుష్య సమస్యను పరిష్కరించేందుకు తక్షణ చర్యలు తీసుకోవాలని కోరుతూ దాఖలైన పలు పిటిషన్లను సుప్రీంకోర్టు విచారిస్తోంది. సర్వోన్నత న్యాయస్థానం ఆమోదముద్ర వేస్తే ఢిల్లీ ప్రభుత్వం, కేంద్రం ఈ పథకాన్ని అమలు చేసేందుకు చర్యలు తీసుకుంటాయి. "కృత్రిమ వర్షం కురిపించాలంటే కనీసం 40 శాతం మేఘాలు కమ్ముకోవాలి. నవంబర్ 20-21 తేదీల్లో మేఘాలు కమ్ముకునే అవకాశం ఉంది. కృత్రిమ వర్షం ప్రణాళికను అమలు చేసేందుకు అనుమతి లభిస్తే అధ్యయనాన్ని నిర్వహిస్తాం' అని ఐఐటీ కాన్పూర్ నిపుణులు తెలిపారు. దేశ రాజధానిలో గాలి కాలుష్యం రాజకీయ వివాదంగా పరిణమించకూడదని సుప్రీంకోర్టు ఇటీవల హెచ్చరించింది. పంజాబ్, హర్యానా, ఉత్తరప్రదేశ్, రాజస్థాన్‌లలో పంట వ్యర్థాల దహనాలను తక్షణమే నిలిపివేయాలని ఆదేశించింది. కాలుష్య సమస్యను ఢిల్లీ ప్రభుత్వం బాధ్యతగా తీసుకోవాలని కోరింది. కృత్రిమ వర్షం అంటే? కరువుల ప్రభావాన్ని తగ్గించడం, అటవీ మంటలను నివారించడం, గాలి నాణ్యతను పెంచడానికి సాధారణంగా ఉపయోగించే కృత్రిమ పద్ధతి. వివిధ రసాయనిక పదార్థాలను మేఘాలలోకి ప్రవేశపెట్టడం ద్వారా వర్షపాతాన్ని కలిగిస్తారు. సిల్వర్ అయోడైడ్, పొటాషియం అయోడైడ్, డ్రై ఐస్ వంటి రసాయనాలను హెలికాప్టర్ల ద్వారా మేఘాలలోకి విడుదల చేస్తారు. ఈ రసాయనాలు నీటి ఆవిరిని మేఘాలుగా ఏర్పర్చి వర్షం కురిసేలా చేస్తాయి. ఇదీ చదవండి: ఢిల్లీ కాలుష్యానికి రీజనరేటివ్ వ్యవసాయమే విరుగుడు..? అసలేంటది..? -
ఢిల్లీలో మళ్లీ సరి–బేసి
న్యూఢిల్లీ: దేశ రాజధానిలో పొగ మంచు కారణంగా కాలుష్యం పెరిగిన నేపథ్యంలో ఈ నెల 13 నుంచి ఐదు రోజుల పాటు వాహనాల సరి–బేసి విధానాన్ని మళ్లీ అమలుచేయాలని ఢిల్లీ ప్రభుత్వం నిర్ణయించింది. రోజురోజుకీ క్షీణిస్తున్న వాయు నాణ్యతను పరిరక్షించేందుకు జాతీయ హరిత ట్రిబ్యునల్(ఎన్జీటీ) గురువారం పలు చర్యలు ప్రకటించింది. ఢిల్లీ, పొరుగు రాష్ట్రాల్లో నిర్మాణ పనులు, వ్యర్థాల దహనాన్ని నిషేధించడంతో పాటు, రాజధాని ప్రాంతంలోకి ట్రక్కుల ప్రవేశంపై నిషేధం విధించింది. మరోవైపు, ఇదే వ్యవహారంలో జాతీయ మానవ హక్కుల సంఘం ఢిల్లీ, పంజాబ్, హరియాణా ప్రభుత్వాలకు, కేంద్రానికి నోటీసులు జారీచేసింది. ఢిల్లీలో కాలుష్య పరిస్థితిని పర్యవేక్షిస్తూ పరిష్కార మార్గాలు సిఫార్సు చేసేందుకు కేంద్ర పర్యావరణ శాఖ ఉన్నత స్థాయి కమిటీని నియమించింది. రాజధానిలో ‘కాలుష్య అత్యయిక’ పరిస్థితి వరసగా మూడో రోజైన గురువారం కూడా కొనసాగింది. శనివారం వరకు పరిస్థితిలో ఎలాంటి మార్పు ఉండకపోవచ్చని అధికారులు తెలిపారు. వాయు నాణ్యత సూచీ 500 పాయింట్ల స్కేలుపై 486గా నమోదైంది. ద్విచక్ర, మహిళలకు మినహాయింపు ఢిల్లీలో మరో దఫా సరి–బేసి విధానానికి రంగం సిద్ధమైంది. నవంబర్ 13 నుంచి ఈ విధానాన్ని ప్రతిరోజూ ఉదయం 8 గంటల నుంచి రాత్రి 8 గంటల మధ్య ఐదు రోజులు అమలుచేస్తారు. ద్విచక్ర వాహనాలు, మహిళలు, సీఎన్జీ ఇంధనంతో నడిచే వాహ నాలకు మినహాయింపు ఇస్తున్నట్లు రవాణా శాఖ మంత్రి కైలాశ్ గెహ్లాట్ వెల్లడించారు. కాలుష్యంతో జీవించే హక్కు ఉల్లంఘన ఢిల్లీలో పరిస్థితిపై ఎన్జీటీ రాష్ట్ర ప్రభుత్వం, పురపాలక సంఘాలపై తీవ్ర స్థాయిలో మండిపడింది. తదుపరి ఆదేశాలు వెలువడే వరకు ఢిల్లీ–ఎన్సీఆర్ పరిధిలో ఎలాంటి నిర్మాణ పనులు చేపట్టొద్దని, అలాగే కాలుష్య కారకాలు వెదజల్లుతున్న అన్ని పారిశ్రామిక కార్యకలాలపై నవంబర్ 14 వరకు నిషేధం విధిస్తున్నట్లు చైర్పర్సన్ జస్టిస్ స్వతంతర్æ కుమార్ నేతృత్వంలోని బెంచ్ స్పష్టం చేసింది. పదేళ్లకు పైబడిన డీజిల్ ట్రక్కులను ఢిల్లీలోకి అనుమతించకూడదని ఆదేశించింది. కా లు ష్యాన్ని ఎదుర్కొనేందుకు ఏమేం చర్యలు తీసుకుంటున్నారో వివరిస్తూ రెండు వారా ల్లోగా నివేదిక సమర్పించాలని జాతీయ మానవ హక్కుల సంఘం ఢిల్లీ, పంజాబ్, హరియాణా రాష్ట్ర ప్రభుత్వాలతో పాటు కేంద్రానికి నోటీసులు పంపింది. కాలుష్యాన్ని విస్మరించడం జీవించే హక్కును ఉల్లంఘించడంతో సమానమని వ్యాఖ్యానించింది. కృత్రిమ వర్షం కురిపించండి: ఢిల్లీ హైకోర్టు పొగమంచు కట్టడికి ఢిల్లీ హైకోర్టు కూడా కొన్ని సూచనలు చేసింది. దుమ్ము, ధూళి గాల్లోకి చేరకుండా నిరోధించేలా మేఘ మథనం ద్వారా కృత్రిమ వర్షం కురిపించే అవకాశాన్ని పరిశీలించాలని ఢిల్లీ ప్రభుత్వానికి సూచించింది. ఢిల్లీ పట్టణంలో నిర్మాణ పనులు సాధ్యమైనంత ఎక్కువ కాలం నిలిపివేసేందుకు తగిన మార్గాలను కనుగొనాలని కోరింది. ప్రస్తుతం ఢిల్లీలో చూస్తున్న పరిస్థితిని లండన్ ఇది వరకే ఎదుర్కొందని పేర్కొంది. -
కృత్రిమంగా కురిపిద్దాం..
- కృత్రిమ వర్షాల గురించి యోచిస్తున్న ప్రభుత్వం - రుతుపవనాల రాక ఆలస్యమయితే ప్రయోగించేందుకు ప్రణాళిక - మరాఠ్వాడా వద్ద ఉన్న - అమరావతి కేంద్రంగా ప్రయోగం - 1993, 2003లో చేపట్టిన - గత ప్రభుత్వాలు సాక్షి, ముంబై: ఎండలు మండిపోతుండటంతోపాటు వర్షకాలంలో వస్తున్న మార్పుల కారణంగా నష్టపోతున్న రైతులను దృష్టిలో ఉంచుకుని కృత్రిమ వర్షాల వైపు రాష్ట్ర ప్రభుత్వం దృష్టి సారించింది. ఈ ప్రక్రియకు సంబంధించిన అన్ని ఏర్పాట్లు చేస్తోంది. ఇందుకోసం వాతావరణ శాఖ, ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ట్రాపికల్ మెట్రోలజీ విభాగం, రాష్ట్ర ప్రభుత్వం, పునరావాస విభాగం అధికారులతో కూడిన ఓ సమితిని ఏర్పాటు చేశారు. ఈ సమితి త్వరలో కృత్రిమ వర్షాలకు సంబంధించిన పనులు ప్రారంభించనుంది. కరవు ప్రాంతాలైన మరాఠ్వాడా, విదర్భ మధ్య భాగం అమరావతిని కేంద్రంగా ఇందుకు ఎన్నుకున్నారు. ఇప్పటికే ఈ అంశంపై నాలుగైదు సమావేశాలను కూడా నిర్వహించినట్టు మంత్రి ఏక్నాథ్ ఖడ్సే స్పష్టం చేశారు. 1993, 2003లో కృత్రిమ వర్షాల కోసం గత ప్రభుత్వాలు ప్రయోగాలు చేశాయి. అయితే అప్పుడు ప్రయోగాలను ఆలస్యంగా చేశారని, ఈ సారి జూన్ 15లోపు కృత్రిమ వర్షాల కోసం అన్ని ఏర్పాట్లు పూర్తి చేయనున్నట్టు సమితి అధికారి సుహాస్ దివసే తెలిపారు. రుతుపవనాలు రాక ఆలస్యం అవుతుందని తెలిస్తే వెంటనే కృత్రిమ వర్షాలను కురిపించనున్నట్టు పేర్కొన్నారు. ప్రత్యామ్నాయాల వైపు ముంబై చూపు ప్రస్తుతం ముంబైలో రికార్డు స్థాయిలో ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. దీంతో అప్పర్ వైతర్ణ జలాశయం ఇప్పటికే అడుగంటిపోయింది. ఇతర జలాశయాల్లో కూడా రెండు నెలలకు సరిపడా నీరు మాత్రమే ఉన్నట్లు అధికారులు చెబుతున్నారు. అయితే ఉష్ణోగ్రతలు పెరిగిపోతుండటంతో నీటి మట్టం కూడా చాలా వేగంగా తగ్గిపోతోంది. దీంతో అధికారుల్లో కొంత ఆందోళన వ్యక్తమవుతోంది. ఈ నేపథ్యంలో మరోసారి ప్రత్యామ్నాయ మార్గాలపై బృహన్ముంబై మున్సిపల్ కార్పొరేషన్ (బీఎంసీ) దృష్టి సారించినట్టు సమాచారం. నగరంలో ప్రతిరోజు దాదాపు 3,750 ఎమ్మెల్డీల నీరు సరఫరా అవుతోంది. ఈ లెక్కన ఏడాది పొడవునా సరఫరా సక్రమంగా జరగాలంటే కనీసం 14 లక్షల ఎమ్మెల్డీల నీటి నిల్వలు అవసరమవుతాయి. నీటి దొంగతనం, లీకేజీ, ఇతర కారణాల వల్ల సుమారు 700 ఎమ్మెల్డీల నీరు రోజూ వృథాగా పోతోంది. దీంతో వర్షాలు సమయానికి రాకపోతే కృత్రిమ వర్షాల ప్రయోగం మరోసారి చేయాలని బీఎంసీ అధికారులు యోచిస్తున్నట్లు తెలిసింది. అయితే కృత్రిమ వర్షాల ప్రక్రియ భారీ వ్యయం, రిస్క్‌తో కూడుకున్నది కావడంతో పరిపాలన విభాగం ఆచితూచి నిర్ణయం తీసుకుంటోంది. ఇప్పటికే ఈ విషయంపై సంబంధిత నిపుణులతో చర్చలు కూడా ప్రారంభించింది. 2009లో వర్షాలు ముఖం చాటేయడంతో భాత్సా, అప్పర్ వైతర్ణ జలాశయాల పరిధిలో కృత్రిమ వర్షం ప్రయోగం చేశారు. కాని అది ఊహించిన విధంగా సఫలీకృతం కాలేకపోయింది. ఇందుకోసం వినియోగించిన విమానాలు సరిగా పనిచేయకపోవడం, రాడార్ కారణంగా 160 సార్లు మేఘాలపై రసాయనాలు పిచికారి చేసినప్పటికీ ఫెయిల్ అవడం వంటివి జరిగాయి. ఆ తరువాత ఓ మోస్తరు వర్షాలు కురవడంతో నీటి కొరత సమస్య కొంత మేర తీరింది. గత మూడు నాలుగేళ్ల నుంచి సగటు వర్షపాతం నమోదు అవుతుండటంతో కృత్రిమ వర్షాల ప్రయోగం చేయాల్సిన అవసరం బీఎంసీకి రాలేదు. ఈ సారి పరిస్థితి ఎలా ఉండబోతుందనేది జూన్ మొదటి వారంలోపు స్పష్టం కానుంది.