న్యూఢిల్లీ: దేశ రాజధాని ఢిల్లీలో వాయు కాలుష్యం ప్రజలను కలవరపెడుతోంది. గత వారం రోజులుగా వాయు నాణ్యత వేగంగా క్షీణిస్తోంది. మరోవైపు ఉష్ణోగ్రతలు పడిపోతున్నాయి. మంగళవారం నగరంలో కనిష్ట ఉష్ణోగ్రత 7.3 డిగ్రీల సెల్సియస్‌గా నమోదయ్యింది. సాధారణం కంటే ఇది 3 డిగ్రీలు తక్కువ అని వాతావరణ శాఖ వెల్లడించింది. గరిష్ట ఉష్ణోగ్రత 27 డిగ్రీల సెల్సియస్‌గా ఉంది. ఇక వాయు నాణ్యత సూచీ(ఏక్యూఐ) కేంద్ర కాలుష్య నియంత్రణ మండలి గణాంకాల ప్రకారం.. ఢిల్లీలో మంగళవారం ఉదయం 9 గంటలకు 358గా రికార్డయ్యింది. అంటే గాలి నాణ్యత చాలా అధ్వాన్నంగా ఉన్నట్లు తేలింది. ఢిల్లీ ప్రభుత్వ సమాచారం ప్రకారం.. నగరంలో ఏక్యూఐ గరిష్టంగా 2018లో 390, 2019లో 368, 2020లో 435, 2021లో 462గా నమోదయ్యింది. ఈ ఏడాది మరింత పెరిగే అవకాశం ఉన్నట్లు నిపుణులు అంచనా వేస్తున్నారు.
సగం మంది పిల్లల్లో శ్వాస సమస్యలు
ప్రపంచంలో వాయు నాణ్యత అత్యంత అధ్వాన్నంగా ఉన్న నగరాల జాబితాలో ఢిల్లీ సైతం ఉన్నట్లు ప్రపంచ ఆరోగ్య సంస్థ(డబ్ల్యూహెచ్‌ఓ) గతంలోనే వెల్లడించింది. ప్రపంచవ్యాప్తంగా 1,650 నగరాల్లో సర్వే చేసి ఈ చేదు నిజాన్ని బహిర్గతం చేసింది. భారత్‌లో మనుషుల మరణాలకు కారణమవుతున్న వాటిలో వాయు కాలుష్యం ఐదో స్థానంలో ఉంది. దేశంలో ప్రతిఏటా 20 లక్షల మంది వాయు కాలుష్యం కాటుకు బలవుతున్నారు. ఢిల్లీలో నివసించే పిల్లల్లో సగం మంది పిల్లలు (దాదాపు 20.2 లక్షల మంది) శ్వాస సంబంధిత సమస్యలతో బాధపడుతున్నట్లు అధ్యయనంలో వెల్లడయ్యింది. నగర పరిసర ప్రాంతాల్లో పంట వ్యర్థాల దహనం, రోడ్డుపై దుమ్మూ ధూళి, శిలాజ ఇంధనాల వినియోగం మితిమీరడం, తీవ్రమైన చలి.. వంటివి వాయు కాలుష్యానికి కారణమవుతున్నాయని నిపుణులు చెబుతున్నారు.
హైదరాబాద్‌లో కాలుష్య కల్లోలం
దేశ రాజధాని ఢిల్లీలోనే కాదు, తెలంగాణ రాజధాని హైదరాబాద్‌లోనూ వాయు కాలుష్యం బెంబేలెత్తిస్తోంది. శీతాకాలంలో సమస్య మరింత ముదురుతోంది. ఏక్యూఐ 201 నుంచి 300 దాకా ఉంటే పరిస్థితి అధ్వాన్నంగా ఉన్నట్లు అర్థం. ఈ ఏడాది నవంబర్ 27న హైదరాబాద్‌లో ఏక్యూఐ 272గా నమోదయ్యింది. 2019లో ఇదే ప్రాంతంలో ఇదే సమయంలో ఏక్యూఐ 150గా రికార్డయ్యింది. నగరంలో మూడేళ్లలోనే కాలుష్య తీవ్రత భారీగా పెరగడం గమనార్హం. కరోనా ముందు కాలంతో పోలిస్తే హైదరాబాద్‌లో కాలుష్యం 55 శాతానికి పైగానే పెరిగినట్లు స్పష్టమవుతోంది. గాలిలో కంటికి కనిపించని దూళి కణాల సంఖ్యను సూచించే ‘పీఎం 2.5’ కౌంట్ కూడా నగరంలో ‘అనారోగ్యకర’ స్థాయిలో ఉన్నట్లు రాష్ట్ర కాలుష్య నియంత్రణ మండలి వివరాలను బట్టి తెలుస్తోంది. పీఎం 2.5 ఎక్కువగా ఉంటే మనుషుల్లో శ్వాస సంబంధిత సమస్యలు తలెత్తుతాయి. ఊపిరి పీల్చుకోవడంలో ఇబ్బందులు ఎదురవుతాయి. పీఎం 2.5 స్థాయి 12 యూజీ–ఎం3 కంటే తక్కువగా ఉంటే ‘ఆరోగ్యకరం’గా గుర్తిస్తారు. కానీ, హైదరాబాద్‌లో ఇటీవల ఇది ఏకంగా 93.69 యూజీ–ఎం3గా నమోదు కావడం ఆందోళన కలిగిస్తోంది.
Delhi air pollution: ఢిల్లీలో డేంజర్ బెల్స్!
Published Wed, Nov 30 2022 5:09 AM | Last Updated on Wed, Nov 30 2022 5:09 AM
Advertisement
Advertisement
Comments
Please login to add a commentAdd a comment