Respiratory problems
-
గాలి నిండా మీథేన్!
పర్యావరణానికి ప్రధాన శత్రువు మనిషేనని మరోసారి రుజువైంది. శిలాజ ఇంధనాల వాడకం, పారిశ్రామికీకరణ వంటి మానవ కార్యకలాపాల వల్ల 20 ఏళ్లలోనే ఏకంగా 67 కోట్ల టన్నుల మేరకు ప్రమాదకర మీథేన్ వాయువు వాతావరణంలోకి విడుదలైందట. స్టాన్‌ఫర్డ్ వర్సిటీ సైంటిస్టుల తాజా అధ్యయనంలో తేలిన చేదు నిజమిది. ఈ దెబ్బకు పారిశ్రామికీకరణకు ముందు నాటితో పోలిస్తే గాలిలో మీథేన్ పరిమాణం ఏకంగా 2.6 రెట్లు పెరిగిపోయిందని ఆ నివేదిక పేర్కొంది. పైగా, ‘‘ఇవి 2020 నాటి గణాంకాల ఆధారంగా వేసిన లెక్కలు. ఈ నాలుగేళ్లలో పరిస్థితి మరింత దిగజారింది’’ అంటూ హెచ్చరించింది... 2000 నుంచి కొన్నాళ్ల పాటు వాతావరణంలో మీథేన్ పెరుగుదల కాస్త అదుపులోనే ఉంటూ వచ్చింది. కానీ ఆ తర్వాత పలు దేశాలు శిలాజ ఇంధనాల ఉత్పత్తి, వాడకాలను విచ్చలవిడిగా పెంచేయడంతో ప్రమాదకర స్థాయిలో పెరుగుతూ వస్తోంది. బొగ్గు, చమురు, సహజవాయువు తదితరాల వెలికితీత, వాడకం వల్ల వెలువడుతున్న మీథేన్ పరిమాణం గత 20 ఏళ్లలో ఏకంగా 33 శాతం పెరిగిపోవడం పరిస్థితి తీవ్రతకు అద్దం పడుతోంది. అలాగే వ్యర్థాలు తదితరాల నుంచి మీథేన్ విడుదలవుతున్న 20 శాతం, వ్యవసాయం వల్ల మరో 14 శాతం పెరిగిందని అధ్యయనం తేలి్చంది! ‘ప్రపంచం పెద్దగా పట్టించుకోవడం లేదు గానీ, వాతావరణంలో పెరిగిపోతున్న మీథేన్ పరిమాణం పర్యావరణానికి పెద్ద విపత్తుగా పరిణమిస్తోంది’ అని అధ్యయనానికి సారథ్యం వహించిన గ్లోబల్ కార్బన్ ప్రాజెక్ట్ హెడ్, స్టాన్‌ఫర్డ్ వర్సిటీలో పర్యావరణ శాస్త్రవేత్త రాబ్ జాక్సన్ హెచ్చరించారు. ఈ ప్రాజెక్టు గ్రీన్హౌస్ వాయు ఉద్గారాలను ఎప్పటికప్పుడు గమనిస్తుంటుంది. ‘‘2000 సంవత్సరంలో వాతావరణంలోని మొత్తం మీథేన్ పరిమాణంలో మనిషి వాటా 60 శాతంగా ఉండేది. ఇప్పుడది ఎకాయెకి 65 శాతానికి పెరిగింది. భూ వాతావరణంలో మీథేన్ పెరుగుదల కార్బన్ డయాక్సైడ్ (సీఓటూ) కంటే చాలా ఎక్కువగా నమోదవుతోంది. 2015లోనైతే వాతావరణంలో మీథేన్ సాంద్రత గత 80 లక్షల ఏళ్లలో ఎన్నడూ లేనంత భారీగా నమోదైంది! వాతావరణంలో వేలాది ఏళ్లపాటు ఉండిపోయే సీఓటూతో పోలిస్తే మీథేన్ ఉండేది 12 ఏళ్లే అయినా అది కలగజేసే నష్టం మాత్రం ఎక్కువ. ఎందుకంటే పర్యావరణానికి సీఓటూ కంటే మీథేన్ 82 రెట్లు ఎక్కువ నష్టం చేస్తుంది’’ అని జాక్సన్ వివరించారు. ‘‘మీథేన్, సీఓటూ ఉద్గారాలు ఇలాగే కొనసాగితే 2050 నాటికి ప్రపంచ సగటు ఉష్ణోగ్రతలు ఏకంగా 3 డిగ్రీలకు మించి పెరిగిపోతాయి. అది వినాశనానికి దారితీస్తుంది’’ అని ఆందోళన వెలిబుచ్చారు. ఈ అధ్యయన ఫలితాలు ‘ఎని్వరాన్మెంటల్ రీసెర్చ్ లెటర్స్’లో మంగళవారం ప్రచురితమయ్యాయి.కాగితాల్లోనే లక్ష్యం...మీథేన్ ముప్పుపై అంతర్జాతీయ వేదికలపై ఎన్నోసార్లు చర్చోపచర్చలు జరిగాయి. పర్యావరణ శాస్త్రవేత్తల వరుస ఆందోళనల ఫలితంగా 2021లో దేశాలన్నీ దీనిపై లోతుగా చర్చించాయి. వాతావరణంలో మీథేన్ పరిమాణాన్ని తగ్గిస్తామంటూ ప్రతినబూనాయి. ‘గ్లోబల్ మీథేన్ ప్లెడ్జ్’గా పిలిచే ఒప్పందంపై 100కు పైగా దేశాలు సంతకాలు చేశాయి. మీథేన్ ఉద్గారాలను 2030 నాటికి 30 శాతానికి పైగా తగ్గించాలన్నది దీని లక్ష్యం. ఫలితంగా 2050 నాటికి గ్లోబల్ వార్మింగ్‌లో 0.2 డిగ్రీ సెల్సియస్ మేరకు తగ్గుదల నమోదవుతుందని అంచనా. కానీ ఆచరణలో ఏ దేశమూ చేసింది పెద్దగా ఏమీ లేకపోవడంతో ఈ లక్ష్యం కాగితాలకే పరిమితమైంది. – సాక్షి, నేషనల్ డెస్క్ మీథేన్‌తో పెను ప్రమాదమే⇒ ఏటా 5.8 కోట్ల టన్నుల మీథేన్ వాతావరణంలోకి విడుదలవుతోందని అంచనా. ఇందులో మనిషి వాటాయే ఏకంగా 60 శాతం. ⇒ వ్యవసాయం, శిలాజ ఇంధనాల వెలికితీత, వాటి వాడకం తదితరాల వల్ల 60 శాతం మీథేన్ విడుదలవుతోంది. ⇒ అమెరికాలో కేవలం గ్యాస్ డ్రిల్లింగ్ కారణంగా 2005 నుంచి ఇప్పటిదాకా ఏకంగా 1.17 కోట్ల టన్నుల మీథేన్ విడుదలై ఉంటుందని అంచనా! ⇒ గాల్లో మీథేన్ పరిమాణం పెరిగితే వచ్చే సమస్యలు అన్నీ ఇన్నీ కావు. ⇒ గ్లోబల్ వార్మింగ్‌కు ప్రధాన కారణమైన గ్రీన్‌హౌజ్ వాయు ఉద్గారాల్లో మీథేన్దే పెద్ద వాటా. ⇒ పారిశ్రామికీకరణ అనంతరం గత 150 ఏళ్లలో ప్రపంచ సగటు ఉష్ణోగ్రతలు ప్రమాదకరంగా పెరిగిపోతుండటం తెలిసిందే. అందులో మూడో వంతు పెరుగుదల మీథేన్ వల్లే సంభవిస్తోంది! ⇒ వాతావరణంలోని వేడిని మీథేన్ నిర్బంధించి దాన్ని తిరిగి భూమిపైకే పంపుతుంది. మరోలా చెప్పాలంటే భూ ఉపరితలంపై ఓజోన్ పొరలాంటి దాన్ని ఏర్పరుస్తుంది. అలా భూ ఉష్ణోగ్రతలు పైకి వెళ్లకుండా అడ్డుకుంటుంది. తద్వారా పర్యావరణం నానాటికీ వేడెక్కుతోంది. ⇒ వాయు నాణ్యతను కూడా మీథేన్ బాగా దెబ్బ తీస్తుంది. దాంతో మనుషులతో పాటు జంతువుల్లో కూడా శ్వాసకోశ సంబంధిత సమస్యలు పెరుగుతాయి. ⇒ పర్యావరణానికి కార్బన్ డయాక్సైడ్ కంటే మీథేన్ వల్ల జరిగే నష్టం ఏకంగా 82 రెట్లు ఎక్కువ! ⇒ తాజా అధ్యయనం కేవలం 2020 నాటికి అందులో ఉన్న డేటా ఆధారంగా చేసినదే. ఈ నాలుగేళ్లలో మీథేన్ ప్రభావం మరింత వేగంగా పెరుగుతూ వస్తోందన్నది పర్యావరణవేత్తల మాట. తక్షణం దిద్దుబాటు చర్యలు తప్పవని వారంటున్నారు.భూ సగటు ఉష్ణోగ్రతల పెరుగుదలను అంతర్జాతీయంగా అంగీకరించిన 1.5 డిగ్రీ సెల్సియస్ స్థాయికి పరిమితం చేయాలంటే సీఓటూ ఉద్గారాలను సగానికి, మీథేన్ ఉద్గారాలను మూడో వంతుకు తగ్గించాలి. ఈ దిశగా తక్షణ కార్యాచరణ అత్యవసరం – బిల్ హేర్, క్లైమేట్ అనలిటిక్స్ సీఈఓ, పర్యావరణ శాస్త్రవేత్త -
వాతావరణ మార్పులు.. ముసురుతున్న వ్యాధులు
సాక్షి, సిటీబ్యూరో: వాతావరణ మార్పులు నగరవాసులను వ్యాధుల బారిన పడేస్తున్నాయి. ముఖ్యంగా వైరల్ ఇన్ఫెక్షన్ల కారణంగా చెవి, ముక్కు, గొంతు సమస్యలతో బాధపడేవారి సంఖ్య పెరుగుతూనే ఉంది. నగరంలో ఈ సమస్యల విజృంభణతో కోఠిలోని ప్రభుత్వ ఈఎన్టీ ఆస్పత్రికి రోగులు పరుగులు పెడుతున్నారు. కోఠిలోని ఈఎన్టీ ఆసుపత్రికి గత కొన్ని రోజులుగా వేల సంఖ్యలో రోగులు వస్తుండటంతో రోజుకు 2 వేల మార్క్‌ను దాటుతున్న పరిస్థితి కనిపిస్తోంది. దీని ఫలితంగా ఆసుపత్రికి వచ్చిన వారిని పరీక్షించడానికి గంటల తరబడి ఆలస్యమవుతోంది. ఇక్కడకు రోగులు గొంతు, చెవి ఇన్ఫెక్షన్ల వంటి సాధారణ సమస్యలతోనే వస్తారు. వచ్చేవారిలో దాదాపు 80– 85 శాతం మందికి మందులతోనే సరిపోతుంది. అయినప్పటికీ గంటల తరబడి వేచి ఉండాల్సి రావడం రోగులకు ఇబ్బందికరంగా మారింది. ఈ నేపథ్యంలో ప్రభుత్వ ఆధ్వర్యంలో మరిన్ని ఈఎన్టీ కేంద్రాలను ఏర్పాటు చేయాల్సిన అవసరం స్పష్టంగా కనిపిస్తోంది. వాతావరణ మార్పులే కారణం.. శీతాకాలం ప్రారంభమయ్యే సమయంలో ఇలాంటి వ్యా«ధులు ప్రబలడం సహజమేనని ఆందోళన చెందాల్సిన అవసరం లేదని కోఠి ఈఎన్టీ ఆసుపత్రి సూపరింటెండెంట్ డా.శంకర్ భరోసా కల్పిస్తున్నారు. చల్లని పదార్థాలకు దూరంగా ఉండడం వంటి జాగ్రత్తలు తీసుకుంటే సరిపోతుందన్నారు. అయితే రోజుల తరబడి సమస్య ఇబ్బంది పెడితే వెంటనే వైద్యులను సంప్రదించాలని సూచించారు. తమ ఆసుపత్రి కరోనాకి ముందు పెద్ద సంఖ్యలో వచ్చేవారని, అదే విధంగా ఇప్పుడు కూడా రోగుల సంఖ్య పెరిగిందన్నారు. ఇక్కడికి వస్తున్న వారిలో జలుబు, దగ్గు తదితర సమస్యలే ఎక్కువగా ఉన్నాయన్నారు. రోగులను పరీక్షించేందుకు ఆలస్యం అవ్వడానికి కొత్తగా ప్రవేశపెట్టిన ఈహెచ్ఎస్ విధానం కొంత వరకూ కారణమవుతోందన్నారు. ప్రతీ రోగికి ఆధార్ తనిఖీతో పాటు రోగి ఆరోగ్య వివరాలను సమగ్రంగా నమోదు చేస్తుండడంతో స్వల్ప ఇబ్బందులు ఎదురైనా ఈ విధానం రోగులకు అనేక విధాలుగా ప్రయోజనకరంగా ఉందన్నారు. -
ములుగు జిల్లాలో డెంగీతో నలుగురు మృతి
సాక్షి, హైదరాబాద్: ములుగు జిల్లాలో డెంగీతో నలుగురు మరణించారని ఆ జిల్లా వైద్యాధికారులు వెల్లడించారు. అయితే వారు గుండె జబ్బులు, ఊపి రితిత్తుల సమస్యలు, జాండిస్, సికిల్ సెల్ అనీమి యా వంటి దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడుతు న్నట్టు వివరించారు. రాష్ట్రంలో కొన్ని రోజులుగా ఎడతెరిపి లేకుండా వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో సీజనల్ వ్యాధుల పరిస్థితిపై గురువారం వైద్య ఆరోగ్యశాఖ మంత్రి హరీశ్‌రావు ఉన్నతాధికారు లతో సమీక్ష నిర్వహించారు. ఈ సమీక్షలో ప్రజా రోగ్య సంచాలకుడు డాక్టర్ శ్రీనివాసరావు, డీఎంఈ రమేశ్‌రెడ్డి, టీవీవీపీ కమిషనర్ అజయ్ కుమార్, అన్ని జిల్లాల డీఎంహెచ్వోలు, డీసీహెచ్‌లు, టీచింగ్ హాస్పిటళ్లు, జిల్లా దవాఖానల సూపరింటెండెంట్లు, ప్రోగ్రాం ఆఫీసర్లు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ములుగు జిల్లా వైద్యాధికారులు డెంగీ మరణాలపై మంత్రి హరీశ్‌రావు దృష్టికి తీసుకొచ్చారు. వారం రోజుల్లోనే 10 మంది మరణించారంటూ కొందరు అవాస్తవాలు ప్రచారం చేస్తున్నారని వారు పేర్కొన్నారు. ఈ ఏడాది జూన్ నుంచి జిల్లాలో వైద్య ఆరోగ్య సిబ్బంది అప్రమత్తంగా ఉన్నారని వెల్లడించారు. జ్వరాల కోసం ప్రత్యేక ఓపీ కౌంటర్లు... రాష్ట్రంలో అవసరమైతే జ్వరాల కోసం ప్రత్యేక ఓపీ కౌంటర్లు ఏర్పాటు చేయాలని మంత్రి హరీశ్‌రావు అధికారులను ఆదేశించారు. పిల్లల జ్వరాలపై ప్రత్యేక నిఘా ఉంచాలని విజ్ఞప్తి చేశారు. ఈ సందర్భంగా అధికారులు పేర్కొన్న అంశాలను మంత్రి వివరించారు. డెంగీ కేసులు పెరుగుతున్నట్టు జరుగుతున్న ప్రచారంలో వాస్తవం లేదని, ఫీవర్ కేసులు ఆందోళనకర స్థాయిలో లేవని హరీశ్‌రావు స్పష్టం చేశారు. ఇప్పటివరకు ఒక్క మరణం కూడా నమోదు కాలేదన్నారు. జ్వర బాధి తుల వివరాలను ఎప్పటికప్పుడు పోర్టల్‌లో నమో దు చేయాలని, ఆ డేటా ఆధారంగా డీఎంహెచ్ వోలు హైరిస్క్ ఏరియాలను గుర్తించి జాగ్రత్త చర్య లు చేపట్టాలన్నారు. జిల్లాల్లో 24 గంటల కాల్ సెంటర్‌ను ఏర్పాటు చేసి ప్రజలకు సమాచారం అందించాలని చెప్పారు. మీడియా సమావేశాలు నిర్వహించి సీజనల్ వ్యాధులపై ప్రజలను అప్రమత్తం చేయాలన్నారు. మలేరియా విభాగం అడిషనల్ డైరెక్టర్‌ను కొత్తగూడెం పంపి, అక్కడి పరిస్థితిని సమీక్షించాలని అధికారులను ఆదేశించారు. -
అలర్ట్: ప్రపంచంలో టాప్-20 వాయు కాలుష్య పట్టణాల్లో 14 భారత్‌లోనే..
ఊపిరాడని పరిస్థితి. శ్వాసకోశ సమస్యలు పట్టిపీడిస్తున్న దుస్థితి. ఎక్కడో ఒక చోటే అని కాదు.. ప్రపంచవ్యాప్తంగా 99 శాతం ప్రజానీకం పీలుస్తున్న గాలి స్వచ్ఛమైనది కాదు. వాయు కాలుష్యం కారణంగా ప్రపంచవ్యాప్తంగా ఏటా 67 లక్షల మందికిపైగానే బలవుతున్నారు. ప్రపంచ ఆరోగ్య సంస్థ తాజాగా వెల్లడించిన నివేదికలోని అంశాలే ఇవి. స్విస్ ఎయిర్ క్వాలిటీ టెక్నాలజీ కంపెనీ చేసిన అధ్యయనం ఆధారంగా ప్రపంచ ఆరోగ్య సంస్థ ఈ నివేదికను విడుదల చేసింది. అందులో మన దేశానికి సంబంధించిన కొన్ని దారుణమైన వాస్తవాలనూ వెల్లడించింది. ప్రపంచంలో వాయు కాలుష్యం అత్యధికంగా ఉన్న టాప్–20 నగరాల జాబితాలో ఏకంగా 14 నగరాలు భారతదేశం నుంచే ఉండటం ఆందోళనకరం. ఇందులో దక్షిణాది రాష్ట్రాలేవీ లేకపోవడం కాస్త ఉపశమనం. వాయు కాలుష్యం ఎక్కువగా ఉన్న నగరాల్లో దానిని తగ్గించే చర్యలు చేపడుతుంటే.. వాటి స్థానంలో కొత్త నగరాలు వచ్చి చేరుతున్నాయి. –సాక్షి ప్రత్యేక ప్రతినిధి, హైదరాబాద్ ఆరు వేల నగరాల్లో పరిశీలించి.. 2022 సంవత్సరానికి సంబంధించి మొత్తం 117 దేశాల్లోని ఆరు వేల నగరాల్లో వాయు నాణ్యతను పరీక్షించామని.. మరికొన్ని దేశాల్లో వాయు నాణ్యతను పరీక్షించేందుకు సరైన పరికరాలు లేని కారణంగా పరీక్షించలేకపోయామని డబ్ల్యూహెచ్‌వో పేర్కొంది. అలాంటి వాటిలో చాలా వాయు కాలుష్యం ఉన్న నగరాలూ ఉండి ఉంటాయని తెలిపింది. తగిన జాగ్రత్తలు తీసుకోలేక.. కార్బన్ డయాక్సైడ్, కార్బన్ మోనాక్సైడ్, నైట్రోజన్ డయాక్సైడ్, సూక్ష్మ ధూళి కణాలు వంటి వాయు కలుషితాలు తీవ్రంగా ప్రభావం చూపిస్తున్నాయి. వేగంగా అభివృద్ధి చెందే క్రమంలో అటవీ సంపదను నాశనం చేస్తుండటం, పరిశ్రమల ఏర్పాటుతో కాలుష్యం పెరుగుతోంది. పరిశ్రమలు విడుదల చేసే వాయు, జల, భూకాలుష్యాలను అరికట్టే చర్యలపై ప్రభుత్వం, అధికార యంత్రాంగం నిర్లక్ష్యం చూపుతున్నాయి. ఏదో భోపాల్ దుర్ఘటన వంటివి జరిగినప్పుడు హడావుడి చేయడం, ఆ తర్వాత మిన్నకుండిపోవడం సాధారణమైపోయింది. భద్రతా ప్రమాణాలను ‘గాలి’కి వదిలేయడం వల్ల వాయు కాలుష్యం ప్రజల ప్రాణాలకు అపాయకరంగా మారుతోంది. వంటింటి పొగ ప్రాణాలు తీస్తోంది వాయు కాలుష్యం కారణంగా ప్రాణాలు పోగొట్టుకుంటున్న వారిలో మహిళలు, చిన్నారులు ఎక్కువగా ఉంటున్నారు. ప్రపంచవ్యాప్తంగా ఏటా 32 లక్షల మందికిపైగా వంటింటి పొగకు బలవుతున్నట్టు డబ్ల్యూహెచ్‌వో నివేదికలో పేర్కొంది. ప్రపంచ జనాభాలో మూడో వంతు కుటుంబాలు వంట కోసం కలప, బొగ్గు, పేడ, పంటల వ్యర్థాలను వాడుతున్నాయని.. తద్వారా వెలువడే వాయు కాలుష్యంతో ఊపిరితిత్తులు దెబ్బతిని శ్వాసకోశ వ్యాధుల బారిన పడుతున్నట్టు వెల్లడించింది. పరిశ్రమలు, వాహన, వంటింటి వాయు కాలుష్యం వల్ల మొత్తంగా ఏటా 67 లక్షల మంది శ్వాసకోశ వ్యాధులతో మృత్యువాత పడుతున్నట్లు తెలిపింది. ఏయే సమస్యలు వస్తున్నాయి? కలుషిత గాలిలోని సూక్ష్మ ధూళి కణాలు ఊపిరితిత్తుల్లోకి వెళ్లి శ్వాస సంబంధిత వ్యాధులు తలెత్తుతున్నాయి. వాయు కాలుష్యంతో మరణిస్తున్న వారిలో 32శాతం మంది ఇస్కామిక్ హర్ట్ డిసీజ్‌తో, 23 శాతం మంది గుండెపోటుతో, 21 శాతం లోయర్ రెస్పిరేటరీ ఇన్ఫెక్షన్, 19 శాతం క్రానిక్ అబ్స్ట్రక్టివ్ పల్మనరీ డిసీజ్‌తో, ఆరు శాతం మంది ఊపిరితిత్తుల కేన్సర్‌తో మరణిస్తున్నట్టు డబ్ల్యూహెచ్‌వో నివేదికలో పేర్కొంది. వాయు కాలుష్యం నివారణకు ఏం చేయాలి? ► వాయు కాలుష్యాన్ని నివారించడానికి ప్రపంచ ఆరోగ్య సంస్థ పలు సూచనలు కూడా చేసింది. తగిన వాయు నాణ్యతా ప్రమాణాలను అనుసరించాలని స్పష్టం చేసింది. ► వాయు కాలుష్య కారక అంశాలను గుర్తించాలి. వాటి నియంత్రణ చర్యలను ప్రభుత్వ యంత్రాంగం నిత్యం పర్యవేక్షించాలి. ► వంటకు అవసరమైన కాలుష్య రహితమైన, నాణ్యమైన ఇంధనాన్ని సమకూర్చాలి. సురక్షితమైన, సామాన్యులకు అందుబాటులో ఉండే రవాణా వ్యవస్థ ఏర్పాటు చేయాలి. పాదచారులకు, సైక్లింగ్ ఫ్రెండ్లీ నెట్వర్క్ కల్పించాలి. ► వాహన కాలుష్యాన్ని అరికట్టేలా కఠిన చట్టాలు తీసుకుని రావాలి. వాటి అమలును నిత్యం పర్యవేక్షించేలా అధికార యంత్రాంగం పనిచేయాలి. ► పరిశ్రమల వ్యర్థాలు, మున్సిపల్ వ్యర్థాల యాజమాన్య నిర్వహణను మరింత పెంచాలి. ► పంట వ్యర్థాలను తగలబెట్టడం ఆపేయాలి. అటవీ అగ్నిప్రమాదాలను అరికట్టాలి. ఉత్తరాది రాష్ట్రాల్లో సమస్య తీవ్రం సూక్ష్మరూపాల్లోని కాలుష్యాలు మనుషుల ఆరోగ్యంపైనే కాకుండా పర్యావరణం, జీవవైవిధ్యం, పశుపక్ష్యాదులు, జంతు జాలం, పొలాలు, వ్యవసాయ ఉత్పత్తులపైనా తీవ్ర ప్రభావం చూపుతున్నాయి. ప్రస్తుతం మన దేశంలో ఉత్తరాది రాష్ట్రాల్లో ఈ సమస్య ఎక్కువగా ఉంది. కానీ దక్షిణాది రాష్ట్రాలు కూడా ఈ విషయంలో జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఉంది. విష వాయువులతోపాటు పీఎం 2.5, పీఎం 10 సూక్ష్మరూపాల్లోని కాలుష్య వ్యాప్తి మనుషుల ఆరోగ్యాన్ని కుంగదీస్తోంది. వాయు కాలుష్యాన్ని తగ్గించే దిశలో ఎవరికి వారు వ్యక్తిగత స్థాయిలో, ప్రభుత్వం, స్వచ్ఛందసంస్థల పరంగా పరిష్కారమార్గాలు ఆలోచించాలి. – ప్రొఫెసర్ కె.పురుషోత్తంరెడ్డి, ప్రముఖ పర్యావరణవేత్త హైదరాబాద్‌లోనూ పెరుగుతున్న కాలుష్యం ఇటీవల సెంట్రల్ పొల్యూషన్ కంట్రోల్‌బోర్డు డేటాను విశ్లేషిస్తూ గ్రీన్‌పీస్ ఇండియా విడుదల చేసిన నివేదికలో.. హైదరాబాద్‌లో పీఎం 10 స్థాయిలు నిర్దేశిత ప్రమాణాల కంటే ఆరేడుశాతం అధికంగా ఉన్నాయి. పరిశ్రమల విస్తరణ, రవాణా పెరగడం, చెత్త తగలబెట్టడం, భారీగా నిర్మాణ కార్యకలాపాల వల్ల వాయు కాలుష్యం పెరుగుతోంది. పర్టిక్యులేట్ మేటర్, సల్ఫర్ డయాక్సైడ్, నైట్రోజన్ ఆక్సైడ్, కార్బన్ మోనాక్సైడ్, పీఎం 2.5, పీఎం 10 వంటివి ఎక్కువ అవుతున్నాయి. ఇవి ఊపిరితిత్తులపై ప్రభావం చూపి.. శ్వాసకోశ సమస్యలకు కారణమవుతున్నాయి. – హరికిషన్ గోనుగుంట్ల, చీఫ్ ఇంటర్వెన్షనల్ పల్మనాలజిస్ట్, యశోద ఆస్పత్రి గాలి నాణ్యతను ఎలా నిర్ధారిస్తారు? గాలి నాణ్యతను ‘ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్ (ఏక్యూఐ)’తో కొలుస్తారు. వాతావరణంలో ఒక క్యూబిక్ మీటర్ గాలిలో కెమికల్స్ రియాక్షన్స్‌తో ఏర్పడిన, లేదా దుమ్ము, ధూళి కణాలు, నిర్మాణ ప్రాంతాలు, పారిశ్రామిక ప్రాంతాల్లో వెలువడే కాలుష్యాల (పర్టిక్యులేట్ మేటర్)ను లెక్కించి కొలుస్తారు. గంటకోసారి లేదా 8 గంటలకోసారి కొలవడం ద్వారా సగటు ఏక్యూఐని గుర్తిస్తారు. టాప్–20 వాయు కాలుష్య నగరాలు లాహోర్ (పాకిస్తాన్), హోటన్ (చైనా),భివండి, ఢిల్లీ (భారత్), పెషావర్ (పాకిస్తాన్) ఎన్ డీజమేనా (చాద్), దర్భంగా, అసోపూర్, పట్నా, ఘజియాబాద్, ధరెహారా (భారత్), బాగ్దాద్ (ఇరాక్), ఛాప్రా, ముజఫర్‌నగర్ (భారత్), ఫైసలాబాద్ (పాకిస్తాన్),గ్రేటర్ నోయిడా, బహదూర్‌ఘర్,ముజఫర్‌పూర్, ఫరీదాబాద్(భారత్) -
బాల్యంలో నిమోనియా బారిన పడితే... భయంపుట్టిస్తున్న స్టడీ వివరాలు..
లండన్: బాల్యంలో నిమోనియా వంటివాటి బారిన పడ్డవారికి పెద్దయ్యాక శ్వాసపరమైన ఇన్ఫెక్షన్ల ముప్పు అధికమని ఓ అధ్యయనంలో తేలింది. ముఖ్యంగా 26 నుంచి 73 ఏళ్ల మధ్య వయసులో శ్వాస సంబంధిత సమస్యలతో మరణించే ప్రమాదమూ ఎక్కువేనని అది తేల్చింది. ‘‘రెండేళ్లు, అంతకంటే తక్కువ వయసులో బ్రాంకైటిస్, నిమోనియా వంటివాటి బారిన పడేవారిలో పెద్దయ్యాక శ్వాస సంబంధిత వ్యాధులతో అకాల మరణం సంభవించే ఆస్కారం ఇతరులతో పోలిస్తే 93 శాతం ఎక్కువ’’ అని వివరించింది. దీర్ఘకాలిక శ్వాస సమస్యలు పెద్ద ఆరోగ్య సమస్యగా మారాయి. వీటివల్ల 2017లో ప్రపంచవ్యాప్తంగా 39 లక్షల మంది మరణించినట్టు గణాంకాలు చెబుతున్నాయి. వీటిలో చాలా మరణాలకు క్రానిక్ అబ్స్ట్రక్టివ్ పల్మనరీ డిసీజ్ (సీఓపీడీ) కారణమని అధ్యయనం పేర్కొంది. అందుకే శ్వాస సంబంధిత సమస్యలను చిన్నతనంలోనే సంపూర్ణంగా నయం చేయడంపై మరింతగా దృష్టి సారించాల్సిన అవసరం చాలా ఉందని అధ్యయనానికి సారథ్యం వహించిన ఇంపీరియల్కాలేజ్ ఆఫ్ లండన్‌కు చెందిన జేమ్స్ అలిన్సన్ అభిప్రాయపడ్డారు. దీని ఫలితాలు ద లాన్సెట్ జర్నల్‌లో ప్రచురితమయ్యాయి. -
Delhi air pollution: ఢిల్లీలో డేంజర్ బెల్స్!
న్యూఢిల్లీ: దేశ రాజధాని ఢిల్లీలో వాయు కాలుష్యం ప్రజలను కలవరపెడుతోంది. గత వారం రోజులుగా వాయు నాణ్యత వేగంగా క్షీణిస్తోంది. మరోవైపు ఉష్ణోగ్రతలు పడిపోతున్నాయి. మంగళవారం నగరంలో కనిష్ట ఉష్ణోగ్రత 7.3 డిగ్రీల సెల్సియస్‌గా నమోదయ్యింది. సాధారణం కంటే ఇది 3 డిగ్రీలు తక్కువ అని వాతావరణ శాఖ వెల్లడించింది. గరిష్ట ఉష్ణోగ్రత 27 డిగ్రీల సెల్సియస్‌గా ఉంది. ఇక వాయు నాణ్యత సూచీ(ఏక్యూఐ) కేంద్ర కాలుష్య నియంత్రణ మండలి గణాంకాల ప్రకారం.. ఢిల్లీలో మంగళవారం ఉదయం 9 గంటలకు 358గా రికార్డయ్యింది. అంటే గాలి నాణ్యత చాలా అధ్వాన్నంగా ఉన్నట్లు తేలింది. ఢిల్లీ ప్రభుత్వ సమాచారం ప్రకారం.. నగరంలో ఏక్యూఐ గరిష్టంగా 2018లో 390, 2019లో 368, 2020లో 435, 2021లో 462గా నమోదయ్యింది. ఈ ఏడాది మరింత పెరిగే అవకాశం ఉన్నట్లు నిపుణులు అంచనా వేస్తున్నారు. సగం మంది పిల్లల్లో శ్వాస సమస్యలు ప్రపంచంలో వాయు నాణ్యత అత్యంత అధ్వాన్నంగా ఉన్న నగరాల జాబితాలో ఢిల్లీ సైతం ఉన్నట్లు ప్రపంచ ఆరోగ్య సంస్థ(డబ్ల్యూహెచ్ఓ) గతంలోనే వెల్లడించింది. ప్రపంచవ్యాప్తంగా 1,650 నగరాల్లో సర్వే చేసి ఈ చేదు నిజాన్ని బహిర్గతం చేసింది. భారత్‌లో మనుషుల మరణాలకు కారణమవుతున్న వాటిలో వాయు కాలుష్యం ఐదో స్థానంలో ఉంది. దేశంలో ప్రతిఏటా 20 లక్షల మంది వాయు కాలుష్యం కాటుకు బలవుతున్నారు. ఢిల్లీలో నివసించే పిల్లల్లో సగం మంది పిల్లలు (దాదాపు 20.2 లక్షల మంది) శ్వాస సంబంధిత సమస్యలతో బాధపడుతున్నట్లు అధ్యయనంలో వెల్లడయ్యింది. నగర పరిసర ప్రాంతాల్లో పంట వ్యర్థాల దహనం, రోడ్డుపై దుమ్మూ ధూళి, శిలాజ ఇంధనాల వినియోగం మితిమీరడం, తీవ్రమైన చలి.. వంటివి వాయు కాలుష్యానికి కారణమవుతున్నాయని నిపుణులు చెబుతున్నారు. హైదరాబాద్‌లో కాలుష్య కల్లోలం దేశ రాజధాని ఢిల్లీలోనే కాదు, తెలంగాణ రాజధాని హైదరాబాద్‌లోనూ వాయు కాలుష్యం బెంబేలెత్తిస్తోంది. శీతాకాలంలో సమస్య మరింత ముదురుతోంది. ఏక్యూఐ 201 నుంచి 300 దాకా ఉంటే పరిస్థితి అధ్వాన్నంగా ఉన్నట్లు అర్థం. ఈ ఏడాది నవంబర్ 27న హైదరాబాద్‌లో ఏక్యూఐ 272గా నమోదయ్యింది. 2019లో ఇదే ప్రాంతంలో ఇదే సమయంలో ఏక్యూఐ 150గా రికార్డయ్యింది. నగరంలో మూడేళ్లలోనే కాలుష్య తీవ్రత భారీగా పెరగడం గమనార్హం. కరోనా ముందు కాలంతో పోలిస్తే హైదరాబాద్‌లో కాలుష్యం 55 శాతానికి పైగానే పెరిగినట్లు స్పష్టమవుతోంది. గాలిలో కంటికి కనిపించని దూళి కణాల సంఖ్యను సూచించే ‘పీఎం 2.5’ కౌంట్ కూడా నగరంలో ‘అనారోగ్యకర’ స్థాయిలో ఉన్నట్లు రాష్ట్ర కాలుష్య నియంత్రణ మండలి వివరాలను బట్టి తెలుస్తోంది. పీఎం 2.5 ఎక్కువగా ఉంటే మనుషుల్లో శ్వాస సంబంధిత సమస్యలు తలెత్తుతాయి. ఊపిరి పీల్చుకోవడంలో ఇబ్బందులు ఎదురవుతాయి. పీఎం 2.5 స్థాయి 12 యూజీ–ఎం3 కంటే తక్కువగా ఉంటే ‘ఆరోగ్యకరం’గా గుర్తిస్తారు. కానీ, హైదరాబాద్‌లో ఇటీవల ఇది ఏకంగా 93.69 యూజీ–ఎం3గా నమోదు కావడం ఆందోళన కలిగిస్తోంది. -
ప్రతి రెండు సెకన్లకు ఒక మరణం..
సాక్షి ప్రత్యేక ప్రతినిధి: ప్లేగు.. మలేరియా.. మశూచి వంటివి ఒకప్పుడు లక్షల ప్రాణాలు బలితీసుకున్నాయి. అవి ఒకరి నుంచి ఒకరికి వేగంగా సోకే లక్షణమున్న అంటు వ్యాధులు కావడం.. టీకాలు, మందుల్లాంటివి లేకపోవడమే దానికి కారణం. తర్వాత టీకాలొచ్చాయి.. మందులూ అందుబాటులోకి వచ్చాయి. అంటువ్యాధులతో ప్రాణాలు కోల్పోవడం తగ్గింది. కానీ మనిషిని మరో ప్రమాదం చుట్టుముడుతోంది. అది కొత్త ముప్పేమీ కాదు.. ప్రభుత్వాల నిర్లక్ష్యం, ప్రజల్లో అవగాహన లేమి, జీవనశైలి మార్పుల పుణ్యమా అని విజృంభిస్తున్న అసాంక్రమిక వ్యాధులు.. గుండెపోటు, మధుమేహం, కేన్సర్లు, శ్వాసకోశ సమస్యలే అవి. ఇప్పుడివే సరికొత్త సవాళ్లు విసురుతున్నాయి. వ్యాధుల నివారణకు చర్యలు అవసరం ►అసాంక్రమిక వ్యాధులు పెచ్చరిల్లేందుకు ప్రధాన కారణం ఆహార అలవాట్లు. వాటి నియంత్రణతోపాటు వ్యాయా మం, దురలవాట్లకు దూరంగా ఉండటం అవసరం. ప్రభుత్వాలు కాలుష్య రహిత నగరాలను ప్రోత్సహించాలి. అందరికీ ఆరోగ్య సేవలు అందేలా చర్యలు తీసుకోవాలని.. అసాంక్రమిక వ్యాధులపై ప్రజల్లో విస్తృత అవగాహన కల్పించాల్సిన అవసరం ఉందని నిపుణులు చెబుతున్నారు. బాధితుల్లో సగమందికిపైగా తమకు రక్తపోటు, మధుమేహం వంటివి ఉన్నట్టు తెలియడం లేదని ఇటీవలి అధ్యయనం ఒకటి చెబుతోంది. ప్రజల్లో అరోగ్యంపై ఉన్న అవగాహనకు ఇదో మచ్చుతునక. అసాంక్రమిత వ్యాధులను సకాలంలో గుర్తించి చికిత్స తీసుకుంటే మరణాలు తగ్గించవ చ్చని నిపుణులు స్పష్టం చేస్తున్నారు. జీవి తంలో మంచి ఉత్పాదక స్థితిలో ఉన్న ముప్ఫై ఏళ్లవారి నుంచి 70ఏళ్లవారి వరకూ అసాంక్రమిక వ్యాధుల బారిన పడకుండా చూసుకోవడం కష్టమేమీ కాదు. పేదలకు మెరుగైన వైద్య సదుపాయాలను కల్పించడం ద్వారా ఈ వ్యాధుల బారిన పడకుండా కాపాడుకోవచ్చు. తద్వారా వారు తమ కుటుంబాలను సొంతంగా పోషించుకోగలరు. సామాజిక ఉత్పా దకతకూ భంగం ఏర్పడదు. అసాంక్రమిక వ్యాధుల బారినపడి చికిత్స, పోషణ తాలూకూ ఖర్చులు ప్రభు త్వంపై పడటం ఆయా దేశాల ఆర్థిక వ్యవస్థలపై తీవ్ర ప్రభావం చూపే అవకాశం ఉంటుంది. పేదలకు మెరుగైన వైద్యం అందుబాటులోకి తీసుకు వస్తే.. ప్రధానమైన ఈ 4అసాంక్రమిత వ్యాధుల నుంచి వారిని కాపాడవచ్చు. భారత్‌లో పరిస్థితి ఇదీ.. ప్రపంచ ఆరోగ్య సంస్థ లెక్కల ప్రకారం.. భారత్‌లో సంభవిస్తున్న మొత్తం మరణాల్లో అసాంక్రమిత వ్యాధుల వల్లే 60.46 లక్షల మరణాలు (66 శాతం) నమోదవుతున్నాయి. ఇందులో గుండె సంబంధిత వ్యాధులతో 25.66 లక్షలు (28%), తీవ్ర శ్వాసకోశ వ్యాధులతో 11.46 లక్షల (12%) మంది మరణిస్తు న్నారు. ఇక కేన్సర్‌తో 9.20 లక్షల మంది, మధుమేహంతో 3.46 లక్షల మంది మరణిస్తున్నట్టు గణాంకాలు చెబుతున్నాయి. ప్రపంచంలో పరిస్థితి ఇదీ.. ప్రపంచవ్యాప్తంగా మొత్తం మరణాల్లో 74 శాతం అసాంక్రమిక వ్యాధులతో సంభవిస్తున్నవే. ఏటా వీటితో దాదాపు 4.1 కోట్ల మంది మరణిస్తున్నారు. గుండె జబ్బులతో మరణాలు 1.80 కోట్లు, కేన్సర్‌తో 93 లక్షలు, శ్వాస సంబంధ వ్యాధులతో 41 లక్షలు, మధుమేహంతో 20 లక్షల మరణాలు ఉంటున్నాయి. అంటే అసాంక్రమిక వ్యాధుల మరణాల్లో 80 శాతం ఈ నాలుగు రకాల వ్యాధులే ఉండటం గమనార్హం. ఈ మరణాల్లో పొగాకు వినియోగం వల్ల 80 లక్షలు, ఉప్పు అధికంగా తీసుకోవడం వల్ల 18 లక్షలు, ఆల్కాహాల్‌తో (కేన్సర్ కలిపి) 30 లక్షలు, సరైన శారీరక శ్రమ చేయకపోవడం వల్ల 8.3 లక్షల మరణాలు సంభవిస్తున్నట్టు ప్రపంచ ఆరోగ్య సంస్థ గణాంకాలు చెబుతున్నాయి. ►మీకు తెలుసా.. మీరు ఈ రెండు పదాలు చదివేలోపు భూమ్మీద ఓ ప్రాణం అసాంక్రమిక వ్యాధుల కారణంగా గాల్లో కలిసిపోయి ఉంటుంది. అవును.. ఇది నిజం. ప్రపంచ ఆరోగ్య సంస్థ లెక్కల ప్రకారం అసాంక్రమిక వ్యాధుల కారణంగా ఏటా 4.1 కోట్ల మంది మరణిస్తున్నారు. ఓపికగా లెక్కేస్తే.. ఇది రెండు సెకన్లకు ఒక్కరని స్పష్టమవుతుంది. ప్రపంచం మాటిలా ఉంటే.. ఇప్పటికే గుండెజబ్బులు, మధుమేహానికి రాజధానిగా మారిన భారత్‌లోనూ పరిస్థితి భిన్నంగా ఏమీ లేదు. అసాంక్రమిక వ్యాధుల కారణంగా ఇక్కడ ఏటా సుమారు అరవై లక్షల మంది ప్రాణాలు కోల్పోతున్నారు. నిజానికి అసాంక్రమిక వ్యాధులతో ఇన్ని విలువైన ప్రాణాలు కోల్పోవాల్సిన అవసరమే లేదు. ఈ వ్యాధులు ఒక రకంగా మనం కోరి తెచ్చుకున్నవే. ప్రజల్లో ఆరోగ్యంపట్ల ఏ కొంచెం అవగాహన పెరిగినా కొన్ని లక్షల ప్రాణాలను కాపాడుకోవచ్చు. ప్రభుత్వాలు ఆరోగ్యంగా జీవించేందుకు అనువైన పరిస్థితులను కల్పిస్తే, ప్రోత్సహిస్తే.. తగిన విధానాలను రూపొందిస్తే ఆగే అకాల మరణాల సంఖ్య కోట్లలో ఉంటుంది. ఈ సంఖ్యలేవీ గాల్లోంచి పుట్టుకొచ్చినవి కావు. సాక్షాత్తు ప్రపంచ ఆరోగ్య సంస్థ లెక్కలేసి చెప్పినవే! అసాంక్రమిక వ్యాధుల మరణాల్లో అల్ప, మధ్యాదాయ వర్గాల వాటా దాదాపు 86 శాతం. అంటే తగిన వైద్య సదుపాయాల్లేని పరిస్థితుల్లో పేదలే ఎక్కువగా బలవుతున్నారన్నమాట. ప్రపంచ సగటు ఆయుర్ధాయం 2022లో 72.98 ఏళ్లుకాగా.. అల్ప, మధ్యాదాయ దేశాల్లో బాగా తక్కువగా ఉండటం గమనార్హం. మన ఆరోగ్యం.. మన చేతుల్లోనే.. అసాంక్రమిత వ్యాధులను ప్రత్యేక జాగ్రత్తలు తీసుకోవడం వల్ల నియంత్రించవచ్చు. ప్రధానంగా షుగర్, బీపీ, శ్వాసకోశ సమస్యలు, ఇన్ఫెక్షన్లు, కేన్సర్ వంటివి రాకుండా చూసుకునే వీలుంది. ఆహారం, రోగ నిరోధకశక్తిని పెంచుకోవడం ద్వారా నియంత్రించుకోవచ్చు. అల వాట్లు, ఆహారం, ధూమపానం, మద్యం వంటి వాటివల్ల ఇలాంటి వ్యాధులు వస్తాయి. తల్లిదండ్రులకు షుగర్, థైరాయిడ్ ఉండటం వల్ల తమకు వచ్చిందని చాలామంది చెబుతుంటారు. అది పూర్తి వాస్తవం కాదు. అలా రాకుండా జాగ్రత్త పడొచ్చు. కేన్సర్ కూడా అంతే. ఆహార అలవాట్లు, నిల్వ ఉంచిన, ప్యాకేజీ ఆహార పదా ర్థాలను తినడం వల్ల వచ్చే అవకాశ ముంది. చాలామంది ఇంట్లో తయారు చేసుకోకుండా రెడీమేడ్ ఆహారాలను తింటున్నారు. ఇది కేన్సర్‌కు ఒక కార ణం. మద్యం కూడా ఒక కారణం. కలుషిత గాలి వల్ల శ్వాసకోశ సమస్యలు, కేన్సర్లు వస్తాయి. ఎవరికివారు జాగ్రత్తలు తీసుకోవడం వల్ల ఇలాంటి వ్యాధులు రాకుండా చూసు కోవచ్చు. – డాక్టర్ సాయి ప్రత్యూష, ఆస్పిన్ హెల్త్ క్లినిక్, హైదరాబాద్ పొగాకు, మద్యం మానేయాలి.. సమయానికి నిద్ర ఉండాలి పొగాకు, మద్యం వాడకం తగ్గించాలి. దీని పై ప్రజల్లో అవగాహన కల్పించాలి. ఏదైనా వ్యాధి బారినపడిన వారు ముందుగానే గుర్తించి చికిత్స తీసుకుంటే కొంత వరకు కాపాడవచ్చు. బయటి ఫుడ్ తగ్గించాలి. ఎక్కువగా నడవాలి. ఆలస్యంగా నిద్ర పోవడం, తిన్న వెంటనే పడుకోవడం కూడా మంచిది కాదు. ఎక్కువ బరువు ఉండటం కూడా ఇబ్బందికరమే. షుగర్, కొలెస్ట్రాల్ ఉన్నవారు ముందు జాగ్రత్తగా చికిత్స తీసుకో వాలి. మందులు సక్రమంగా వాడా లి. ఇవన్నీ ఎవరికి వారే గుర్తించి అప్రమత్తంగా ఉండాలి. – డాక్టర్ తూడి పవన్‌రెడ్డి, జనరల్ ఫిజీషియన్, కిమ్స్, సన్‌షైన్ ఆస్పత్రి -
కాలుష్య వ్యాధుల కోరల్లో ఢిల్లీ
న్యూఢిల్లీ: కాలుష్యకాసారంగా మారిన ఢిల్లీ–రాజధాని ప్రాంత పరిసరాల (ఎన్సీఆర్) ప్రజలు ఉక్కిరిబిక్కిరవుతున్నారు. కొద్ది వారాలుగా ప్రతి ఐదింట నాలుగు కుటుంబాలు కాలుష్య సంబంధ వ్యాధులపాలవుతున్నాయని లోకల్ సర్కిల్స్ అనే సంస్థ సర్వేలో తేలింది. అందులో పాల్గొన్న వారిలో 18 శాతం ఇప్పటికే గాలి కాలుష్యంతో అస్వస్థులై ఆస్పత్రికి వెళ్లొచ్చారు. 80 శాతం కుటుంబాల్లో కనీసం ఇంటికొకరు ఒకరు శ్వాససంబంధ సమస్యను ఎదుర్కొంటున్నారు. వాయు కాలుష్యంతో బెంబేలెత్తిపోయిన ఢిల్లీ–ఎన్సీఆర్ ప్రాంత ప్రజలు కొందరు స్వస్థలాలు వదిలి వేరే ప్రాంతాలకు తాత్కాలికంగా తరలిపోయారు. ఇటీవల దీపావళి పర్వదినం సందర్భంగా బాణసంచా వినియోగంతో వెలువడిన దుమ్ము ధూళీతో పొగచూరిన ఢిల్లీలో ఐదు రోజుల తర్వాత ప్రజాభిప్రాయం తీసుకున్నారు. అప్పుడు సైతం ఇదే తరహా కాలుష్య సంబంధ ఆరోగ్య సమస్యలు చుట్టుముట్టాయని 70 శాతం మంది పౌరులు ఆవేదన వ్యక్తంచేయడం గమనార్హం. ప్రభుత్వ పాలన, ప్రజాసంబంధాలు, పౌరుల, వినియోగదారుల ప్రయోజనాలు, ఎదుర్కొంటున్న కష్టాలపై సామాజిక మాధ్యమ వేదికగా లోకల్‌సర్కిల్స్ సంస్థ సర్వేలు చేస్తుంటుంది. -
వైరస్‌కో స్వరం!
సాక్షి, హైదరాబాద్: మనుషుల కంఠస్వరం నుంచి వెలువడే శబ్దాన్ని (వాయిస్) బట్టి కరోనా సోకిందా? లేదా వారు ఈ వైరస్ వ్యాప్తికి కారకులవుతున్నారా అనేది చెప్పేస్తామంటున్నారు బెంగళూరు ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ (ఐఐఎస్సీ) శాస్త్రవేత్తలు. శబ్దాధారిత పరీక్షలతో కరోనా వైరస్‌ను నిర్ధారించవచ్చని వారంటున్నారు. శ్వాస, దగ్గు, కంఠస్వరాల ద్వారా ‘కరోనా స్ప్రెడర్స్’ను చాలా వేగంగా గుర్తించొచ్చునని, ఇందుకయ్యే ఖర్చూ అతి స్వల్పమేనని చెబుతున్నారు. ఇప్పటికే పరిమితంగా నిర్వహించిన అధ్యయనంలో ఇతర శ్వాసకోశ వ్యాధిగ్రస్తులతో పోలిస్తే కరోనా పేషెంట్ దగ్గు భిన్నంగా ఉందని ప్రాథమికంగా గుర్తించినట్టు వెల్లడించారు. బ్రాంకటీస్ లేదా శ్వాసకోశాల ఇన్ఫెక్షన్ వంటి శ్వాసకోస సంబంధ వ్యాధులున్న వారి దగ్గుతో పోలిస్తే కరోనా పేషెంట్ల దగ్గు భిన్నంగా ఉన్నట్టు చెబుతున్నారు. మార్చి చివరి నుంచే.. దేశంలో కరోనా కేసులు పెరుగుతున్న దశలోనే మార్చి నెలాఖరు నుంచి ఐఐఎస్సీ పరిశోధన బృందం స్మార్ట్‌ఫోన్ ద్వారా కరోనా బారిన పడినవారు, ఇతర శ్వాసకోశ ఇన్ఫెక్షన్లు ఉన్న వారి నుంచి కంఠస్వరం, దగ్గు శబ్దాల శ్యాంపిళ్ల డేటాను సేకరించడం మొదలుపెట్టింది. ఐఐఎస్సీలోని ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్, ఇతర విభాగాలకు చెందిన పరిశోధకుల బృందం.. ఆరోగ్యంతో ఉన్న వారి దగ్గు, శ్వాసకోశ సమస్యలున్న వారి దగ్గు శబ్దాల్లో తేడా, రకాలున్నట్టు గుర్తించింది. పరిశోధనకు ఐసీఎంఆర్ ఓకే.. అమెరికా నుంచి వెలువడిన పరిశోధన పత్రం.. ఈ పరిశోధన బృందంలో ఆసక్తిని రేకెత్తించింది. కరోనా పేషెంట్ల దగ్గు ఇతర రోగుల దగ్గుకంటే భిన్నంగా ఉన్నట్టు ఆ పత్రం పేర్కొంది. కంఠస్వర శబ్దం, దగ్గు ఆధారిత డేటా ఆధారంగా కరోనా నిర్ధారణలో 95% కచ్చితత్వం సాధించినట్టు తెలిసింది. ఇదే సమయంలో ఐఐఎస్సీ సేకరించిన నమూనాలు తక్కువగా ఉండటంతో ఆస్పత్రుల్లోని పేషెంట్ల నుంచి నమూనాలు సేకరించాలని భావించినా అది సాధ్యంకాలేదు. దీంతో భారీగా డేటా సేకరణకు ఐసీఎంఆర్‌ను ఐఐఎస్సీ అనుమతి కోరగా అందుకు ఆమోదం తెలిపింది. దీంతో శ్వాససంబంధ అంశాలు, దగ్గు, కంఠస్వరాలు ఆధారంగా కరోనా నిర్ధారణకు సంబంధించి ‘కోస్వర’పేరిట ఐఐఎస్సీ ప్రాజెక్ట్‌ను చేపట్టింది. నిర్ధారణ ఇలా.. వెబ్, మొబైల్ అప్లికేషన్ రూపంలో కరోనా నిర్ధారణ సాధనాన్ని (డయాగ్నసిస్ టూల్) ఐఐఎస్సీ పరిశోధకులు విడుదల చేయనున్నారు. తమ కంఠస్వరాలను (శబ్దాలు) రికార్డ్ చేయాల్సిందిగా ఈ అప్లికేషన్ కోరుతుంది. ఇలా భారీగా శ్వాసకోశ సమస్యలు, ఇతరుల నుంచి వాయిస్ శాంపిల్స్ ద్వారా డేటాను రికార్డ్ చేశాక ఆయా వ్యక్తుల నుంచి వెలువడే శబ్దాల ఆధారంగా స్కోర్‌ను వెల్లడిస్తారు. ఈ స్కోర్ ఆధారంగా కరోనా సోకిందా లేదా ఆయా వ్యక్తుల నుంచి వైరస్ వ్యాప్తికి అవకాశముందా అనేది తేలుస్తారు. దేశంలో కరోనా ఏ మేరకు? దేశంలో కరోనా ఏ మేరకు వ్యాపించింది? వైరస్ తీవ్ర ప్రభావిత ప్రాంతాల్లో పరిస్థితి ఏమిటి? కమ్యూనిటీ స్ప్రెడ్, ట్రాన్స్మిషన్ ఏ మేరకుంది? అనే అంశాలపై స్పష్టమైన అంచనా సాధించే కసరత్తు మొదలుకానుంది. సమాజంలో ఎంత మందికి ఈ వైరస్ సోకింది అనే విషయాన్ని తేల్చేందుకు రక్తనమూనాల పరీక్షల (సెరో సర్వే) అధ్యయనానికి రంగం సిద్ధమవుతోంది. ఈ సర్వే కోసం పుణే నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ వైరాలజీ అభివృద్ధి చేసిన యాంటీబాడీ టెస్టింగ్ కిట్లను ఉపయోగించనున్నారు. కరోనా పాజిటివ్ కేసుల గుర్తింపునకు శ్వాబ్ టెస్ట్‌లను నిర్వహిస్తుండగా మధుమేహం, ఇతర రోగాలను అక్కడికక్కడే బ్లడ్ శాంపిళ్లను స్ట్రిప్‌ల ద్వారా గుర్తించేలా ఈ సర్వేలో పరీక్షలు నిర్వహించనున్నారు. 70% కేసులు ఆ 10 నగరాల్లోనే.. దేశంలోని ముంబై, ఢిల్లీ, చెన్నై, అహ్మదాబాద్, కోల్‌కతా, పుణే, ఇండోర్, థానే, జైపూర్, సూరత్ హాట్‌స్పాట్ నగరాల్లో చేపట్టనున్న సెరోసర్వేను ఈ వారంలోనే ప్రారంభించ నున్నారు. ఇప్పటివరకు దేశంలోని మొత్తం కేసుల లోడ్‌లో 70 శాతం ఈ నగరాల నుంచే ఉన్నట్టుగా అంచనా వేస్తున్నారు. ఈ సర్వే ద్వారా దేశంలోని ఎంత శాతం జనాభా ఈ వైరస్ బారిన పడింది, మరణాలను తగ్గించేందుకు ఏ చర్యలు తీసుకోవాలన్నది స్పష్టమవుతుందని నిపుణులు అంచనా వేస్తున్నారు. -
అన్ని ఆసుపత్రుల్లోనూ ‘ఆక్సిజన్’ తప్పనిసరి
సాక్షి, హైదరాబాద్: కరోనా వల్ల ఊపిరితిత్తులు దెబ్బతిని శ్వాసకోశ సంబంధ సమస్యలు వస్తున్నాయని, ఈ నేపథ్యంలో అన్ని ఆసుపత్రుల్లో ఆక్సిజన్ సదుపాయం ఉండేలా చూడాలని వైద్య ఆరోగ్య శాఖ మంత్రి ఈటల రాజేందర్ ఆదేశించారు. లాక్డౌన్ సడలింపుల నేపథ్యంలో వైద్య సిబ్బంది, ప్రభుత్వ ప్రైవేట్ ఆసుపత్రులు, ప్రజలు తీసు కోవాల్సిన జాగ్రత్తలపై మంత్రి ఈటల మంగళ వారం ఉన్నతస్థాయి సమీక్ష నిర్వహించారు. ప్రాథ మిక ఆరోగ్య కేంద్రాల్లోని మందుల స్టాక్‌పై ఆరా తీశారు. అన్ని ఆసుపత్రుల్లో సరిపడా మందులుం డేలా చూడాలని ఎండీని ఆదేశించారు. లాక్డౌన్ సడలింపులతో ప్రజలు పెద్దసంఖ్యలో బయటికి వస్తున్నారని, ఇప్పుడు మరింత అప్రమత్తత అవసరమన్నారు. బయటికొచ్చే వారు తప్పక మాస్క్ ధరించాలని, భౌతికదూరం పాటించాలని, తరచుగా చేతులు శుభ్రం చేసుకోవాలని కోరారు. ఇంట్లో చిన్న పిల్లలు, వృద్ధుల పట్ల జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. దగ్గు, జ్వరం లక్షణాలుంటే వైద్య పరీక్షలు చేయించుకోవాలని కోరారు. వలస కార్మికులు, విదేశీ ప్రయాణికులు, ఇతర రాష్ట్రాల నుంచి వస్తున్న వారికి, అలాగే కరోనా కట్టడికి ముందుండి పనిచేస్తున్న వైద్య, మున్సిపల్, పోలీసు సిబ్బందికి వ్యాధి లక్షణాలుంటే పరీక్షలు చేయించా లని ఐసీఎంఆర్ మార్గనిర్దేశకాలు విడుదల చేసిందన్నారు. గ్రామాల్లో జ్వర పరీక్షలపై ఆరా.. గతంలోనే చెప్పినట్టు బయటి నుంచి వస్తున్న వారిని 14 రోజుల పాటు హోం క్వారంటైన్ చేయాలని ఈటల మరోసారి ఆదేశించారు. గ్రామాల్లో జ్వర పరీక్షలపై మంత్రి ఆరా తీశారు. ఎట్టి పరిస్థితుల్లో నిర్లక్ష్యం వహించవద్దని కోరారు. అన్ని ఆసుపత్రుల్లో అన్ని వైద్య సేవలందేలా చూడాలని సూచించారు. కరోనా లక్షణాలున్న వారిని, నాన్ కరోనా రోగులను విడివిడిగా చూడాలని కోరారు. గాంధీ ఆసుపత్రిలో రోగుల చికిత్సపై కూడా మంత్రి సమీక్షించారు. గాంధీ ఆసుపత్రి సూపరింటెండెంట్ రాజారావుతో ఫోన్లో మాట్లాడారు. -
శ్వాసకోశ సమస్యలన్నీ సైనస్‌కు ఇబ్బందే...
హోమియో కౌన్సెలింగ్ నా మిత్రుడికి 24 సంవత్సరాలు. తను గత ఆరు నెలలుగా తీవ్రమైన తలనొప్పి, ముక్కుదిబ్బడ, తుమ్ములు, ముక్కుకారడం వంటి సమస్యలతో బాధపడుతున్నాడు. డాక్టర్‌ను సంప్రదిస్తే సైనసైటిస్ అని నిర్థారించి, నివారణగా యాంటీబయాటిక్స్ ఇచ్చారు. వాటిని వాడటం వల్ల సైడ్ ఎఫెక్ట్స్ వస్తున్నాయి. హోమియోలో దీనికి పరిష్కారం ఉంటే చెప్పగలరు. - ఎస్.పవన్ కుమార్, తెనాలి. కపాలంలో గాలితో నిండి కవాటాలను సైనస్‌లని అంటారు. ఈ సైనస్‌లు మ్యూకస్ మెంబ్రేన్ అనే మెత్తటి పొరతో కప్పి ఉంటాయి. ఈ మెంబ్రేన్ పలుచటి ద్రవపదార్థాన్ని స్రవిస్తుంది. ఇవి స్రవించే మార్గంలో వివిధ కారణాల వల్ల అడ్డంకులు ఏర్పడి ఇన్ఫెక్షన్ రావచ్చు. దీనినే సైనసైటిస్ అంటారు. అన్ని రకాల శ్వాసకోశ సమస్యలు ఈ సైనస్పై ప్రభావం చూపుతాయి. లక్షణాలు: సైనస్‌లు ఉన్న భాగం నొప్పి, ముక్కు కారడం, ముక్కు దిబ్బడ, తల బరువుగా ఉండటం, కొంచెం దూరం నడిస్తే ఆయాసం, జ్వరం, నిద్రలేమి, తలనొప్పి, తుమ్ములు, ఆకలి మందగించడం వంటివి. కారణాలు: ముక్కులో వచ్చే ఇన్ఫెక్షన్లు, సైనస్లకు దగ్గరగా ఉండే ఎముకలు విరగడం వల్ల వచ్చే ఇన్ఫెక్షన్స్, దంతాల ఇన్ఫెక్షన్స్, నాసల్ కేవిటీలో ద్రవాలు నిల్వ ఉండటం, చల్లని వాతావరణం, పౌష్టికాహారలోపం, డయాబెటిస్, తట్టు, అమ్మవారు, కోరింత దగ్గు, డీఎన్ఎస్. సైనసైటిస్లలో మాక్సిలరీ సైనసైటిస్, ఫ్రంటల్ సైనసైటిస్, ఇథిమాయిడల్ సైనసైటిస్, స్పీనాయిడల్ సైనసైటిస్ అని నాలుగు రకాలున్నాయి. నిర్ధారణ: వ్యాధి లక్షణాలను బట్టి, సైనస్ ఎక్స్‌రే, సీబీపీ, ఈఎస్సార్ల ఆధారంగా. నివారణ: వేడినీటి ఆవిరి పట్టడం, వ్యాయామం చేయడం, ఎలర్జీ కలిగించే వస్తువులకు,చల్లటి ఆహార పదార్థాలకు, చల్లటి వాతావరణానికి, ఇన్ఫెక్షన్స్, శ్వాసకోశ వ్యాధులతో బాధపడుతున్న వారికి దూరంగా ఉండటం, శ్వాసకోశ వ్యాధులు దీర్ఘకాలంపాటు ఉండకుండా చూసుకోవడం, ధూమపానం అలవాటుంటే మానేయడం, దుమ్మూధూళికి దూరంగా ఉండటం. హోమియో చికిత్స: హోమియోలో ఎటువంటి సమస్యలకయినా కాన్స్టిట్యూషనల్ చికిత్స ద్వారా క్రమేపీ రోగనిరోధక శక్తిని పెంచి వ్యాధి తీవ్రతను తగ్గించి క్రమక్రమంగా వ్యాధి నివారణ జరుగుతుంది. మీ స్నేహితుడిని వెంటనే హోమియో వైద్యనిపుణుని సంప్రదించి, తగిన చికిత్స తీసుకోమని చెప్పండి. డాక్టర్ ఎ.ఎం. రెడ్డి సీనియర్ డాక్టర్ పాజిటివ్ హోమియోపతి హైదరాబాద్ గ్యాస్ట్రోఎంటరాలజీ కౌన్సెలింగ్ నాకు ఈ మధ్యకాలంలో కడుపులో నీరు వస్తుంది. కాళ్లు వాపుగా ఉంటున్నాయి. దగ్గర్లో ఉన్న డాక్టర్‌ను కలిస్తే మందులు ఇచ్చారు. అవి వేసుకున్నప్పుడు ఈ రెండు సమస్యలు తగ్గిపోయాయి. కానీ కొన్నిరోజుల తరువాత మళ్లీ ఈ సమస్యలు మొదలైనవి. మందులు వేసుకున్నప్పుడు తగ్గుతుంది. ఎందుకిలా? నేను రోజూ ఆల్కహాల్ తీసుకుంటాను. దానివల్ల ఇలా జరుగుతుందంటారా? జీవితాంతం ఈ మందులు వాడాలా? ఇంకేదైనా సమస్య ఉందా? ఏం చేయాలో సరైన సలహా ఇవ్వగలరు. - రమణ, శ్రీకాకుళం మీరు తెలిపిన వివరాలను బట్టి చూస్తే సాధారణంగా కిడ్నీ సమస్యల వల్ల వాపు కనిపిస్తుంది. కడుపులో నీరు చేరడం కూడా ఉంటుంది. లివర్ మరియు గుండెకు సంబంధించిన జబ్బులు ఉన్నప్పుడు కూడా ఇటువంటి లక్షణాలు కనిపిస్తాయి. మీరు ఆల్కహాల్ తీసుకుంటున్నారు కాబట్టి ఇది లివర్ వల్ల వచ్చిన వ్యాధి అయి ఉంటుంది. మీరు ఏమైనా పరీక్షలు చేయించుకున్నారో లేదో చెప్పలేదు. ఒకసారి మీరు కడుపు స్కానింగ్, లివర్ ఫంక్షన్ టెస్ట్, కిడ్నీ ఫంక్షన్ టెస్ట్, కడుపులోని నీరు పరీక్షలు చేయించుకోండి. వాటి రిపోర్టుల ఆధారంగా మీ దగ్గరలోని గ్యాస్ట్రో ఎంట్రారాలజిస్టును కలిస్తే సరైన చికిత్స అందించగలుగుతారు. నాకు చాలా రోజుల నుంచి ఛాతీలో మంటగా ఉంటోంది. చిన్న విషయమే కదా అని మెడికల్ షాపులో అడిగితే డైజిన్ జెల్ తాగమని ఇచ్చారు. ఇది తాగినప్పుడు మంట తగ్గుతుంది. కానీ తరువాత మళ్లీ పరిస్థితి మామూలే. దీన్ని తగ్గించుకోవడానికి ఏం చేయాలి? - తేజ, అమలాపురం మీరు తెలిపిన విషయాలను బట్టి చూస్తే మీకు గ్యాస్ట్రో ఈసోఫెగల్ రిప్లెక్స్ డిసీజ్ ఉన్నట్లనిపిస్తోంది. ఆహారపు అలవాట్లు సరిగా లేకపోవడం వల్ల వచ్చే అనారోగ్యం ఇది. మీరు మీ జీవన విధానంలో కొన్ని మార్పులు చేసుకుంటే చాలావరకు మీ సమస్య తగ్గిపోతుంది. మీరు కాఫీ, టీలను మానేయాలి. ఆహారంలో కొవ్వు పదార్థాలను తగ్గించుకోవాలి. మద్యం మానివేయాలి. పొగ తాగకూడదు. బరువు ఎక్కువగా ఉంటే తగ్గించుకోవాలి. భోజనం చేయగానే పడుకోకూడదు. ఈ మార్పులు తప్పనిసరిగా చేస్తే మీరు మీ సమస్యను అధిగమించగలరు. అయినా తగ్గకపోతే మీరు డాక్టర్ సలహా మేరకు ఒక్కసారి ఎండోస్కోపీ పరీక్ష చేయించుకొని చికిత్స పొందగలరు. డాక్టర్ భవానీరాజు సీనియర్ గ్యాస్ట్రో ఎంటరాలజిస్ట్ కేర్ హాస్పిటల్స్ బంజారాహిల్స్ హైదరాబాద్ న్యూరో కౌన్సెలింగ్ మా అమ్మకు 53 ఏళ్లు. చాలాకాలంగా ఆమె భరించలేనంత తలనొప్పితో బాధపడుతున్నారు. అన్నిరకాల వైద్యాలు ప్రయత్నించిన తర్వాత ఇటీవల ఎమ్మారై స్కాన్ చేయిస్తే మెదడులో క్యాన్సర్ కణితులు ఉన్నట్లు తేలింది. ఇది మాకు షాక్‌లా ఉంది. సర్జరీ, రేడియేషన్‌తో కణితులను తొలగించవచ్చని ఆయన అంటున్నారు. కానీ మాకు ఆందోళనగా ఉంది. మాకు తగిన సలహా ఇవ్వగలరు. - రవళి, గుడివాడ మెదడులో క్యాన్సర్ కణితులు ఉన్నట్లు హఠాత్తుగా తెలుసుకోవడం ఎవరికైనా ఆందోళనే కలిగిస్తుంది. ఒకప్పుడు మెదడులో కణితులకు చికిత్స కష్టమేమోగానీ, ఇప్పుడున్న చికిత్స పద్ధతులతో అంతగా ఆందోళన చెందాల్సిన విషయం కాదు. సాధారణ కణితులను సర్జరీ చేసి తొలగిస్తే సరిపోతుంది. కానీ క్యాన్సర్ కణితుల విషయంలో వాటిని తొలగించడంతో పాటు కీమోథెరపీ, రేడియేషన్ థెరపీ వంటివి అవసరమవుతాయి. మెదడులో వచ్చే కణితుల్లో నాలుగు గ్రేడులు ఉంటాయి. ఇతర క్యాన్సర్ల మొదటి దశతో మొదలై క్రమేపీ ముదిరి నాలుగో దశకు చేరతాయి. కాబట్టి ఇలాంటి క్యాన్సర్లను ముందుగానే గుర్తిస్తే వాటిని దాదాపుగా నయం చేసే వీలుంటుంది. కానీ మెదడులో వచ్చే క్యాన్సర్ కణితుల విషయంలో క్రమేపీ ఒక దశ నుంచి మరో దశకు వెళ్లడం ఉండదు. మొదలవుతూనే అవి మూడు లేదా నాలుగో దశలతో ఉండవచ్చు. కణితి మొదటి రెండు గ్రేడులలో ఉంటే చికిత్సతో రోగి జీవితకాలాన్ని పదేళ్లకు పెంచవచ్చు. కానీ నాలుగో దశలో కణితులు ఉంటే మాత్రం రోగి ఎక్కువకాలం జీవించడం కష్టం. కణితి చాలా చిన్నగా ఉండి, ఎమ్మారై స్కానింగ్‌లో అది మొదటి రెండు గ్రేడ్లలో ఉందని తేలితే వెంటనే సర్జరీ చేసి తొలగించాల్సిన అవసరం లేదు. అది పెరిగి 2 నుంచి 3 సెం.మీ. సైజుకు చేరితే అప్పుడు సర్జరీ అవసరమవుతుంది. అలాగే మెదడులోని నుదురు, చెవుల భాగంలో వచ్చే కణితులను సర్జరీతో తొలగిస్తే చాలావరకు సాధారణ జీవితం గడపవచ్చు. కానీ మెదడు మధ్యభాగంలో వచ్చే కణితులను పూర్తిగా తొలగించడం అన్నివేళలా సాధ్యం కాకపోవచ్చు. ఎందుకంటే మనకు మాటలు వచ్చేలా చేసే కేంద్రం, శరీర కదలికలను నియంత్రించే కేంద్రం వంటి వాటిని గుర్తించి, వాటిని ముట్టుకోకుండా మిగతా భాగంలో ఉన్న కణితిని తొలగించాలి. మిగిలిపోయిన భాగాలను రేడియోథెరపీ, కీమోథెరపీల ద్వారా నయం చేయవచ్చు. ఒకవేళ కణితి మెదడు మధ్యభాగంలో వస్తే మెదడు కణజాలాన్నీ, కణితినీ వేరు చేసి చూడటం కష్టమవుతుంది. పొరబాటున కణితితో పాటు మెదడు భాగాన్ని కూడా తొలగిస్తే చాలా నష్టం. కాబట్టి ఈ తేడాను గుర్తించేందుకు నిపుణులు మైక్రోస్కోపిక్, నావిగేషన్ వంటి పరిజ్ఞానాలను వినియోగిస్తారు. కాబట్టి మీరు ఆందోళన చెందకుండా అన్ని సౌకర్యాలతో పాటు నిపుణులైన న్యూరోసర్జన్లు ఉన్న దగ్గర్లోని కేంద్రానికి తీసుకెళ్లి చికిత్స తీసుకోండి. డాక్టర్ ఆనంద్ బాలసుబ్రమణ్యం సీనియర్ న్యూరో సర్జన్ యశోద హాస్పిటల్స్ సికింద్రాబాద్