World Health Organization Released Air Pollution Data, 14 Of The Top 20 Cities In India - Sakshi
Sakshi News home page

అలర్ట్‌: ప్రపంచంలో టాప్‌-20 వాయు కాలుష్య పట్టణాల్లో 14 భారత్‌లోనే.. 

Published Tue, Jun 13 2023 5:50 AM | Last Updated on Tue, Jun 13 2023 3:23 PM

World Health Organization released air pollution data - Sakshi

ఊపిరాడని పరిస్థితి. శ్వాసకోశ సమస్యలు పట్టిపీడిస్తున్న దుస్థితి. ఎక్కడో ఒక చోటే అని కాదు.. ప్రపంచవ్యాప్తంగా 99 శాతం ప్రజానీకం పీలుస్తున్న గాలి స్వచ్ఛమైనది కాదు. వాయు కాలుష్యం కారణంగా ప్రపంచవ్యాప్తంగా ఏటా 67 లక్షల మందికిపైగానే బలవుతున్నారు. ప్రపంచ ఆరోగ్య సంస్థ తాజాగా వెల్లడించిన నివేదికలోని అంశాలే ఇవి. స్విస్‌ ఎయిర్‌ క్వాలిటీ టెక్నాలజీ కంపెనీ చేసిన అధ్యయనం ఆధారంగా ప్రపంచ ఆరోగ్య సంస్థ ఈ నివేదికను విడుదల చేసింది.

అందులో మన దేశానికి సంబంధించిన కొన్ని దారుణమైన వాస్తవాలనూ వెల్లడించింది.  ప్రపంచంలో వాయు కాలుష్యం అత్యధికంగా ఉన్న టాప్‌–20 నగరాల జాబితాలో ఏకంగా 14 నగరాలు భారతదేశం నుంచే ఉండటం ఆందోళనకరం. ఇందులో దక్షిణాది రాష్ట్రాలేవీ లేకపోవడం కాస్త ఉపశమనం. వాయు కాలుష్యం ఎక్కువగా ఉన్న నగరాల్లో దానిని తగ్గించే చర్యలు చేపడుతుంటే.. వాటి స్థానంలో కొత్త నగరాలు వచ్చి చేరుతున్నాయి. 
–సాక్షి ప్రత్యేక ప్రతినిధి, హైదరాబాద్‌

ఆరు వేల నగరాల్లో పరిశీలించి.. 
2022 సంవత్సరానికి సంబంధించి మొత్తం 117 దేశాల్లోని ఆరు వేల నగరాల్లో వాయు నాణ్యతను పరీక్షించామని.. మరికొన్ని దేశాల్లో వాయు నాణ్యతను పరీక్షించేందుకు సరైన పరికరాలు లేని కారణంగా పరీక్షించలేకపోయామని డబ్ల్యూహెచ్‌వో పేర్కొంది. అలాంటి వాటిలో చాలా వాయు కాలుష్యం ఉన్న నగరాలూ ఉండి ఉంటాయని తెలిపింది. 

తగిన జాగ్రత్తలు తీసుకోలేక.. 
కార్బన్‌ డయాక్సైడ్, కార్బన్‌ మోనాక్సైడ్, నైట్రోజన్‌ డయాక్సైడ్, సూక్ష్మ ధూళి కణాలు వంటి వాయు కలుషితాలు తీవ్రంగా ప్రభావం చూపిస్తున్నాయి. వేగంగా అభివృద్ధి చెందే క్రమంలో అటవీ సంపదను నాశనం చేస్తుండటం, పరిశ్రమల ఏర్పాటుతో కాలుష్యం పెరుగుతోంది. పరిశ్రమలు విడుదల చేసే వాయు, జల, భూకాలుష్యాలను అరికట్టే చర్యలపై ప్రభుత్వం, అధికార యంత్రాంగం నిర్లక్ష్యం చూపుతున్నాయి. ఏదో భోపాల్‌ దుర్ఘటన వంటివి జరిగినప్పుడు హడావుడి చేయడం, ఆ తర్వాత మిన్నకుండిపోవడం సాధారణమైపోయింది. భద్రతా ప్రమాణాలను ‘గాలి’కి వదిలేయడం వల్ల వాయు కాలుష్యం ప్రజల ప్రాణాలకు అపాయకరంగా మారుతోంది.  

వంటింటి పొగ ప్రాణాలు తీస్తోంది 
వాయు కాలుష్యం కారణంగా ప్రాణాలు పోగొట్టుకుంటున్న వారిలో మహిళలు, చిన్నారులు ఎక్కువగా ఉంటున్నారు. ప్రపంచవ్యాప్తంగా ఏటా 32 లక్షల మందికిపైగా వంటింటి పొగకు బలవుతున్నట్టు డబ్ల్యూహెచ్‌వో నివేదికలో పేర్కొంది. ప్రపంచ జనాభాలో మూడో వంతు కుటుంబాలు వంట కోసం కలప, బొగ్గు, పేడ, పంటల వ్యర్థాలను వాడుతున్నాయని.. తద్వారా వెలువడే వాయు కాలుష్యంతో ఊపిరితిత్తులు దెబ్బతిని శ్వాసకోశ వ్యాధుల బారిన పడుతున్నట్టు వెల్లడించింది. పరిశ్రమలు, వాహన, వంటింటి వాయు కాలుష్యం వల్ల మొత్తంగా ఏటా 67 లక్షల మంది శ్వాసకోశ వ్యాధులతో మృత్యువాత పడుతున్నట్లు తెలిపింది. 

ఏయే సమస్యలు వస్తున్నాయి? 
కలుషిత గాలిలోని సూక్ష్మ ధూళి కణాలు ఊపిరితిత్తుల్లోకి వెళ్లి శ్వాస సంబంధిత వ్యాధులు తలెత్తుతున్నాయి. వాయు కాలుష్యంతో మరణిస్తున్న వారిలో 32శాతం మంది ఇస్కామిక్‌ హర్ట్‌ డిసీజ్‌తో, 23 శాతం మంది గుండెపోటుతో, 21 శాతం లోయర్‌ రెస్పిరేటరీ ఇన్ఫెక్షన్, 19 శాతం క్రానిక్‌ అబ్‌స్ట్రక్టివ్‌ పల్మనరీ డిసీజ్‌తో, ఆరు శాతం మంది ఊపిరితిత్తుల కేన్సర్‌తో మరణిస్తున్నట్టు డబ్ల్యూహెచ్‌వో నివేదికలో పేర్కొంది.

వాయు కాలుష్యం నివారణకు ఏం చేయాలి? 
► వాయు కాలుష్యాన్ని నివారించడానికి ప్రపంచ ఆరోగ్య సంస్థ పలు సూచనలు కూడా చేసింది. తగిన వాయు నాణ్యతా ప్రమాణాలను అనుసరించాలని స్పష్టం చేసింది. 

► వాయు కాలుష్య కారక అంశాలను గుర్తించాలి. వాటి నియంత్రణ చర్యలను ప్రభుత్వ యంత్రాంగం నిత్యం పర్యవేక్షించాలి. 

► వంటకు అవసరమైన కాలుష్య రహితమైన, నాణ్యమైన ఇంధనాన్ని సమకూర్చాలి. సురక్షితమైన, సామాన్యులకు అందుబాటులో ఉండే రవాణా వ్యవస్థ ఏర్పాటు చేయాలి. పాదచారులకు, సైక్లింగ్‌ ఫ్రెండ్లీ నెట్‌వర్క్‌ కల్పించాలి. 

► వాహన కాలుష్యాన్ని అరికట్టేలా కఠిన చట్టాలు తీసుకుని రావాలి. వాటి అమలును నిత్యం పర్యవేక్షించేలా అధికార యంత్రాంగం పనిచేయాలి. 

► పరిశ్రమల వ్యర్థాలు, మున్సిపల్‌ వ్యర్థాల యాజమాన్య నిర్వహణను మరింత పెంచాలి. 

► పంట వ్యర్థాలను తగలబెట్టడం ఆపేయాలి. అటవీ అగ్నిప్రమాదాలను అరికట్టాలి. 

ఉత్తరాది రాష్ట్రాల్లో సమస్య తీవ్రం 
సూక్ష్మరూపాల్లోని కాలుష్యాలు మనుషుల ఆరోగ్యంపైనే కాకుండా పర్యావరణం, జీవవైవిధ్యం, పశుపక్ష్యాదులు, జంతు జాలం, పొలాలు, వ్యవసాయ ఉత్పత్తులపైనా తీవ్ర ప్రభావం చూపుతున్నాయి. ప్రస్తుతం మన దేశంలో ఉత్తరాది రాష్ట్రాల్లో ఈ సమస్య ఎక్కువగా ఉంది. కానీ దక్షిణాది రాష్ట్రాలు కూడా ఈ విషయంలో జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఉంది. విష వాయువులతోపాటు పీఎం 2.5, పీఎం 10 సూక్ష్మరూపాల్లోని కాలుష్య వ్యాప్తి మనుషుల ఆరోగ్యాన్ని కుంగదీస్తోంది. వాయు కాలుష్యాన్ని తగ్గించే దిశలో ఎవరికి వారు వ్యక్తిగత స్థాయిలో, ప్రభుత్వం, స్వచ్ఛందసంస్థల పరంగా పరిష్కారమార్గాలు ఆలోచించాలి. 
– ప్రొఫెసర్‌ కె.పురుషోత్తంరెడ్డి, ప్రముఖ పర్యావరణవేత్త 

 హైదరాబాద్‌లోనూ పెరుగుతున్న కాలుష్యం 
ఇటీవల సెంట్రల్‌ పొల్యూషన్‌ కంట్రోల్‌బోర్డు డేటాను విశ్లేషిస్తూ గ్రీన్‌పీస్‌ ఇండియా విడుదల చేసిన నివేదికలో.. హైదరాబాద్‌లో పీఎం 10 స్థాయిలు నిర్దేశిత ప్రమాణాల కంటే ఆరేడుశాతం అధికంగా ఉన్నాయి. పరిశ్రమల విస్తరణ, రవాణా పెరగడం, చెత్త తగలబెట్టడం, భారీగా నిర్మాణ కార్యకలాపాల వల్ల వాయు కాలుష్యం పెరుగుతోంది. పర్టిక్యులేట్‌ మేటర్, సల్ఫర్‌ డయాక్సైడ్, నైట్రోజన్‌ ఆక్సైడ్, కార్బన్‌ మోనాక్సైడ్, పీఎం 2.5, పీఎం 10 వంటివి ఎక్కువ అవుతున్నాయి. ఇవి ఊపిరితిత్తులపై ప్రభావం చూపి.. శ్వాసకోశ సమస్యలకు కారణమవుతున్నాయి. 
– హరికిషన్‌ గోనుగుంట్ల, చీఫ్‌ ఇంటర్వెన్షనల్‌ పల్మనాలజిస్ట్, యశోద ఆస్పత్రి 

గాలి నాణ్యతను ఎలా నిర్ధారిస్తారు? 
గాలి నాణ్యతను ‘ఎయిర్‌ క్వాలిటీ ఇండెక్స్‌ (ఏక్యూఐ)’తో కొలుస్తారు. వాతావరణంలో ఒక క్యూబిక్‌ మీటర్‌ గాలిలో కెమికల్స్‌ రియాక్షన్స్‌తో ఏర్పడిన, లేదా దుమ్ము, ధూళి కణాలు, నిర్మాణ ప్రాంతాలు, పారిశ్రామిక ప్రాంతాల్లో వెలువడే కాలుష్యాల (పర్టిక్యులేట్‌ మేటర్‌)ను లెక్కించి కొలుస్తారు. గంటకోసారి లేదా 8 గంటలకోసారి కొలవడం ద్వారా సగటు ఏక్యూఐని గుర్తిస్తారు.  

టాప్‌–20 వాయు కాలుష్య నగరాలు 
లాహోర్‌ (పాకిస్తాన్‌), హోటన్‌ (చైనా),భివండి, ఢిల్లీ (భారత్‌), పెషావర్‌ (పాకిస్తాన్‌) ఎన్‌ డీజమేనా (చాద్‌), దర్భంగా, అసోపూర్, పట్నా, ఘజియాబాద్, ధరెహారా (భారత్‌), బాగ్దాద్‌ (ఇరాక్‌), ఛాప్రా, ముజఫర్‌నగర్‌ (భారత్‌), ఫైసలాబాద్‌ (పాకిస్తాన్‌),గ్రేటర్‌ నోయిడా, బహదూర్‌ఘర్,ముజఫర్‌పూర్, ఫరీదాబాద్‌(భారత్‌)  

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement