Our Students Are Eager to Study in America - Sakshi
Sakshi News home page

చైనాను అధిగమించి.. దూసుకెళ్తున్నారు..

Published Thu, Jul 13 2023 2:19 AM | Last Updated on Thu, Jul 13 2023 7:25 PM

Our students are eager to study in America - Sakshi

సాక్షి ప్రత్యేక ప్రతినిధి, హైదరాబాద్ : అమెరికాలో గ్రాడ్యుయేషన్, అండర్‌ గ్రాడ్యుయేషన్‌ చదువుల కోసం వెళ్లే భారతీయ విద్యార్థుల సంఖ్య గణనీయంగా పెరుగుతోంది. ప్రస్తుతం అమెరికాలో విద్యనభ్యసిస్తున్న విదేశీ విద్యార్థుల్లో చైనీయులు అధిక సంఖ్యలో ఉన్నారు. తర్వాత స్థానంలో భారత్‌ ఉంది. కానీ ఈ పరిస్థితి మరికొన్ని సంవత్సరాల్లోనే మారనుంది. త్వరలోనే భారత్‌ మొదటి స్థానంలోకి రానుంది.

చైనా నుంచి వెళ్లే విద్యార్థుల సంఖ్య క్రమంగా తగ్గుతుండటమే ఇందుకు కారణం. ఇటీవలి కాలం వరకు అమెరికా విద్యాసంస్థలు చైనా విద్యార్థులను చేర్చుకోవ డానికి అధిక ప్రాధాన్యతనిచ్చేవి. కోవిడ్‌ తర్వాత పరిస్థితిలో మార్పు వచ్చింది. ద్వైపాక్షిక సంబంధాలు కూడా ప్రభావం చూపిస్తున్నాయి. ఈ నేప థ్యంలో అమెరికా విద్యాసంస్థలు భారత్‌ను తమకు అనుకూలమైన అతిపెద్ద మార్కెట్‌గా పరిగణిస్తు న్నాయి.

స్ప్రింగ్‌ స్నాప్‌షాట్‌ పేరిట ఇంటర్నేషనల్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ ఎడ్యుకేషన్‌ (ఐఐఈ) నిర్వహించిన సర్వే ఈ విషయం స్పష్టం చేస్తోంది. 2020 నుంచి 2023 నాటికి చైనా నుంచి వచ్చే విద్యార్థుల సంఖ్య 3,68,800 నుంచి 2,53,630కి తగ్గగా.. అదే సమయంలో భారత్‌ నుంచి వెళ్లే విద్యార్థుల సంఖ్య 1.90 లక్షల నుంచి 2.53 లక్షలకు పెరిగినట్లు ఐఐఈ పేర్కొంది. 2030కి 3.94 లక్షల మందితో భారత్‌ అగ్రస్థానానికి చేరుతుందని అంచనా వేసింది.

భారత్‌ వైపే 57%  సంస్థలు మొగ్గు
గ్రాడ్యుయేషన్‌తో పాటు అండర్‌ గ్రాడ్యుయేషన్‌ విద్యార్థులను ఆకర్షించడానికి అమెరికా విద్యాసంస్థలు ప్రయత్ని స్తున్నాయి. ప్రతి పది మంది గ్రాడ్యుయేట్‌ విద్యార్థుల్లో నలుగురు విదేశీ విద్యార్థులు ఉండేలా ఈ రిక్రూట్‌మెంట్‌ విధానం కొనసాగుతోంది. 2023–24 విద్యా సంవత్సరంలో విదేశీ విద్యార్థుల చేరికకు సంబంధించి ఏప్రిల్‌ నుంచి మే మధ్య కాలంలో ఐఐఈ సర్వే నిర్వహించింది.  మొత్తం 527 విద్యాసంస్థల నుంచి డేటా సేకరించింది.

సుమారు 57 శాతం సంస్థలు భారత్‌ విద్యార్థులను ఎక్కువగా చేర్చుకోవడానికి ప్రయత్నించినట్లు వెల్లడించింది. 2022–23 కంటే  2023–24 విద్యా సంవత్సరంలో విదేశీ విద్యార్థుల నుంచి తమకు అధికంగా దరఖాస్తులు అందినట్లు 61 శాతం కాలేజీలు/యూనివర్సిటీలు వెల్లడిస్తే.. మరో 28 శాతం విద్యా సంస్థలు తమకు గత సంవత్సరం వచ్చిన మేరకు దరఖాస్తులు వచ్చాయని పేర్కొన్నాయి. మరో 12% విద్యా సంస్థలు మాత్రం తమకు దరఖాస్తులు తగ్గినట్లు తెలిపాయి.  

అమెరికాకు తగ్గిన ఆదాయం
కోవిడ్‌ తరువాత గడిచిన రెండేళ్లుగా విదేశీ విద్యార్థుల సంఖ్య పెరుగుతున్నా, కోవిడ్‌ కంటే ముందున్న ఆదాయం రాలేదని ఐఐఈ సర్వే వెల్లడిస్తోంది. కోవిడ్‌కు ముందు 2018 విద్యా సంవత్సరంలో విదేశీ విద్యార్థుల నుంచి అమెరికాకు వచ్చే ఆదాయం దాదాపు 45 బిలియన్‌ డాలర్లు.. మన రూపాయల్లో అది రూ. 3.7 లక్షల కోట్లు. ఇప్పటివరకు ఏ విద్యా సంవత్సరంతో పోల్చినా ఇదే అత్యధిక ఆదాయం.

కాగా  అప్పట్లో ఏటా దాదాపు 11 లక్షల వరకు విదేశీ విద్యార్థులు అమెరికాలో విద్యాభాస్యం కోసం వచ్చేవారని పేర్కొంది. అయితే 2022–23లో విదేశీ విద్యార్థుల వల్ల అమెరికాకు 33.8 బిలియన్‌ డాలర్ల ఆదాయం మాత్రమే సమకూరింది. అంటే మన కరెన్సీలో ఇది రూ.2.7 లక్షల కోట్లు.

అమెరికా విద్యా సంస్థలకు ఆస్ట్రేలియా, కెనడా, బ్రిటన్, జర్మనీ, ఫ్రాన్స్, స్పెయిన్‌ దేశాల నుంచి పోటీ ఎక్కువ అవుతున్నట్లు సర్వేలో తేలింది. అంటే ఈ దేశాల విద్యా సంస్థల్లో కూడా విదేశీ విద్యార్థులు అధిక సంఖ్యలో చేరుతున్నారన్నమాట. ప్రస్తుతం దాదాపు 10 లక్షల మంది వరకు విదేశీ విద్యార్థులు అమెరికాలో ఉన్నారు.

టాప్‌ టెన్‌ దేశాలివే..
విదేశీ విద్యార్థుల చేరికకు సంబంధించి ఐఐఈ గణాంకాల ప్రకారం.. గత సంవత్సరం చైనా, భారత్, దక్షిణ కొరియా, కెనడా, వియత్నాం, తైవాన్, సౌదీ అరేబియా, బ్రెజిల్, మెక్సికో, నైజీరియా దేశాలు వరుసగా తొలి పది స్థానాల్లో ఉన్నాయి. ఈ టాప్‌ టెన్‌ దేశాల విద్యార్థులే కాకుండా ఇతర దేశాల విద్యార్థులను సైతం అమెరికా విద్యాసంస్థలు ఆకర్షిస్తున్నాయి.

2021–22 సంవత్సరంలో 11వ స్థానంలో ఉన్న జపాన్‌ నుంచి 14 శాతం పెరుగుదల ఉండగా, చైనా నుంచి 8.6 శాతం తగ్గుదల కనిపించింది. 2023లో జపాన్‌ విద్యార్థుల సంఖ్యలో 33 శాతం పెరుగుదల ఉంటుందని అంచనా వేసింది. నైజీరియా నుంచి కూడా అనూహ్యంగా విద్యార్థులు పెరిగినట్లు ఐఐఈ తెలిపింది ఇక సౌదీ అరేబియా నుంచి 17 శాతం మేర విద్యార్థులు తగ్గారు.

అయితే 2030 నాటికి ఈ దేశం నుంచి విద్యార్థులు గణనీయంగా పెరగనున్నారు. తర్వాత నేపాల్, బంగ్లాదేశ్‌ల నుంచి కూడా విద్యార్థుల సంఖ్య పెరిగి ఆ రెండు దేశాలు టాప్‌ టెన్‌లో (8, 9 స్థానాల్లోకి)కి రానున్నాయి.

ఇంగ్లిష్‌ మాట్లాడే ఇతర దేశాలకూ విద్యార్థులు
విదేశీ విద్యార్థులకు అమెరికానే తొలి ప్రాధాన్యత అయినప్పటికీ..అమెరికాతో పాటు ఆంగ్లం మాట్లాడే ఇతర దేశాలకు కూడా విద్యార్థులు గణనీయ సంఖ్యలో వెళుతున్నారు. ఈ మేరకు ఆమెరికాకు విద్యార్థుల సంఖ్య తగ్గుతోంది.

ఆస్ట్రేలియా, కెనడా, బ్రిటన్‌తో పాటు జర్మనీ, స్పెయిన్, ఫ్రాన్స్‌ తదితర దేశాలకు విదేశాల నుంచి విద్యార్థులు వెళ్తున్నారు. ఆయా దేశాలు విదేశీ విద్యార్థులను ఆకట్టుకోవడానికి నిర్దేశించుకున్న లక్ష్యాలను సాధిస్తున్నాయి. 
– డాక్టర్‌ ఎస్తేర్‌ డి బ్రిమ్మర్, ఈడీ, సీఈఓ, నేషనల్‌ అసోసియేషన్‌ ఫర్‌ ఫారిన్‌ స్టూడెంట్‌ ఎఫైర్స్‌

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement