
రాష్ట్రంలో పుష్కర కాలంలో 22 శాతం పెరుగుదల
దేశంలోని మొత్తం గొర్రెల్లో 25 శాతం తెలంగాణలోనే..
వాణిజ్య పౌల్ట్రీలో తెలంగాణ వాటా 11.68 శాతం
భూమి లేని రైతుల నుంచే 62 శాతం పాల ఉత్పత్తి
సామాజిక, ఆర్థిక సర్వే 2024–25లో వెల్లడి
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో పశు సంపద సమృద్ధిగా ఉందని సామాజిక, ఆర్థిక సర్వే 2024–25లో ప్రభుత్వం వెల్లడించింది. 2012 నుంచి రాష్ట్రంలో పశు సంపద 22 శాతం పెరిగిందని తెలిపింది. సర్వే ప్రకారం రాష్ట్రంలో 3.26 కోట్ల పశువులు ఉన్నాయి. మరీ ముఖ్యంగా దేశంలోని మొత్తం గొర్రెల్లో 25 శాతం తెలంగాణలోనే ఉన్నాయి. గ్రామీణ ఆర్థిక వ్యవస్థ పటిష్ఠంగా ఉండడానికి వ్యవసాయంతోపాటు దాని అనుబంధ రంగాలైన పాల ఉత్పత్తి, కోళ్లు, మేకలు, గొర్రెల పెంపకం వల్ల వస్తున్న ఆదాయమే కారణమని సర్వే స్పష్టం చేసింది. వ్యవసాయ అనుబంధ రంగాలపై సర్వేలోని కీలక విషయాలు
» రాష్ట్రంలో ఉత్పత్తి అవుతున్న పాలలో 62 శాతం వ్యవసాయ భూమి లేని రైతుల నుంచే వస్తున్నాయి.
» 70 శాతం రైతులు పశు సంపదను కలిగి ఉన్నారు. రాష్ట్రంలో మొత్తం 3.26 కోట్ల పశువులు ఉన్నాయి.
» 2012 నుంచి పశు సంపద 22 శాతం పెరిగింది.
» ఈ రంగంలో 2023–24 ఆర్థిక సంవత్సరం తుది సవరించిన అంచనాల ప్రకారం ‘జోడించిన రాష్ట్ర స్థూల విలువ’(జీఎస్‌వీఏ) రూ.96,908 కోట్లు ఉంటే.. 2024–25 ముందస్తు అంచనాల ప్రకారం రూ.1,02,835 కోట్లకు పెరిగింది.
» 2024–25లో చేపల ఉత్పత్తి లక్ష్యం 4,81,421 టన్నులు కాగా.. ఈ ఏడాది జనవరి నాటికి 3,69,489 టన్నులు ఉత్పత్తి అయ్యింది. మంచినీటి రోయ్యల ఉత్పత్తి లక్ష్యం 18,366 టన్నులు కాగా.. జనవరి నాటికి 11,845 టన్నులు వచ్చింది. – చేపల పెంపకంలో కృషికిగాను రాష్ట్రానికి కేంద్రం ‘బెస్ట్ పెర్ఫార్మింగ్ ఇన్‌ల్యాండ్ స్టేట్ ఇన్ ఫిషరీస్ సెక్టార్’అవార్డు ప్రకటించింది.
Comments
Please login to add a commentAdd a comment