Livestock
-
పదేళ్లు.. రూ. 2 వేల కోట్ల వృద్ధి
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ రాష్ట్రం ఏర్పాటైన తర్వాత పశుసంపద గణనీయంగా వృద్ధి చెందిందని, వాటి విలువ దాదాపు రూ.2 వేల కోట్లు పెరిగిందని కేంద్ర గణాంక, కార్యక్రమాల అమలు శాఖ వెల్లడించింది. మాంసం, గుడ్లు, పాలు ఉత్పత్తుల్లోనూ రాష్ట్రం వృద్ధి సాధించిందని తెలిపింది. ఈ మేరకు ఒక నివేదిక విడుదల చేసింది. పశుసంపద, గుడ్లు, పాలు, మాంస ఉత్పత్తులకు సంబంధించిన గణాంకాలను ఇందులో పొందుపరిచింది.ఈ గణాంకాల ప్రకారం.. 2022–23 నాటికి తెలంగాణలో పశు సంపద విలువ రూ.4,789.09 కోట్లుగా నమోదైంది. అయితే రాష్ట్రం ఏర్పాటైన 2014–15లో ఇది రూ.2,824.57 కోట్లు మాత్రమే కావడం గమనార్హం. కాగా గుడ్ల ఉత్పత్తిలోనూ రాష్ట్రం మంచి ఫలితాలను సాధించింది. 2014–15లో రూ. 228.97 కోట్ల విలువైన గుడ్లను తెలంగాణ ఉత్పత్తి చేస్తుండగా, 2022–23 నాటికి అది రూ.381.04 కోట్లకు చేరింది. ఇక మాంసం ఉత్పత్తుల విలువ పదేళ్ల కాలంలో గణనీయ వృద్ధి సాధించింది.2014–15లో అన్ని రకాల మాంసం ఉత్పత్తుల విలువ రూ.1,484.05 కోట్లు కాగా, 2022–23 నాటికి అది ఏకంగా రూ.5,531.85 కోట్లకు చేరింది. పశుసంపద గణనీయంగా పెరిగినప్పటికీ పాల ఉత్పత్తిలో మరింత వృద్ధి నమోదు కావలసి ఉందని ఈ గణాంకాలు చెబుతున్నాయి. 2014–15లో రాష్ట్రం ఏర్పాటయ్యే నాటికి తెలంగాణలో పాల ఉత్పత్తి విలువ రూ.1,350.69 కోట్లు కాగా, 2022–23లో అది రూ.1,874.28 కోట్లకు మాత్రమే పెరిగినట్టు వెల్లడిస్తున్నాయి. -
మంగోలియాలో చలి పులి పంజా
ప్రకృతి వైపరీత్యం ‘జడ్’మంగోలియాను ముంచెత్తుతోంది. అతి శీతల చలికాలంతో మంగోలియా ప్రజలు తీవ్ర ఇబ్బందులను ఎదుర్కొంటున్నారు. ప్రకృతి ప్రకోపం వల్ల ఇక్కడ కనీసం పచ్చగడ్డి కూడా మొలవకపోవడంతో లక్షల సంఖ్యలో పశువులు మృత్యువాత పడుతున్నాయి. అయితే.. గతంలో దశాబ్దానికి ఒకసారి వచ్చిన జడ్.. ఇప్పుడు తరచూ వస్తుండటంతో మంగోలియా ప్రజల ఇబ్బందులు మరింత తీవ్రమయ్యాయి.తూర్పు ఆసియా దేశమైన మంగోలియాలో తీవ్ర అనావృష్టి తరవాత అతి శీతల చలికాలం వస్తే దాన్ని జడ్ అంటారు. ఈ వాతావరణ వైపరీత్యంలో పచ్చగడ్డి కూడా మొలవక పశువులు పెద్ద సంఖ్యలో చనిపోతాయి. ప్రస్తుతం మంగోలియాలో జరుగుతున్నది ఇదే. జడ్ వల్ల ఈ ఏడాది ఒక్క ఫిబ్రవరిలోనే 21 లక్షల పశువులు, గొర్రెలు, మేకలు చనిపోగా మే నెల కల్లా ఆ సంఖ్య 71 లక్షలకు చేరింది. వాటిలో 80 శాతాన్ని, అంటే 56 లక్షల జీవాలను పాతిపెట్టారు. లేదంటే అంటు వ్యాధులు ప్రబలుతాయని మంగోలియా ప్రభుత్వం పశువులను పాతిపెట్టింది. దేశంలో జడ్ వల్ల మున్ముందు మొత్తం కోటీ 49 లక్షల జీవాలు చనిపోవచ్చునని, ఇది మంగోలియా పశుసంపదలో 24 శాతానికి సమానమని ఉప ప్రధాని ఎస్.అమార్ సైఖాన్ చెప్పారు. మంగోలియా జనాభా 33 లక్షలైతే వారికి 6.5 కోట్ల పశువులు, యాక్‌లు, గొర్రెలు, మేకలు, గుర్రాలు ఉన్నాయి. వీటిని జాతీయ సంపదగా ఆ దేశ రాజ్యాంగం ప్రకటించింది. మంగోలియా ఎగుమతుల్లో గనుల నుంచి తవ్వి తీసిన ఖనిజాల తరవాత మాంసం, ఇతర జంతు ఉత్పత్తులదే రెండో స్థానం. వ్యవసాయంలో 80 శాతం వాటా పశుపాలన, మేకలు, గొర్రెల పెంపకానిదే. దీనివల్ల మంగోలియా జీడీపీలో 11 శాతం లభిస్తోంది.ప్రసుత్తం జడ్ వల్ల మంగోలియా ఆర్థికవ్యవస్థ అస్థిరతకు లోనవుతోంది. ప్రధాన వృత్తి అయిన పశుపాలన దెబ్బతినడంతో ప్రజలు దేశ రాజధాని ఉలాన్ బటోర్కు, ఇతర పట్టణాలకు వలస పోతున్నారు. కానీ, అక్కడ వారందరికీ సరిపడా పనులు లేవు. గతంలో దశాబ్దానికి ఒకసారి వచ్చిన జడ్ ఇప్పుడు వాతావరణ మార్పుల వల్ల మరింత తరచుగా వచ్చిపడుతోంది.ప్రస్తుత జడ్ గడచిన పదేళ్లలో ఆరోది, మహా తీవ్రమైనది. జనానికి తీవ్ర ఆహార కొరత ఎదురవుతోంది. మంగోలియాను ఆదుకోవడానికి 60 లక్షల డాలర్ల విరాళాలను సేకరించాలని అంతర్జాతీయ సంస్థలు తలపెట్టినా మార్చి మధ్యనాటికి అందులో 20 శాతాన్ని కూడా సేకరించలేకపోయాయి. ఉక్రెయిన్, గాజా యుద్ధాలపై ప్రపంచ దేశాల దృష్టి కేంద్రీకృతం కావడమే ఇందుకు కారణంగా తెలుస్తోంది. -
ఏడేళ్లలో 60 లక్షల మేర పెరిగిన పశు సంపద
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ రాష్ట్రంలో పశు సంపద ఏడేళ్ల కాలంలో 60 లక్షల మేర పెరిగినట్టు తెలంగాణ ఎట్ ఏ గ్లాన్స్–2021 నివేదిక వెల్లడించింది. ఈ నివేదిక ప్రకారం 2012లో తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా 2,66,96,109 పశువులు, గొర్రెలు, ఇతర మూగజీవాలు ఉండగా, 2019 నాటికి వాటి సంఖ్య 3,26,40,639కి చేరింది. ఆ తర్వాతి రెండేళ్లు కలిపితే ఈ సంఖ్య మూడున్నర కోట్లకు చేరుతుందని అంచనా. ఇందులో అత్యధికంగా గొర్రెలు 1.90 కోట్ల వరకు ఉన్నాయని ఈ నివేదికలో పేర్కొన్నారు. 2012లో 1.28 కోట్లుగా ఉన్న గొర్రెలు, 2019 నాటికి 1.90 కోట్లకు చేరాయి. ఆ తర్వాత మేకలు 49 లక్షల వరకు ఉన్నాయి. 2012లో వీటి సంఖ్య 45 లక్షలు కాగా, ఏడేళ్లలో మరో నాలుగు లక్షలు పెరిగి 49 లక్షలకు చేరాయి. ఇక పశువుల విషయానికి వస్తే పాలిచ్చే పశువులు 42 లక్షలు, ఎద్దులు, దున్నపోతులు కలిసి 42 లక్షలకు పైగా ఉన్నాయి. పందులు 2012లో 1.77 లక్షలు ఉండగా, 2019 నాటికి వాటి సంఖ్య 2.37 లక్షలకు చేరింది. కోళ్ల విషయానికి వస్తే ఏడున్నర లక్షల వరకు ఉత్పత్తి తగ్గింది. 2012లో 8.07 కోట్లకు పైగా కోళ్లు ఉత్పత్తి కాగా, 2019లో 7.99 కోట్లు మాత్రమే ఉత్పత్తి అయ్యాయని నివేదిక తెలిపింది. రూ.6,21,746 కోట్ల డిపాజిట్లు రాష్ట్రంలోని అన్ని బ్యాంకుల్లో ఉన్న డిపాజిట్లు, రుణాల వివరాలను కూడా ఈ నివేదిక వెల్లడించింది. 2020–21 ఆర్థిక సంవత్సరం నాటికి రాష్ట్రంలోని అన్ని పబ్లిక్, ప్రైవేట్ రంగాల బ్యాంకులు, విదేశీ బ్యాంకుల్లో కలిపి రూ.6,21,746 కోట్ల డిపాజిట్లు ఉన్నాయని పేర్కొంది. రూ.5,61,844 కోట్ల అప్పులు ఉన్నాయని తెలిపింది. ప్రతి బ్యాంకులో సగటున ఆరుగురు పనిచేస్తున్నారని వివరించింది. -
పశు సంపదతో రైతులకు మెరుగైన ఆదాయం
సాక్షి,అమరావతి/యూనివర్సిటీ క్యాంపస్ (తిరుపతి): గ్రామీణ ప్రాంతాల్లో రైతులకు మెరుగైన ఆదాయాన్నివ్వడంలో పశు సంపద కీలకపాత్ర పోషిస్తోందని గవర్నర్ విశ్వభూషణ్ హరిచందన్ చెప్పారు. తిరుపతి వేదికగా శనివారం జరిగిన శ్రీ వేంకటేశ్వర పశువైద్య విశ్వవిద్యాలయం పదో స్నాతకోత్సవంలో కులపతి హోదాలో గవర్నర్ పాల్గొన్నారు. విజయవాడ రాజ్‌భవన్ నుంచి వెబినార్‌లో ప్రసంగించారు. రైతులు అదనపు ఆదాయం కోసం వ్యవసాయ అనుబంధ రంగాలకు మరలుతున్నారని, హరిత విప్లవం, ఆర్థిక సరళీకరణ, వ్యవసాయ ఉత్పత్తులు తగ్గిపోవడం, కూలీల కొరత వంటి కారణాలతో పశు పోషణపై ప్రత్యేకంగా దృష్టిసారిస్తున్నట్టు తెలిపారు. గ్రామీణ జనాభాలో మూడింట రెండొంతుల మంది జీవనోపాధికి పశు సంతతి కీలకంగా మారిందన్నారు. పెంపకందార్లకు పశు వైద్యులు వృత్తిపరంగా, నైతికంగా మద్దతిస్తూ పశు పోషణను లాభదాయకంగా మార్చేందుకు మార్గనిర్దేశం చేయాలని గవర్నర్ కోరారు. ఆర్బీకేల మూల్యాంకనం అభినందనీయం తీరిక సమయాల్లో విద్యార్థులు సామాజిక సేవలో నిమగ్నం కావాలని పిలుపునిచ్చారు. బీవీఎస్సీ విద్యార్థులు చివరి సంవత్సరం శిక్షణ కాలంలో రైతు భరోసా కేంద్రాల(ఆర్బీకే) పనితీరును మూల్యాంకనం చేయడం అభినందనీయమన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ‘అమూల్’ సంస్థతో ఒప్పందం కుదుర్చుకోవడం శుభపరిణామమని, తద్వారా పాడి పరిశ్రమ అభివృద్ధి మార్గంలో దూసుకు పోగలదన్న ఆశాభావం వ్యక్తం చేశారు. స్టార్టప్‌ల ఫైనాన్సింగ్, వ్యవస్థాపకత, ఉద్యోగ కల్పనను ప్రోత్సహించేందుకు భారత ప్రభుత్వం ‘స్టార్ట్–అప్ ఇండియా’ ప్రచారాన్ని ప్రారంభించిందని, విద్యార్థులు అవకాశాలను అన్వేషించి పారిశ్రామికవేత్తలు కావాలని.. మరింత మందికి ఉద్యోగాలు కల్పించాలని గవర్నర్ సూచించారు. మత్స్యశాఖ ప్రాముఖ్యం దృష్ట్యా.. ప్రత్యేక విశ్వవిద్యాలయం 974 కిలోమీటర్ల తీర ప్రాంతం నీటి వనరులు, 1.74 లక్షల హెక్టార్ల ఉప్పు నీటి సాంద్రత కలిగిన ఆంధ్రప్రదేశ్.. మత్స్య రంగంలో దేశంలోనే మొదటి స్థానంలో నిలిచిందని గవర్నర్ తెలిపారు. ఈ రంగం ప్రత్యక్షంగా, పరోక్షంగా 14.5 లక్షల మందికి ఉపాధి కల్పిస్తోందన్నారు. మత్స్యశాఖ ప్రాముఖ్యతను దృష్టిలో ఉంచుకుని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పశ్చిమ గోదావరి జిల్లాలో ప్రత్యేక మత్స్యశాస్త్ర విశ్వవిద్యాలయాన్ని ప్రకటించిందని గవర్నర్ విశ్వభూషణ్ హరిచందన్ వివరించారు. కార్యక్రమంలో రాజ్‌భవన్ నుంచి గవర్నర్ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఆర్పీ సిసోడియా, గవర్నర్ సంయుక్త కార్యదర్శి శ్యామ్‌ప్రసాద్, విశ్వవిద్యాలయ పరిశోధన విభాగపు సంచాలకులు డాక్టర్ సర్జనరావు, విస్తరణ విభాగ సంచాలకులు డాక్టర్ వెంకటనాయుడు పాల్గొన్నారు. తిరుపతి నుంచి వ్యవసాయ శాస్త్రవేత్తల నియామక బోర్డు సభ్యుడు డాక్టర్ ఏకే శ్రీవాత్సవ స్నాతకోత్సవానికి ముఖ్య అతిథిగా హాజరు కాగా, వీసీ డాక్టర్ పద్మనాభరెడ్డి పాల్గొన్నారు. అనంతరం వెటర్నరీ రంగంలో విశేష సేవలు అందిస్తున్న శాస్త్రవేత్తలు, అధ్యాపకులకు అవార్డులను, పలువురు విద్యార్థులకు పతకాలను అందించారు. బాపట్లకు చెందిన తులసీరుక్మిణి 11 బంగారు పతకాలు, ఒక వెండి పతకం, నెల్లూరుకు చెందిన మహ్మద్ కరీమా 5 బంగారు, ఒక వెండి పతకాన్ని అందుకున్నారు. -
పులి ఆకలి ఖరీదు రూ.21 లక్షలు!
సాక్షి, మంచిర్యాల: పులి ఆకలి ఖర్చు.. అక్షరాలా లక్షల రూపాయలు. మేత కోసం అడవికి వెళ్లిన రైతుల పశువులను హతమారుస్తూ పులి తన ఆకలి తీర్చుకుంటోంది. దీంతో సదరు రైతులకు పరిహారం రూపంలో అటవీశాఖ డబ్బులు ఇవ్వాల్సి వస్తోంది. ఇలా ప్రతి నెలా పులి ఆకలి ఖర్చు పెరిగిపోతోంది. ఉమ్మడి ఆదిలాబాద్ జి ల్లా పరిధిలో విస్తరించిన కవ్వాల్ టైగర్ జోన్లో ఇటీవల పశులవులపై పులుల దాడులు పెరిగాయి. గతంలో కంటే పులుల సంఖ్య పెరగడంతో దాడుల సంఖ్యా పెరిగి నష్టపరిహారం పెరుగు తూ వస్తోంది. అధికారిక గణాంకాలు పరిశీలిస్తే గతేడాది ఒక్క కాగజ్‌నగర్ డివిజన్‌లోనే 77 పశువులు పులికి ఆహారమయ్యాయి. ఇందుకు రూ. 9.62 లక్షలు పరిహారంగా పశువుల యజమానులకు చెల్లించారు. తాజాగా ఈ ఏడాది ఇప్పటివరకు మరో 5 పశువులపై దాడిచేయగా.. రూ.38 వేలు చెల్లించారు. చెన్నూరు డివిజన్లో 50కిపైగా పశువులు పులి దాడిలో చనిపోగా రూ.6 లక్షలు, బెల్లంపల్లి డివిజన్ పరిధిలో 32 పశువులకు గాను రూ.5 లక్షల వరకు చెల్లించారు. వన్యప్రాణుల సమతుల్యత దెబ్బతిని.. మహారాష్ట్రలోని తడోబా పులుల సంరక్షణ కేం ద్రంలో పులుల సంతతి పెరిగి.. అవి ప్రాణహిత నది దాటి కవ్వాల్ టైగర్ జోన్లోకి వస్తున్నాయి. ప్రస్తుతం కవ్వాల్ టైగర్ జోన్లో 6 పులులు సంచరిస్తున్నట్లు అంచనా. ఈ జోన్లో పులుల సంఖ్యకు అనుగుణంగా శాకాహార జంతువులు లేవు. దీంతో పశువులపై పులుల దాడులు పెరి గాయి. దీంతో అటవీ అధికారులు గడ్డిక్షేత్రాలు పెంచి శాకాహార జంతువుల సంతతిని వృద్ధి చే స్తున్నారు. ఫలితంగా కొన్నాళ్లకు శాకాహార జం తువులు పెరిగే అవకాశాలున్నా.. ఇప్పటికిప్పు డు పులుల సంఖ్యకు అనుగుణంగా వన్యప్రాణులు తక్కువగానే ఉన్నాయి. గతంలో విచ్చలవిడిగా వన్యప్రాణుల వేట, కలప అక్రమ రవా ణాతో శాకాహార జంతువుల సమతుల్యత దెబ్బ తింది. అదీగాక పంది, జింక, దుప్పి, నీల్గాయి లాంటివి వేటాడటం కంటే మేతకు వెళ్లిన పశువులను వేటాడటం పులికి సులభంగా మారింది. ఏటేటా పెరుగుతున్న పరిహారం పులుల సంచారం అధికంగా ఉన్న కాగజ్‌నగర్, చెన్నూరు, ఆసిఫాబాద్ ఫారెస్టు డివిజన్లతో పా టు పెంచికల్‌పేట, బెజ్జూరు, చెన్నూరు, కోటపల్లి, నీల్వాయి ప్రాంతాల్లో పరిహారం చెల్లింపులు ఎక్కువగా ఉన్నాయి. ఇటీవల బెల్లంపల్లి, మంచిర్యాల డివిజన్లలోనూ పులుల సంచారం పెరగటంతో పశువులపై దాడులు మొదలయ్యా యి. అటవీ సమీప గ్రామాల శివార్లలో మేతకు వెళ్లిన పశువులపై పులులు పంజా విసురుతున్నాయి. గేదెలు, ఆవులు, ఎద్దులు, గొర్రెలు ఎక్కువగా పులికి ఆహారమవుతున్నాయి. గత ఫిబ్రవరిలో మంచిర్యాల జిల్లా నీల్వాయి రేంజ్ పరిధి బ్రాహ్మణపల్లి అటవీ ప్రాంతంలో పులి ఏకంగా పశువుల కాపరిపైనే దాడి చేయగా, అతడు స్వల్ప గాయాలతో బయటపడ్డాడు. పశువును బట్టి పరిహారం పులి దాడిలో మరణించిన పశువులకు అటవీ అధికారులు పశువును బట్టి నష్టపరిహారం చెల్లిస్తున్నారు. గేదె, ఆవు, ఎద్దు, గొర్రె, మేకకు ఓ రేటు ప్రకారం ఇస్తున్నారు. పాలిచ్చేవి, పశువుల వయసు తదితర అంశాలను బట్టి విలువ కడుతున్నారు. ఇందుకు స్థానిక పశువైద్యులతో పులి దాడిలోనే చనిపోయిందనే ధ్రువీకరణతోపాటు స్థానిక ప్రజాప్రతినిధుల సమక్షంలో అటవీ అధికారులు విచారణ చేపట్టి నష్టపరిహారం కోసం ఉన్నతాధికారులకు నివేదిస్తే చెక్కురూపంలో పశువు యజమానికి డబ్బులు అందుతున్నాయి. దాదాపు రెండు వారాల్లోపే నష్టపరిహారం చెల్లించడంతో పశువుల యజమానులకు ఊరట కలుగుతోంది. పరిహారం చెల్లింపుల కోసం అటవీ శాఖ ప్రత్యేకంగా నిధులు కేటాయిస్తోంది. పశువులు పులుల బారిన పడకుండా దాని సంచారం ఉన్నచోటకు వెళ్లొద్దని అటవీ అధికారులు స్థానిక రైతులకు అవగాహన కలిగిస్తున్నారు. -
ట్యాగ్ నుంచి పేటెంటెడ్ టెక్నాలజీ
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: లైవ్‌స్టాక్ టెక్నాలజీ కంపెనీ ట్రాపికల్ యానిమల్ జెనెటిక్స్ (ట్యాగ్) పేటెంటెడ్ టెక్నాలజీ ‘ట్రాపికల్ బొవైన్ జెనెటిక్స్’ను అందుబాటులోకి తెచ్చింది. పాడి రైతుల ఆదాయం పెంపు లక్ష్యంగా దీనిని అభివృద్ధి చేసినట్టు ట్యాగ్ ఎండీ ప్రవీణ్ కిని వెల్లడించారు. కంపెనీ కో–ఫౌండర్ ఆలూరి శ్రీనివాస రావు, ఫ్యూచర్ టెక్నాలజీ ఆర్కిటెక్ట్ బ్రూస్ వైట్లాతో కలిసి సోమవారమిక్కడ మీడియాతో మాట్లాడారు. ‘భారత్‌లో ఆవు/గేదె ఏడాదికి సగటున 1,500 లీటర్లు ఇస్తుంది. మా టెక్నాలజీతో ఇది 4,000 లీటర్లకు చేరుతుంది. ఎంబ్రియో టెక్నాలజీ కారణంగా ఆవుల ఉత్పాదకత గణనీయంగా పెరుగుతుంది. మరో విధానమైన ప్రెగ్నెన్సీ ఫ్రీ లాక్టేషన్ పద్ధతిలో ఆవు గర్భం దాల్చకుండానే పాలను ఇస్తుంది. ప్రతి ఏడాది ఒక ఇంజెక్షన్ ఇస్తే చాలు. పశువు జీవిత కాలం అంతా పాలను అందిస్తుంది. గుజరాత్‌లోని ఆనంద్‌లో ఏడాదికి ఒక లక్ష అండాలను అభివృద్ధి చేయగలిగే సామర్థ్యమున్న ప్లాంటు ఉంది. ఇటువంటి కేంద్రం ఒకటి తెలంగాణ లేదా అంధ్రప్రదేశ్‌లో నెలకొల్పుతాం. ఇప్పటికే కంపెనీలో రూ.56 కోట్లు వెచ్చించాం’ అని వివరించారు. -
వట్టిపోతున్న ‘పాల’మూరు
♦ జిల్లాలో తగ్గుతున్న పాల ఉత్పత్తి ♦ గ్రాసం లేక కబేళాలకు తరలుతున్న పశుసంపద సాక్షి ప్రతినిధి, మహబూబ్‌నగర్ : తీవ్ర దుర్భిక్ష పరిస్థితులు ఎదుర్కొంటున్న మహబూబ్‌నగర్ జిల్లా రైతాంగానికి పశుసంపదను కాపాడుకోవడం శక్తికి మించిన భారంగా పరిణమించింది. వ్యవసాయానికి చేదోడు, వాదోడుగా ఉండే పశువులతో పాటు కుటుంబానికి ఆర్థిక చేయూతనిచ్చే పాడి గేదెలకు కనీసం గ్రాసం సమకూర్చలేక రైతాంగం తల్లడిల్లుతోంది. పశువులతో వ్యవసాయ పరంగా తమకున్న అనుబంధాన్ని ఒకవైపు వదులుకోలేక మరోవైపు కరువు పరిస్థితులు ముంచుకొస్తుండడంతో పశువులకు తాగడానికి నీరు, తినడానికి గడ్డి పెట్టడం తమ వల్ల కాక అనేక మంది రైతులు పశువులను తెగనమ్మడానికి సంతకు తరలిస్తున్నారు. కాలం ప్రతికూలించి నప్పుడు, పంటలు సరిగ్గా పండని సమయం లో సైతం జిల్లాలోని అనేక మంది రైతులను పాడి సంపద ఆదుకొనేది. కానీ ఈ ఏడాది రైతుల ఇళ్లలో పాడిగేదెలు వట్టిపోయి ప్యాకెట్ పాలు దర్శనమిచ్చే దుర్భర పరిస్థితి. కబేళాలకు తరలింపు.. జిల్లాలో పలు ప్రాంతాల్లో పాల దిగుబడి గణనీయంగా పడిపోవడంతో రైతాంగం కంట నీరు ఒలుకుతోంది. పశువులకు సరైన మేత, నీరు లేకపోవడంతో అవి బక్కచిక్కడమే గాక రోజూ ఏదో ఒక ఊరు నుంచి పదుల సంఖ్యలో పశువులు కబేళాలకు సిద్ధమవుతున్నాయి. కరువుతో అల్లాడుతున్న జిల్లాలో పశు సంపదను ఆదుకొనే దిక్కే లేకుండా పోయిం ది. గతేడాది చివరి నుంచి ఇప్పటి వరకు ప్రభుత్వం పశుసంపద అభివృద్ధి కోసం పైసా విదల్చకపోవడంతో జిల్లాలో పశువుల పరిస్థితి దయనీయంగా తయారైంది. మేకలు, గొర్రెలకు కూడా గ్రాసం లభించక కనీసం గుక్కెడు నీరు లభించని దుస్థితి నెలకొనడంతో మేకలు, గొర్రెలను బతికించుకొనేందుకు వందల కిలోమీటర్ల దూరం ఆంధ్రా ప్రాంతాలకు వలస తీసుకెళ్తున్నారు. పాన్‌గల్, కొల్లాపూర్, వీపనగండ్ల, పెద్దకొత్తపల్లి, కోడేరు వంటి ప్రాంతాల్లో ఉన్న జీవాలను సమీపంలోని రాయలసీమ జిల్లాలకు మక్తల్, నారాయణపేట, ఆత్మకూర్, మాగనూరు వంటి ప్రాంతాల్లో జీవాలను కర్ణాటక ప్రాంతానికి వాహనాల్లో తరలిస్తున్నారు. పశు సంపదను కాపాడడానికి వాటికి గ్రాసం, నీరు అందించేందుకు అనేక ప్రణాళికలు రూపొందించిన ప్రభుత్వం నుంచి మాత్రం ఇందుకు నిధులు విడుదల కాని పరిస్థితి నెలకొంది. ప్రతిపాదనలు బుట్టదాఖలేనా? జిల్లాలో పశు సంపదను కాపాడడానికి దాదాపు రూ.12 కోట్ల బడ్జెట్ అవసరమని అధికారులు ప్రతిపాదనలు పంపినా కేటాయింపులు మాత్రం ఇప్పటికీ అతీగతీ లేని దుస్థితి నెలకొంది. రోజుకు 7 లక్షల లీటర్ల పాల ఉత్పత్తినిచ్చే 5 లక్షల పాడి ఆవులు, గేదెలకు సరైన గ్రాసం అందక అల్లాడుతున్నాయి. జిల్లాలో పశుగ్రాసం కోసం అధికారులు ప్రభుత్వానికి 70 శాతం సబ్సిడీతో పశుగ్రాసం విత్తనాల పంపిణీ కోసం 1.38 కోట్లు 50 శాతం సబ్సిడీ దాణా కోసం 5.83 కోట్లు లవణ మిశ్రమం పంపిణీకి మరో రూ.82 లక్షలు అవసరమని నివేదికలు పంపించినా ప్రభుత్వం నుంచి మాత్రం నిధుల ఊసే లేని పరిస్థితి నెలకొంది. జిల్లాలో ఉచిత పశుగ్రాస కేంద్రాలను ఏర్పాటు చేయాల్సిన అవసరాన్ని అధికారులు నివేదికల ద్వారా ప్రభుత్వానికి ఇప్పటికే పంపించారు. జిల్లాలో పశుసంపద అత్యధికంగా ఉన్నా ప్రభుత్వం నుంచి నిధుల కేటాయింపు మాత్రం ఇందుకనుగుణంగా లేకపోవడంతో ఆ శాఖకు వచ్చిన బడ్జెట్ పట్టుమని 6, 7 నెలలకు సైతం సరిపోని దుస్థితి నెలకొంది. జిల్లాను కరువు ప్రాంతంగా ప్రకటించి నెలలు గడిచిన కరువు సహాయక నిధుల ఊసే లేకపోవడంతో పశువులకు గోస తప్పని పరిస్థితి నెలకొంది. ఇప్పటికైనా పాలమూరుగా దేశస్థాయి ప్రసిద్ధి గాంచిన ఈ జిల్లాలో ‘పాల’ ఉత్పత్తి మరింత పడిపోకుండా ప్రభుత్వం చర్యలు తీసుకోవడంతోపాటు ఆర్థిక ఆలంబన ఇస్తున్న పశు సంపదను కాపాడి తమకు జీవం పోయాలని రైతులు కోరుతున్నారు. -
బతికున్నవి నిషేధించారని చంపి తీసుకెళ్లింది
సిచూవాన్: బతికున్న బాతును ట్రైన్లో తీసుకు వెళ్లకూడదని సెక్కూరిటీ చెక్ పోస్ట్ దగ్గర అధికారులు చెప్పడంతో.. ఓ యువతి దాన్ని చంపి తీసుకెళ్లింది. ఈ సంఘటన చైనాలోని సిచూవాన్ ప్రావిన్స్‌లోని చెంగూ ఈస్ట్ స్టేషన్లో చోటు చేసుకుంది. ఈ సంఘటనను అక్కడే ఉన్న వాంగ్ అనే వ్యక్తి వెంటనే తన దగ్గర ఉన్న కెమెరాతో ఫోటోలు తీశాడు. వీటిని చూసిన ప్రపంచ వ్యాప్తంగా ఉన్న మూగ జీవుల ప్రేమికులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఫోటోలు తీసిన వాంగ్.. చూడడానికి 20 ఏళ్ల వయసున్న ఆ యువతి దగ్గరకు వెళ్లి అక్కడున్న వారందరి ముందు ఓ బాతును చంపడమేంటని, ఇలాంటి పని చేసే ముందు మిగతా ప్రయాణికుల మనోభావాల గురించి ఆలోచించవా? అని ప్రశ్నించాడు. దానికి ఆమె బదులిస్తూ.. అధికారులు బతికున్న బాతును ట్రైన్లో తీసుకు వెళ్లనివ్వడం లేదని అందుకే మరో ప్రయాణికురాలి దగ్గర నుంచి పండ్లు కోసే కత్తిని అడిగి బాతును స్టేషన్‌లోని ఓ మూలకు తీసుకువచ్చి చంపానని చెప్పింది. ఆ అమ్మాయి ఆ బాతును చంపే సమయంలో రక్తం కిందపడకుండా జాగ్రత్తగా పేపర్‌ను పరిచి గొంతు కోసి చంపింది. తనతో తీసుకు వచ్చిన హ్యండ్ బ్యాగ్‌లో చంపిన బాతును తీసుకువెళ్లింది. అయితే ఈ సంఘటన పై అక్కడి అధికారులు మాట్లాడుతూ..మేము సమయానికి స్పందించలేక పోయాము. స్టేషన్‌లోపల బాతును చంపకూడదు. పక్షులనే కాకుండా, కత్తులను కూడా ట్రైన్లో తీసుకురావడం నిషేధించాం. మరోసారి ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చూస్తామని చెప్పారు. బాతును చంపిన అమ్మాయి ఎవరు అనే విషయం తెలసుకునే పనిలో ఉన్నామన్నారు. -
కరువు కాటు.. కాడెద్దులూ భారమే!
వ్యవసాయం చేసే కుటుంబాల్లో ఎదిగిన కొడుకు తల్లిదండ్రులకు ఎంత అండో.. కాడెద్దులు కూడా అంతే... పశువుల వయస్సు పెరిగి వ్యవసాయానికి పనికిరాక పోయినా అమ్మడానికి రైతులు ఒప్పుకోరు... రైతులకు, పశువులకు అంత అనుబంధం ఉంటుంది... అలాంటి వారికి ఇప్పుడు పెద్ద కష్టమొచ్చింది. ఇలాంటి సమయంలో సాగు సంగతి దేవుడెరుగు. కనీసం పశువుల కడుపు నిండే పరిస్థితి కూడా లేదు... దీంతో మూగ జీవాల బాధ చూడలేక మరో గత్యంతరం లేక కళేబరాలకు అమ్ముకుంటున్నారు. చిన్నమండెం: జిల్లాలోని పలు మండలాల నుంచి నెల రోజులుగా వందల సంఖ్యలో పశువులను కళేబరాలకు తరలిస్తున్నారు. ఏ సంతలో చూసినా ఇదే దృశ్యం కనిపిస్తోంది. పశువులకు మేత కూడా లేకపోవడంతో సంత జరిగే ప్రాంతాలలో దిగాలుగా పశువులను అమ్మేదుకు వచ్చిన అన్నదాతలే కనిపిస్తున్నారు. ప్రతి నిత్యం రాయచోటి-బెంగ ళూరు ప్రధాన రహదారిలో, కడప-చిత్తూరు జాతీయ రహదారిలో పశువులతో వెళ్తున్న లారీలు కనిపిస్తున్నాయి. తీవ్ర వర్షాభావ పరిస్థితుల్లో చినుకు కూడా రాలకపోవడంతో చెరువుల్లో నీరు లేక పంటలు సాగు చేసే అవకాశం లేకుండా పోయింది. కనీసం పశువులకు కావాల్సిన మేత కూడా దొరకక పోవడంతో వాటిని బతికించుకునే అవకాశాలు లేవని, అందుకే అమ్ముకుంటున్నామని రైతన్నలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇటువంటి సమయంలో కనీసం పాలు ఇచ్చే పాడి పశువులకైనా ప్రభుత్వం పశుగ్రాసం పంపిణీ చేయాలని వారు కోరుతున్నారు. గతంలో వరిగడ్డి కట్ట ఒక్కొక్కటి రూ.5-6లకు దొరుకుతుంటే, ప్రస్తుతం అది రెండింతలు అయ్యింది. దీంతో పాటు ట్రాక్టర్ వేరుశనగ కట్టె కొనాలంటే రూ.15 వేలు ఇవ్వాల్సిన పరిస్థితి ఉంది. మేత భారం మోయలేక అమ్ముకుంటున్నారు. దీంతో పాడి పశువులు, సేద్యం చేసే పశువులు రోజు రోజుకు కనుమరుగవుతున్నాయి. పశువుల మాంసానికి పలు రాష్ట్రాల్లో విపరీతమైన డిమాండ్ ఉండటం అందుకు ఒక కారణంగా తెలుస్తోంది. అయితే పశువులను అక్రమంగా తరలించటం చట్ట వ్యతిరేకమని చట్టాలు చెబుతున్నాయి. కాడెద్దులను మేపాలంటే భారంగా ఉంది: బుడ్డా వెంకట్రమణ, చాకిబండ కస్పా, రైతు కరువు వచ్చేసింది. పశువుల మేత దొరకడం లేదు. పంటలు సాగు అవ్వలేదు. కాడెద్దులు మేపాలంటే భారంగా ఉంది. గతంలో అడవులకు పశువులను తీసుకెళ్లి మేపే వాళ్లం. పంట పొలాల చుట్టూ పశువులకు కావాల్సిన మేత ఉండేది. కానీ ఇప్పుడు లేదు. మేత కొనాల్సిన పరిస్థితి వచ్చింది. నెలకు పశువుల మేతకు సుమారు 4-5వేల రూపాయలు అవుతోంది. దీంతో చుట్టు పక్కల చాలా ఊర్లలో పశువులను అమ్ముకున్నారు. నెల రోజుల వరకు వర్షాలు పడకుంటే మేము కూడా పశువులను అమ్ముకోవాల్సి వస్తుంది. ప్రభుత్వం అయినా ఆదుకుని, పశుగ్రాసం పంపిణీ చేయిస్తే బాగుంటుంది. -
టూకీగా ప్రపంచ చరిత్ర 39
నేరం ఇప్పటికీ నివాసం తోళ్లతో కప్పిన గుడారమే; ఇప్పటికీ బతుకు తెరువు అడవి జంతువులను వేటాడడమే; కానీ, ఇదివరకటిలా వాళ్లకు వేట ఏకైక జీవన మార్గం కాదు. వేట ఎంత ప్రధానమో, మచ్చికయ్యే జంతువుల కోసం వలలు పన్నడం అంతే ప్రధానమైంది. ఆకలి వేటకు కేటాయించే రోజులు కొన్నైతే, పశుసంపద పెంచుకునేందుకు కేటాయించే రోజులు మరికొన్నిగా విడిపోయాయి. కాలక్రమేణా, వేటాడేందుకు కొందరు, ప్రాణంతో జంతువులను సేకరించేందుకు మరికొందరుగా విడిపోయారు. ఒడుపును బట్టి ఆయా పనులు కేటాయించడంలో, వాళ్ల స్పృహతో నిమిత్తం లేకుండా సమాజంలో వృత్తి విభజన ప్రవేశించింది. జీవన విధానంలో ఏర్పడిన మార్పును బట్టి మానవుని ఆలోచనా విధానంలో గూడా తేడా వచ్చింది. మునుపటిలా ‘కడుపు నిండితే చాల’నే దశ దాటిపోయింది; ఇప్పుడు అతని తాపత్రయమంతా ‘సమృద్ధి’ని సాధించుకోవడం. మంద ఎంత పెరిగితే సంపద అంత పెరిగినట్టు లెక్క. సంపద మూలంగా ఏర్పడే సౌకర్యాలు ఒక ఎత్తై, దాంతోపాటు ప్రవేశించే చీకాకులు మరో ఎత్తు. ‘ఆస్తి’, ‘నేరం’ అనేవి ఒకే నాణెం మీది బొమ్మాబొరుసులు. పశువుల రూపంలో సంపద ఏర్పడగానే, ఏనాడూ ఎరుగని దొంగతనాలతో ‘నేరం’ సమాజంలోకి ప్రవేశించింది. ఋగ్వేదంలో కనీసం మండలానికి ఒక్కసారైనా దొంగల నుండి తమ గోవులను కాపాడమని దేవతలను అర్థించే స్తోత్రాలో, దొంగల బారి నుండి గోవులను విడిపించినందుకు చేసే అభినందనలో గమనిస్తే, ఈ నేరం చాలా ప్రాచీనమైందనీ, వేదకాలం నాటికి ఇది చాలా తీవ్రమైన సమస్యగా పరిణమించిందనీ స్పష్టమౌతుంది. దొంగిలించిన గోవులను నరికేస్తారని గూడా ప్రస్తావించడంతో (ఋగ్వేదం, 1వ మండలం, 61వ సూక్తం, 10వ బుక్కు), ‘నేరం’ ఒక్క దొంగతనంతోనే ఆగిపోలేదు; బావిలోకి తోసో, మోకులతో కట్టేసి నదిలో పడదోసో హత్యలకు ప్రయత్నించడం ఋగ్వేదంలోనే అనేక సందర్భాల్లో తారసపడుతుంది. మరోవైపు, పశువుల మందలు పెరిగేకొద్దీ పచ్చిక కొరత తీవ్రమైన సమస్యగా ఎదురయింది. కొత్త బయళ్లు వెదుక్కుంటూ ఏ దిశగా వలస పోయినా అప్పటికే మరో గుంపు అక్కడ ఉండనే ఉంటుంది. ఆక్షేపాలు భీకరమైన పోరాటాలకు దారితీసేవి. తగాదాలకు కారణం అదొక్కటేగాదు; ఉప్పు దొరికే ‘జేడె’ నేలలు గూడా ప్రత్యర్థుల నుండి కాపాడుకోవలసిన ఖజానాలే. ఉప్పు కేవలం రుచి కోసం వాడే పదార్థం మాత్రమే కాదు; శరీరంలో లవణాల కొరత ఏర్పడితే కండరాలు పనిచేయవు కాబట్టి అది తప్పనిసరి గూడా. మాంసం మాత్రమే ఆహారంగా కలిగిన జీవులకు ఆ అవసరం అంతగా ఏర్పడదు గానీ, శాకాహారులైన పశువుల్లోనూ, భోజనంలో భాగంగా ఇప్పుడు శాకపదార్థాలను గణనీయంగా పెంచుకున్న మానవుల్లోనూ శరీరానికి చాలినంత లవణం సమకూర్చుకోవాలంటే బీడు భూములు అవసరం ఎంతైనా ఉంది. పాత రోజుల్లో నియాండర్తల్ మానవుని తరిమేసినంత తేలికైంది కాదు ఇప్పుడు జరిగే పోరాటం. ప్రత్యర్థి పక్షం సమఉజ్జీ కావడంతో ప్రాణ నష్టం బాగా పెరిగింది. గెలుపును సాధించే దిశగా దండును నడిపేందుకు ఒక ‘దండనాయకు’ని అవసరం గూడా ఏర్పడింది. దాడిని సమర్థవంతంగా నిర్వహించే నేర్పుగల మనిషికి ఆ హోదా స్థిరపడింది. వ్యక్తిగత ఆస్తులు ఏర్పడనంత దాకా అది కేవలం గౌరవ సూచకమైన హోదా మాత్రమే. కాకపోతే గుంపు మొత్తం అతనికి విధేయంగా నడుచుకునేది; అతని గౌరవార్థం విందులు జరిగేవి; గాయకులు అతని గొప్పలను ప్రత్యేకంగా కీర్తించేవారు. తన జనానికి ప్రయోజనం చేకూర్చిన తృప్తి తప్ప నాయకులకు స్వప్రయోజనమనే ఆలోచనే ఉండేదిగాదు. గెలిచిన గుంపు ఓడినవాళ్ల సంపదను నిరాటంకంగా స్వాధీనం చేసుకునేది. ఆ సంపద ఉమ్మడి ఆస్తిలో భాగంగా కలిసిపోయేది. స్త్రీలు సంతానోత్పత్తి క్షేత్రాలు కాబట్టి, వంశం విస్తరించాలని ఆకాంక్షించే రోజుల్లో స్త్రీ జనాన్ని కుండల్లో కలుపుకోవడం ఆలోచించేపాటి సమస్యగాదు; పని చేసేవాడొకడూ, చేయించుకునేవాడు మరొకడూ ఉంటాడని తెలియని రోజుల్లో పట్టుబడిన పురుషులను ఏం చెయ్యాలన్నదే తేల్చుకోవలసిన సమస్య. ఆ సమస్యకు పరిష్కారమే ప్రాచీన సంప్రదాయంలో కనిపించే ‘నరమేధం’. నరికే ప్రక్రియను మేధం అంటారు. అగ్నిగుండం సమక్షంలో శత్రువును నరికివేయడం పవిత్రమైన యజ్ఞంగా వెనుకటి రోజుల్లో కొనసాగింది. అంతకు మించి వాళ్లకు గత్యంతరం లేదు కూడా. ఆ తరువాత చాలా కాలానికి, విశ్వామిత్ర మహర్షి చొరవతో నరమేధాలు ఆగినట్టు ఋగ్వేదభాష్యం ద్వారా తెలుస్తూ ఉంది. రచన: ఎం.వి.రమణారెడ్డి -
పచ్చిమేతతోనే పాడి
ఖమ్మం వ్యవసాయం: మన రాష్ట్రంలో పశుసంపదకు కావాల్సిన మేతలో మూడో వంతు మాత్రమే లభిస్తోంది. ఈ పశుగ్రాసం కొరత కారణంగానే పాల ఉత్పత్తి తక్కువగా ఉంది. రోజుకు ఒక పశువుకు 30 నుంచి 40 కిలోల పచ్చిమేత అవసరం. అంటే సంవత్సరానికి ఒక పశువు 10 నుంచి 14 టన్నుల పచ్చిమేత తింటుంది. పాడి రైతులకు ఇంత వరకు అనేక రకాలైన పశుగ్రాసాలు అందుబాటులో ఉన్నాయి. కానీ ఇటీవల ప్రపంచవ్యాప్తంగా అందుబాటులోకి వచ్చిన సంకరజాతి పశుగ్రాసాల్లో ముఖ్యమైనవి ఒకటి షుగర్గ్రేజ్, రెండోది న్యూట్రిఫీడ్. ఈ రకాల పశుగ్రాసాలను ఇప్పటికే జిల్లాలోని మధిర, ఎర్రుపాలెం తదితర ప్రాంతాల్లో రైతులు సాగు చేస్తున్నారు. ఈ మేతనే పాడి పశువులకు మేపుతూ అధిక దిగుబడులు సాధిస్తున్నారు. షుగర్ గ్రేజ్ ఇది ఏక వార్షిక పశుగ్రాసం. ఒక ఎకరానికి 4-5 కిలోలు పశుగ్రాసం విత్తనాలు వేసుకోవాలి. షుగర్గ్రేజ్ వేరు వ్యవస్థ బాగా అభివృద్ధి చెంది ఆరోగ్యకరమైన పిలకలు వస్తాయి. ఈ మేత విత్తనాలను 2-3 సెంటీమీటర్ల లోతులో విత్తుకోవాలి. సాలు నుంచి సాలుకు 30 సెంటీమీటర్ల నిడివి, మొక్క నుంచి మొక్కకు 25 సెం.మీ దూరం ఉండాలి. ఇది నీటి ఎద్దడిని తట్టుకుని అధిక దిగుబడిని ఇచ్చే పంట. తేలికైన నేలల్లో 5-7 రోజుల్లో ఒక తడి, బరువు నేలల్లో 7-10 రోజుల్లో ఒక తడి పెట్టాలి. అత్యధిక పశుగ్రాసం ఉత్పత్తి చేయడమే కాక కాండం మెత్తగా ఉండి చెరుకులాగా తీయగా రుచికరంగా ఉంటుంది. ఈ పశుగ్రాసం తీపిగా ఉండటం వల్ల పశువులు ఇష్టంగా తింటాయి. పశుగ్రాసం కూడా వృథా కాదు. ఈ పశుగ్రాసాన్ని మేపడం వల్ల రోజుకు రెండు లీటర్ల పాలు పెరిగే అవకాశం ఉంది. జిల్లాలోని ఎర్రుపాలెం మండలానికి చెందిన రైతులు ఈ పశుగ్రాసాన్ని పెంచుతున్నారు. అధిక పాల ఉత్పత్తి సాధిస్తున్నారు. పాతరగడ్డిగా కూడా షుగర్గ్రేజ్ను ఉపయోగించుకోవచ్చు. న్యూట్రిఫీడ్ సజ్జ పశుగ్రాసం నుంచి అభివృద్ధి చేసిన సంకరజాతి గడ్డి రకం ఇది. ఈ పశుగ్రాసంలో 14 నుంచి 16 శాతం మాంస కృత్తులు ఉంటాయి. అధికశక్తినిచ్చే ఖనిజ లవణాలనూ ఇది కలిగి ఉంటుంది. ఈ పశుగ్రాసం మేపడం వల్ల గేదె, పాడిపశువులలో పాల ఉత్పత్తి, వెన్నశాతం పెరుగుతుంది. ఒక ఎకరానికి 3 కిలోల విత్తనాలు సరిపోతాయి. బోదెలు తోలి బోదెల్లో ఈ విత్తనాలు విత్తుకోవడం మంచిది. ఈ విధానం వల్ల అధిక పశుగ్రాసం పొందవచ్చు. బహువార్షిక పశుగ్రాసం విత్తితే 70-80 రోజులకు మొదటి కోత వస్తుంది. తర్వాత నత్రజని ఎరువులు, నీరు పెట్టడం వల్ల రెండో కోతను 40-45రోజుల్లో పొందవచ్చు. ఆరుతడులు ఇవ్వడం వల్ల చాలా కోతలకు అవకాశం ఉంది. ఈ రెండు రకాల పశుగ్రాస విత్తనాలను పశుసంవర్థకశాఖ 75 శాతం సబ్సిడీపై రైతులకు అందజేస్తోంది. -
బీ(ధీ)మా లేదు!
కడప అగ్రికల్చర్: గ్రామీణ ప్రాంతాల్లో వ్యవసాయం తర్వాత రైతులు పశుసంపదను ప్రాణపదంగా ప్రేమిస్తారు. ఎంతటి కరువు పరిస్థితుల్లోనూ ఇది రైతు కుటుంబాలను ఆదుకుంటోంది. మరి ఆ పశుసంపదకు ఆపద వస్తే ఆదుకునేందుకు ప్రభుత్వం ముందుకు రావడం లేదు. మనుషులకు ఎలా బీమా చేస్తారో..అలాగే పశువులకు కూడా బీమా చేయించే సౌకర్యాన్ని కేంద్ర ప్రభుత్వం కల్పించింది. అయితే ఈ ఏడాది ఇంతవరకు బీమా పథకం వివరాలను వెల్లడించకపోవడంతో పశువుల యజమానులు ఆందోళన చెందుతున్నారు. మేత కోసం బయటికి వెళ్లిన పశువులు సాయంత్రం తిరిగి ఇంటికి వచ్చే వరకు యజమానికి నమ్మకం లేకుండా పోయింది. ఏ కరెంటు తీగనో.. ఏ రోడ్డు ప్రమాదంలోనో..ఏ విషపదార్థాలను తినో మత్యువాత పడుతున్నాయి. దీంతో రైతులకు తీరని నష్టం.. కష్టం మిగులుతోంది. కేంద్ర ప్రభుత్వం గత ఏడాది మార్చి నుంచి ఈ ఏడాది మార్చి వరకు పశువులకు బీమా చేసుకునే సౌకర్యాన్ని కల్పించడంతో రైతులు బీమా చేస్తూ వచ్చారు. అయితే ఈ ఏడాది మార్చి నుంచి వచ్చే ఏడాది మార్చి వరకు పశువులకు బీమా చేసుకునే సౌకర్యాన్ని కేంద్ర ప్రభుత్వం, న్యూ ఇండియా ఇన్సూరెన్స్ కంపెనీ సహకారంతో కల్పించాల్సి ఉంది. ఇప్పటి వరకు కేంద్ర ప్రభుత్వం పశువుల బీమాపై విధి విధానాలు రూపొందించకపోవడంతో రైతులు తీవ్ర ఆందోళనకు గురవుతున్నారు. ఎనిమిది నెలలు గడుస్తున్నా ప్రీమియం సౌకర్యం లేకపోవడంతో చనిపోయిన మూగజీవాలకు పరిహారం దక్కడం లేదు. పశు సంవ ర్థక శాఖ లెక్కల ప్రకారం జిల్లాలో మొత్తం 5 లక్షల 95 వేల 636 పశువులున్నాయి. ఇందులో బీమా చేసుకునే వీలున్న పశువులు 3 లక్షల14 వేల 283 ఉన్నాయి. వీటికి బీమా చేయించుకునేందుకు గ్రామాల్లోని రైతులు సిద్ధంగా ఉన్నారు. జిల్లాలో 2008 నుంచి బీమా పథకం ప్రారంభమైంది. అప్పటి నుంచి ఇప్పటి వరకు జిల్లా వ్యాప్తంగా 72 వేల 273 పశువులకు రైతులు బీమా చేయించగా, వివిధ కారణాల వల్ల 22 వేల 39 పశువులు చనిపోగా రూ. 5.33 కోట్ల బీమాను ఆయా రైతులకు అందించారు. బీమా మార్గదర్శకాల కోసం ఎదురు చూస్తున్నాం..: పశువులకు బీమా సౌకర్యం ఉంటేనే ఎంతోకొంత ప్రయోజనం ఉంటుంది. ప్రమాదవశాత్తు పశువు మరణించినప్పుడు పూర్తి మొత్తం కాకపోయినా వచ్చే పరిహారం మళ్లీ పశువు కొనుగోలు చేసుకునేందుకు సహాయకారిగా ఉంటుంది. పశువులకు బీమా సౌకర్యం కల్పించాలని మా శాఖ రాష్ట్ర ఉన్నతాధికారులకు లేఖ రాశాం. కేంద్ర ప్రభుత్వం బీమా కంపెనీతో సంప్రదింపులు జరిపింది. పదిరోజుల్లో అనుమతులు వస్తాయని ఆశిస్తున్నాం. -డాక్టర్ హేమంత్‌కుమార్, అసిస్టెంట్ డైరక్టర్, జిల్లా పశుగణాభివద్ధిశాఖ సంవత్సరం బీమా చేయించిన పరిహారం పరిహార పశువులు ఇచ్చిన పశువుల మొత్తం సంఖ్య (రూ.లక్షల్లో) 2008-09 8044 చనిపోలేదు పరిహారంలేదు 2009-10 38567 45 5.96 2010-11 12315 1308 106.24 2011-12 4669 281 196.02 2012-13 5343 294 77.92 2013-14 3335 183 51.03 2014-14 అనుమతులులేవు 128(పాతవి) 35.44 (పాత మొత్తం) -
పశువులకూ అంబులెన్స్
* మంత్రి పోచారం వెల్లడి సాక్షి, హైదరాబాద్: పశువులకు వైద్య సేవలను వేగంగా అందించేందుకు 108 తరహాలో నియోజకవర్గానికో అంబులెన్స్ చొప్పున ఏర్పాటు చేయనున్నట్లు వ్యవసాయ శాఖ మంత్రి పోచారం శ్రీనివాస్‌రెడ్డి తెలిపారు. ప్రశ్నోత్తరాల్లో భాగంగా పాలకల్తీ, పశువుల ఆసుపత్రుల నిర్వహణ తది తర అంశాలపై సభ్యులు అడిగిన ప్రశ్నలకు మంత్రి సమాధానమిచ్చారు. ప్రతి నియోజవర్గంలోనూ పశువులకు సేవలందించే వాహనాలను అందుబాటులోకి తెస్తామని, మందులతో పాటు వైద్యులనూ అందుబాటులో ఉంచుతామన్నారు. ప్రత్యేక ఫోన్‌నంబర్ కేటాయించి దానికి ఫోన్ చేయగానే వేగంగా సేవలు అందేలా చర్యలు చేపడతామన్నారు. పశుసంవర్థక శాఖలో ఖాళీగా ఉన్న పోస్టుల భర్తీకి చర్యలు చేపడతామని మంత్రి పోచారం పేర్కొన్నారు. -
నవ్విపోదురు..
జిల్లాలో కరువు కరాళ నృత్యం చేస్తోంది. తీవ్ర వర్షాభావ పరిస్థితులు కొనసాగుతున్నాయి. బోరుబావుల్లో నీరు రావడం లేదు. వేసిన అరకొర పంటలు నిలువునా ఎండిపోయాయి. ఇప్పటికే లక్ష హెక్టార్లలో వేరుశనగను తొలగించేశారు. చాలా ప్రాంతాల్లో తాగునీటికీ విపత్కర పరిస్థితులు ఏర్పడ్డాయి. గ్రాసం, నీరు లేక మూగజీవాలు అల్లాడిపోతున్నాయి. వాటి బాధ చూడలేక రైతులు సంతల్లో అయినకాడికి అమ్మేస్తున్నారు. జిల్లాలో ఇంతటి దారుణ పరిస్థితులు నెలకొన్నా.. పశుసంవర్ధక శాఖ అధికారులు మాత్రం ‘అంతా బాగుంద’ని చెప్పుకొంటున్నారు. పశు గ్రాసానికైతే ఎలాంటి సమస్యా లేదంటున్నారు. మార్కెట్‌యార్డుల్లో మూగజీవాల క్రయవిక్రయాలు గతంతో పోలిస్తే బాగా తగ్గిపోయాయట. గ్రాసం ఉండడమే ఇందుకు కారణమన్నది వారి వాదన. దీనిపై రైతులు మండిపడుతున్నారు. గ్రామాల్లోకి వచ్చి చూస్తే పరిస్థితి అర్థమవుతుందని అంటున్నారు. అనంతపురం అగ్రికల్చర్ : జిల్లాలో 38 లక్షల గొర్రెలు, ఏడు లక్షల మేకలు, 13.48 లక్షల పశువులు ఉన్నట్లు పశుగణన సర్వేలో తేలింది. రెండేళ్ల క్రితం పశువులు 16 లక్షలకు పైగా ఉండేవి. క్రమేణా వాటి సంఖ్య తగ్గుతూ వస్తోంది. గత రెండు, మూడేళ్లలో కరువు పరిస్థితుల వల్ల లక్షల సంఖ్యలో పశువులను కబేళాలకు తరలించారు. ఈ ఏడాది ఖరీఫ్ ఆరంభం నుంచి చెప్పుకునే స్థాయిలో ఒక్క వర ్షం కూడా కురవలేదు. ఎక్కడా ఒక చెరువు పొంగి పొర్లింది లేదు. ప్రతి నెలా సాధారణం కంటే తక్కువగానే వర్షపాతం నమోదైంది. జూన్‌లో 63.9 మిల్లీమీటర్ల(మి.మీ)కు గాను 44.9, జూలైలో 67.4 మి.మీకి గాను 35.7, ఆగస్టులో 88.7 మి.మీకి గాను 56.8, సెప్టెంబర్‌లో సాధారణ వర్షపాతం 42.6 మి.మీ కాగా.. ఇప్పటి వరకూ 5.2 మి.మీ మాత్రమే నమోదైంది. ఈ ఏడాది ఖరీఫ్‌లో ఇప్పటివరకు 45.7 మి.మీ వర్షపాతం తక్కువగా నమోదైంది. ఈ పరిస్థితుల్లో పశువులకు గ్రాసం కొరత తీవ్రమైంది. గొర్రెల కాపరులు కర్ణాటక, కర్నూలు ప్రాంతాలకు వలస పోతున్నారు. ఆర్థిక ఇబ్బందుల కారణంగా పశువులను అమ్ముకోవడం లేదని, కేవలం మేత సమకూర్చలేకే అయినకాడికి అమ్మేస్తున్నామని రైతులు చెబుతున్నారు. బోరుబావుల కింద గ్రాసం సాగు చేద్దామనుకుంటే చుక్కనీరు రావడం లేదు. 500 నుంచి 800 అడుగుల లోతుకు బోర్లు వేయిస్తున్నా 80 శాతం వాటిలో చుక్కు నీరు రావడం లేదు. జిల్లాలోని 73 ప్రాంతాల్లో బోర్లకు అనుసంధానించిన ఫిజోమీటర్ల ద్వారా భూగర్భజల శాఖ తాజాగా వివరాలు సేకరించింది. వాటి ప్రకారం జిల్లా సగటు నీటి మట్టం 20.47 మీటర్లకు పడిపోయింది. 20 మీటర్లకు పైగా నమోదైతే ఆందోళన కలిగించే విషయమని భూగర్భజలశాఖ అధికారులు తెలిపారు. 1.53 లక్షల మెట్రిక్ టన్నుల గడ్డి కోసం ప్రతిపాదనలు జిల్లాలో పరిస్థితులను మూడు నెలల క్రితం అంచనా వేసిన పశు సంవర్ధక శాఖ అధికారులు డిసెంబర్ వరకూ 1.53 లక్షల మెట్రిక్ టన్నుల గడ్డి అవసరం ఏర్పడుతుందని గుర్తించారు. ఆ మేరకు ప్రభుత్వానికి ప్రతిపాదనలు కూడా పంపారు. అయితే.. ఆ అధికారులే ప్రస్తుతం జిల్లాలో పశుగ్రాస కొరత లేదని ప్రెస్‌మీట్ పెట్టి మరీ చెబుతున్నారు. గ్రాసం సరఫరాకు ప్రభుత్వం నిధులు విడుదల చేయకపోవడంతోనే ఈ విధంగా వ్యవహరిస్తున్నారనే విమర్శలు వినిపిస్తున్నాయి. అధికార పార్టీ ప్రజాప్రతినిధులైనా వాస్తవ పరిస్థితిని గమనించి గ్రాసం సరఫరాకు చర్యలు తీసుకోవాలని రైతులు కోరుతున్నారు. -
కబేళాలకు మూగజీవాలు
ప్యాపిలి, న్యూస్‌లైన్: వర్షాభావ పరిస్థితుల కారణంగా అడవుల్లో పచ్చగడ్డి జాడ కరువైంది. పాడి పశువులకు గ్రాసం కొరత ఏర్పడటంతో బక్కచిక్కి పోతున్నాయి. వేసవి ప్రారంభానికి ముందే చెరువులు ఎండిపోవడంతో పశువులకు నీటి కొరత ఏర్పడింది. ఎండలు భగభగ మండిపోతుండటంతో మూగజీవాలు పశుగ్రాసం లేక విలవిలలాడుతున్నాయి. మండల కేంద్రంతో పాటు కౌలుపల్లి, బూరుగల, రాచర్ల, బోంచెర్వుపల్లి, సీతమ్మతాండ, గార్లదిన్నె, పీఆర్ పల్లి, గుడిపాడు, కొమ్మేమర్రి, సిద్దనగట్టు, జలదుర్గం, చిన్నపూదెళ్ల, పెద్దపూదెళ్ల తదితర గ్రామాల్లో ఎక్కువ శాతం మంది రైతులు పశుపోషణపైనే ఆధారపడి జీవిస్తున్నారు. పశువులకు ప్రస్తుతం పశుగ్రాసం కొరత ఏర్పడటంతో పశుపోషకులు అందోళన కు గురవుతున్నారు. గతేడాది వర్షాలు అంతంత మాత్రంగానే కురవడంతో చెరువులు, కుంటలకు ఆశించిన నీరు చేరలేదు. పశుగ్రాసం కొనాలన్నా చేతిలో డబ్బులు లేక పోవడంతో రైతులు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. ట్రాక్టర్ వరి గడ్డి రూ. 7 నుంచి 10 వేలు పలుకుతోందని రైతులు వాపోతున్నారు. పశుగ్రాసం కొనలేక విధిలేని పరిస్థితుల్లో పశువులను కబేళాలకు తరలించాల్సిన పరిస్థితి నెలకొందని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.