బతికున్నవి నిషేధించారని చంపి తీసుకెళ్లింది
సిచూవాన్: బతికున్న బాతును ట్రైన్లో తీసుకు వెళ్లకూడదని సెక్కూరిటీ చెక్ పోస్ట్ దగ్గర అధికారులు చెప్పడంతో.. ఓ యువతి దాన్ని చంపి తీసుకెళ్లింది. ఈ సంఘటన చైనాలోని సిచూవాన్ ప్రావిన్స్లోని చెంగూ ఈస్ట్ స్టేషన్లో చోటు చేసుకుంది. ఈ సంఘటనను అక్కడే ఉన్న వాంగ్ అనే వ్యక్తి వెంటనే తన దగ్గర ఉన్న కెమెరాతో ఫోటోలు తీశాడు. వీటిని చూసిన ప్రపంచ వ్యాప్తంగా ఉన్న మూగ జీవుల ప్రేమికులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
ఫోటోలు తీసిన వాంగ్.. చూడడానికి 20 ఏళ్ల వయసున్న ఆ యువతి దగ్గరకు వెళ్లి అక్కడున్న వారందరి ముందు ఓ బాతును చంపడమేంటని, ఇలాంటి పని చేసే ముందు మిగతా ప్రయాణికుల మనోభావాల గురించి ఆలోచించవా? అని ప్రశ్నించాడు. దానికి ఆమె బదులిస్తూ.. అధికారులు బతికున్న బాతును ట్రైన్లో తీసుకు వెళ్లనివ్వడం లేదని అందుకే మరో ప్రయాణికురాలి దగ్గర నుంచి పండ్లు కోసే కత్తిని అడిగి బాతును స్టేషన్లోని ఓ మూలకు తీసుకువచ్చి చంపానని చెప్పింది. ఆ అమ్మాయి ఆ బాతును చంపే సమయంలో రక్తం కిందపడకుండా జాగ్రత్తగా పేపర్ను పరిచి గొంతు కోసి చంపింది. తనతో తీసుకు వచ్చిన హ్యండ్ బ్యాగ్లో చంపిన బాతును తీసుకువెళ్లింది.
అయితే ఈ సంఘటన పై అక్కడి అధికారులు మాట్లాడుతూ..మేము సమయానికి స్పందించలేక పోయాము. స్టేషన్లోపల బాతును చంపకూడదు. పక్షులనే కాకుండా, కత్తులను కూడా ట్రైన్లో తీసుకురావడం నిషేధించాం. మరోసారి ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చూస్తామని చెప్పారు. బాతును చంపిన అమ్మాయి ఎవరు అనే విషయం తెలసుకునే పనిలో ఉన్నామన్నారు.