బీ(ధీ)మా లేదు!
కడప అగ్రికల్చర్: గ్రామీణ ప్రాంతాల్లో వ్యవసాయం తర్వాత రైతులు పశుసంపదను ప్రాణపదంగా ప్రేమిస్తారు. ఎంతటి కరువు పరిస్థితుల్లోనూ ఇది రైతు కుటుంబాలను ఆదుకుంటోంది. మరి ఆ పశుసంపదకు ఆపద వస్తే ఆదుకునేందుకు ప్రభుత్వం ముందుకు రావడం లేదు. మనుషులకు ఎలా బీమా చేస్తారో..అలాగే పశువులకు కూడా బీమా చేయించే సౌకర్యాన్ని కేంద్ర ప్రభుత్వం కల్పించింది. అయితే ఈ ఏడాది ఇంతవరకు బీమా పథకం వివరాలను వెల్లడించకపోవడంతో పశువుల యజమానులు ఆందోళన చెందుతున్నారు.
మేత కోసం బయటికి వెళ్లిన పశువులు సాయంత్రం తిరిగి ఇంటికి వచ్చే వరకు యజమానికి నమ్మకం లేకుండా పోయింది. ఏ కరెంటు తీగనో.. ఏ రోడ్డు ప్రమాదంలోనో..ఏ విషపదార్థాలను తినో మత్యువాత పడుతున్నాయి. దీంతో రైతులకు తీరని నష్టం.. కష్టం మిగులుతోంది. కేంద్ర ప్రభుత్వం గత ఏడాది మార్చి నుంచి ఈ ఏడాది మార్చి వరకు పశువులకు బీమా చేసుకునే సౌకర్యాన్ని కల్పించడంతో రైతులు బీమా చేస్తూ వచ్చారు.
అయితే ఈ ఏడాది మార్చి నుంచి వచ్చే ఏడాది మార్చి వరకు పశువులకు బీమా చేసుకునే సౌకర్యాన్ని కేంద్ర ప్రభుత్వం, న్యూ ఇండియా ఇన్సూరెన్స్ కంపెనీ సహకారంతో కల్పించాల్సి ఉంది. ఇప్పటి వరకు కేంద్ర ప్రభుత్వం పశువుల బీమాపై విధి విధానాలు రూపొందించకపోవడంతో రైతులు తీవ్ర ఆందోళనకు గురవుతున్నారు. ఎనిమిది నెలలు గడుస్తున్నా ప్రీమియం సౌకర్యం లేకపోవడంతో చనిపోయిన మూగజీవాలకు పరిహారం దక్కడం లేదు.
పశు సంవ ర్థక శాఖ లెక్కల ప్రకారం జిల్లాలో మొత్తం 5 లక్షల 95 వేల 636 పశువులున్నాయి. ఇందులో బీమా చేసుకునే వీలున్న పశువులు 3 లక్షల14 వేల 283 ఉన్నాయి. వీటికి బీమా చేయించుకునేందుకు గ్రామాల్లోని రైతులు సిద్ధంగా ఉన్నారు. జిల్లాలో 2008 నుంచి బీమా పథకం ప్రారంభమైంది. అప్పటి నుంచి ఇప్పటి వరకు జిల్లా వ్యాప్తంగా 72 వేల 273 పశువులకు రైతులు బీమా చేయించగా, వివిధ కారణాల వల్ల 22 వేల 39 పశువులు చనిపోగా రూ. 5.33 కోట్ల బీమాను ఆయా రైతులకు అందించారు.
బీమా మార్గదర్శకాల కోసం ఎదురు చూస్తున్నాం..:
పశువులకు బీమా సౌకర్యం ఉంటేనే ఎంతోకొంత ప్రయోజనం ఉంటుంది. ప్రమాదవశాత్తు పశువు మరణించినప్పుడు పూర్తి మొత్తం కాకపోయినా వచ్చే పరిహారం మళ్లీ పశువు కొనుగోలు చేసుకునేందుకు సహాయకారిగా ఉంటుంది. పశువులకు బీమా సౌకర్యం కల్పించాలని మా శాఖ రాష్ట్ర ఉన్నతాధికారులకు లేఖ రాశాం. కేంద్ర ప్రభుత్వం బీమా కంపెనీతో సంప్రదింపులు జరిపింది. పదిరోజుల్లో అనుమతులు వస్తాయని ఆశిస్తున్నాం.
-డాక్టర్ హేమంత్‌కుమార్,
అసిస్టెంట్ డైరక్టర్, జిల్లా పశుగణాభివద్ధిశాఖ
సంవత్సరం బీమా చేయించిన పరిహారం పరిహార
పశువులు ఇచ్చిన పశువుల మొత్తం
సంఖ్య (రూ.లక్షల్లో)
2008-09 8044 చనిపోలేదు పరిహారంలేదు
2009-10 38567 45 5.96
2010-11 12315 1308 106.24
2011-12 4669 281 196.02
2012-13 5343 294 77.92
2013-14 3335 183 51.03
2014-14 అనుమతులులేవు 128(పాతవి) 35.44
(పాత మొత్తం)