పశువులకూ అంబులెన్స్
* మంత్రి పోచారం వెల్లడి
సాక్షి, హైదరాబాద్: పశువులకు వైద్య సేవలను వేగంగా అందించేందుకు 108 తరహాలో నియోజకవర్గానికో అంబులెన్స్ చొప్పున ఏర్పాటు చేయనున్నట్లు వ్యవసాయ శాఖ మంత్రి పోచారం శ్రీనివాస్‌రెడ్డి తెలిపారు. ప్రశ్నోత్తరాల్లో భాగంగా పాలకల్తీ, పశువుల ఆసుపత్రుల నిర్వహణ తది తర అంశాలపై సభ్యులు అడిగిన ప్రశ్నలకు మంత్రి సమాధానమిచ్చారు.
ప్రతి నియోజవర్గంలోనూ పశువులకు సేవలందించే వాహనాలను అందుబాటులోకి తెస్తామని, మందులతో పాటు వైద్యులనూ అందుబాటులో ఉంచుతామన్నారు. ప్రత్యేక ఫోన్‌నంబర్ కేటాయించి దానికి ఫోన్ చేయగానే వేగంగా సేవలు అందేలా చర్యలు చేపడతామన్నారు. పశుసంవర్థక శాఖలో ఖాళీగా ఉన్న పోస్టుల భర్తీకి చర్యలు చేపడతామని మంత్రి పోచారం పేర్కొన్నారు.