నిధులు తేవడమే కాదు...దగ్గరుండి పనులూ చేయిస్తారు
వారం, పదిరోజులకోసారైనా వెళ్లాల్సిందే...
గుట్టా..పుట్టా అన్నీ చుట్టేస్తారు
సాక్షి ప్రతినిధి, కామారెడ్డి: ఆయన డెబ్బై ఆరేళ్ల వయస్సులో కూడా నవ యువకుడిగా తిరుగుతూనే ఉంటారు. అడవి అయినా, గుట్ట, పుట్ట ఎక్కడికైనా సరే చలో అంటారు. అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేయడమే కాదు... పనులు పూర్తయ్యే దాకా కాంట్రాక్టర్ల వెంట పడతారు. తనే స్వయంగా ఆ పనులను పర్యవేక్షిస్తుంటాడు. ఆయనే బాన్సువాడ ఎమ్మెల్యే పోచారం శ్రీనివాస్‌రెడ్డి. మంత్రిగా స్పీకర్‌గా మూడు దశాబ్దాలకు పైగా వివిధ హోదాల్లో పనిచేశారు. ఎమ్మెల్యేగా తొలిసారి ఎన్నికైన నాటి నుంచి ఇప్పటివరకు ఒకే రకమైన టెంపో కొనసాగిస్తున్నారు.
అభివృద్ధి పనులకు నిధులు సాధించి వాటిని పూర్తి చేసేదాకా వెంటపడతారు. గత బీఆర్‌ఎస్ ప్రభుత్వ హయాంలో పదేళ్ల కాలంలో రూ.10 వేల కోట్లు తీసుకొచ్చాడని చెబుతారు. రాష్ట్రంలో ఎక్కడా లేనివిధంగా బాన్సువాడ నియోజకవర్గంలో 10 వేలకు పైగా డబుల్ బెడ్‌రూం ఇళ్లను నిర్మించడంలో ఆయన కృషి ఎంతో ఉందంటారు. ఇళ్ల నిర్మాణాలు జరుగుతున్న తీరును ఆయన ఎన్నోసార్లు పర్యవేక్షించారు. రోడ్లు, ప్రాజెక్టులు, ఎత్తిపోతల పథకాలు, స్కూల్ భవనాలు... ఇలా ఏ పని అయినా సరే తను వెళ్లాల్సిందే.
నియోజకవర్గ పరిధిలోని సిద్దాపూర్ అటవీ ప్రాంతంలో నిర్మిస్తున్న రిజర్వాయర్లకు శంకుస్థాపన చేసిన నాటి నుంచి ఇప్పటి దాకా ఆయన ప్రతి నెలలో ఒకటి రెండుసార్లు పరిశీలించారు. ఎంతదూరమైనా సరే, ఎంత లోపలకు ఉన్నా సరే వెళతారు. ఒకవేళ రోడ్డు మార్గం సరిగ్గా లేదని కార్లు వెళ్లే పరిస్థితి లేదంటే బైక్ మీద కూడా వెళ్లి వస్తారు. బాన్సువాడ పట్టణంలో జరిగే పనులను రెగ్యులర్‌గా పరిశీలిస్తారు. జోరువర్షం కురుస్తుందని అందరూ ఇళ్లలో ఉంటే తను మాత్రం బ్యాటరీ వాహనంలో ఊరంతా చుట్టేస్తారు.
నీరు నిలిచిపోకుండా నాలాలను శుభ్రం చేయించమని ఆదేశిస్తారు. కాంట్రాక్టర్లు పనులు ఆపితే కారణాలు తెలుసుకొని బిల్లుల సమస్య అయితే ఉన్నతాధికారులతో మాట్లాడి బిల్లులు ఇప్పించి వారికి సహకరిస్తుంటారు. దీంతో అందరూ పోచారం స్టైలే వేరబ్బా అంటుంటారు. పెద్దాయనతో పోటీపడలేమని ఇతర ప్రజాప్రతినిధులు చెబుతుంటారు.
Comments
Please login to add a commentAdd a comment