
పునాదిరాయి వేసి నాలుగు దశాబ్దాలు
మొన్నటి బడ్జెట్‌లో రూ.40 కోట్ల కేటాయింపు
ఈసారైనా పూర్తవుతుందన్న ఆశలో రైతులు
సాక్షి ప్రతినిధి, కామారెడ్డి: మహారాష్ట్ర, తెలంగాణ రాష్ట్రాల సరిహద్దుల్లో నాలుగు దశాబ్దాల క్రితం పునాదిరాయి వేసిన ‘లెండి’ ప్రాజెక్టు అసంపూర్తిగానే మిగిలింది. ఇరు రాష్ట్రాల్లోని 60 వేల పైచిలుకు ఎక రాల భూములకు.. సాగునీరు అందించేందుకు చేపట్టిన ఈ ప్రాజెక్టు నిర్మాణ పనులు భూసేకరణ, నిధుల సమస్యలతో నానుతూ వస్తోంది. ప్రాజెక్టు పనులు పూర్తయితే.. వెనుకబడిన ప్రాంతమైన కామారెడ్డి జిల్లాలోని మద్నూర్, బిచ్కుంద (Bichkunda) మండలాల్లో దాదాపు 22 వేల ఎకరాల భూములు సాగులోకి వస్తాయి. కేవలం వర్షాధారంతో ఆరుతడి పంటలు సాగు చేస్తున్న రైతులు ఏళ్లుగా ఎదురుచూ స్తూనే ఉన్నారు.
1984లో ప్రాజెక్టు పనులు మొదలు పెట్టినపుడు అంచనా వ్యయం రూ.54.55 కోట్లు మాత్రమే. అప్పట్లో నిధుల సమస్య, భూసేకరణ వంటి సమస్యలతో పనులు పలుమార్లు ఆగిపోవడంతో.. ఇప్పుడు అంచనా వ్యయం రూ.వెయ్యి కోట్లు దాటింది. ప్రాజెక్టు ముంపు రైతులకు పునరావాసం కింద అందించాల్సిన డబ్బులు.. అప్పట్లో పూర్తి స్థాయిలో చెల్లించకపోవడంతో ప్రాజెక్టు నిర్మాణం పెండింగులో పడిపోయింది. దీంతో ప్రాజెక్టు కోసం ఎదురుచూస్తున్న రైతుల ఆశలు అడియాసలయ్యాయి.
6.36 టీఎంసీల సామర్థ్యం..
మహారాష్ట్రలోని దెగ్లూర్ తాలూకాలోని గోజేగావ్ వద్ద లెండి ప్రాజెక్టు నిర్మాణం చేపట్టారు. 6.36 టీఎంసీల సామర్థ్యంతో ప్రాజెక్టు రూపకల్పన జరిగింది. ఇందులో మహారాష్ట్ర 3.93 టీఎంసీలు, తెలంగాణ 2.43 టీఎంసీల నీటిని వాడుకోవాలని నిర్ణయించారు. మహారాష్ట్రంలోని దెగ్లూర్, ముఖేడ్ తాలూకాల పరిధిలోని గ్రామాల్లో 39,275 ఎకరాల ఆయకట్టుకు, తెలంగాణ (Telangana) రాష్ట్రంలో కామారెడ్డి జిల్లాలోని మద్నూర్, బిచ్కుంద మండలాల్లోని గ్రామాల పరిధిలో 22 వేల ఎకరాల ఆయకట్టుకు ఈ ప్రాజెక్టు నీరందిస్తుందని అంచనా వేశారు. కాగా ప్రాజెక్టు నిర్మాణం మొదలుపెట్టిన 1984లో ప్రాజెక్టు నిర్మాణ వ్యయం రూ.54.55 కోట్లు అవుతుందని అంచనా వేశారు. అప్పట్లో ముంపు గ్రామాల రైతులకు పరిహారం విషయంలో అసంపూర్తి చెల్లింపులు జరగడంతో నిర్మాణానికి ఆటంకాలు ఎదురయ్యాయి.
కాగా గోజేగావ్ వద్ద చేపట్టిన లెండి ప్రాజెక్టు నిర్మాణ పనులు దాదాపు 75 శాతం పూర్తయ్యాయి. ప్రాజెక్టుకు 14 గేట్లు నిర్మించాల్సి ఉండగా, 10 గేట్ల నిర్మాణం అప్పుడే పూర్తయ్యింది. మరో నాలుగు గేట్ల నిర్మాణం పూర్తి కావలసి ఉంది. దివంగత సీఎం వైఎస్ రాజశేఖర్‌రెడ్డి హయాంలో లెండి ప్రాజెక్టు పనులను కొలిక్కి తెచ్చే ప్రయత్నం జరిగింది. ప్రాజెక్టు కోసం రూ.43.14 కోట్లు ఖర్చు చేశారు. అప్పుడు కామారెడ్డి జిల్లా పరిధిలోని మద్నూర్, బిచ్కుంద మండలాలకు సంబంధించి కెనాల్స్ పనులు జరిగాయి. కానీ ప్రాజెక్టు పనులు మాత్రం అసంపూర్తిగానే ఉండిపోయాయి.
చదవండి: కంచకు చేరని కథ
తెలంగాణ రాష్ట్రం ఏర్పాటైన తరువాత లెండి ప్రాజెక్టు అంచనా వ్యయం రూ.554.54 కోట్లని తేల్చారు. ఇందులో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం వాటాగా 42 శాతం కింద రూ.236.10 కోట్లు, మిగతా మొత్తం రూ.318.45 కోట్లు మహారాష్ట్ర భరించాల్సి ఉంటుంది. రాష్ట్ర వాటాగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం రూ.189.73 కోట్లు విడుదల చేసింది. అయినా పనులు మాత్రం ముందుకు సాగలేదు. దీంతో ప్రాజెక్టు అంచనా వ్యయం ఏటేటా పెరుగుతూనే ఉంది. భూములకు పరిహారంతో పాటు ప్రాజెక్టు పనుల పూర్తికి అంచనా వ్యయం మరింత పెరగవచ్చని నీటిపారుదల శాఖ అధికారులు అభిప్రాయపడుతున్నారు.
ఇప్పుడైనా పూర్తవుతుందా..
ప్రస్తుత జుక్కల్ ఎమ్మెల్యే తోట లక్ష్మీకాంతారావు.. అసంపూర్తిగా మిగిలిన లెండి ప్రాజెక్టును పరిశీలించారు. ఈ సందర్భంగా ఇరు రాష్ట్రాల అధికారులతో మాట్లాడారు. ప్రాజెక్టు పూర్తి చేయడానికి అవసరమైన నిధులు మంజూరు చేయిస్తానని రైతులకు భరోసా ఇచ్చారు. రాష్ట్ర ప్రభుత్వం ఇటీవల ప్రవేశపెట్టిన బడ్జెట్‌లో రూ.40 కోట్లు కేటాయించింది. మహారాష్ట్ర ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకువచ్చి అక్కడి రైతులకు పరిహారం ఇప్పించి పనులు పూర్తి చేయించాల్సిన అవసరం ఉంది.