
నాలుగున్నర దశాబ్దాల్లో వెయ్యి మందికి పైగా చదువు
దేశ, విదేశాల్లో ఉద్యోగాలు
సొంతంగా డెయిరీ పరిశ్రమల ఏర్పాటు
సాక్షి ప్రతినిధి, కామారెడ్డి: తెలంగాణ రాష్ట్రంలోనే ఏకైక డెయిరీ కళాశాల కామారెడ్డి జిల్లా కేంద్రంలో ఉంది. నాలుగున్నర దశాబ్దాల చరిత్ర ఉన్న ఈ కళాశాలలో చదివిన విద్యార్థులు దేశ, విదేశాల్లో ఉన్నతోద్యోగాలు, వ్యాపారాల్లో స్థిరపడ్డారు. ఇక్కడ చదువు పూర్తవకముందే ప్రభుత్వ, ప్రైవేటు రంగంలో అనేక ఉద్యోగావకాశాలు దక్కుతాయి. రాష్ట్రంలో ప్రముఖ డెయిరీ సంస్థ అయిన జెర్సీ డెయిరీ డైరెక్టర్లంతా ఈ కళాశాల విద్యార్థులు కావడం విశేషం. రాష్ట్రంలోని వివిధ డెయిరీ సంస్థల్లో కీలక స్థానాల్లో పనిచేస్తున్న వారంతా ఇక్కడ చదువుకున్నవారే.
కామారెడ్డి పట్టణంలోని ఆర్ట్స్ అండ్ సైన్స్ డిగ్రీ కళాశాలలో 1978లో బీఎస్సీ డెయిరీ కోర్సును ప్రారంభించారు. ఇంటర్ చదివిన వారికి.. నేరుగా సాధారణ డిగ్రీ కోర్సుల్లా డెయిరీ కోర్సులో ప్రవేశం కల్పించేవారు. తరువాతి కాలంలో బీటెక్ డెయిరీ కోర్సుగా మార్పుచెంది.. ఎంసెట్ ద్వారా సీట్ల కేటాయింపు మొదలైంది. డెయిరీ కోర్సు ఎంచుకున్న వారికి.. ఎంసెట్ ర్యాంకుల ఆధారంగా సీట్లు కేటాయించేవారు. ఉమ్మడి రాష్ట్రంలో ఉస్మానియా యూనివర్సిటీ పరిధిలో కొనసాగిన డెయిరీ కోర్సును 2007 సెప్టెంబర్ 1న శ్రీ వేంకటేశ్వర పశువైద్య విశ్వవిద్యాలయం పరిధిలోకి మార్చారు. తెలంగాణ రాష్ట్రం (Telangana State) ఏర్పాటయ్యాక పీవీ నర్సింహారావు పశువైద్య విశ్వ విద్యాలయం పరిధిలోకి తీసుకువచ్చారు.
దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖర్‌రెడ్డి (YS Rajasekhara Reddy) హయాంలో.. ప్రభుత్వ ఆర్ట్స్ అండ్ సైన్స్ డిగ్రీ కళాశాలకు సంబంధించిన 60 ఎకరాల భూమిని డెయిరీ కళాశాలకు కేటాయించారు. కాలేజీ భవనం, హాస్టళ్ల నిర్మాణాలకు రూ.11 కోట్లు మంజూరు చేసిన అప్పటి సీఎం వైఎస్సార్.. భవనాల నిర్మాణానికి శంకుస్థాపన కూడా చేశారు. కాలేజీ భవనంతో పాటు బాలికలు, బాలుర హాస్టళ్లు, ఆడిటోరియం, ల్యాబ్‌లకు భవనాలు నిర్మించారు. పీజీ కోర్సులకు అవసరమైన మేర సౌకర్యాలు కూడా ఉన్నాయి. అప్పటి నుంచి అదే భవనంలో కళాశాల కొనసాగుతోంది. ప్రాక్టికల్స్‌లో భాగంగా విద్యార్థులు పాల పదార్థాలు తయారు చేసి.. డెయిరీ పార్లర్‌ను కూడా నిర్వహిస్తున్నారు. విద్యార్థులు కోవా, దూద్‌పేడా, రసగుల్లా, గులాబ్‌జామ్ (Gulab Jamun) వంటివి తయారు చేసి విక్రయిస్తారు.
వెయ్యి మందికి పైగా చదువు..
కళాశాల స్థాపించినప్పటి నుంచి.. ఇప్పటి వరకు 900 పైచిలుకు డెయిరీ కోర్సులు చదివారు. వారిలో చాలామంది దేశంలోని వివిధ రాష్ట్రాలతో పాటు అమెరికా, ఆస్ట్రేలియా వంటి దేశాల్లోనూ డెయిరీ రంగంలో ఉన్నతోద్యోగాల్లో స్థిరపడ్డారు. ఇక్కడ చదివిన వారిలో కొందరు విద్యార్థులు సొంతంగా డెయిరీ ఉత్పత్తుల సంస్థలను స్థాపించారు కూడా. మరెందరో వివిధ డెయిరీ సంస్థల్లో పనిచేస్తున్నారు. తెలంగాణ రాష్ట్ర డెయిరీ డెవలప్‌మెంట్ కార్పొరేషన్‌లోనూ చాలామంది ఉద్యోగాలు చేస్తున్నారు. టీఎస్‌పీఎస్సీ ద్వారా విజయ డెయిరీ, ఫుడ్‌సేఫ్టీ ఆఫీసర్, మార్కెటింగ్ ఎగ్జిక్యూటివ్, సూపర్‌వైజర్లు వంటి ఉద్యోగ అవకాశాలు కూడా పొందే వీలుంది. రాష్ట్ర స్థాయిలో ఉపకార వేతనాలు, జాతీయ స్థాయిలో మెరిట్ స్కాలర్‌షిప్‌లు అందిస్తారు.

పీజీ కోర్సులు వస్తే మరింత ప్రయోజనం
కళాశాలలో పీజీ కోర్సులు ఏర్పాటు చేస్తే విద్యార్థులకు మేలు జరుగుతుంది. రాష్ట్రంలో ఎక్కడా డెయిరీ కళాశాలలు లేవు. ఏకైక కామారెడ్డి కళాశాలలో పీజీ కోర్సులు లేకపోవడం విద్యార్థులకు శాపంగా మారింది. కర్ణాటక, తమిళనాడు తదితర రాష్ట్రాలకు వెళ్లి పీజీ కోర్సులు చదవాల్సి వస్తోంది. ఇతర రాష్ట్రాల్లో ఉన్నత విద్యనభ్యసించాలంటే ఖర్చుతో కూడుకున్నది కావడంతో.. చాలా మంది బీటెక్‌తోనే చదువును ఆపేస్తున్నారు. ఇక్కడే పీజీ కోర్సులు ప్రారంభిస్తే ఎంతో ప్రయోజనం కలుగుతుందని విద్యార్థులు అంటున్నారు. ప్రభుత్వం ఆ దిశగా చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు.

మంచి భవిష్యత్తు ఉన్న కోర్సు
బీటెక్ డెయిరీ కోర్సు చదివిన వారెవరూ ఖాళీగా ఉండే పరిస్థితి లేదు. అందరికీ అనేక అవకాశాలు దొరుకుతున్నాయి. మా కళాశాలలో చదివినవారు ప్రపంచవ్యాప్తంగా డెయిరీ సంస్థల్లో ఉన్నతోద్యోగాలు చేస్తున్నారు. మన రాష్ట్రంలోని అన్ని డెయిరీల్లోనూ మనవారే కీలక పాత్ర పోషిస్తున్నారు. కొందరు సొంతంగా డెయిరీ సంస్థలు నెలకొల్పారు. ఏటా 40 మందికి ప్రవేశం పొందడానికి అవకాశం ఉంది. ఎంపీసీ చదివిన విద్యార్థులకు ఎంసెట్ ద్వారా డెయిరీ కోర్సులో 35 మందికి సీట్లు దక్కుతాయి. ఐదు సీట్లను రైతు విభాగాల కోటా ద్వారా భర్తీ చేస్తాం.
– డాక్టర్ ఉమాపతి, కళాశాల డీన్