Irrigation project
-
నాపై కక్ష సాధించుకోండి
సాక్షి ప్రతినిధి, మహబూబ్ నగర్: ‘‘ఉమ్మడి రాష్ట్రంలోనైనా, తెలంగాణలోనైనా వలసలకు మారుపేరు పాలమూరు జిల్లా. అలాంటి జిల్లాలో ప్రాజెక్టులు పూర్తి కాకపోవడానికి కారణం గత పాలకుల నిర్లక్ష్యమే. తెలంగాణ వచ్చి పదేళ్లయినా వలసలు కొనసాగుతున్నాయి. పాలమూరు జిల్లా బిడ్డగా సాగునీటి ప్రాజెక్టులు పూర్తి చేయకపోతే నన్ను చరిత్ర క్షమించదు. జిల్లాలో పెండింగ్‌లో ఉన్న ప్రాజెక్టులు పూర్తిచేసి పాడి పంటలతో విలసిల్లేలా మా ప్రభుత్వ నిర్ణయాలుంటాయి..’’అని ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్‌రెడ్డి ప్రకటించారు.ఆదివారం ఆయన రాష్ట్ర మంత్రులు కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి, దామోదర రాజనర్సింహలతో కలసి మహబూబ్‌నగర్ జిల్లా చిన్నచింతకుంట మండలం అమ్మాపురంలో కురుమూర్తి స్వామిని దర్శించుకున్నారు. అక్కడ రూ.110 కోట్ల వ్యయంతో చేపట్టిన ఎలివేటెడ్ కారిడార్, ఘాట్ రోడ్ నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. అనంతరం మాట్లాడారు. చిల్లర మల్లర రాజకీయాలు చేస్తున్నారు నారాయణపేట– మక్తల్– కొడంగల్ ప్రాజెక్ట్ పూర్తి చేసి త్వరలోనే ఆయా నియోజకవర్గాలకు కృష్ణా జలాలు పారిస్తామని సీఎం రేవంత్ చెప్పారు. ఆరేడు దశాబ్దాలుగా వెనుకబడ్డ ఈ ప్రాంతంలో వలసలు ఆపాలని తాను చేస్తున్న అపర భగీరథ ప్రయత్నాన్ని అడ్డుకునేందుకు కొందరు ఆరోపణలతో, చిల్లర మల్లర రాజకీయాలు చేయాలని ప్రయతి్నస్తున్నారని ఆరోపించారు. తనపై కోపం ఉంటే రాజకీయంగా కక్ష సాధించుకోవాలని.. అంతేతప్ప ప్రాజెక్టులను, జిల్లా అభివృద్ధిని అడ్డుకోవద్దని పేర్కొన్నారు. అలా చేస్తే చరిత్రహీనులుగా మిగిలిపోక తప్పదని వ్యాఖ్యానించారు. కాళ్లలో కట్టెలు పెట్టి, కుట్రలు చేసి ఎవరైనా అభివృద్ధిని అడ్డుకోవాలని చూస్తే పాలమూరు బిడ్డలు క్షమించబోరని హెచ్చరించారు. అన్ని గ్రామాలకు బీటీ రోడ్లు.. పాలమూరు జిల్లాలోని అమర్ రాజా బ్యాటరీస్ కంపెనీలో రెండు వేల మంది స్థానిక నిరుద్యోగులకు నైపుణ్య శిక్షణ ఇచ్చి ఉద్యోగాలు ఇవ్వడానికి అంగీకరించారని సీఎం రేవంత్ చెప్పారు. ఈ ప్రాంతంలో ఏ కంపెనీలు వచి్చనా ఇక్కడి నిరుద్యోగులకు శిక్షణ ఇచ్చి, ఉద్యోగాలు ఇప్పించే బాధ్యత తమదని తెలిపారు. జిల్లాలో అన్ని గ్రామాలు, తండాలకు బీటీ రోడ్లు వేస్తామన్నారు. ఈ మేరకు అంచనాలు రూపొందించాలని ఉమ్మడి జిల్లా పరిధిలోని కలెక్టర్లను ఆదేశిస్తున్నట్టు తెలిపారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షుడు చిన్నారెడ్డి, ఎమ్మెల్యేలు జీఎమ్మార్, యెన్నం శ్రీనివాస్‌రెడ్డి, వాకిటి శ్రీహరి తదితరులు పాల్గొన్నారు.మాకు అవకాశం వచి్చంది.. అభివృద్ధి చేసుకోవద్దా..?నాడు పాలమూరు జిల్లా ప్రజలు పార్లమెంట్‌కు పంపినా, రాష్ట్రానికి రెండు సార్లు సీఎం అయినా ఈ జిల్లాను పట్టించుకోలేదని మాజీ సీఎం కేసీఆర్‌ను ఉద్దేశించి రేవంత్ విమర్శలు గుప్పించారు. ‘‘మీ ప్రాంతానికి నిధులు తీసుకెళ్లినా, మీ నియోజకవర్గాలను అభివృద్ధి చేసుకున్నా మేం ఏనాడూ ఏడవలేదు. ఈ రోజు మాకు అవకాశం వచ్చింది. ఈ జిల్లా ప్రజలు 12 మంది ఎమ్మెల్యేలు, ఒక పార్లమెంట్ సభ్యుడిని ఇచ్చారు. సీఎంగా కూడా అవకాశం ఇచ్చారు.. ఈ జిల్లాను అభివృద్ధి చేసుకునే బాధ్యత మాకు లేదా.. నేను ఎక్కడికి వెళ్లినా, ఏ పనిచేస్తున్నా నిరంతరం పాలమూరు జిల్లాను అభివృద్ధి చేయాలన్నదే నా ఆకాంక్ష’’అని పేర్కొన్నారు. -
‘సాగునీటి’ అప్పులపై వడ్డీని తగ్గించేలా చూడండి
సాక్షి, న్యూఢిల్లీ: తెలంగాణలోని సాగునీటి ప్రాజెక్టుల కోసం గత ప్రభుత్వం చేసిన అప్పులు ఆర్థికంగా భారంగా మారాయని రాష్ట్ర నీటిపారుదల, పౌర సరఫరాల శాఖ మంత్రి ఎన్.ఉత్తమ్‌కుమార్‌రెడ్డి పేర్కొన్నారు. ఆయా అప్పులపై వడ్డీని పూర్తిగా లేదా పాక్షికంగా తగ్గించేలా కేంద్ర ప్రభుత్వరంగ ద్రవ్య సంస్థలను ఒప్పించేందుకు చొరవ తీసుకోవాలని కేంద్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. మంగళవారం ఢిల్లీలోని భారత మండపంలో కేంద్ర జలశక్తి మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో జరుగుతున్న 8వ అంతర్జాతీయ నీటి వారం సదస్సు– 2024కు ఉత్తమ్ హాజరయ్యారు.రాష్ట్ర పతి ద్రౌపదీ ముర్ము ప్రారంభించిన ఈ సదస్సు 4 రోజులపాటు కొనసాగనుంది. తొలిరోజు కార్యక్రమంలో మాట్లాడిన మంత్రి ఉత్తమ్.. తెలంగాణలో ఈ రంగానికి రాష్ట్ర ప్రభుత్వం ఇస్తున్న ప్రా ధాన్యతను వివరించారు. ప్రతి ఏటా సుమారు ఆరు లక్షల ఎకరాల మేర కొత్త ఆయకట్టును సృష్టించాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం ఈసారి బడ్జెట్లో రూ.29 వేల కోట్లను ఈ రంగానికి కేటాయించిందని చెప్పా రు. రాష్ట్ర ప్రభుత్వ కృషికి తోడుగా కేంద్రం నుంచి తగిన సహాయ సహకారాలు అందించాలని విజ్ఞప్తి చేశారు.నిధుల రూపంలో సాయం అందించడంతో పాటు వివిధ రకాల క్లియరెన్సులను కూడా త్వరితగతిన ఇచ్చేలా చొరవ తీసుకోవాలని కోరారు. ఛత్తీస్‌గఢ్ ప్రభుత్వంతో సంప్రదింపులు జరిపి సమ్మక్క–సారలమ్మ ప్రాజెక్టుకు అన్ని రకాల క్లియరెన్సులు ఇచ్చేలా కేంద్ర ప్రభుత్వం చొరవ తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు. ఇలావుండగా మంత్రి.. పలు సాగునీటి ప్రాజెక్టులకు అవసరమైన రుణాలపై ప్రపంచ బ్యాంకు, ఆసియా అభివృద్ధి బ్యాంకు ప్రతినిధులతో చర్చించారు. ఈ కార్యక్రమంలో 40 దేశాలకు చెందిన ప్రతినిధులతో పాటు మన దేశంలోని 20 రాష్ట్రాలకు చెందిన ఇరిగేషన్ మంత్రులు, ఎన్జీవో సంస్థల ప్రతినిధులు, నిపుణులు పాల్గొన్నారు. -
సాగునీటి ప్రాజెక్టులపై చర్చకు సిద్ధం: భట్టి
బీఆర్ఎస్ ప్రభుత్వం కట్టిన ప్రాజెక్టులన్నీ అవినీతిమయమని.. తమ ప్రాజెక్టులు ప్రజలపరమని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క చెప్పారు. వైరా సభలో ఆయన మాట్లాడారు. ‘‘ఈ రాష్ట్రంలో ఏయే ప్రాజెక్టులు ప్రారంభించాం, తక్కువ ఖర్చుతో ఏం పూర్తి చేశామనే చర్చకు ఎక్కడైనా, ఎప్పుడైనా నేను, మా మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి చర్చకు సిద్ధం. కేసీఆర్, హరీశ్‌రావు, కేటీఆర్ సిద్ధమా? పదేళ్లలో రూ.లక్ష రుణమాఫీ చేయలేని గత ప్రభుత్వం.. ఏకకాలంలో 15 రోజుల్లో రూ.2 లక్షల రుణమాఫీ చేసిన మా ప్రభుత్వానికి పోలిక ఉందా? దేశంలో ఏ రాష్ట్ర చరిత్రలోనూ లేనట్టుగా వ్యవసాయ, అనుబంధ రంగాలకు బడ్జెట్లో రూ.72 వేల కోట్లు కేటాయించాం.సీఎం ఆదేశించిన వెంటనే శుక్రవారం రైతుల ఖాతాల్లో రుణమాఫీ నిధులు జమ అవుతాయి..’’ అని తెలిపారు. గోదావరి జలాలను ఖమ్మం జిల్లాకు తీసుకురావాలనే ఉద్దేశంతో నాటి సీఎం వైఎస్ రాజశేఖర్‌రెడ్డి ఇందిరాసాగర్, రాజీవ్‌సాగర్‌లకు పునాది వేశారని గుర్తు చేశారు. వైఎస్ హయాంలోనే వీటికి రూ.1,500 కోట్లకు పైగా ఖర్చు చేశారని.. మరో రూ.1,548 కోట్లు ఖర్చు చేస్తే 4 లక్షల ఎకరాల ఆయకట్టు సాగులోకి వచ్చేదని చెప్పారు. కానీ బీఆర్ఎస్ వీటిని పక్కనపెట్టి రీడిజైనింగ్ పేరిట సీతారామ ప్రాజెక్టును తెచ్చి దోపిడీ చేసిందని.. వేల కోట్లు దండుకునేందుకు, కమీషన్ల కక్కుర్తి కోసం ఐదేళ్ల ముందే మోటార్లను కొనుగోలు చేసిందని ఆరోపించారు.బీఆర్ఎస్ అసమర్థత వల్లే ప్రాజెక్టు ఆలస్యం: ఉత్తమ్కుమార్రెడ్డిపదేళ్లలో రూ. 7,500 కోట్లు ఖర్చు చేసినా, బీఆర్ఎస్ ప్రభుత్వ అస మర్థతతో సీతారామ ప్రాజెక్టు పూ ర్తికాలేదని మంత్రి ఉత్తమ్ మండి పడ్డారు. తమ మంత్రుల పర్యవేక్ష ణతోనే ప్రాజెక్టు పనులు ముందు కు సాగాయన్నారు. మరో 15 రో జుల్లో ప్రాజెక్టు ద్వారా 67 టీఎంసీల నీళ్లు వాడుకునేందుకు కేంద్రం నుంచి అనుమతులు వస్తాయని చెప్పారు. రాష్ట్రంలో రాబోయే ఐదేళ్లలో 35 లక్షల ఎకరాల కొత్త ఆయకట్టు తేవాలని లక్ష్యంగా పెట్టుకున్నట్టు వెల్లడించారు.మేమే ప్రారంభించాం.. మేమే పూర్తి చేస్తాం: పొంగులేటిగతంలో కాంగ్రెస్ ప్రారంభించిన ఇందిరాసాగర్, రాజీవ్‌సాగర్ ప్రాజెక్టులను ఇప్పుడు కాంగ్రెస్ పార్టీయే పూర్తి చేస్తుందని మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి చెప్పా రు. వైఎస్సార్ హయాంలో చేప ట్టిన ప్రాజెక్టుల పనులు మళ్లీ కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాకే జరుగుతున్నాయన్నారు. కేసీఆర్ పదేళ్లు అధికారంలో ఉండి చుక్కనీరు ఇవ్వకుండా కాలం వెళ్లదీశారని మండిపడ్డారు. ఇప్పటివరకు సీతారామ ప్రాజెక్టు పనులు 39 శాతమే పూర్తయ్యాయని వెల్లడించారు.రైతు రుణం తీర్చుకుంటున్నాం: తుమ్మలరాష్ట్రంలో ఇందిరమ్మ రా జ్యం కోసం ప్రజలు తపించారని, వారి రుణం తీర్చు కుంటున్నామని మంత్రి తు మ్మల చెప్పారు. ‘‘రైతులకు రూ.31 వేల కోట్లు రుణాలు మాఫీ చేసి మాట నిలబె ట్టుకున్నాం. కొన్ని పార్టీలు రుణమాఫీ రాలేదంటూ వా ట్సాప్ చేయాలంటున్నాయి. గత పదేళ్లలో చేయని హామీల గురించి వాట్సాప్ చేస్తే మంచిది’ అని పేర్కొన్నారు.ఫ్లోరైడ్ భూతాన్ని తరిమికొడతాం: మంత్రి కోమటిరెడ్డికాంగ్రెస్ పార్టీ ఎన్నికల సమయంలో ప్రజలకు ఇచ్చిన హామీలన్నీ నెరవేరుస్తున్నామని.. అందులో భాగంగా రైతు రుణమాఫీ చేశామని మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి చెప్పారు. నల్లగొండ జిల్లా ఫ్లోరైడ్ భూతాన్ని తరిమి కొట్టేందుకు సీఎం రేవంత్‌రెడ్డి నేతృత్వంలో ఎన్ని వేల కోట్లు అయినా ఖర్చు చేస్తామన్నారు. -
కాళేశ్వరంపై లేనిపోని ఆరోపణలు
సాక్షి, హైదరాబాద్: ఒక బ్యారేజీలో ఒకటో రెండో పిల్లర్లు కుంగిపోతే దానిపై కాంగ్రెస్ నేతలు కోడిగుడ్డు మీద ఈకలు పీకినట్లు పీకుతున్నారని మాజీ మంత్రి, బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీశ్‌రావు ధ్వజమెత్తారు. కాళేశ్వరం సమగ్ర స్వరూపం చాలా మందికి తెలియదని.. 3 బ్యారేజీలు, 15 రిజర్వాయర్లు, 19 సబ్ స్టేషన్లు, 21 పంప్ హౌస్‌లు, 203 కిలోమీటర్ల సొరంగం, 1,531 కిలోమీటర్ల గ్రావిటీ కెనాల్, 98 కిలోమీటర్ల ప్రెజర్ మెయిన్స్, 141 టీఎంసీల స్టోరేజ్ కెపాసిటీ, 530 మీటర్ల ఎత్తుకు లిఫ్ట్, 240 టీఎంసీల ఉపయోగం.. వీటన్నింటి సమాహారం కాళేశ్వరం అని వివరించారు. దీనిపై లేనిపోని ఆరోపణలు చేస్తున్నారని, నిందలు వేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. మంగళవారం అసెంబ్లీ మీడియా పాయింట్లో శాసనసభ్యులు కడియం శ్రీహరి, సబితా ఇంద్రారెడ్డిలతో కలిసి ఆయన మాట్లాడారు. కాంగ్రెస్ ప్రాణహిత–చేవెళ్ల ఎందుకు కట్టలేదు? ఏదో జరిగిందని మేడిగడ్డ వెళ్లిన సీఎం రేవంత్‌రెడ్డి, ఎమ్మెల్యేలు దారిలో రంగనాయక సాగర్, మల్లన్న సాగర్, కుడెల్లి వాగు, పచ్చటి పొలాలు చూడాలని హరీశ్‌రావు హితవు పలికారు. కాళేశ్వరంతో ఏం చేశారని అడుగుతున్న రాష్ట్ర కాంగ్రెస్ నేతలు.. రైతుల దగ్గరకు వెళ్లి అడగాలని సూచించారు. పక్క రాష్ట్రమైన కర్ణాటక కాంగ్రెస్ ఎమ్మెల్యేలు రంగనాయక సాగర్ చూసి అద్భుతం అని మెచ్చుకున్నారని, నేర్చుకున్నారని గుర్తు చేశారు. కేంద్రం, మహారాష్ట్ర, ఏపీలో నాడు కాంగ్రెస్ అధికారంలో ఉన్నా ప్రాణహిత – చేవెళ్ల ఎందుకు కట్టలేదని నిలదీశారు. మేము నీళ్ళు లేని ప్రాంతం నుంచి నీళ్ళు ఉన్నచోటకు ప్రాజెక్టును మార్చి కట్టి నీళ్ళు అందించామని, మూడు కోట్ల మెట్రిక్ టన్నుల పంట పండింది అంటే ఆ జలాల వల్లే అనే విషయం తెలుసుకోవాలని అన్నారు. తప్పులు జరిగితే చర్యలు తీసుకోండి మేము చేసిన పనుల్లో తప్పులు జరిగితే చర్యలు తీసుకోవాలని హరీశ్‌రావు అన్నారు. అదే సమ యంలో చేసిన పనులను ఆపకుండా పునరుద్ధ రణ పనులు చేపట్టాలని కోరారు. దురుద్దేశంతో ప్రాజెక్టు పునరుద్ధరణ చేయడం లేదని, మీ రు చేసే పనుల వల్ల రైతులు నష్టపోయే పరిస్థితి వచ్చిందని, దీన్ని ప్రజలు క్షమించరని అన్నా రు. నల్లగొండలో బీఆర్ఎస్ సభ ఉందనే మేడి గడ్డ బ్యారేజీ టూర్ ప్రోగ్రాం పెట్టారని హరీశ్‌రా వు విమర్శించారు. మీ నీతిని ప్రజలందరూ గమనిస్తున్నారని వ్యాఖ్యానించారు. కేఆర్ఎంబీకి ప్రాజెక్టులు అప్పగించొద్దంటూ తాము నిద్ర లేపితే వారు లేచారని విమర్శించారు. -
మేడిగడ్డపై సీబీఐ విచారణ అంటే ఎందుకు భయం?
సాక్షి ప్రతినిధి, వరంగల్: ‘కాళేశ్వరం ప్రాజెక్టులో అక్రమాలు, అవినీతిపై గత సీఎం కేసీఆర్ సీబీఐ దర్యాప్తునకు ముందుకు రాలేదు. అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ కూడా సీబీఐ దర్యాప్తు ఎందుకు కోరడం లేదో ముఖ్యమంత్రి చెప్పాలి. రాష్ట్ర ప్రభుత్వం ముందుకొస్తే.. కాళేశ్వరంపై దర్యాప్తు చేయడానికి సీబీఐ సిద్ధంగా ఉందని కేంద్రం రాష్ట్ర ప్రభుత్వానికి లేఖ రాసినా స్పందించడం లేదు. మేడిగడ్డపై సీబీఐ విచారణకు ఆ రెండు పార్టీలు ఎందుకు ముందుకు రావడం లేదో చెప్పాలి’ అని కేంద్ర పర్యాటకశాఖ మంత్రి, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు జి.కిషన్‌రెడ్డి సవాల్ విసిరారు. మంగళవారం వరంగల్‌లో పార్టీపార్లమెంట్ కార్యాలయం ప్రారంభం, వేయిస్తంభాల ఆలయం కల్యాణ మంటపం పనులను పరిశీలించిన అనంతరం కిషన్‌రెడ్డి మీడియాతో మాట్లాడారు. కాళేశ్వరంపై డ్యామ్ సేఫ్టీ అథారిటీ రిపోర్ట్ ఇచ్చిన తర్వాత నాటి బీఆర్ఎస్ సర్కారు, ఎన్నికల తర్వాత నేటి కాంగ్రెస్ ప్రభుత్వాలకు ఉత్తరాలు పంపినా స్పందించలేదన్నారు. గత సంవత్సరం అక్టోబర్ 21 మేడిగడ్డ బ్యారేజీ కుంగిందని వార్తలు రాగానే.. మరుసటి రోజు 22న తాను కేంద్ర జలశక్తి మంత్రికి ఉత్తరం రాశానని, ఆ తర్వాతి రోజే భారత ప్రభుత్వ జలశక్తి శాఖ డ్యామ్ సేఫ్టీ అథారిటీ ఆధ్వర్యంలో ఉన్నతస్థాయి కమిటీ ఏర్పాటు చేసి.. మేడిగడ్డకు పంపిందని కిషన్‌రెడ్డి స్పష్టం చేశారు. అక్టోబర్ 24, 25న ఆ రెండు రోజులు డ్యామ్ సేఫ్టీ అథారిటీ.. రాష్ట్ర అధికారులను వివరాలు అడిగి నవంబర్ 1న ప్రాథమిక నివేదిక తయారు చేసి రాష్ట్రానికి పంపిందన్నారు. ప్రాజెక్ట్ సర్వే, ప్లానింగ్, డిజైనింగ్, నిర్మాణం, ఆపరేషన్, నిర్వహణ అన్నీ లోపభూయిష్టంగా ఉన్నాయని వెల్లడించిందన్నారు. ప్రమాదకర పరిస్థితిలో డ్యామ్ ఉన్నదని, నీటిని ఖాళీ చేయాలని డ్యామ్ సేఫ్టీ అథారిటీ సూచించిందని మంత్రి చెప్పారు. మేడిగడ్డపై కాంగ్రెస్, బీఆర్ఎస్ కుమ్మక్కు రాజకీయాలు ప్రతిపక్ష, పాలక పార్టీలు ఆడుతున్నాయని కిషన్‌రెడ్డి ఆరోపించారు. మేడిగడ్డ డ్యామేజీ వ్యవహారాన్ని పొలిటికల్ మైలేజ్‌కి కాంగ్రెస్ వాడుకుంటున్నదన్నారు. అసెంబ్లీ బంద్ పెట్టి.. మేడిగడ్డకు ఎందుకు వెళుతున్నారో అర్థం కావడం లేదని, ఇంతకు ముందే మంత్రులు చూశారు. రేవంత్, రాహుల్‌గాంధీ చూశారు.. ఇప్పుడు మళ్లీ ఎందుకు వెళుతున్నారో చెప్పాలి? అని నిలదీశారు. బీఆర్ఎస్ పార్టీ తీరు అలాగే ఉన్నదని, ప్రజాసమస్యలపై చర్చించేందుకు అసెంబ్లీకి వెళ్లని కేసీఆర్, నల్లగొండ బహిరంగ సభకు వెళ్లారని ఎద్దేవా చేశారు. ప్రాంతీయ విద్వేషాలు రెచ్చగొట్టేందుకు కేసీఆర్ సభ ఏపీ పోలీసులను పెట్టి బలవంతంగా కృష్ణా నీళ్లు తీసుకెళ్తే.. ఏం చేయాలో ఇప్పటివరకు యాక్షన్‌ప్లాన్ ఏంటో, మీ వైఖరి ఏమిటో.. ఈ సమస్యను ఎలా పరిష్కరించుకుంటారో చె ప్పాలని నిలదీశారు. మీరు పరిష్కరించుకుంటే.. కేంద్రం జోక్యం చేసుకోదన్నారు. ప్రాజె క్టుల సమస్య వస్తే పరిష్కరించాల్సిన బాధ్యత కేంద్ర ప్రభుత్వంపై ఉందని చెప్పా రు. కేంద్రంపై నిందలు వేస్తూ ప్రాంతీయ విద్వేషాలు రెచ్చగొట్టాలని కేసీఆర్ నల్లగొండ సభ పెట్టారని, ఆయన రెచ్చగొట్టే వ్యాఖ్యలను ప్రజలు పట్టించుకోరన్నారు. ఒకరు కృష్ణా జలాలపై, మరొకరు కాళేశ్వరంపై రచ్చ చేస్తూ ఎంపీ ఎన్నికల్లో లబ్ధిపొందాలని ప్రయత్నం చేస్తున్నారని, తెలంగాణలో ఈసారి బీజేపీ డబుల్ డిజిట్ సీట్లు గెలుస్తుందన్నారు. -
తప్పు తేలితే తగిన శిక్ష!
సాక్షి, హైదరాబాద్: మేడిగడ్డ బ్యారేజీ సహా రాష్ట్రంలోని సాగునీటి ప్రాజెక్టుల వాస్తవ పరిస్థితులపై అ ధ్యయనం జరిపి రూపొందించిన శ్వేతపత్రాన్ని ఒక ట్రెండు రోజుల్లో శాసనసభలో విడుదల చేస్తామని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ప్రకటించారు. మేడిగడ్డ బ్యారేజీ విషయంలో అసలేం జరిగిందో ప్రజలకు నిజాలు తెలియాల్సిన అవసరం ఉందన్నారు. మేడిగడ్డ విషయంలో తప్పు జరిగిందా? జరిగినట్టు తేలితే బాధ్యులెవరు? అనేది తేలుస్తామని.. వారికి తగిన శిక్ష ఉంటుందని పేర్కొన్నారు. మంగళవారం మేడిగడ్డ బ్యారేజీ సందర్శనకు బయలుదేరే ముందు శాసనసభలో రేవంత్ ప్రసంగించారు. రాష్ట్ర తాగు, సాగునీటి అవసరాలకు కృష్ణా, గోదావరి జలాలే కీలకమని.. కృష్ణాజలాలపై ఇప్పటికే శాసనసభలో చర్చించామని, గోదావరి జలాలపై త్వరలో చర్చిస్తామని తెలిపారు. సభలో రేవంత్ ప్రసంగం ఆయన మాటల్లోనే.. ‘‘తెలంగాణను సస్యశ్యామలం చేసేందుకు వైఎస్సార్ హయాంలో ప్రాణహిత–చేవెళ్ల ప్రాజెక్టు చేపట్టారు. తెలంగాణ ఏర్పాటయ్యే నాటికే వేల కోట్ల విలువైన పనులు కూడా జరిగాయి. కానీ బీఆర్ఎస్ ప్రభుత్వం రీడిజైనింగ్ పేరిట ప్రాజెక్టుకు మార్పులు చేసి.. మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల అంటూ బ్యారేజీలను కట్టుకుంటూ పోయింది. రూ.38,500 కోట్ల వ్యయ అంచనాతో ప్రాణహిత– చేవెళ్లను రూపొందిస్తే.. కాళేశ్వరం పేరిట రూ.1.47 లక్షల కోట్లకు పెంచేశారు. ప్రాజెక్టును పూర్తి చేసేందుకు రూ.2.5 లక్షల కోట్లు అవుతుందా? ఇంకెంత అవుతుందోనన్న దానిపై స్పష్టత లేదు. పిట్టగూడులా కట్టారా? బాంబులతో పేల్చారా? మ్యాన్ మేడ్ వండర్ అంటూ కాళేశ్వరం ప్రాజెక్టుపై పెద్ద ఎత్తున ప్రచారం చేశారు. ఈ ప్రాజెక్టు బీఆర్ ఎస్ నేతలకు ఏటీఎంలా మారిందని మేం ఇక్కడ అనడం లేదు. కాళేశ్వరం గొప్పతనాన్ని కేసీఆర్ స్వయంగా వివరిస్తే బాగుంటుంది. మేడిగడ్డ బ్యారేజీ సంద ర్శనకు మాజీ సీఎం కేసీఆర్, కాళేశ్వర్రావు (హరీ శ్‌రావును ఉద్దేశించి)తోపాటు కడియం శ్రీహరి, బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు అందరూ రావాలి. బ్యారేజీకి ఏం జరిగిందో చూసి, తెలంగాణ ప్రజలకు వివరించాలి. బస్సులో ప్రయాణించడానికి కష్టమైతే.. కేసీఆర్ కోసం ప్రత్యేకంగా హెలికాఫ్టర్‌ను సిద్ధంగా ఉంచాం. మేడిగడ్డ బ్యారేజీ కుంగడంపై ఆందోళన చేసిన ప్రతిపక్షాలను అప్పట్లో అడ్డుకున్నారు. అప్పటి మంత్రి ప్రశాంత్‌రెడ్డి అయితే.. ప్రతిపక్షాలే బ్యారేజీని బాంబులు పెట్టి పేల్చేశాయంటూ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఇవన్నీ చూడటానికే ప్రభుత్వం మేడిగడ్డ టూర్ ఏర్పాటు చేసింది’’ అని రేవంత్ చెప్పారు. కాగా మేడిగడ్డ బ్యారేజీ డిజైన్‌లో లోపాలున్నట్టుగా విజిలెన్స్ రిపోర్టు ఇచ్చిందని మంత్రి శ్రీధర్‌బాబు పేర్కొనగా.. బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు అభ్యంతరం వ్యక్తం చేశారు. ఇసుకలో పేకమేడలు కట్టారా? పునాదుల కింద ఇసుక కదలడం వల్లే మేడిగడ్డ బ్యారేజీ కుంగిందని గత ప్రభుత్వ నేతలు అంటున్నారు. వాళ్లు ఇసుకలో పేకమేడలు కట్టారా? సభలో ప్రాజెక్టులపై శ్వేతపత్రం పెట్టాక.. కాళేశ్వరంపై, కాళేశ్వర్రావుగా పిలుచుకున్న హరీశ్‌రావుపై, ప్రాజెక్టు ఎవరెవరికి ఏటీఎంలా మారిందన్న అంశంపై చర్చిద్దాం. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక కొందరు అధికారులు కార్యాలయాల నుంచి ఫైళ్లు మాయం చేశారని వచ్చిన ఆరోపణలపై విచారణకు ఆదేశించాం. ఏమేం ఫైళ్లు మాయమయ్యాయి? ఎవరు మాయం చేశారన్న దానిపై ప్రాథమిక నివేదిక అందింది. -
ఆయకట్టు ఎకరా పెరగలేదు
సాక్షి, హైదరాబాద్: ఉమ్మడి నల్లగొండ, ఖమ్మం జిల్లాల సాగునీటి ప్రాజెక్టులను పూర్తి చేయడంలో గత ప్రభుత్వం నిర్లక్ష్యం వహించిందని రాష్ట్ర మంత్రులు ఆరోపించారు. గత ప్రభుత్వ హయాంలో చేపట్టిన ప్రాజెక్టుల రీఇంజనీరింగ్ వల్ల ఎకరా ఆయకట్టు అదనంగా పెరగలేదని, కేవలం వ్యయం మాత్రమే పెరిగిందని విమర్శించారు. రాష్ట్ర సచివాలయంలోని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క చాంబర్లో గురువారం ఉమ్మడి నల్లగొండ, ఖమ్మం జిల్లాల సాగునీటి ప్రాజెక్టులపై ఇరిగేషన్ అధికారులతో భట్టి, నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్‌కుమార్ రెడ్డి సమీక్ష నిర్వహించారు. మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి, మంత్రులు కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి, తుమ్మల నాగేశ్వర్రావు, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, దుద్దిళ్ల శ్రీధర్‌బాబు, పొన్నం ప్రభాకర్ పాల్గొన్నారు. సీతారామకు పర్యావరణ అనుమతులు రావాలి కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో రూ.2,400 కోట్లతో చేపట్టిన ఇందిరా, రాజీవ్‌సాగర్ ప్రాజెక్టుల అంచ నా వ్యయాన్ని రీ డిజైనింగ్ పేరిట రూ.13 వేల కో ట్లకు ఎందుకు పెంచాల్సి వచ్చిందని భట్టి విక్రమా ర్క అధికారులను ప్రశ్నించారు. అదనంగా ఆయక ట్టు పెరిగిందా? అని ప్రశ్నించగా, పెరగలేదని అధికారులు బదులిచ్చారు. గత ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం మేరకు ఇందిరా సాగర్ ప్రాజెక్టును రీ డిజైనింగ్ చేశామని చెప్పారు. సీతారామ ప్రాజెక్టు పనుల పురోగతిని పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా వివరించారు. బ్యారేజీ నిర్మాణానికి ఇంకా పర్యావరణ అనుమతులు రావాల్సి ఉందని, రెండు నెలల్లో వచ్చే అవకాశం ఉందని తెలిపారు. ప్రాజెక్టులపై నివేదికలు ఇవ్వండి గత ప్రభుత్వం రూ.వేల కోట్లతో కొత్త ప్రాజెక్టులను ప్రారంభించడంతో ప్రజలపై భారం పడిందని మంత్రి ఉత్తమ్‌కుమార్ రెడ్డి విమర్శించారు. ఆరు నెలల్లో పూర్తయ్యే ప్రాజెక్టులు, ఏడాదిలోగా పూర్తయ్యేవి, 18 నెలల్లోగా పూర్తయ్యేవి, 24 నెలల్లో పూర్తయ్యే ప్రాజెక్టులు గుర్తించి, వాటి కావాల్సిన బడ్జెట్ అంచనా వ్యయాన్ని రూపొందించి వెంటనే నివేదికలు ఇవ్వాలని ఆదేశించారు. ఇరిగేషన్ శాఖలో ఎన్నికలకు ముందు పిలిచిన టెండర్లను వెంటనే నిలిపివేయాలని, వర్క్ అలాట్మెంట్ చేసిన వాటిని కూడా ఆపి వేయాలని ఆదేశించారు. గత ప్రభుత్వం రీడిజైనింగ్ చేసిన సీతారామ ప్రాజెక్టు విషయంలో వెనక్కి పోలేము, ముందుకు పోలేమన్నట్టుగా ఉందని ఉత్తమ్ అన్నారు. బ్యారేజీ హెడ్ వర్క్ నుంచి చివరి కెనాల్ వరకు ఫేజ్‌ల వారీగా జరిగిన పనుల గురించి మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి ఆరా తీశారు. అధికారులు చిత్తశుద్ధితో పనిచేయాలి గత ప్రభుత్వ హయాంలో నల్లగొండ జిల్లా రైతులకు సాగునీటిని అందించేందుకు కనీస ప్రయత్నం కూడా జరగలేదని మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి ఆరోపించారు. ఎస్ఎల్బీసీ సొరంగం పనులు, ఉదయ సముద్రం ప్రాజెక్టు ఎందుకు పూర్తి కాలేదని ఈఎన్సీ మురళీధర్‌ను ప్రశ్నించారు. డిండి బ్యాలెన్సింగ్ రిజర్వాయర్, సింగరాజుపల్లి రిజర్వాయర్, పాకాల బ్యాలెన్సింగ్ రిజర్వాయర్, గొట్టెముక్కుల రిజర్వాయర్, పిల్లాయిపల్లి కెనాల్, నెల్లికల్ లిఫ్ట్ పనులు ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అన్న చందంగా ఉండిపోయాయని అన్నారు. నల్లగొండ జిల్లా ప్రాజెక్టుల పూర్తికి కావాల్సిన అనుమతులు, నిధులు తీసుకొస్తానని, అధికారులు చిత్తశుద్ధితో పనిచేయాలని ఆదేశించారు. ఉమ్మడి నల్లగొండ జిల్లా సస్యశ్యామలం కావాలంటే గత ప్రభుత్వం మొదలుపెట్టిన ప్రాజెక్టుల పనులు ఆపకుండా త్వరగా పూర్తి చేయాలని గుత్తా సుఖేందర్ రెడ్డి సూచించారు. -
‘సాగునీటి’లోనూ అక్రమాల ప్రవాహం
సాక్షి, అమరావతి : సాగునీటి ప్రాజెక్టులను పూర్తిచేసే ముసుగులో చంద్రబాబునాయుడు ప్రభుత్వ ఖజానాను అడ్డగోలుగా దోచేశారు. ఐదేళ్లలో రూ.68,293.94 కోట్లు ఖర్చుచేసినా ఒక్క ప్రాజెక్టునూ పూర్తిచేయలేకపోయారు. ఇంత ఖర్చుచేసినా కొత్త, పాత కలిపి కేవలం 3.4 లక్షల ఎకరాల ఆయకట్టుకు మాత్రమే నీళ్లందించగలిగారు. వీటిని పరిశీలిస్తే.. సాగునీటి ప్రాజెక్టుల పనుల్లో చంద్రబాబు ఏ స్థాయిలో దోపిడీ చేశారో అర్థంచేసుకోవచ్చు. టీడీపీ ప్రభుత్వం 2014లో అధికారంలోకి రాగానే.. పోలవరం, ఉత్తరాంధ్ర సుజల స్రవంతి మినహా జలయజ్ఞం కింద చేపట్టి, పూర్తికాని 40 ప్రాజెక్టుల్లో మిగిలిన పనులను పూర్తిచేయడానికి కేవలం రూ.17,368 కోట్లు మాత్రమే అవసరమని 2014, జూలై 28న నాటి సీఎం చంద్రబాబు శ్వేతపత్రంలో ప్రకటించారు. ఈ ప్రాజెక్టుల కోసం 2014, జూన్ 8 నుంచి 2019, మే 29 వరకూ రూ.68,293.94 కోట్లను ఖర్చుచేసినట్లు చంద్రబాబు ఘనంగా ప్రకటించుకుంటున్నారు. ఇందులో పోలవరంపై ఖర్చుపెట్టిన రూ.10,860.67 కోట్లు, నీరు–చెట్టు పేరుతో కాజేసిన రూ.12,400.23 కోట్లు.. కమీషన్ల కోసం చేపట్టిన పట్టిసీమ, పురుషోత్తపట్నం ఎత్తిపోతలపై వ్యయం చేసిన రూ.3,199.92 వెరసి.. రూ.26,460.82 కోట్లను మినహాయిస్తే.. జలయజ్ఞం కింద చేపట్టిన 40 ప్రాజెక్టులకు రూ.41,833.12 కోట్లు వ్యయం చేసినట్లు స్పష్టమవుతోంది. అంటే.. చంద్రబాబు చెప్పిన ప్రకారం ఆ ప్రాజెక్టులను పూర్తిచేయడానికి అవసరమైన దానికంటే రూ.24,465.12 కోట్లను అధికంగా వ్యయం చేశారు. పోనీ.. ఒక్క ప్రాజెక్టునైనా పూర్తిచేశారా అంటే అదీ లేదు. దీన్నిబట్టి చూస్తే.. కేవలం జలయజ్ఞం ప్రాజెక్టుల్లో మాత్రమే కాంట్రాక్టర్లకు ప్రభుత్వ ఖజానా నుంచి రూ.24 వేల కోట్లను దోచిపెట్టి.. అందులో చాలావరకూ ముడుపుల రూపంలో చంద్రబాబు రాబట్టుకున్నారన్నది బహిరంగ రహస్యం. ‘పోలవరం’తో కేంద్ర ఖజానాను సైతం.. ఇక కేంద్రమే నిరి్మంచాల్సిన పోలవరం ప్రాజెక్టు నిర్మాణ బాధ్యతలను చంద్రబాబు దక్కించుకుని.. కేంద్ర ప్రభుత్వ ఖజానాను దోచేశారు. దేశ చరిత్రలో ఎక్కడాలేని రీతిలో పోలవరం హెడ్‌వర్క్స్‌లో రూ.2,917 కోట్ల విలువైన పనులను రామోజీరావు వియ్యంకుడికి చెందిన నవయుగకు.. ఎడమ కాలువలో ఐదో ప్యాకేజీలో రూ.142 కోట్ల విలువైన పనులను అప్పటి ఆర్థికమంత్రి యనమల వియ్యంకుడు పుట్టా సుధాకర్ యాదవ్‌కు కట్టబెట్టి అక్రమాల్లో రికార్డు నెలకొల్పారు. అందుకే చంద్రబాబు కమీషన్ల కోసం పోలవరాన్ని ఏటీఎంగా మార్చుకున్నారని ప్రధాని మోదీ సైతం ఆరోపించారు. -
నీళ్లు ఊరికే రావు!
సాక్షి, హైదరాబాద్: ‘‘ప్రస్తుతం నీటికి భారీగా డిమాండ్ పెరుగుతోంది...అయితే నీటి లభ్యత పరిమితంగా ఉన్న దృష్ట్యా ఉచితంగా సరఫరా చేయొద్దు. గృహ, సాగు, పారిశ్రామిక అవసరాలకు సరఫరా చేసే నీటికి ధరలు ఖరారు చేయాలి. కనీసం సాగునీటి ప్రాజెక్టులపై పెట్టిన పెట్టుబడితోపాటు నిర్వహణ, పర్యవేక్షణ(ఓఅండ్ఎం) వ్యయాలు రాబట్టుకునే విధంగా నీటి ధరలు ఉండాలి’’...అని కేంద్ర జలశక్తి శాఖ ఆధ్వర్యంలోని కేంద్ర జలసంఘం(సీడబ్ల్యూసీ) అన్ని రాష్ట్రాలకు సిఫారసు చేసింది. ‘ప్రైసింగ్ ఆఫ్ వాటర్ ఇన్ పబ్లిక్ సిస్టమ్ ఇన్ ఇండియా–2022’పేరుతో రూపొందించిన పంచవర్ష నివేదికలో నీటికి చార్జీలు వసూలు చేయాల్సిందేనని నొక్కి చెప్పింది. నీటి ధరలపై ప్రతి ఐదేళ్లకోసారి ఈ నివేదిక విడుదల చేస్తుండగా, గతేడాది రావాల్సిన నివేదిక తాజాగా బయటకొచ్చింది. ఉచితంగా/తక్కువ ధరలకు నీరు సరఫరా చేస్తే దుర్వినియోగం అవుతుందని, ఆదాయం రాక ప్రభుత్వంపై పెనుభారం పడుతుందని ఆ నివేదికలో స్పష్టం చేసింది. రాష్ట్రాలకు సరైన పాలసీ ఉండాలి పన్నులు, ఇతర మార్గాల్లో ప్రజల నుంచి వసూలు చేస్తున్న డబ్బు ద్వారా ప్రభుత్వాలు మధ్యతరహా, భారీ సాగునీటి ప్రాజెక్టులు నిర్మిస్తున్నాయి. దీంతో ఆయకట్టు రైతులు భారీగా ఆర్థిక ప్రయోజనాలు పొందుతున్నారు. ఈ ప్రాజెక్టుల పెట్టుబడులను తిరిగి రాబట్టుకోవడానికి రాష్ట్రాలు సరైన పాలసీలు కలిగి ఉండాలి. తిరిగి వచ్చిన రాబడులతో కొత్త ప్రాజెక్టులు చేపట్టి సమాజంలోని ఇతర వర్గాలకు లబ్ధి చేకూర్చాలి. సాగునీటి చార్జీలు... రెండు రకాల వ్యయాలు పంట రకాలు, విస్తీర్ణం, తడుల సంఖ్య, మొత్తం నీటి పరిమాణాన్ని పరిగణనలోకి తీసుకొని సాగునీటి ధరలు ఖరారు చేయాలి. నీటి టారీఫ్ ఖరారు విధానాన్ని అన్ని రాష్ట్రాలు హేతుబద్దీకరించాలి. పంట దిగుబడి విలువ ఆధారంగా సాగునీటి చార్జీలు వసూలు చేయాలని ఇరిగేషన్ కమిషన్(1972) కోరింది. ప్రాజెక్టుల పెట్టుబడి వ్యయంలో కొంత భాగంతోపాటు పూర్తిగా నిర్వహణ వ్యయం రాబట్టుకోవాలని వైద్యనాథన్ కమిటీ కోరింది. ► సాగునీటి చార్జీల వసూళ్లతో ప్రాజెక్టుల మొత్తం నిర్వహణ వ్యయాన్ని రాబట్టుకోవాల్సిందే. దీనికి అదనంగా.. ఆహార పంటలైతే హెక్టారులో వచ్చిన దిగుబడుల విలువలో కనీసం ఒక శాతం, వాణిజ్య పంటలైతే ఇంకా ఎక్కువ శాతాన్ని వసూలు చేయాలి. ఈ మేరకు సాగునీటి వినియోగానికి సంబంధించి రెండు రకాల చార్జీలు విధించాలి. నిర్వహణ చార్జీలతో ప్రాజెక్టుల నిర్వహణకు, దిగుబడుల విలువ ఆధారిత చార్జీలను ప్రాజెక్టుల ఆధునికీకరణకు వినియోగించాలి. నీటి లభ్యత లెక్కల ఆధారంగా 75శాతం, ఆపై లభ్యత ఉన్న ప్రాజెక్టుల కింద పూర్తిస్థాయిలో సాగునీటి చార్జీలు వసూలు చేయాలి.75 శాతానికి తక్కువ లభ్యత ఉన్న ప్రాజెక్టుల కింద 50 శాతం మేరకు చార్జీలు తగ్గించాలి. ఎత్తిపోతల పథకాల నీటిచార్జీలు ఎక్కువే.. ఎత్తిపోతల పథకాలతో సరఫరా చేసే నీటికి చార్జీలు ఆయా ప్రాజెక్టుల పెట్టుబడి, నిర్వహణ వ్యయాల ఆధారంగా ఖరారు చేయాలి. ఎత్తిపోతల పథకాల ద్వారా సరఫరా చేసే నీటికి కచ్చితమైన లెక్కలు ఉంటాయి. ఈ నేపథ్యంలో ఎంత నీరు సరఫరా చేస్తే ఆ మేరకు చార్జీలు వాల్యూమెట్రిక్ (నీటి పరిమాణం) ఆధారంగా వసూలు చేయాలి. ఎత్తిపోతల పథకాల నిర్వహణ వ్యయం ఎక్కువే కాబట్టి గ్రావిటీ ప్రాజెక్టుల నీటిచార్జీల కంటే వీటి ద్వారా సరఫరా చేసే నీటి చార్జీలు అధికంగా ఉంటాయి. నీటి ధరల ఖరారుకు రెగ్యులేటరీ కమిషన్ తాగు, పారిశుద్ధ్యం, సాగు, పారిశ్రామిక, ఇతర అవసరాలకు సరఫరా చేసే నీటికి సరైన ధరలు ఖరారు చేసేందుకు ప్రతి రాష్ట్రంలో చట్టబద్ధంగా స్వయంప్రతిపత్తి గల వాటర్ రెగ్యులేటరీ ఆథారిటీని ఏర్పాటు చేయాలి. నీటి పరిమాణం ఆధారంగా చార్జీలు వసూలు చేయడానికి 100 శాతం ఇళ్లలోని నల్లాలకు మీటర్లు, కాల్వలకు నీటిని కొలిచే యంత్రాలు బిగించాలి. పేదలకు రాయితీపై నీరు సరఫరా చేయవచ్చు. పూర్తి నిర్వహణ వ్యయంతోపాటు పెట్టుబడిలో కొంత భాగం వసూలు చేసేలా నీటిచార్జీలు ఉండాలి. వీటితో పాటుగా పెట్టుబడి రుణాల తిరిగి చెల్లింపులు, ఇతర అవసరాలకు నిధులు నిల్వ ఉండేలా చార్జీలు ఖరారు చేయాలి. సాగునీటి ప్రాజెక్టుల నీటిని వినియోగిస్తే హెక్టారుకు రూ.600, వినియోగించని పక్షంలో హెక్టారుకు రూ.300 చొప్పున నిర్వహణ చార్జీలు వసూలు చేయాలని జల వనరుల 11వ పణ్రాళిక సిఫారసు చేసింది. పేద, బలహీనవర్గాలకు రాయితీ కొనసాగాలి. నిర్వహణ, పెట్టుబడి రాబట్టుకోవాలి దేశంలో ప్రస్తుతం వసూలు చేస్తున్న నీటి ధరలు భారీ రాయితీతో ఉన్నాయి. దీంతో ఆదాయానికి గండిపడుతోంది. రైతుల శక్తిసామర్థ్యాలను దృష్టిలో పెట్టుకుని నీటి ధరలు రాష్ట్రాలు ఖరారు చేస్తున్నాయి. కనీసం సాగునీటి ప్రాజెక్టుల నిర్వహణ వ్యయం కూడా రావడం లేదు. దీంతో నిర్వహణ సరిగా ఉండడం లేదు. పూర్తి నిర్వహణ వ్యయంతో పాటు పాక్షికంగా పెట్టుబడి ఖర్చు రాబట్టుకునేలా నీటి ధరలు ఉండాలి. సెకండ్ ఇరిగేషన్ కమిషన్(1972), డాక్టర్ వైద్యనాథన్ కమిటీ(1991), వివిధ ఫైనాన్స్ కమిషన్లు, ఇంటిగ్రేటెడ్ వాటర్ రిసోర్సెస్ డెవలప్మెంట్ అండ్ మేనేజ్మెంట్–2016 నిబంధనలు సైతం సరైనరీతిలో నీటి ధరలు ఖరారు చేసి నీటిపారుదల చార్జీల రూపంలో కనీసం నిర్వహణ వ్యయం వసూలు చేసుకోవాలని సిఫారసులు చేశాయి. -
వేగంగా ప్రాజెక్టులు
-
ఆకుపచ్చ హామీ ఏమైంది?
సాక్షి ప్రతినిధి, నల్లగొండ: మునుగోడు ప్రాంతంలో 1.75 లక్షల ఎకరాలకు నీళ్లు ఇచ్చే డిండి ఎత్తిపోతల పథ కాన్ని ఒకటిన్నరేళ్లలో పూర్తిచేసి మునుగోడును ఆకుపచ్చగా చేసే బాధ్యత తనదేనని చెప్పిన సీఎం కేసీఆర్ హామీ ఏమైందని బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు గంగిడి మనోహర్‌రెడ్డి ప్రశ్నించారు. ఈ మేరకు శుక్రవారం ఆయన బహిరంగ లేఖ విడుదల చేశారు. 2018 ఎన్నికల ప్రచారానికి ప్రజా ఆశీర్వాద సభ పేరుతో వచ్చి గాలిమాటలు చెప్పి ప్రజలను మోసం చేశారని దుయ్యబట్టారు. రాజగోపాల్‌రెడ్డి రాజీనామాతో సీఎం కేసీఆర్ ఇప్పుడు మళ్లీ తాయిలాలకు తెరలేపార న్నారు. ప్రగతిభవన్, ఫాం హౌస్ దాటని కేసీఆర్.. రాజగోపాల్‌రెడ్డి రాజీనామాతో ఉప ఎన్నికల కోసం పరుగులు పెడుతున్నారని ధ్వజమెత్తారు. సీసీరోడ్లకు ప్రతిపాదనలు, మునుగోడు నియోజకవర్గంలో 9 వేల ఆసరా పెన్షన్లు, డిండి లిఫ్టు నిర్వాసితులకు రూ.116 కోట్లు, చేనేత కార్మికులకు బీమా, పెన్షన్లు వస్తున్నాయని, రోడ్లు, బ్రిడ్జి పనులకు రూ.7 కోట్లు వస్తున్నా యని తెలిపారు. -
‘ఆర్ఆర్ఆర్’ పరిహారం లెక్క చదరపు మీటర్లలో..!
సాక్షిప్రతినిధి, సంగారెడ్డి: రీజినల్ రింగ్ రోడ్డులో భూసేకరణ పరిహారం చదరపు మీటర్లలో లెక్కించి ఇవ్వాలని ప్రభుత్వం సూత్రప్రాయంగా నిర్ణయించింది. సాధారణంగా సాగునీటి ప్రాజెక్టుల నిర్మాణం, ఇతర ప్రజాప్రయోజనాల కోసం సేకరించి భూములకు సంబంధించిన పరిహారాన్ని ఎకరాల్లో లెక్కించి చెల్లిస్తారు. ఆయా గ్రామాల్లో ఇటీవల జరిగిన భూక్రయవిక్రయాలకు సంబంధించి రిజిస్ట్రేషన్ రేటుకు నెగోషియేషన్ చేసి ధర నిర్ణయిస్తారు. కానీ ఈ రీజినల్ రింగ్ రోడ్డు నిర్మాణంతో భూములు కోల్పోతున్న రైతులకు ఇందుకు భిన్నంగా చదరపు మీటర్లలో లెక్కించి పరిహారం చెల్లించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు రెవెన్యూ అధికారులు కసరత్తు చేస్తున్నారు. ఎకరానికి 4,046.85 చదరపు మీటర్లుగా లెక్కించి పరిహారం ఇవ్వనున్నారు. రెండు రోజుల్లో నోటిఫికేషన్... ఈ రహదారి భూసేకరణకు సంబంధించి రెవెన్యూ అధికారులు రెండు రోజుల్లో నోటిఫికేషన్ విడుదల చేయనున్నారు. అలైన్‌మెంట్‌పై ప్రైవేట్ ఏజెన్సీ చేసిన సర్వే నివేదికను ఆ సంస్థ ఇటీవలే రెవెన్యూ అధికారులకు అప్పగించింది. ఏజెన్సీ ఇచ్చిన సర్వేనంబర్లను జిల్లా రెవెన్యూ అధికారులు మరోసారి క్రాస్ చెక్ చేస్తున్నారు. భూమికి సంబంధించిన పట్టాదారు పేరు, సర్వే నంబరు, గ్రామం, మండలం, జిల్లా, విస్తీర్ణం వంటి వివరాలను ప్రత్యేక ప్రొఫార్మాలో పొందుపరుస్తున్నారు. ఈ ప్రక్రియను రెండు రోజుల్లో ముగించి, వెంటనే స్థానిక భూసేకరణ నోటిఫికేషన్ విడుదల చేసేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. కాగా ఆర్ఆర్ఆర్ ఉత్తర భాగం 158.64కి.మీ.ల నిర్మాణానికి అవసరమైన భూసేకరణ కోసం సంగారెడ్డి, జోగిపేట్, నర్సాపూర్, తూప్రాన్, గజ్వేల్, భువనగిరి, చౌటుప్పల్ ఆర్డీఓలు, యాదాద్రి భువనగిరి అదనపు కలెక్టర్‌ను భూసేకరణ అథారిటీగా నియమించిన విషయం విదితమే. నేషనల్ హైవే అథారిటీ అధికారులు విడుదల చేసిన అలైన్మెంట్ ప్రకారం ఆర్డీఓలు 113 గ్రామాల్లో భూసేకరణ ప్రక్రియ ప్రారంభించారు. -
అప్పర్ భద్ర లెక్కలు తప్పు
సాక్షి, అమరావతి : అప్పర్ భద్రకు నీటి కేటాయింపులపై కర్ణాటక చెప్పిన మాయ లెక్కలను నమ్మి, ఆ ప్రాజెక్టుకు అనుమతులిచ్చారని, వాటిని పునఃసమీక్షించాలని కేంద్ర జల సంఘం (సీడబ్ల్యూసీ), జల్ శక్తి శాఖలను రాష్ట్ర ప్రభుత్వం గట్టిగా కోరింది. బేసిన్ పరిధిలోని మహారాష్ట్ర, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ అభిప్రాయాలు తీసుకోకుండానే సీడబ్ల్యూసీ హైడ్రాలజీ విభాగం అధికారులు అనుమతులిచ్చారని వెల్లడించింది. ఈ ప్రాజెక్టు పూర్తయితే కర్ణాటక, ఆంధ్రప్రదేశ్, తెలంగాణలోని తుంగభద్ర ఆయకట్టుతోపాటు రెండు తెలుగు రాష్ట్రాల్లో కృష్ణా ఆయకట్టుపై తీవ్ర ప్రభావం పడుతుందని ఆందోళన వ్యక్తం చేసింది. ఈ మేరకు కేంద్ర జల్ శక్తి శాఖ కార్యదర్శి పంకజ్‌కుమార్‌కు రాష్ట్ర జలవనరుల శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి కేఎస్ జవహర్‌రెడ్డి ఇటీవల లేఖ రాశారు. చుక్క నీరూ కేటాయించకుండానే.. కృష్ణా జల వివాదాల ట్రిబ్యునల్ (కేడబ్ల్యూడీటీ)–1 నీటి కేటాయింపులు చేయకున్నా, కేడబ్ల్యూడీటీ–2 తీర్పు అమల్లోకి రాకపోయినా, అప్పర్ భద్ర ప్రాజెక్టుకు నీటి కేటాయింపులు ఉన్నట్లుగా కేంద్ర జల సంఘాన్ని (సీడబ్ల్యూసీ) కర్ణాటక ప్రభుత్వం నమ్మించింది. అప్పర్ భద్రకు నీటిని కేటాయించాలన్న కర్ణాటక ప్రతిపాదనలను 1976లోనే కేడబ్ల్యూడీటీ–1 తోసిపుచ్చింది. తుంగభద్రలో ఆ మేరకు నీటి లభ్యత లేదని స్పష్టం చేసింది. కానీ.. తుంగ ఆనకట్ట ఆధునికీకరణ వల్ల 6.25 టీఎంసీలు, భద్ర ఆనకట్ట ఆధునికీకరణ వల్ల 0.5, విజయనగర చానల్స్ ఆధునికకీరణ వల్ల 6.25, కృష్ణా డెల్టాకు పోలవరం ద్వారా మళ్లించిన జలాల్లో వాటా నీరు 2, కృష్ణా బేసిన్లో అదనపు మిగులు జలాలు 6 టీఎంసీలు వెరసి 31 టీఎంసీల లభ్యత ఉందని కర్ణాటక పేర్కొంది. ఇందులో ప్రవాహ, ఆవిరి నష్టాలుపోనూ 29.90 టీఎంసీలను అప్పర్ భద్ర ద్వారా వాడుకుంటామని తెలిపింది. అప్పర్ తుంగ ప్రాజెక్టు నుంచి 17.40 టీఎంసీలను భద్ర ప్రాజెక్టులోకి ఎత్తిపోస్తామని, భద్ర నుంచి 29.90 టీఎంసీలను తరలించి.. దుర్భిక్ష ప్రాంతాల్లో 2.25 లక్షల హెక్టార్లకు నీళ్లందిస్తామని పేర్కొంది. కానీ, అప్పర్ తుంగ, భద్ర, విజయనగర ఛానల్స్ ఆధునికీకరణ వల్ల నీటి వినియోగం ఏమాత్రం తగ్గలేదని, కృష్ణా బేసిన్లో అదనపు మిగులు జలాలు లేవని కేడబ్ల్యూడీటీ–2 స్పష్టం చేసింది. అయినా, కర్ణాటక చెప్పిన తప్పుడు లెక్కలనే నమ్మిన సీడబ్ల్యూసీ దిగువ రాష్ట్రాలైన ఏపీ, తెలంగాణల అభిప్రాయం తీసుకోకుండానే గతేడాది డిసెంబర్ 24న అప్పర్ భద్రకు హైడ్రలాజికల్ క్లియరెన్స్ ఇచ్చేసింది. ఈ అనుమతులను చూపిస్తూ కర్ణాటక సర్కారు అప్పర్ భద్రకు రూ.16,125.48 కోట్ల (2018–19 ధరల ప్రకారం)తో పెట్టుబడి అనుమతి ఇవ్వాలని గత మార్చి 25న కేంద్ర జల్ శక్తి శాఖకు ప్రతిపాదన పెట్టింది. దీనికి కేంద్ర జల్ శక్తి శాఖ ఆమోదించింది. ఈ అనుమతుల ఆధారంగా.. ఈ ప్రాజెక్టుకు జాతీయ హోదా కల్పించి.. 90 శాతం నిధులు (రూ.14,512.94 కోట్లు) ఇవ్వాలని కేంద్రానికి ప్రతిపాదించింది. ఈ ప్రతిపాదనపై కేంద్రానికి ఇప్పటికే అభ్యంతరం వ్యక్తం చేసిన రాష్ట్ర ప్రభుత్వం.. ఆ ప్రాజెక్టుకు నీటి కేటాయింపులు లేకపోవడాన్ని ఎత్తిచూపింది. మూడు రాష్ట్రాలకూ నష్టమే తుంగభద్ర డ్యామ్‌కు 230 టీఎంసీలను కేడబ్ల్యూడీటీ–1 కేటాయించింది. కానీ 1976–77 నుంచి 2007–08 వరకూ ఏనాడూ 186.012 టీఎంసీలకు మించి ప్రవాహాలు రాలేదు. దాంతో దామాషా పద్ధతిలో కర్ణాటక, ఏపీ, తెలంగాణలకు తుంగభద్ర బోర్డు నీటి కేటాయింపులు చేస్తోంది. అప్పర్ భద్ర పూర్తయితే తుంగభద్ర డ్యామ్‌కు వచ్చే ప్రవాహాలు మరింత తగ్గుతాయి. ఇది తుంగభద్ర డ్యామ్తోపాటూ కేసీ కెనాల్, ఆర్డీఎస్(రాజోలిబండ డైవర్షన్ స్కీం) ఆయకట్టుపై తీవ్ర ప్రభావం చూపుతుంది. దేశంలో అత్యల్ప వర్షపాతం నమోదయ్యే హగరి (వేదవతి)పై కర్ణాటకలోని వాణివిలాసాగర్, ఏపీలోని బీటీపీ (భైరవానితిప్ప ప్రాజెక్టు) మధ్యలో ఎలాంటి ప్రాజెక్టు నిర్మించకూడదని కేడబ్ల్యూడీటీ–1 స్పష్టంగా చెప్పింది. కానీ.. ఇప్పుడు అప్పర్ భద్రలో అంతర్భాగంగా ఆ రెండు జలాశయాల మధ్య వేదవతిపై మరో జలాశయం నిర్మిస్తే బీటీపీ ఆయకట్టు ఎడారిగా మారుతుంది. ఈ అంశాలన్నింటినీ విపులీకరిస్తూ రాష్ట్ర ప్రభుత్వం కేంద్రానికి లేఖ రాసింది. రాష్ట్ర ప్రయోజనాలను దెబ్బతీసే అప్పర్ భద్రకు ఇచ్చిన అనుమతులను పునఃసమీక్షించాలని డిమాండ్ చేసింది. -
నీళ్లు లేని ప్రాజెక్టుకు జాతీయ హోదానా?
సాక్షి, అమరావతి: అప్పర్ భద్ర ప్రాజెక్టుకు జాతీయ హోదా కల్పించాలని కర్ణాటక సర్కార్ చేసిన ప్రతిపాదనపై ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసింది. నీటి కేటాయింపులు లేని ప్రాజెక్టుకు జాతీయ హోదా ఎలా ప్రతిపాదిస్తారని ప్రశ్నించింది. బ్రిజేష్ కుమార్ ట్రిబ్యునల్ తీర్పు అమలులోకి రాకముందే ఈ ప్రాజెక్టుకు సీడబ్ల్యూసీ అనుమతివ్వడాన్ని ఆక్షేపించింది. దీన్ని తక్షణం రద్దు చేయాలని పట్టుబట్టింది. దీంతో రెండు రాష్ట్రాలతో చర్చించాకే అప్పర్ భద్రకు జాతీయ హోదా కల్పనపై తుది నిర్ణయం తీసుకుంటామని కేంద్ర జల్‌శక్తి శాఖ కార్యదర్శి పంకజ్‌కుమార్ స్పష్టం చేశారు. దేశంలో 16 జాతీయ ప్రాజెక్టుల పురోగతిని సమీక్షించేందుకు పంకజ్‌కుమార్ అధ్యక్షతన హైపవర్ కమిటీ సోమవారం వర్చువల్ విధానంలో సమావేశమైంది. రాష్ట్ర జలవనరుల శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి కేఎస్ జవహర్‌రెడ్డి, ఈఎన్సీ సి.నారాయణరెడ్డి ఇందులో పాల్గొన్నారు. అప్పర్ భద్ర నుంచి 29.90 టీఎంసీలను తరలించి దుర్భిక్ష ప్రాంతాల్లో 6.25 లక్షల ఎకరాలకు నీళ్లందించేలా ప్రాజెక్టు చేపట్టామని కర్ణాటక జలవనరులశాఖ అధికారులు తెలిపారు. ఈ ప్రాజెక్టుకు జాతీయ హోదా కల్పించి అంచనా వ్యయంలో 90 శాతం నిధులివ్వాలని కేంద్రాన్ని కోరారు. చదవండి: ఏపీలో అపర్ణ రూ.100 కోట్ల పెట్టుబడి దీనిపై ఏపీ జలవనరుల శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి కేఎస్ జవహర్‌రెడ్డి తీవ్ర అభ్యంతరం తెలిపారు. అప్పర్ భద్రకు నీటి కేటాయింపులే లేవని స్పష్టం చేశారు. బ్రిజేష్ కుమార్ ట్రిబ్యునల్ కేవలం 9 టీఎంసీలే కేటాయించిందని, ఆ తీర్పు ఇప్పటివరకు అమలులోకి రాలేదని గుర్తు చేశారు. అప్పర్ భద్ర వల్ల కృష్ణా బేసిన్లో దిగువ రాష్ట్రమైన ఏపీ తీవ్ర ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుందని ఆందోళన వ్యక్తం చేశారు. తక్షణమే డిజైన్లు ఆమోదించాలి.. పోలవరం పనుల పురోగతిని హైపవర్ కమిటీకి అధికారులు వివరించారు. పెండింగ్ డిజైన్లను తక్షణమే ఆమోదించేలా డీడీఆర్పీ(డ్యాం డిజైన్ రివ్యూ ప్యానల్), సీడబ్ల్యూసీని ఆదేశించాలని కోరగా కేంద్ర జలశక్తిశాఖ కార్యదర్శి పంకజ్‌కుమార్ సానుకూలంగా స్పందించారు. ఎప్పటికప్పుడు నిధుల రీయింబర్స్మెంట్ ద్వారా పనులను మరింత వేగంగా చేయడానికి ఆస్కారం ఉంటుందన్న రాష్ట్ర అధికారుల అభిప్రాయంతో కేంద్ర జలశక్తి శాఖ కార్యదర్శి ఏకీభవించారు. విభాగాల వారిగా పరిమితులు విధించకుండా అంచనా వ్యయాన్ని గంపగుత్తగా భావించి నిధులు విడుదల చేయాలని జలవనరులశాఖ అధికారులు కోరారు. డిస్ట్రిబ్యూటరీ పనులకు సంబంధించిన సర్వే పూర్తయిందని త్వరలోనే టెండర్లు పిలుస్తామని తెలిపారు. -
ప్రాజెక్టుల నిర్వహణ పనులా.. మాకొద్దు!
సాక్షి, హైదరాబాద్: సాగునీటి ప్రాజెక్టుల నిర్వహణ పనులంటేనే కాంట్రాక్టర్లు బెంబేలెత్తుతున్నారు. ఎందుకంటే.. చేసిన పనులకు బిల్లులు రావనే భయం వారిని వెంటాడుతోంది. రాష్ట్రంలోని ప్రధాన ప్రాజెక్టుల పరిధిలో ఇకపై ఆపరేషన్ అండ్ మెయింటెనెన్స్ (ఓ అండ్ ఎం)కే అధిక ప్రాధాన్యం ఇస్తామని ప్రభుత్వం ప్రకటించినప్పటికీ కాంట్రాక్ట్ ఏజెన్సీలు నమ్మడంలేదు. చాలాఏళ్ల కిందట చేసిన పనులకే ఇంతవరకు బిల్లులు చెల్లించలేదు. పైగా, ఏడాది బడ్జెట్లో నిధులు కేటాయించినా ఒక్క రూపాయి కూడా ఇవ్వలేదు. అధికారమున్నా నిధులు సున్నా రాష్ట్రంలోని ప్రధాన డ్యామ్‌లు, రిజర్వాయర్ల పరిధిలో గేట్లు, జనరేటర్లు, రోప్‌వైర్లు, మరమ్మతులు, లీకేజీలు, కలుపుమొక్కల తొలగింపు, పెయింటింగ్, గ్రీజింగ్, గ్యాంట్రిక్ క్రేన్లు, ఎలక్ట్రీషియన్, డిస్ట్రిబ్యూటరీల నిర్వహణ వంటివన్నీ ఓ అండ్ ఎంలో భాగంగా చేపట్టాలి. వీటి నిర్వహణకు ఏటా రూ.280 కోట్లు కేటాయించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ నిధులను గ్రీన్‌చానల్‌లో విడుదల చేస్తామని కూడా గతంలో హామీ ఇచ్చింది. అత్యవసర పనులకు వ్యక్తిగత స్థాయిలోనే నిధులు విడుదల చేసే అధికారాన్ని ఈఎన్సీ మొదలు ఈఈల వరకు కట్టబెట్టింది. కోటి వరకు ఈఎన్సీ (జనరల్), రూ.50 లక్షల వరకు సీఈ, రూ.25 లక్షల దాకా ఎస్ఈలకు, రూ.5 లక్షల వరకు ఈఈలకు పరిపాలనా అనుమతులు ఇచ్చే అధికారాన్ని కట్టబెట్టింది. అయితే ఇంతవరకు ఒక్క రూపాయి విడుదలైన దాఖలాలు కూడా లేవు. ఇప్పటికే నాగార్జునసాగర్, జూరాల, ఎస్సారెస్పీ ప్రాజెక్టుల పరిధిలో ఓ అండ్ ఎంకు సంబంధించిన బిల్లులు రూ.20 కోట్ల మేర పెండింగ్‌లో ఉన్నాయి. ఈ ఏడాది సైతం... ఈ ఏడాది 19 డివిజన్ల పరిధిలో 613 రకాల ఓ అండ్ ఎం పనులను రూ.65 కోట్లతో చేపట్టాలనే ప్రతిపాదనలు వచ్చాయి. అయితే చాలాచోట్ల ఇంజనీర్లు టెండర్లు పిలుస్తున్నా స్పందన రావడం లేదు. నాగార్జునసాగర్ పరిధిలో రూ.35 లక్షల సివిల్ పనులకు రెండుసార్లు టెండర్లు పిలిచినా ఎవరూ ముందుకు రాకపోవడంతో మూడోసారి టెండర్ పిలిచారు. ఎస్సారెస్పీ పరిధిలో మరమ్మతులు, మట్టి పనులకు రూ.50 లక్షలతో రెండుసార్లు టెండర్లు పిలిచినా కాంట్రాక్టర్లలో ఉలుకూపలుకూలేదు. ఇక జూరాల పరిధిలో మెకానికల్ పనులు, హెడ్‌రెగ్యులేటర్, షట్టర్ల పనులకు రూ.25–30 లక్షలతో మూడుసార్లు టెండర్లు పిలిచినా స్పందన కరువైంది. సూర్యాపేట జిల్లాలో ఎస్సారెస్పీ స్టేజ్–2 పనులకూ ఇదే పరిస్థితి నెలకొంది. మరోవైపు జీవో 20 కింద పంప్‌హౌస్‌ల నిర్వహణ నిమిత్తం రూ.100 కోట్ల పనులకు టెండర్లు పిలిచారు. వీటికి సంబంధించి ఏజెన్సీలు టెండర్లు దాఖలు చేసినా, నిధుల విడుదల ఉంటుందా.. ఉండదా.. అనే సంశయం మాత్రం వారిని వెంటాడుతోందని ఇరిగేషన్ వర్గాలే అంటున్నాయి. -
గోదావరి జలాలతో సస్యశ్యామలం
సాక్షి ప్రతినిధి, వరంగల్: గోదావరి జలాలను పూర్తిస్థాయిలో వినియోగించుకోవడం ద్వారా ఆయకట్టు భూములను సస్యశ్యామలం చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం కృషి చేస్తోందని రాష్ట్ర మంత్రులు ఎర్రబెల్లి దయాకర్‌రావు, సత్యవతి రాథోడ్ తెలిపారు. ఉమ్మడి వరంగల్ జిల్లాలో ప్రాజెక్టుల కోసం భూసేకరణ, పెండింగ్ ప్రాజెక్టుల పూర్తిపై ఆదివారం హన్మకొండ కలెక్టరేట్ సమావేశ మందిరంలో అధికారులతో సమీక్ష నిర్వహించారు. మంత్రులతో పాటు సీఎంఓ కార్యదర్శి స్మితా సబర్వాల్, ఈఎన్సీ మురళీధర్‌రావు, ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్‌రెడ్డి, మాజీ డిప్యూటీ సీఎం కడియం శ్రీహరి, రాజ్యసభ సభ్యులు బండా ప్రకాష్, మహబూబాబాద్ ఎంపీ మాలోత్ కవిత, ఎమ్మెల్యేలు డాక్టర్ టి.రాజయ్య, ముత్తిరెడ్డి యాదగిరి రెడ్డి, చల్లా ధర్మారెడ్డి, పెద్ది సుదర్శన్‌రెడ్డి ఇందులో పాల్గొన్నారు. మంత్రులు మాట్లాడుతూ 5.18 టీఎంసీల సామర్థ్యంతో 1,22,700 ఎకరాల ఆయకట్టుకు సాగునీరు అందించేందుకు దేవాదుల ప్రాజెక్టుకు రూపకల్పన చేయగా.. ఆ మేరకు పూర్తి చేయకుండా నాటి పాలకులు నిర్లక్ష్యం వహించారని విమర్శించారు. సీఎం కేసీఆర్ ప్రత్యేక శ్రద్ధతో దేవాదుల ప్రాజెక్టును పూర్తిస్థాయిలో వినియోగంలోకి తీసుకురావడానికి అహర్నిశలు కృషి చేస్తున్నారని తెలిపారు. జనగామ జిల్లా ప్రాజెక్టులకు అవసరమైన భూసేకరణను పూర్తి చేయాలని సూచించారు. ఎత్తైన ప్రదేశంలో ఉన్న వేలేరుకు అవసరమైన ప్రతిపాదనలు సిద్ధం చేయాలని, పాలకుర్తి, ఘన్‌పూర్‌లో ఆగిన 6వ ప్యాకేజీ పనులు ప్రారంభించాలని చెప్పారు. మధ్యలోనే వెళ్లిపోయిన ముత్తిరెడ్డి దేవాదులపై సమీక్ష సందర్భంగా మంత్రి ఎర్రబెల్లి, జనగామ ఎమ్మెల్యే ముత్తిరెడ్డి మధ్య వాగ్వాదం జరిగింది. చెరువులకు నీటి విడుదల సంబంధిత సమస్యలను స్మితా సబర్వాల్‌కు ముత్తిరెడ్డి వివరిస్తూ అధికారుల తీరుపై విమర్శలు చేశారు. దీంతో మంత్రి ఎర్రబెల్లి ఆయన్ను వారించారు. ఇందుకు నిరసనగా ఎమ్మెల్యే సమావేశం నుంచి వాకౌట్ చేశారు. -
నిధులపై నీళ్లు.. సాగునీటి ప్రాజెక్టులపై గెజిట్ దెబ్బ
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో చేపట్టిన సాగునీటి ప్రాజెక్టుల నిర్మాణాలకు నిధుల కొరత వెంటాడుతోంది. ఇప్పటికే అనేక ప్రాజెక్టుల పరిధిలో భారీగా బకాయిలు పేరుకుపోగా.. కృష్ణా, గోదా వరి బోర్డులపై కేంద్రం తీసుకొచ్చిన గెజిట్‌తో కొత్త చిక్కులు వచ్చి పడుతున్నాయి. అనుమతుల్లేవని చెబుతున్న ప్రాజెక్టులకు రుణాల విడుదలలో రుణ సంస్థలు ఆచితూచి వ్యవహరిస్తున్నాయి. ఇప్పటికే కొన్ని సంస్థలు నిధుల విడుదలను నిలిపివేయడంతో, ప్రాజెక్టుల పూర్తికి ప్రభుత్వం పెట్టుకున్న లక్ష్యాలు నిర్ణీత గడువులోగా చేరుకునే పరిస్థితి లేకుండా పోతోంది. పేరుకుపోయిన బకాయిలు రాష్ట్రంలోని ప్రధాన ప్రాజెక్టుల పరిధిలో గతంలో ఎన్నడూ లేనంతగా బకాయిలు పేరుకుపోయాయి. కరోనా ప్రభావంతో రాష్ట్ర ఆదాయానికి గండి పడటం, మరోవైపు ఇతర ప్రాధాన్యత రంగాలకు నిధుల వెచ్చింపు పెరగడంతో ప్రాజెక్టులకు రాష్ట్ర నిధుల నుంచి కేటాయింపులు తగ్గాయి. కొత్త ఆర్థిక ఏడాదిలో ఏప్రిల్ నుంచి ఇప్పటివరకు ప్రాజెక్టులపై రూ.4,925 కోట్లు వెచ్చించగా, ఇందులో రాష్ట్ర నిధుల నుంచి ఇచ్చింది కేవలం రూ.1,887 కోట్లు మాత్రమే. ఇక రుణాల రూపేణా వచ్చిన సొమ్ముతో మరో రూ.3,038 కోట్లు మేర ఖర్చు చేశారు. అయినప్పటికీ ఇంకా రూ.11,396 కోట్ల మేర బకాయిలు చెల్లించాల్సి ఉంది. ఇందులో నిర్మాణ పనులు (వర్క్స్)కు సంబంధించిన బిల్లులే రూ.5,710 కోట్ల మేర పెండింగ్‌లో ఉన్నాయి. పనులకు సంబంధించిన బకాయిల్లో కాళేశ్వరం పరిధిలోనే రూ.1,200 కోట్ల మేర చెల్లించాల్సి ఉండగా, మల్లన్నసాగర్ రిజర్వాయర్ పరిధిలోనివి రూ.300–400 కోట్ల వరకు ఉన్నట్లు చెబుతున్నారు. ఈ రిజర్వాయర్ పనులు ఇప్పటికే పూర్తి కావాల్సి ఉన్నా, చివరి దశలో ఉన్న పనులకు నిధుల కొరత కారణంగా కనీసం డీజిల్ ఖర్చులకు సైతం ఇక్కట్లు తప్పట్లేదు. పాలమూరు–రంగారెడ్డి పరిధిలో మరో రూ.2 వేల కోట్ల వరకు బకాయిలు ఉన్నట్లు నీటి పారుదల శాఖ వర్గాలు చెబుతున్నాయి. జూలై తొలివారం వరకు వచ్చిన నిధులు ప్రాజెక్టులకు నిధుల కొరత రావద్దనే ఉద్దేశంతోనే కాళేశ్వరం కార్పొరేషన్, తెలంగాణ వాటర్ రిసోర్స్ డెవలప్మెంట్ కార్పొరేషన్‌ను ప్రభుత్వం ఏర్పాటు చేసింది. ఈ కార్పొరేషన్లకు ప్రైవేటు బ్యాంకులతో పాటు పవర్ ఫైనాన్స్ కార్పొరేషన్, రూరల్ ఎలక్ట్రిసిటీ కార్పొరేషన్, నాబార్డ్ వంటి సంస్థలు రుణాలిస్తున్నాయి. ఈ ఆర్థిక ఏడాది జూలై తొలివారం వరకు కాళేశ్వరానికి రూ.1,624 కోట్లు, పాలమూరు–రంగారెడ్డికి రూ.1,039 కోట్లు, కంతనపల్లికి రూ.40 కోట్లు, దేవాదులకు రూ.127 కోట్లు, సీతారామకు రూ.136 కోట్లు మేర రుణాలు విడుదలయ్యాయి. అయినప్పటికీ కాళేశ్వరం, పాలమూరుతో పాటు సీతారామలో పనులకు సంబంధించి రూ.563 కోట్లు, దేవాదులలో రూ.10 కోట్లు బకాయిలున్నాయి. మున్ముందు పనులకు రూ.2 వేల కోట్ల మేర నిధుల అవసరాలున్నాయి. గెజిట్‌తో రుణ సంస్థల వెనుకంజ ప్రస్తుతం కేంద్రం వెలువరించిన గెజిట్ నోటిఫికేషన్ల కారణంగా రుణ సంస్థలు రుణాల విడుదలపై సందిగ్ధంలో పడ్డాయి. అనుమతుల్లేని ప్రాజెక్టులు, వాటికి అనుమతుల విషయమై గెజిట్‌లో కేంద్రం పలు సూచనలు చేసిన నేపథ్యంలో రుణాల విడుదలపై సంస్థలు వెనుకంజ వేస్తున్నాయి. ముఖ్యంగా కాళేశ్వరం అదనపు టీఎంసీ, పాలమూరు–రంగారెడ్డి, సీతారామ, దేవాదుల, సీతమ్మసాగర్ బ్యారేజీ వంటి ప్రాజెక్టులకు కేంద్ర సంస్థల నుంచి అనుమతి తీసుకోవాలని గెజట్లో పేర్కొన్న నేపథ్యంలో రుణ సంస్థలు ఈ అంశాలపై రాష్ట్రానికి ప్రశ్నలు సంధిస్తున్నాయి. ప్రాజెక్టులకు ఆమోదం ఎప్పటిలోగా తీసుకుంటారు, ఒకవేళ అనుమతులు రాకుంటే పరిస్థితి ఏంటీ, రుణాల చెల్లింపు విషయంలో ప్రభుత్వ విధానం ఏంటని ఆరా తీస్తున్నాయి. ఈ నేపథ్యంలోనే గెజిట్ వెలువడిన నాటి నుంచి కార్పొరేషన్లకు రుణ సంస్థలు ఒక్క రూపాయి కూడా ఇవ్వలేదు. ప్రస్తుతం కాళేశ్వరం ప్రాజెక్టుకు నాబార్డ్ నుంచి రూ.400 కోట్ల మేర రావాల్సి ఉన్నా.. ప్రస్తుత పరిస్థితులతో వాటిని వాయిదా వేస్తోంది. ప్రధాన ప్రాజెక్టులన్నింటికీ రుణాలే కీలకం కాగా, ప్రస్తుత పరిస్థితుల్లో ఎంత మేర రుణాలు లభిస్తాయన్నది ప్రశ్నార్ధకంగా మారింది. -
‘సీతమ్మ’కు రూ.3,426 కోట్ల రుణం
సాక్షి, హైదరాబాద్: గోదావరి నదిపై దుమ్ముగూడెం ఆనకట్టకు దిగువన నిర్మించనున్న సీతమ్మసాగర్ బహుళార్థ సాధక ప్రాజెక్టు నిర్మాణానికి రూ.3,426.25 కోట్ల రుణం తీసుకునేందుకు తెలంగాణ ప్రభుత్వం అనుమతినిచ్చింది. రాష్ట్ర జలవనరుల మౌలిక వసతుల అభివృద్ధి సంస్థకు పవర్ ఫైనాన్స్ కార్పొరేషన్ నుంచి ఈ రుణాలు తీసుకునేలా ఆమోదించింది. గతంలోనే ఈ ప్రాజెక్టు రుణాలకు ఓకే చెప్పిన ప్రభుత్వం.. తాజాగా సవరణ ఉత్తర్వులు జారీచేసింది. 37 టీఎంసీల నిల్వ, 320 మెగావాట్ల విద్యుదుత్పత్తి సామర్థ్యం లక్ష్యంగా చేపట్టిన ఈ ప్రాజెక్టుకు రూ.3,481 కోట్లతో గతేడాది పరిపాలనా అనుమతులిచ్చింది. ఈ ప్రాజెక్టు టెండర్లను ఎల్అండ్టీ సంస్థ దక్కించుకోగా పనులు ఇప్పుడిప్పుడే మొదలు పెడుతున్నారు. అయితే, ఈ ప్రాజెక్టుకు కేంద్ర జలసంఘం నుంచి ఎలాంటి అనుమతులు అవసరమున్నా.. తీసుకోవాలని.. ఒకవేళ అనుమతిలేని కారణంగా పనులు నిలిపివేస్తే.. రుణాన్ని బేషరతుగా వెన క్కి తీసుకుంటామని పీఎఫ్సీ తన పేర్కొంది. ఇటీవల కేంద్రం విడుదల చేసిన గెజిట్‌లో సీతమ్మసాగర్‌ను అనుమతి లేని ప్రాజెక్టుగా తెలిపింది. ఆరు నెలల్లోగా అనుమతులు తీసుకోవాలని అందులో స్పష్టం చేసింది. ఈ నేపథ్యంలో పీఎఫ్సీ ఈ నిబంధనలను పెట్టింది. -
ఫలాలకు దీటుగా పునరావాసం
సాక్షి, అమరావతి: సాగునీటి ప్రాజెక్టుల ద్వారా ప్రయోజనం పొందే ఆయకట్టు రైతులకు దీటుగా త్యాగం చేస్తున్న నిర్వాసితుల జీవన ప్రమాణాలు పెంపొందించేలా ప్రభుత్వం పునరావాసం కల్పిస్తోంది. భూసేకరణ చట్టం– 2013 ప్రకారం పరిహారం చెల్లించడంతోపాటు కాలనీల్లో నిర్మించిన ఇళ్లల్లో పునరావాసం కల్పిస్తోంది. రక్షిత మంచినీరు, రహదారి, మురుగునీటి కాలువలు, విద్యుత్ సరఫరాను పూర్తి స్థాయిలో కల్పిస్తోంది. నిర్వాసితులకు చేతివృత్తులతోపాటు నైపుణ్యాలను అభివృద్ధి చేసేలా శిక్షణ ఇస్తూ.. ఉపాధి కల్పిస్తోంది. గతేడాది గండికోట, చిత్రావతి జలాశయాల్లో ముంపునకు గురైన గ్రామాల్లో 19,688 కుటుంబాలకు రూ.1166.57 కోట్లు ఖర్చు చేసి పునరావాసం కల్పించింది. దేశంలో ఒక ఏడాది ఇంత భారీ ఎత్తున నిర్వాసితులకు పునరావాసం కల్పించడం ఇదే తొలిసారి. ఈ ఏడాది పోలవరం, వెలిగొండలో 22,070 నిర్వాసిత కుటుంబాల పునరావాసానికి రూ.5,452.52 కోట్లు ఖర్చు చేస్తున్నారు. ప్రభుత్వం నిర్వాసితులకు పూర్తి స్థాయిలో పునరావాసం కల్పించడం ద్వారా పులిచింతల, సోమశిల, గండికోట, చిత్రావతి, వామికొండసాగర్, సర్వారాయసాగర్, పైడిపాళెం రిజర్వాయర్ల చరిత్రలో తొలిసారిగా పూర్తి సామర్థ్యం మేరకు నీటిని నిల్వ చేసింది. పోలవరంలో శరవేగంగా.. వెలిగొండను ఈ ఏడాదే పూర్తి చేసేలా చర్యలు చేపట్టిన ప్రభుత్వం పోలవరాన్ని 2022 నాటికి పూర్తి చేసే దిశగా పనులను వేగవంతం చేసింది. 194.6 టీఎంసీల సామర్థ్యంతో నిర్మిస్తున్న పోలవరం ప్రాజెక్టుతో ఉభయ గోదావరి జిల్లాల్లో 373 గ్రామాలు ముంపునకు గురవుతాయి. ఈ గ్రామాల్లో 1,05,601 నిర్వాసిత కుటుంబాలకు పునరావాసం కల్పనకు ఓ.ఆనంద్‌ను ప్రభుత్వం అడ్మినిస్ట్రేటర్‌గా నియమించింది. సీడబ్ల్యూసీ మార్గదర్శకాల ప్రకారం ఈ ఏడాది 41.15 కాంటూర్ మీటర్ల పరిధిలోని 20,870 కుటుంబాలకు పునరావాసం కల్పించాలి. ఇప్పటికే 3,417 కుటుంబాలకు పునరావాసం కల్పించారు. మిగిలిన 17,453 కుటుంబాలకు పునరావాసం కల్పించడానికి రూ.3,942.97 కోట్లను ప్రభుత్వం ఖర్చు చేస్తోంది. పునరావాసం కల్పించడం కోసం 73 కాలనీలను నిర్మిస్తోంది. 27 కాలనీల నిర్మాణాన్ని పూర్తి చేసింది. పూర్తి స్థాయి నీటి మట్టం అంటే 45.72 మీటర్ల కాంటూర్ పరిధిలోని 84,731 కుటుంబాలకు పునరావాసం కల్పించడానికి రూ.25,539.18 కోట్లు అవసరం. ఈ కుటుంబాలకు పునరావాసం కల్పించడానికి 140 కాలనీలను నిర్మించనుంది. వెలిగొండలో వేగవంతం.. వెలిగొండలో అంతర్భాగంగా 53 టీఎంసీల సామర్థ్యంతో నిర్మిస్తున్న నల్లమలసాగర్ జలాశయంతో ప్రకాశం జిల్లాలో 11 గ్రామాలు ముంపునకు గురవుతాయి. 4,617 నిర్వాసిత కుటుంబాలు, 18 ఏళ్లు నిండిన 2,938 మంది యువతకు ఏకకాల పరిష్కారం కోసం రూ.1510.05 కోట్లు అవసరం. ఇప్పటికే రూ.1411.56 కోట్లను మంజూరు చేశారు. ఏడు పునరావాస కాలనీల్లో ఇళ్లను నిర్మిస్తున్నారు. -
రాయలసీమ ప్రాజెక్టుల ఎస్పీవీకి గ్రీన్‌సిగ్నల్
సాక్షి, అమరావతి: రాయలసీమ కరువు నివారణ ప్రణాళిక అమలుకు రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన ఏపీఆర్‌ఎస్‌డీఎంపీసీఎల్ (ఆంధ్రప్రదేశ్ రాయలసీమ కరువు నివారణ ప్రాజెక్టుల అభివృద్ధి సంస్థ)కు కేంద్ర కార్పొరేట్ వ్యవహారాల మంత్రిత్వ శాఖ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. వంద శాతం రాష్ట్ర ప్రభుత్వ రంగ సంస్థ అయిన ఈ సంస్థ రిజిస్ట్రేషన్ (రిజిస్ట్రేషన్ నంబర్ 116293)పై ఆమోదముద్ర వేసింది. దీంతో సంస్థ మొదటి బోర్డు సమావేశాన్ని నిర్వహించడానికి ఆ సంస్థ చైర్మన్, మేనేజింగ్ డైరెక్టర్ అయిన జలవనరుల శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఆదిత్యనాథ్ దాస్ కసరత్తు చేస్తున్నారు. బోర్డు సమావేశంలో తీసుకున్న నిర్ణయాల ఆధారంగా బ్యాంకులో ఆ సంస్థ పేరుతో ఖాతాను ప్రారంభిస్తారు. రాష్ట్ర ప్రభుత్వ వాటాగా తొలి విడతగా రూ.ఐదు కోట్లను అందులో జమ చేస్తారు. ఆ తర్వాత అంతర్జాతీయ, జాతీయ ఆర్ధిక సంస్థలతో సంప్రదింపులు జరిపి.. తక్కువ వడ్డీకే రుణాలు తెచ్చి, వాటికి బడ్జెట్ ద్వారా కేటాయించే నిధులను జత చేసి రాయలసీమ కరువు నివారణ ప్రాజెక్టులను పూర్తి చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. రుణాలకు ఆర్ధిక సంస్థలు రెడీ ప్రాజెక్టులకు అవసరమైన నిధుల్లో 30 శాతాన్ని అంటే రూ.11,994 కోట్లను ప్రభుత్వం తన వాటాగా సమకూర్చుతుంది. మిగిలిన 70 శాతం అంటే రూ.27,986 కోట్లను జాతీయ, అంతర్జాతీయ ఆర్ధిక సంస్థల నుంచి తక్కువ వడ్డీకే రుణాల రూపంలో సమకూర్చుకోనున్నారు. ఆ మేరకు సంప్రదింపుల నేపథ్యంలో.. రుణాలు ఇచ్చేందుకు పలు సంస్థలు ప్రాథమికంగా అంగీకారం తెలిపాయి. రూ.39,980 కోట్ల వ్యయంతో 27 ప్రాజెక్టులు కృష్ణా నదికి వరద వచ్చే 30 నుంచి 40 రోజుల్లోనే రాయలసీమ, నెల్లూరు జిల్లాల్లో సాగునీటి ప్రాజెక్టులను నింపేలా కాలువల వ్యవస్థను అభివృద్ధి చేయడం, అవసరమైన కొత్త ప్రాజెక్టులు చేపట్టడం ద్వారా వరద జలాలను మళ్లించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ ప్రణాళిక కింద రూ.39,980 కోట్ల వ్యయంతో 27 ప్రాజెక్టులను చేపట్టడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఇందులో ఇప్పటికే మూడు ప్యాకేజీల పనులకు టెండర్ల ప్రక్రియను పూర్తి చేశారు. ఈ ప్రాజెక్టులను శరవేగంగా పూర్తి చేసేందుకు స్పెషల్ పర్పస్ వెహికల్ (ఎస్పీవీ)ను ఏర్పాటు చేయాలని జలవనరుల శాఖ అధికారులను సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆదేశించారు. ఆ మేరకు ఏపీఆర్‌ఎస్‌డీఎంపీసీఎల్ ఏర్పాటయ్యింది. -
ఈ శాఖలన్ని ఒకే గూటికి
సాక్షి, ఖమ్మం: నీటిపారుదల శాఖల పునర్వ్యవస్థీకరణ శరవేగంగా సాగుతోంది. రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు ఇప్పటివరకు జిల్లాలో ఉన్న నీటిపారుదల శాఖలైన ఎన్నెస్పీ, ఇరిగేషన్, మేజర్ ఇరిగేషన్, ఐడీసీ, దుమ్ముగూడెం ప్రాజెక్టు ఇంజనీరింగ్ విభాగాలను ఒకే గొడుగు కిందకు తీసుకొచ్చి జలవనరుల శాఖగా మార్చేందుకు నిర్ణయించారు. అందుకు అనుగుణంగా ఉమ్మడి జిల్లాలోని వనరులు, ఆయకట్టు, నియోజకవర్గాల పరిధిని పరిగణనలోకి తీసుకొని పలు నిర్ణయాలు తీసుకోనున్నారు. రీ ఆర్గనైజేషన్ కమిటీ పర్యవేక్షణలో ఈ ప్రక్రియ కొనసాగుతోంది. ఇప్పటికే ఆయకట్టు, ప్రస్తుతం ఉన్న పోస్టులు, ఇంజనీరింగ్ విభాగాలకు సంబంధించి సమగ్ర సమాచారం తెప్పించుకొని దాని ఆధారంగా రీ ఆర్గనైజేషన్‌లో తీసుకున్న నియమ నిబంధనల ప్రకారంఅమలు చేసేందుకు చర్యలు చేపట్టినట్లు తెలిసింది. వచ్చే నెలలో ప్రారంభమయ్యే అసెంబ్లీ సమావేశాల నాటికి ఈ ప్రక్రియ అంతా పూర్తి చేసి ఆమోదం పొందే విధంగా పనులు సాగిస్తున్నట్లు సమాచారం. ఉమ్మడి ఖమ్మం జిల్లా పరిధిలో సాగులో ఉన్న ఆయకట్టు, ప్రతి నియోజకవర్గాన్ని హద్దుగా పరిగణనలోకి తీసుకుంటారు. ఒక్కో ఈఈ పరిధిలో సుమారు లక్ష ఎకరాల ఆయకట్టును స్థిరీకరించి దాని పరిధిలో 25వేల ఎకరాల వరకు ఒక డీఈ స్థాయి అధికారిని నియమించే విధంగా రూపకల్పన చేశారు. శాఖలన్నింటినీ ఏకం చేసిన తర్వాత ఇంజనీర్లను కేటాయిస్తారు. ఎన్నెస్పీ, ఇరిగేషన్, లిఫ్ట్ ఇరిగేషన్, దుమ్ముగూడెం, సీతారామ ప్రాజెక్టు, మధ్యతరహా ప్రాజెక్టుల పరిధిలో ఆయకట్టుకు నీటి పర్యవేక్షణ వారే చేపట్టాల్సి ఉంటుంది. తొలుత ఉమ్మడి జిల్లాలో ఖమ్మం కేంద్రంగా ఒక సీఈ, ఖమ్మం, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాల్లో ఎస్ఈలు, ఈఈ, డీఈలు, ఏఈలను కేటాయించే విధంగా ప్రతిపాదించినట్లు సమాచారం. తాజాగా రెండు సీఈ పోస్టులను ఏర్పాటు చేసే విధంగా కసరత్తు చేస్తున్నట్లు తెలిసింది. ఖమ్మం జిల్లా పరిధికి ఒక సీఈ, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పరిధికి ఒక సీఈని కేటాయించే అవకాశం ఉంది. ఉమ్మడి జిల్లావ్యాప్తంగా సుమారు 10లక్షల ఎకరాలకుపైగా ఆయకట్టు ఉంది. అనధికారికంగా మరికొంత ఉంది. ఆ ప్రకారం ఇంజనీర్ పోస్టులను కేటాయించే విధంగా కసరత్తు సాగుతోంది. గతంలో ఉన్న పోస్టులు ఇలా.. ఇప్పటివరకు ఉమ్మడి జిల్లావ్యాప్తంగా వివిధ ఇరిగేషన్ శాఖల పరిధిలో ఒక సీఈ, మూడు ఎస్ఈ, 12 మంది ఈఈలు కొనసాగుతున్నారు. ఇరిగేషన్ శాఖలో దుమ్ముగూడెం ప్రాజెక్టుకు ఒక సీఈ, ఇద్దరు ఎస్ఈ, ఎన్నెస్పీలో ఒక ఎస్ఈ, ముగ్గురు ఈఈలు, ఐడీసీలో ఒక ఈఈ, మిగిలిన ఈఈలు దుమ్ముగూడెం, మైనర్ ఇరిగేషన్ పరిధిలో 8 మంది కొనసాగుతున్నారు. ఒకే పరిధిలోకి వస్తే.. ఇరిగేషన్‌లోని అన్ని శాఖలు ఒకే పరిధిలోకి వస్తే ఉమ్మడి జిల్లాలోని 10 నియోజకవర్గాల్లో పోస్టులను కేటాయిస్తారు. రెండు సీఈ, నాలుగు ఎస్ఈ, లక్ష ఎకరాల ఆయకట్టుకు, నియోజకవర్గ పరిధికి ఒక ఈఈ, 25వేల ఎకరాల ఆయకట్టుకు ఒక డీఈని కేటాయించే అవకాశం ఉంది. -
రాయలసీమ ఎత్తిపోతల పాతదే: సీఎం జగన్
సాక్షి, అమరావతి: కేంద్ర జలశక్తి మంత్రి గజేంద్ర సింగ్ షెకావత్‌కు ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి లేఖ రాశారు. కొద్ది రోజుల క్రితం షెకావత్ రాసిన లేఖకు జగన్ నేడు సమాధానమిచ్చారు. ఏపీ స్పందన లేదంటూ ఈనెల 7న షెకావత్ రాసిన లేఖ కరెక్ట్ కాదని సీఎం అభిప్రాయపడ్డారు. కృష్ణానదీ జలాల ట్రిబ్యునల్ కేటాయింపుల ఆధారంగానే ప్రాజెక్ట్‌లు నిర్మిస్తున్నట్లు జగన్ చెప్పారు. రాయలసీమ ఎత్తిపోతల పథకం పాతవాటికి కొనసాగింపు మాత్రమే అన్నారు. అదనంగా నీటి మళ్లింపు, నీటి నిల్వ, అదనపు ఆయకట్టు లేదని సీఎం స్పష్టం చేశారు. పునర్వ్యవస్థీకరణ చట్టంప్రకారం ఏపీకి రావాల్సిన నీటి వాటా సమర్థ వినియోగానికే రాయలసీమ ఎత్తిపోతల ప్రాజెక్ట్ అని సీఎం జగన్ స్పష్టం చేశారు. (కొత్త ప్రాజెక్టులపై ముందుకెళ్లొద్దు) కేఆర్ఎంబీ ఆదేశాలకు విరుద్ధంగా తెలంగాణ కొత్త ప్రాజెక్ట్‌లు చేపడుతోందని సీఎం జగన్ ఆరోపించారు. కృష్ణానదిపై తెలంగాణ చేపట్టిన పాలమూరు-రంగారెడ్డి, డిండి ఎత్తిపోతల ప్రాజెక్ట్‌లకు సంబంధించి.. సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలైనట్లు ఆయన లేఖలో తెలిపారు. ఆ రెండు ప్రాజెక్ట్‌లు తెలంగాణలో కొత్త కాల్వ వ్యవస్థను, ఆయకట్టును సృష్టిస్తున్నాయన్నారు. మొదటి అపెక్స్ కౌన్సిల్ సమావేశంలో కృష్ణా జల వివాదాల ట్రిబ్యునల్ ఇచ్చిన నీటి వాటాకు బద్దులై ఉంటామని తెలంగాణ చెప్పిందన్నారు. కానీ తర్వాత మాట మార్చి పాలమూరు-రంగారెడ్డి, డిండి ఎత్తిపోతల నిర్మాణాలను చేపట్టిందని తెలిపారు. ఈ నిర్మాణాలను నిలుపుదల చేయాల్సిందిగా అపెక్స్ కౌన్సిల్ తెలంగాణను ఆదేశించలేదన్నారు. రెండో అపెక్స్ కౌన్సిల్ సమావేశంలోనైనా ఈ అంశాలు పరిష్కారమవుతాయని భావించాను అన్నారు. కానీ రెండో అపెక్స్ కౌన్సిల్ సమావేశం జరగకుండా ఆగిపోయిందని లేఖలో సీఎం జగన్ తెలిపారు. -
జలయజ్ఞంతో ప్రాజెక్టులకు రూపం
దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి జిల్లా ప్రజల గుండెల్లో చెరగని ముద్ర వేసుకున్నారు. ఎన్నో అభివృద్ధి పనులతో జిల్లాకు జవజీవాలిచ్చారు. సీఎం అంటే ఇలా ఉండాలి అనిపించేలా జిల్లాలో అభివృద్ధిని పరుగులు పెట్టించారు. ఆ మహానేత కనుమరుగై దశాబ్దం దాటినా జిల్లా ప్రజలు ఆయన జ్ఞాపకాలను ఇంకా మరువలేకున్నారు. వైఎస్సార్ జయంతిని రాష్ట్ర ప్రభుత్వం రైతు దినోత్సవంగా నిర్వహిస్తున్నారు. బుధవారం వైఎస్ఆర్ జయంతి సందర్భంగా ఆ జ్ఞాపకాలను ఒకసారి నెమరు వేసుకుందాం.. సాక్షి, ఒంగోలు: డాక్టర్ వైఎస్ రాజశేఖరరెడ్డి రైతుల గుండెల్లో చిరస్థాయిగా నిలిచిపోయేలా సాగు, తాగునీటి ప్రాజెక్టులకు జీవం పోశారు. రైతులు, రైతు కూలీలు పడుతున్న ఇబ్బందులను తన పాదయాత్రలో కళ్లారా చూసిన ఆయన అధికారంలోకి వచ్చాక జలయజ్ఞంలో భాగంగా జిల్లాలో కూడా పలు ప్రాజెక్టులకు రూపకల్పన చేశారు. వాటిలో ప్రధానమైనది పూల సుబ్బయ్య వెలిగొండ ప్రాజెక్టు. వెలిగొండ ప్రాజెక్టు.. చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు శంకుస్థాపన చేసిన వెలిగొండ ప్రాజెక్టు ఆ తరువాత ఒక్క అడుగు కూడా ముందుకు పడలేదు. అప్పుడు వేసిన శిలాఫలకం కాలగర్భంలో కలిసిపోయింది. 2004లో డాక్టర్ వైఎస్.రాజశేఖర రెడ్డి ముఖ్యమంత్రి అయ్యాక వెలిగొండ ప్రాజెక్టు నిర్మాణానికి సంకలి్పంచారు. శ్రీశైలం జలాశయం నుంచి 43.58 టీఎంసీల కృష్ణా వరద నీటిని మళ్లించి జిల్లాలోని 23 మండలాల్లో 3,36,100 ఎకరాలకు, వైఎస్సార్ కడప జిల్లాలోని 2 మండలాలకు చెందిన 27,200 ఎకరాలకు, నెల్లూరు జిల్లాలోని 5 మండలాలకు చెందిన 84 వేల ఎకరాలకు సాగునీరు అందించే లక్ష్యంగా రూపొందించారు. మొత్తం కలిసి 4,47,300 ఎకరాలకు సాగు నీరు అందించనున్నారు. అదే విధంగా 15.25 లక్షల మంది ప్రజానీకానికి తాగునీరు అందించటానికి ఈ ప్రాజెక్టును రూపకల్పన చేశారు. ప్రస్తుతం ఆ ప్రాజెక్టు అంచనాలు రూ.8,840 కోట్లకు చేరింది. అప్పట్లో రూ.5,150 కోట్లు కేటాయించి ప్రాజెక్టు పనులను పరుగులు పెట్టించారు. వైఎస్ అనంతరం కాంగ్రెస్ ప్రభుత్వం పట్టించుకోలేదు. మళ్లీ 2014లో సీఎం అయిన చంద్రబాబు ప్రజల సొమ్మును కాంట్రాక్టర్ల రూపంలో పిండుకొని వాటాలు వేసుకున్నారే తప్ప ప్రాజెక్టు మాత్రం ముందుకు కదలలేదు. వైఎస్ జగన్‌తో మళ్లీ పనుల్లో వేగం.. వైఎస్ జగన్ ముఖ్యమంత్రి అయ్యాక మళ్లీ వెలిగొండ పనులు వేగం పుంజుకున్నాయి. చంద్రబాబుకు చెందిన బినామీ కాంట్రాక్టర్లను తప్పించారు. వెలిగొండ ప్రాజెక్టు టెండర్లలో కొత్త విధానాన్ని తీసుకొచ్చారు. రివర్స్ టెండర్ల ద్వారా కాంట్రాక్టర్లను ఆహా్వనించారు. వెలిగొండ ప్రాజెక్టు పరిధిలోని రెండో టన్నెల్‌కు నిర్వహించిన రివర్స్ టెండర్లో ప్రభుత్వ ఖజానాకు రూ.84 కోట్లు జమయ్యాయి. ఒకటో టన్నల్ తవ్వటం దాదాపు పూర్తయింది. అక్టోబర్ ఆఖరుకు ఆ టన్నెల్ నుంచి వెలిగొండ ప్రాజెక్టుకు చెందిన నల్లమల సాగర్‌కు నీళ్లు వదలనున్నారు. గుండ్లకమ్మ ప్రాజెక్టు... గుండ్లకమ్మ నది నుంచి జలాలు వృథాగా సముద్రం పాలు కావటాన్ని గుర్తించిన వైఎస్సార్ మద్దిపాడు మండలం మల్లవరం గ్రామం వద్ద ప్రాజెక్టు నిర్మించాలని తలచారు. అందు కోసం రూ.543.43 కోట్లు కేటాయించారు. 3.859 టీఎంసీల నీటి సామర్ధ్యంతో ఈ ప్రాజెక్టు నిర్మాణానికి రూపకల్పన చేశారు. 9 మండలాల పరిధిలోని 80 వేల ఎకరాలకు సాగునీరు, జిల్లా కేంద్రం ఒంగోలుతో పాటు 43 గ్రామాల పరిధిలోని 2.56 లక్షల మంది ప్రజలకు తాగునీరు అందించటమే లక్ష్యంగా గుండ్లకమ్మ ప్రాజెక్టును రూపొందించారు. 2008 నవంబర్ 24న డాక్టర్ వైఎస్సార్ ఈ ప్రాజెక్టును జాతికి అంకితం చేశారు. కొరిశపాడు లిఫ్ట్ ఇరిగేషన్ స్కీం: యర్రం చినపోలిరెడ్డి కొరిశపాడు లిఫ్ట్ ఇరిగేషన్ స్కీం కూడా వైఎస్సార్ పుణ్యమే. గుండ్లకమ్మ రిజర్వాయర్ నుంచి నీటిని ఎత్తిపోసి కొరిశపాడు, నాగులుప్పలపాడు మండలాల్లో ప్రజలను ఆదుకునేందుకు ఈ ప్రాజెక్టుకు రూపకల్పన చేశారు. రెండు మండలాల్లోని 20 వేల ఎకరాలకు సాగు నీరు అందించేలా 1.33 టీఎంసీల సామర్ధ్యంతో ప్రాజెక్టుకు రూపకల్పన చేశారు. మొత్తం రూ.177 కోట్ల వ్యయ అంచనాలతో నిర్మాణం చేపట్టారు. ౖవైఎస్సార్ అకాల మరణం చెందిన తరువాత ప్రాజెక్టు పనులు నిలిచిపోయాయి. తిరిగి వైఎస్ జగన్ ప్రభుత్వం వచ్చాక మళ్లీ కొరిశపాడు లిఫ్ట్ ఇరిగేషన్ పనులు ప్రారంభమయ్యాయి. పాలేరు రిజర్వాయర్.. కొండపి నియోజకవర్గ ప్రజల కష్టాలు తీర్చేందుకు వైఎస్సార్ పొన్నలూరు మండలం చెన్నుపాడు గ్రామం వద్ద పాలేరుపై రిజర్వాయర్ నిర్మాణానికి శ్రీకారం చుట్టారు. 0.584 టీఎంసీల నీటి సామర్ధ్యంతో 9,500 ఎకరాల ఆయకట్టుకు సాగునీరు, 4 మండలాల పరిధిలోని 15 గ్రామాలకు చెందిన 30 వేల మంది ప్రజలకు తాగునీరు అందించటమే లక్ష్యంగా రూ.50 కోట్ల వ్యయ అంచనాలతో ప్రాజెక్టుకు రూపకల్పన చేశారు. ఆ తరువాత వచ్చిన ముఖ్యమంత్రులెవ్వరూ ఈ ప్రాజెక్టు ఊసే పట్టించుకోలేదు. ప్రస్తుత వైఎస్ జగన్ ప్రభుత్వం కాంట్రాక్టర్‌ను మార్చి పనులు ప్రారంభించే పనిలో నిమగ్నమైంది. రూ.400 కోట్లతో సాగర్ కాలువల అభివృద్ధి: జిల్లాలో ఆయకట్టుకు సాగర్ కాలువలు ప్రధాన ఆధారం. సాగర్ కుడి కాలువ ద్వారా జిల్లాలో దాదాపు 4.40 లక్షల ఎకరాలలో సాగు భూమి ఉంది. వైఎస్సార్ అధికారంలోకి వచ్చిన తరువాత సాగర్ కాలువల అభివృద్ధికి రూ.400 కోట్లు కేటాయించారు. అంతకు ముందు కనీసం లక్ష ఎకరాలకు కూడా సాగర్ నీరు జిల్లాకు వచ్చేది కాదు. అలాంటి సాగర్ కాలువల అభివృద్ధితో సాగర్ ఆయకట్టు చివరి భూముల వరకు నీరు వచ్చేలా ఆధునికీకరణ చేపట్టారు. రూ.250 కోట్లతో ఒంగోలులో రిమ్స్.. జిల్లా ప్రజలు వైద్యం కోసం గుంటూరు, నెల్లూరు, లేకుంటే చెన్నై వెళ్లేవారు. వైఎస్సార్ అధికారం చేపట్టాక జిల్లాకు రిమ్స్ వైద్య కళాశాలను మంజూరు చేశారు. రిమ్స్ ఏర్పాటు కోసం రూ.250 కోట్లు కేటాయించి భవన నిర్మాణాలను ప్రారంభించారు. ఒంగోలు రిమ్స్ రాజన్న చలువే. ఆరోగ్యశ్రీ పథకాన్ని అందుబాటులోకి తీసుకొచ్చి జిల్లాలోని లక్షలాది మంది పేదలకు ఆరోగ్య ప్రదాతగా నిలిచారు. కందుకూరులో రూ.110 కోట్లతో ఎస్ఎస్ ట్యాంకు.. కందుకూరు ప్రజల దాహార్తి తీర్చేందుకు చీమకుర్తి సమీపంలో నిర్మించిన రామతీర్ధం జలాశయం నుంచి కందుకూరుకు నీరు మళ్లించేందుకు రూ.110 కోట్లతో సమ్మర్ స్టోరేజ్ ట్యాంక్ నిర్మాణానికి శ్రీకారం చుట్టారు. ఒంగోలు నగర ప్రజల దాహార్తిని తీర్చటానికి కూడా రామతీర్థం జలాశయం నుంచే నీటిని ఒంగోలు ఎస్ఎస్ ట్యాంకులను నింపుతున్నారు. రూ.80 కోట్లతో సోమశిల ఉత్తర కాలువ అభివృద్ధి: రాళ్లపాడు ప్రాజెక్టు రైతుల కష్టాలు తెలుసుకున్న వైఎస్సార్ ఎగువనున్న నెల్లూరు జిల్లా సోమశిల నుంచి నీటిని రాళ్లపాడుకు నీరు మళ్లించేందుకు అంచనాలు రూపొందించాలని అప్పట్లో అధికారులను ఆదేశించారు. సోమశిల ఉత్తర కాలువను పొడిగించటం ద్వారా దాదాపు రూ.80 కోట్లు ఖర్చవుతాయని వ్యయ అంచనాలు రూపొందించారు. వెంటనే పరిపాలనా అనుమతులు ఇచ్చి ఉత్తర కాలువ పనులను ప్రారంభింపజేశారు. కనిగిరిలో రూ.175 కోట్లతో రక్షిత మంచినీటి పథకం: కనిగిరి ప్రాంతంలో ఫ్లోరైడ్ నీటితో అనారోగ్యం పాలవుతున్నామని అక్కడి ప్రజలు వైఎస్సార్ దృష్టికి తీసుకెళ్లారు. దీంతో రూ.175 కోట్ల వ్యయ అంచనాలతో రక్షిత మంచినీటి పథకాన్ని సిద్ధం చేశారు. నిధులు కూడా మంజూరు చేశారు. ఆ పథకం వలన కనిగిరి ప్రాంతంలో కొంతమేర మంచినీటి కష్టాలు తీరాయి. కనిగిరి ప్రాంత ప్రజలు ఫ్లోరైడ్ పీడితులుగా మారుతున్నారని ఫ్లోరైడ్ నివారణ కోసం వైఎస్ జగన్ ముఖ్యమంత్రి అయ్యాక రూ.800 కోట్లతో చర్యలు చేపట్టారు. -
అప్పటికి ఎగువమానేరుకు గోదావరి జలాలు
సిరిసిల్ల: సాగునీటి ప్రాజెక్టులకు ఎలాంటి నిధుల కొరత లేదని, ప్రాధాన్యత ప్రకారం ప్రభుత్వం నిధులు మంజూరు చేస్తోందని నీటి పారుదల శాఖ ముఖ్యకార్యదర్శి రజత్‌కుమార్ అన్నారు. రాజన్న సిరిసిల్ల జిల్లాలోని కాళేశ్వరం ప్రాజెక్ట్–9 ప్యాకేజీ పనులను మంగళవారం ఆయన క్షేత్రస్థాయిలో పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కోవిడ్–19 కారణంగా రాష్ట్ర ఖజానాకు రాబడి తగ్గినా.. ప్రాజెక్టుల నిర్మాణాలకు నిధుల కొరత లేదని స్పష్టం చేశారు. 9వ ప్యాకేజీ పనులను సెప్టెంబర్‌లోగా పూర్తి చేయాలని ఆయన అధికారులను ఆదేశించారు. 12 కిలోమీటర్ల సొరంగం పనులు పూర్తి అయ్యాయని, మరో 50 మీటర్లు పెండింగ్‌లో ఉందని అధికారులు వివరించారు. పంప్‌హౌస్ నిర్మాణం పూర్తిచేసి మధ్యమానేరు నుంచి ఎగువమానేరుకు నీటిని పంపింగ్ చేసేలా పనులు పూర్తి చేయాలన్నారు. రోజువారీగా పనుల ప్రగతి ఫొటోలను తనకు పంపించాలన్నారు. అక్టోబర్ 15 నాటికి ఎగువమానేరుకు గోదావరి జలాలు చేరాలని రజత్‌కుమార్ ఆదేశించారు. ఇది పూర్తి అయితే లక్ష ఎకరాలకు సాగునీరు అందుతుందని తెలిపారు. అత్యంత ప్రాధాన్యత కలిగిన ప్రాజెక్టుగా గుర్తించి పనులను వేగవంతం చేయాలని కోరారు. సొరంగంలో మూడు కిలోమీటర్ల మేర ఆయన ప్రయాణించి పనుల ప్రగతిని సమీక్షించారు. ఆయన వెంట ప్రణాళికా సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షుడు బోయినపల్లి వినోద్‌కుమార్, నీటి పారుదల శాఖ చీఫ్ ఇంజనీర్ మురళీధర్‌రావు, ఈఎన్సీ హరిరామ్, ట్రెయినీ కలెక్టర్ రిజ్వాన్ షేక్‌బాషా, ఎస్ఈ ఆనంద్, ఆర్డీవో శ్రీనివాస్‌రావు, ఈఈ శ్రీనివాస్‌రెడ్డి పాల్గొన్నారు. మల్లన్నసాగర్ పనుల పరిశీలన.. తొగుట (దుబ్బాక): సిద్దిపేట జిల్లా తొగుట మండలంలో నిర్మిస్తున్న మల్లన్న సాగర్ కాల్వ నిర్మాణ పనులను నీటి పారుదల శాఖ ముఖ్య కార్యదర్శి రజత్ కుమార్, కలెక్టర్ వెంకట్రామిరెడ్డితో కలసి మంగళవారం సాయంత్రం పరిశీలించారు. ఈ సందర్భంగా రంగనాయకసాగర్ నుంచి కొండపోచమ్మ సాగర్‌కు వెళ్తున్న గోదావరి జలాలను చూసి సంతోషం వ్యక్తం చేశారు. రోజుకు ఎన్ని మోటార్ల ద్వారా నీటిని తోడుతున్నారన్న విషయాలను అడిగి తెలుసుకున్నారు. అనంతరం కాళేశ్వరం ప్రాజెక్టు 12వ ప్యాకేజీలో భాగంగా నిర్మిస్తున్న దుబ్బాక నియోజకవర్గానికి సాగునీరు అందించే మల్లన్న సాగర్ కాల్వ పనులు పరిశీలించారు. కాల్వ పనుల్లో ఎందుకు ఆలస్యం జరుగుతుందని, పనులను త్వరగా పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. వచ్చే ఖరీఫ్‌కు సాగునీరు అందించాలన్న లక్ష్యంతో సీఎం కేసీఆర్ కృషి చేస్తున్నారని చెప్పారు. ఆయన వెంట సీఎం సలహాదారు శ్రీధర్‌రావు దేశ్‌పాండే, ఎస్ఈ ఆనందర్‌రావు తదితరులు ఉన్నారు. -
పోల‘వరం’లో తొలి అడుగు
సాక్షి, రాజమహేంద్రవరం: జిల్లావాసుల కలల సౌధం పోలవరం ప్రాజెక్టు పరుగులు పెట్టే రోజులు వచ్చేశాయి. గత పాలకుల నిర్లక్ష్యానికి గురైన ప్రాజెక్టు నిర్వాసితులకు స్వర్ణ యుగం వచ్చేసింది. ఏళ్ల తరబడి ఎదురుచూస్తున్న ప్యాకేజీకి ఎట్టకేలకు మోక్షం కలిగింది. సీఎంగా జగన్మోహన్రెడ్డి బాధ్యతలు స్వీకరించి ఏడాది తిరగకుండానే నిర్వాసితులకు పునరవాస ప్యాకేజీ రూ.79 కోట్లు కేటాయించారు. నిర్వాసితులు సంతోషంగా ఉంటేనే ప్రాజెక్టు నిర్మాణం ముందుకు వెళుతుందనే ఉద్దేశంతో సీఎం తొలి విడత ప్యాకేజీ ప్రకటించి ... ఇచ్చిన మాటను నిలబెట్టుకున్నారు. ఏటా కడలిపాలవుతున్న వేల టీఎంసీలను ఒడిసిపట్టే బహుళార్థక సాధక ప్రాజెక్టును సాకారం చేయాలనే చిత్తశుద్ధి ఉండడడంతో సీఎం ముందుగా తమ గోడు పట్టించుకుంటున్నారని నిర్వాసితులు సంబరపడుతున్నారు. ఈ నేపథ్యంలో నిర్వాసితులతో మాట్లాడి వారి సమస్యలు పరిష్కారానికి జలవనరులశాఖా మంత్రి అనిల్‌కుమార్ యాదవ్ బుధ, గురువారాల్లో జిల్లా పర్యటనకు వస్తున్నారు. (అన్ని వర్గాల ఆర్థిక ప్రగతికి..సంక్షేమ రథం) కమీషన్ల కోసం బాబు యావ గత పాలకుల నిర్లక్ష్యానికి సాక్షీభూతంగా నిర్వాసితులు మిగిలిపోయారు. వారి బాధలను గాలికొదిలేసి కమీషన్లు వచ్చే పనులను భుజానకెత్తుకున్నారు. పరిహారం ఇచ్చి ఇళ్లు నిర్మిస్తే ఖాళీచేసి వెళ్లిపోతామని మొత్తుకున్నా పట్టించుకోలేదు. పునరావాస చర్యలు తీసుకున్న తరువాతే ప్రాజెక్టు నిర్మాణ పనులు చేపట్టాలని నిర్వాసితులు, నిపుణులు కమిటీ సూచించినా చంద్రబాబు అండ్ కో పెడచెవిన పెట్టారు. ఫలితంగా ప్రతి ఏటా 69 వేల పైచిలుకు కుటుంబాలు గోదావరి వరదల్లో ముంపు బారిన పడుతున్నాయి. నష్టపరిహారం చెల్లించి, ప్రాజెక్టు పనులు చేపట్టాలని ఐదేళ్లు మొత్తుకున్నా కనీసం పట్టించుకోకుండా బాబు సర్కార్ అనాలోచితంగా పర్సంటేజీలకు కక్కుర్తిపడి కాఫర్ డ్యామ్ నిర్మాణం చేపట్టి గ్రామాలను ముంచేశారు. (కోవిడ్ పట్ల భయాందోళనలు పోవాలి) కాఫర్ డ్యామ్‌తో కొద్దిపాటి వరదకే గతేడాది మూడుసార్లు గిరిజన గ్రామాలు ముంపునకు గురై నిర్వాసితులు మూడు నెలలు ఇబ్బందులు పడ్డారు. భద్రాచలంలో గోదావరికి మూడో ప్రమాద హెచ్చరిక జారీచేస్తేనే దేవీపట్నంతోపాటు విలీన మండలాల్లో ముంపునకు గురవుతాయి. అటువంటిది కాఫర్ డ్యామ్ కారణంగా భద్రాచలంలో ఒకటో ప్రమాద హెచ్చరిక జారీచేసే సరికే ఏజెన్సీ మండలాలు ముంపునకు గురయ్యే పరిస్థితి. ఇంతా చేసి అధికారం కోల్పోయాక తగదునమ్మా అంటూ చంద్రబాబు తనయుడు, లోకేష్ ముంపు గ్రామాల పర్యటనకు వచ్చినప్పుడు బాధితుల ఆగ్రహానికి తోకముడిచి వెనుతిరగక తప్పింది కాదు. వైఎస్ హయాంలో... మహానేత వైఎస్ రాజశేఖర్‌రెడ్డి హయాంలో ప్రాజెక్టు నిర్మాణం ప్రారంభించినప్పుడు ముందుగా నిర్వాసితుల ప్రయోజనాలకే పెద్దపీట వేసేవారు. ముందు ముంపునకు గురయ్యే గ్రామాలను సురక్షిత ప్రాంతాలకు తరలించేందుకు అత్యధిక ప్రాధాన్యం ఇచ్చేవారు. హామీ ఇచ్చినట్టే ముంపు బాధితులకు ప్యాకేజీ ప్రకటించి పునరావాస కాలనీలకు తరలించేవారు. ఆ తరువాతే ప్రాజెక్టు నిర్మాణాన్ని చేపట్టేవారు. నాడు దేవీపట్నం మండలం వీరవరంలంక, గొందూరు, పరగసానిపాడు, అంగుళూరు, బోడిగూడెం గ్రామాల ప్రజలను ఇందుకూరిపేట–ఫజుల్లాబాద్‌కు మధ్య నిర్మించిన కాలనీలకు తరలించారు. భూమికి, భూమి, ఆర్అండ్ఆర్ ప్యాకేజీ, కాలనీలు నిర్మాణం పూర్తి చేశారు. ఈ రకంగా వైఎస్ హయాం 2004–2009 మధ్య సుమారు 1500 నిర్వాపిత కుటుంబాలకు మంచి చేశారు. ఆ బాటలోనే తనయుడు గతేడాది జూలైలో పోలవరం ప్రాజెక్టు సందర్శనకు సీఎం జగన్ మోహన్‌రెడ్డి వచ్చినప్పుడు ఏజెన్సీ ప్రాంతంలో కాఫర్ డ్యామ్ కారణంగా ముంపునకు గురయ్యే ప్రాంతాన్ని ఏరియల్ సర్వేలో వీక్షించారు. అనంతరం మంత్రులు, అ«ధికారులతో సమీక్షించిన సందర్భంలో నిర్వాసితులకు పునరావాసం ప్యాకేజీ, ఇల్లు ఖాళీ చేయించే ప్రక్రియను 2020 జూన్ నాటికి పూర్తి చేస్తానని హామీ ఇచ్చారు. నాడు ఇచ్చిన మాట ప్రకారం నిర్వాసితులకు తొలి ప్రాధాన్యం ఇచ్చారు. అనాలోచితంగా చంద్రబాబు సర్కార్ నిర్మించిన కాఫర్ డ్యామ్ కారణంగా ముంపునకు గురవుతున్న గ్రామాలకు తొలి ప్రాధాన్యంగా ప్యాకేజీని విడుదల చేశారు. ఆర్అండ్ఆర్ ప్యాకేజీ, ఇళ్లకు నష్టపరిహారం కోసం ఇటీవలనే రూ.79 కోట్లు విడుదల చేశారు. మహానేత వైఎస్ తరువాత ఇంత కాలానికి మళ్లీ ప్యాకేజీని ప్రకటించి మనసున్న నాయకుడిగా సీఎం నిలిచారని నిర్వాసితులు ఆనందడోలికల్లో తేలియాడుతున్నారు. కాఫర్ డ్యామ్‌కు సమీపాన ఉన్న ఆరు గ్రామాలకు పూర్తి స్ధాయి ప్యాకేజీ, ఇళ్ల నష్టపరిహారం చెల్లించేందుకు నిధులు విడుదల చేయడంతో ప్రాజెక్టు పనులు ముందుకు వెళ్లడానికి మార్గం సుగమమైందని చెప్పొచ్చు. శరవేగంగా కాలనీలు... ప్రాజెక్టు నిర్మాణం కారణంగా తొలివిడతలో దేవీపట్నం మండలంలో ముంపునకు గురవుతున్న నిర్వాసితులకు యుద్ధ ప్రాతిపదికన కాలనీల నిర్మాణం జరుగుతున్నాయి. గిరిజనేతరులకు గోకవరం మండలం కృష్ణునిపాలెంలోను, గిరిజనులకు దేవీపట్నం మండలంలోని పలు గ్రామాల్లో నిర్మాణం చురుగ్గా జరుగుతున్నాయి. వాస్తవానికి గత చంద్రబాబు సర్కార్‌లోనే వీరికి ఇళ్లు నిర్మిస్తామని హామీ ఇచ్చారు. కానీ ఆ ఐదేళ్ల పాలనలో ఏనాడూ నిర్వాసితులను పట్టించుకున్న దాఖలాలు లేవు. వైఎస్ ఆలోచనే వేరు మాజీ ముఖ్యమంత్రి వెఎస్ రాజశేఖర్‌రెడ్డి హయాంలో ప్రాజెక్టు నిర్మాణ ఆలోచన రాగానే ముందుగా నిర్వాసితుల ప్రయోజనాలకే పెద్దపీట వేసేవారు. ముంపునకు గురయ్యే గ్రామాలను సురక్షిత ప్రాంతాలకు తరలించేందుకు ప్రాధాన్యం ఇచ్చేవారు. బాధితులకు ప్యాకేజీ ప్రకటించి పునరావాస కాలనీలకు తరలించేవారు. ఆ తరువాతే ప్రాజెక్టు నిర్మాణానికి శ్రీకారం చుట్టేవారు. కమీషన్లకే బాబు ప్రాధాన్యం మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కమీషన్ల కోసమే పోలవరం పనులు చేపట్టేవారు. ఇందుకు ఉదాహరణ కాఫర్ డ్యాం నిర్మాణం. పరిహారం ఇచ్చి ఇళ్లు నిర్మిస్తే ఖాళీచేసి వెళ్లిపోతామని బాధితులు మొత్తుకున్నా అప్పటి సర్కారు పట్టించుకోలేదు. దీని ఫలితంగా ప్రతి ఏటా 69 వేల పైచిలుకు కుటుంబాలు గోదావరి వరదల్లో ముంపు బారిన పడుతున్నాయి. ఈ పాపం ఆయనదే. జగన్‌దీ తండ్రిబాటే... గత ఏడాది జూలైలో పోలవరం ప్రాజెక్టు సందర్శనకు సీఎం జగన్ మోహన్‌రెడ్డి వచ్చినప్పుడు ఏజెన్సీ ప్రాంతంలో కాఫర్ డ్యామ్ కారణంగా ముంపునకు గురయ్యే ప్రాంతాన్ని ఏరియల్ సర్వేలో వీక్షించారు. పునరావాసం ప్యాకేజీ, ఇల్లు ఖాళీ చేయించే ప్రక్రియను 2020 జూన్ నాటికి పూర్తి చేస్తానని హామీ ఇచ్చారు. కాఫర్ డ్యామ్ కారణంగా ముంపునకు గురవుతున్న గ్రామాలకు తొలి ప్రాధాన్యంగా ప్యాకేజీని విడుదల చేసి మాట నిలబెట్టుకుంటున్నారు. ‘బాబు సర్కార్ పట్టించుకోలేదు’ నిర్వాసితులకు ముందుగా పునరావాసం కల్పించాలనే ఆలోచనే చంద్రబాబు సర్కార్‌కు రాలేదు. గ్రామాల నుంచి తరలించేందుకు అంత ప్యాకేజీ ప్రకటించడాన్ని ఎప్పుడూ పట్టించు కోలేదు. కాఫర్ డ్యామ్‌కు దగ్గరగా ఉన్న గ్రామాల్లో మాకు ఆర్అండ్ఆర్ ప్యాకేజీ కోసం కాళ్లరిగేలా తిరిగాం. టీడీపీ ప్రభుత్వం నిర్వాసితులను అసలు మనుషులుగా కూడా చూడ లేదు. కమీషన్ల కోసం కాఫర్ డ్యామ్ నిర్మాణం చూసుకున్నారు తప్ప వరదలు వస్తే నిర్వాసితులు ఇబ్బందులు పడతారనే విషయాన్ని పట్టించుకోలేదు. – పోలిశెట్టి శివరామకృష్ణనాయుడు, తొయ్యేరు ‘ప్యాకేజీ సంతోషంగా ఉంది’ ఈ ఏడాది వరదలు వచ్చినా నిర్వాసితులు ఎవరు ఇబ్బంది పడకుండా ముఖ్యమంత్రి జగన్మోహన్రెడ్డి చేస్తున్న ఏర్పాట్లు చాలా సంతోషాన్ని కలిగిస్తున్నాయి. గత వరదలు వలన నిర్వాసితులు అష్ట కష్టాలు పడ్డారు. గత ప్రభుత్వం చేసిన తప్పులకు మేమంతా బలయ్యాం. ప్రస్తుతం అలాంటి పరిస్థితి రాకుండా ముందుగానే పునరావాస కాలనీలు పూర్తి చేసి నిర్వాసితులను తరలించే ఏర్పాటు చేయడం ఊరటనిస్తోంది. కాలనీలకు తరలించి వరద ముంపు నుంచి తప్పిస్తారని ఎదురుచూస్తున్నాం. – వెంకటరమణ, సీతారామం