మల్కపేట సొరంగంలో అ«ధికారులతో మాట్లాడుతున్న రజత్‌కుమార్
సిరిసిల్ల: సాగునీటి ప్రాజెక్టులకు ఎలాంటి నిధుల కొరత లేదని, ప్రాధాన్యత ప్రకారం ప్రభుత్వం నిధులు మంజూరు చేస్తోందని నీటి పారుదల శాఖ ముఖ్యకార్యదర్శి రజత్‌కుమార్ అన్నారు. రాజన్న సిరిసిల్ల జిల్లాలోని కాళేశ్వరం ప్రాజెక్ట్–9 ప్యాకేజీ పనులను మంగళవారం ఆయన క్షేత్రస్థాయిలో పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కోవిడ్–19 కారణంగా రాష్ట్ర ఖజానాకు రాబడి తగ్గినా.. ప్రాజెక్టుల నిర్మాణాలకు నిధుల కొరత లేదని స్పష్టం చేశారు. 9వ ప్యాకేజీ పనులను సెప్టెంబర్‌లోగా పూర్తి చేయాలని ఆయన అధికారులను ఆదేశించారు. 12 కిలోమీటర్ల సొరంగం పనులు పూర్తి అయ్యాయని, మరో 50 మీటర్లు పెండింగ్‌లో ఉందని అధికారులు వివరించారు.
పంప్‌హౌస్ నిర్మాణం పూర్తిచేసి మధ్యమానేరు నుంచి ఎగువమానేరుకు నీటిని పంపింగ్ చేసేలా పనులు పూర్తి చేయాలన్నారు. రోజువారీగా పనుల ప్రగతి ఫొటోలను తనకు పంపించాలన్నారు. అక్టోబర్ 15 నాటికి ఎగువమానేరుకు గోదావరి జలాలు చేరాలని రజత్‌కుమార్ ఆదేశించారు. ఇది పూర్తి అయితే లక్ష ఎకరాలకు సాగునీరు అందుతుందని తెలిపారు. అత్యంత ప్రాధాన్యత కలిగిన ప్రాజెక్టుగా గుర్తించి పనులను వేగవంతం చేయాలని కోరారు. సొరంగంలో మూడు కిలోమీటర్ల మేర ఆయన ప్రయాణించి పనుల ప్రగతిని సమీక్షించారు. ఆయన వెంట ప్రణాళికా సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షుడు బోయినపల్లి వినోద్‌కుమార్, నీటి పారుదల శాఖ చీఫ్ ఇంజనీర్ మురళీధర్‌రావు, ఈఎన్‌సీ హరిరామ్, ట్రెయినీ కలెక్టర్ రిజ్వాన్ షేక్‌బాషా, ఎస్‌ఈ ఆనంద్, ఆర్డీవో శ్రీనివాస్‌రావు, ఈఈ శ్రీనివాస్‌రెడ్డి పాల్గొన్నారు.
మల్లన్నసాగర్ పనుల పరిశీలన..
తొగుట (దుబ్బాక): సిద్దిపేట జిల్లా తొగుట మండలంలో నిర్మిస్తున్న మల్లన్న సాగర్ కాల్వ నిర్మాణ పనులను నీటి పారుదల శాఖ ముఖ్య కార్యదర్శి రజత్ కుమార్, కలెక్టర్ వెంకట్రామిరెడ్డితో కలసి మంగళవారం సాయంత్రం పరిశీలించారు. ఈ సందర్భంగా రంగనాయకసాగర్ నుంచి కొండపోచమ్మ సాగర్‌కు వెళ్తున్న గోదావరి జలాలను చూసి సంతోషం వ్యక్తం చేశారు. రోజుకు ఎన్ని మోటార్ల ద్వారా నీటిని తోడుతున్నారన్న విషయాలను అడిగి తెలుసుకున్నారు. అనంతరం కాళేశ్వరం ప్రాజెక్టు 12వ ప్యాకేజీలో భాగంగా నిర్మిస్తున్న దుబ్బాక నియోజకవర్గానికి సాగునీరు అందించే మల్లన్న సాగర్ కాల్వ పనులు పరిశీలించారు. కాల్వ పనుల్లో ఎందుకు ఆలస్యం జరుగుతుందని, పనులను త్వరగా పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. వచ్చే ఖరీఫ్‌కు సాగునీరు అందించాలన్న లక్ష్యంతో సీఎం కేసీఆర్ కృషి చేస్తున్నారని చెప్పారు. ఆయన వెంట సీఎం సలహాదారు శ్రీధర్‌రావు దేశ్‌పాండే, ఎస్‌ఈ ఆనందర్‌రావు తదితరులు ఉన్నారు.
Comments
Please login to add a commentAdd a comment