ప్రాజెక్టుల ప్రగతి ఎంత?
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో నిర్మాణంలో ఉన్న సాగునీటి ప్రాజెక్టులకు కేంద్ర పథకాల నుంచి అందిన నిధులతో సాధించిన ప్రగతిపై ప్రధానమంత్రి నరేంద్రమోదీ సమీక్షించనున్నారు. ముఖ్యంగా సత్వర సాగునీటి ప్రయోజన కార్యక్రమం(ఏఐబీపీ), ప్రధాన మంత్రి సహాయ ప్యాకేజీ(పీఎంఆర్‌ఎఫ్) కింద రాష్ట్రాల్లో అమలు చేస్తున్న సాగునీటి పథకాలు, వాటి కింద ఖర్చు చేసిన నిధులు, అదనపు అవసరాలు, సాగులోకి తెచ్చిన ఆయకట్టు తదితరాలపై రాష్ట్ర ఉన్నతాధికారుల నుంచి వివరాలు తెలుసుకోనున్నారు. ఈ మేరకు ప్రగతి నివేదికలతో సిద్ధం కావాలని, ఈ నెల 27న ప్రధాని వాటిపై వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్షిస్తారని ఇప్పటికే ప్రధానమంత్రి కార్యాలయం(పీఎంవో)..
రాష్ట్ర ప్రధాన కార్యదర్శి రాజీవ్‌శర్మకు సమాచారం పంపింది. దీంతో నీటి పారుదల శాఖ ఇప్పటివరకు చేపట్టిన పనులు, పలు ప్రాజెక్టుల పరిధిలో కేంద్రం నుంచి రావాల్సిన బకాయిలు తదితరాలపై సమగ్ర వివరాలను క్రోడీకరించే పనిలో నిమగ్నమైంది.
10 లక్షల ఎకరాల ఆయకట్టు
రాష్ట్రాలు చేపట్టిన ప్రాజెక్టుల పరిధిలో 50 శాతం కన్నా ఎక్కువగా పనులు జరిగి ఉంటేనే కేంద్ర జల సంఘం ఆ ప్రాజెక్టును ఏఐబీపీ పథకం కింద చేరుస్తుంది. నిర్ణీత సమయంలో ప్రాజెక్టులను పూర్తి చేయని పక్షంలో గడువును కేవలం రెండుమార్లు మాత్రమే పొడగించి, ఆ తర్వాత జాప్యం చేస్తే నిధుల విడుదలను నిలిపేస్తుంది. రాష్ట్రంలో ఇప్పటికే ఏఐబీపీ, పీఎంఆర్‌ఎఫ్ కింద 1996-97 నుంచి ఇప్పటివరకు మొత్తంగా 16 ప్రాజెక్టులను చేపట్టారు. ఈ ప్రాజెక్టుల కింద ఖర్చయ్యే నిధులను కేంద్రం, రాష్ట్రం 1:3 నిష్పత్తిలో పంచుకుంటాయి.
16 ప్రాజెక్టులకు మొత్తంగా రూ.18,179 కోట్లు అంచనా వేయగా అందులో గతేడాది వరకు రూ.13,793 కోట్లు వరకు ఖర్చు చేశారు. ఇందులో ఏఐబీపీ కింద రూ.3,886 కోట్లు కేంద్రం అందించగా.. మరిన్ని నిధులు రావాల్సి ఉంది. ఇప్పటిదాకా వెచ్చించిన నిధులతో 4.04 లక్షల హెక్టార్లు (సుమారు 10 లక్షల ఎకరాలు) సాగులోకి వచ్చినట్లుగా అధికార లెక్కలు చెబుతున్నాయి. ఇంకా కొన్ని పనులు కొనసాగుతున్నాయి. వీటన్నింటినీ ప్రభుత్వం ప్రధానికి నివేదించనుంది.
బకాయిలు, అదనపు ప్రాజెక్టులపై
ఏఐబీపీ కింద చేర్చిన దేవాదుల ప్రాజెక్టుకు కేంద్రం నుంచి రూ.1,626 కోట్ల సాయం రావాల్సి ఉంది. ఇందులో ఇప్పటివరకు రూ.1,204.58 కోట్ల మేర సాయం అందగా మరో రూ.422 కోట్లు అందాల్సి ఉంది. 2012-13 నుంచి ఈ బకాయిలు విడుదల కావాల్సి ఉన్నా కేంద్రం ఆలస్యం చేస్తోంది. వీటిని త్వరగా విడుదల చేయాల్సిన అవసరాన్ని రాష్ట్ర ప్రభుత్వం ప్రధాని దృష్టికి తీసుకువెళ్లే అవకాశం ఉంది. వీటితోపాటు నిజాంసాగర్ ఆధునీకరణ, ఎస్సారెస్పీ వరద కాల్వ, మోదికుంట వాగు వంటి ప్రాజెక్టులను కొత్తగా ఏఐబీపీలో చేర్చాలని విన్నవించనుంది.
ఇందులో నిజాంసాగర్ ఆధునీకరణకు రూ.978 కోట్లు, మోదికుంటవాగుకు రూ.456 కోట్లతో రూపొందించిన ప్రతిపాదనలను ప్రధాని దృష్టికి తీసుకెళ్లనుంది. వీటితోపాటే ఇందిరమ్మ వరద కాల్వకు సంబంధించి సవరించిన అంచనా(రూ.5,887 కోట్లు)ను ఆమోదించాలని కోరనుంది. వీటితోపాటు కేంద్రం కొత్తగా చేపడుతున్న ప్రధానమంత్రి కృషి సించాయి యోజన(పీఎంకేఎస్‌వై) కింద ‘ప్రతి సాగుభూమికి నీరు’ పథకంలో.. రాష్ట్రం రూపొందించిన సమగ్ర సాగునీటి ప్రణాళిక ప్రగతిపై ప్రధాని ఆరా తీసే అవకాశం ఉందని నీటిపారుదల వర్గాలు తెలిపాయి.