AIBP
-
కాళేశ్వరానికి సాయమేది?
సాక్షి, హైదరాబాద్: కాళేశ్వరం ప్రాజెక్టు ముగింపు దశకు చేరుకుంటున్నా.. కేంద్రం నుంచి దక్కే ఆర్థిక సాయం మాత్రం తేలేలా లేదు. ఈ ప్రాజెక్టును సత్వర సాగునీటి ప్రాయోజిత కార్యక్రమం (ఏఐబీపీ)లో చేరుస్తామంటూ ఆరు నెలల కిందటే కేంద్రం సంకేతాలు ఇచ్చినా దీనిపై మళ్లీ ఊసే లేదు. అడపాదడపా ప్రాజెక్టుకు ఉన్న అనుమతులు, ఇతర అంశాలపై లేఖలు రాస్తున్నా.. ఇంతవరకు నయాపైసా విదల్చలేదు. దీంతో కేంద్ర నిధులపై రాష్ట్రం ఆశలు పూర్తిగా నీరుగారినట్లే కన్పిస్తున్నాయి. కాళేశ్వరం ప్రాజెక్టుకు జాతీయ హోదా అంశం ఎటూ తేలకపోవడంతో కనీసం ఏఐబీపీ పథకంలోనైనా చేర్చి ఆర్థిక సాయం చేయాలని రాష్ట్ర ప్రభుత్వం రెండున్నరేళ్ల కిందట కేంద్రాన్ని కోరింది. అప్పట్లోనే ప్రాజెక్టు డీపీఆర్ సమర్పించింది. గోదావరి నుంచి రోజుకు 2 టీఎంసీలను తీసుకుంటూ రూ.80,190 కోట్లతో ఎత్తిపోతల పథకాన్ని చేపట్టినట్లు వివరించింది. ఏఐబీపీలో ప్రాజెక్టును చేర్చాలని కోరే నాటికే ప్రాజెక్టు కింద సుమారు రూ.50 వేల కోట్ల మేర నిధులు ఖర్చు చేశామని, మిగతా నిధుల అవసరాలకు సాయం చేయాలని విజ్ఞప్తి చేసింది. ఈ ఏడాది మేలో ఏఐబీపీ పథకాన్ని 2026 వరకు పొడిగిస్తున్నట్లు నిర్ణయించి, అందులో కాళేశ్వరాన్ని చేర్చేందుకు సద్ధంగా ఉన్నట్లు తెలిపింది. ప్రాజెక్టు సమగ్ర వివరాలు కోరింది. దీంతో ఆ వివరాలను మరోసారి కేంద్రానికి పంపింది. దీనిపై పలుసార్లు పర్యావరణ, అటవీ అనుమతులు, టెక్నికల్ అడ్వైజరీ కమిటీ (టీఏసీ) అనుమతులు, కాస్ట్ అప్రైజల్ అనుమతులు, భూసేకరణ, ఆర్అండ్ఆర్ వివరాలు కోరగా, వాటినీ రాష్ట్ర ప్రభుత్వం సమర్పించింది. ఈ అన్ని అంశాలపై సమగ్ర పరిశీలన చేసిన కేంద్ర జల సంఘం (సీడబ్ల్యూసీ) పరిధిలోని మానిటరింగ్ అండ్ అప్రైజల్ డైరెక్టరేట్ ప్రాజెక్టును ఏఐబీపీలో చేర్చేందుకు అన్ని అర్హతలు ఉన్నాయంటూ కేంద్రానికి నివేదించింది. తర్వాత కూడా ప్రాజెక్టుపై చేసిన వ్యయం, రానున్న ఆర్థిక సంవత్సరాల్లో ప్రాజెక్టుపై వెచ్చించేందుకు నిర్ణయించిన బడ్జెట్‌పై వివరణలు కోరింది. ఇన్ని వివరాలు అడిగినా ఇప్పటివరకు ప్రాజెక్టును ఏఐబీపీలో చేరుస్తున్నట్లు కేంద్రం ఎలాంటి అధికారిక ఉత్తర్వులు జారీ చేయలేదు. అదనపు టీఎంసీ పనులకు కష్టమే.. ప్రాజెక్టు విస్తరణలో భాగంగా రూ.30 వేల కోట్లతో చేపట్టిన అదనపు టీఎంసీ పనులను ఏఐబీపీలో చేర్చాలని కోరుదామంటే, ఈ పనులన్నీ కొత్తగా చేపట్టినవని, వీటికి అపెక్స్ కౌన్సిల్ సహా, బోర్డుల అనుమతులు ఉండాలని కేంద్రం పేర్కొంటోంది. ఇప్పుడు చేర్చినా ఫలితం కొంతే.. కాళేశ్వరం మొత్తం వ్యయం రూ.80 వేల కోట్లలో ఇప్పటికే ప్రభుత్వం రూ.68 వేల కోట్ల మేర ఖర్చు చేసింది. ఈ నిధుల కోసం రుణ సంస్థల నుంచి నిధులు సేకరించింది. రుణాల ద్వారా సేకరించిన వాటి నుంచే రూ.45 వేల కోట్ల వరకు ఖర్చు జరిగింది. ఈ పరిస్థితుల్లో ప్రాజెక్టును ఏఐబీపీలో చేర్చినా పెద్దగా ఫలితం ఉండదని చెబుతున్నారు. మిగిలిన రూ.12 వేల కోట్ల పనుల్లో ఏఐబీపీ కింద కేంద్రం గరిష్టంగా రూ.3–5 వేల కోట్లు ఇచ్చినా.. ఆ నిధులతో ప్రాజెక్టుకు ఒరిగే ప్రయోజం ఏమీ ఉండదు. పైగా ఈ నిధులు ఇచ్చేందుకు కూడా కేంద్రం రెండు, మూడేళ్లు గడువు పెడుతోంది. అప్పట్లోగా ప్రాజెక్టు పనులన్నీ పూర్తవుతాయి. -
ఏఐబీపీ ప్రాజెక్టులన్నీ పూర్తికావాల్సిందే!
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో సత్వర సాగునీటి ప్రాయోజిత కార్యక్రమం (ఏఐబీపీ) కింద ఆర్థిక సాయం అందిస్తున్న ప్రాజెక్టులను పూర్తి చేసే విషయంలో కఠినంగా వ్యవహరించాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఏళ్లకు ఏళ్లు గడుస్తున్నా ప్రాజెక్టుల పనులు పూర్తి కాకపోవడం, పూర్తి ఆయకట్టుకు నీరివ్వకపోవడం పై గుర్రుగా ఉన్న కేంద్రం ఈ ఆర్థిక ఏడాది ముగిసేలోగా ప్రాజెక్టులన్నీ పూర్తి చేయాలని అన్ని రాష్ట్ర ప్రభుత్వాలను ఆదేశించింది. తెలంగాణకు సంబంధించి 8 ప్రాజెక్టులను వచ్చే ఏడాదిలోగా వంద శాతం పూర్తి చేయాలని ఆదేశాలు జారీ చేసిన కేంద్రం, పనుల పురోగతిపై ఈ నెల 31న సమీక్ష నిర్వహించనుంది. 8 ప్రాజెక్టులు.. 8 నెలలు... రాష్ట్రంలో ఏఐబీపీ కింద కేంద్రం ఆర్థిక సాయం అందిస్తున్న ప్రాజెక్టులు 11 ఉండగా అందులో గొల్లవాగు, రాలివాగు, మత్తడి వాగు పనులు పూర్తయ్యాయి. సుద్దవాగు, పాలెంవాగు, జగన్నా«థ్పూర్, భీమా, ఇందిరమ్మ వరద కాల్వ, దేవాదుల, ఎస్సారెస్పీ–2, కొమురం భీం ప్రాజెక్టులు పూర్తి చేయాలి. ఈ ప్రాజెక్టులకు రూ.19,500 కోట్లు ఖర్చు చేయగా, మరో రూ.2వేల కోట్లు మేర నిధుల అవసరాలున్నాయి. ఇందులో కేంద్రం సాయం రూ.4,500 కోట్లకుగాను ఇంకా రూ.175 కోట్లు నిధులు విడుదల కావాల్సి ఉంది. ఎస్సారెస్పీ స్టేజ్–2కి రూ.9 కోట్లు, దేవాదులకి రూ.145 కోట్లు, జగన్నాథ్‌పూర్‌కు రూ.6.50 కోట్లు, భీమాకు రూ.29 కోట్ల మేర నిధులు ఇవ్వాలి. ఈ నిధులను గత ఆర్థిక ఏడాదిలోనే విడుదల చేయాల్సి ఉన్నా కేంద్రం నయాపైసా ఇవ్వలేదు. ఈ ఏడాది ఆ నిధుల విడుదలకు సానుకూలంగా ఉంది. ఏఐబీపీ కింద ఉన్న కొన్ని ప్రాజెక్టులకు రాష్ట్రం తరఫున ఇవ్వాల్సిన నిధులను సమకూర్చడంలో ప్రభుత్వం వెనకాముందూ చేస్తోంది. దీనికి తోడు దేవాదుల పరిధిలోనే 2,400 ఎకరాలు, వరద కాల్వ కింద మరో 6వేల ఎకరాలు, ఎస్సారెస్పీ–2 కింద 700 ఎకరాలు మేర భూసేకరణ పనులు ముందుకు సాగడం లేదు. ఈ సేకరణను వేగవంతం చేసి పనులు ముగించి ఈ వానాకాలానికే 11 ప్రాజెక్టుల కింద నిర్ణయించిన 6.50 లక్షల ఎకరాలకు నీరివ్వాలని కేంద్రం ఆదేశించినా అది జరగలేదు. 4 లక్షల ఎకరాల్లో మాత్రమే నీరందించగలిగారు. అయితే వచ్చే ఏడాది మార్చి నాటికి అన్ని ప్రాజెక్టుల పనులను పూర్తి చేయాలని కేంద్రం కొత్త లక్ష్యాలను నిర్దేశించింది. దీనికి అనుగుణంగా నిధుల విడుదల చేసే అవకాశాలున్నాయి. కేంద్ర జల శక్తి శాఖ కార్యదర్శి ఈ నెల 31న రాష్ట్ర అధికారులతో ఢిల్లీ నుంచి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ఈ ప్రాజెక్టుల పురోగతిని సమీక్షించనున్నారు. పనుల పూర్తికి రాష్ట్రం తీసుకున్న చర్యలు, నిధుల వ్యయం, అవరోధాలు తదితరాలపై సమగ్ర నివేదికలతో సిద్ధం కావాలని జల శక్తి శాఖ సీనియర్ జాయింట్ కమిషనర్ ఏకే ఘా రాష్ట్రానికి లేఖ రాశారు. -
1.81 లక్షల ఎకరాలకు ‘సత్వర’ ఫలాలు
సాక్షి, అమరావతి: సత్వర సాగునీటి ప్రయోజన పథకం (ఏఐబీపీ) ద్వారా చేపట్టిన ఏడు ప్రాజెక్టుల కింద మిగిలిపోయిన ఆయకట్టుకు కూడా నీళ్లందించేలా రాష్ట్ర ప్రభుత్వం ప్రణాళిక రూపొందించింది. ఈ ప్రాజెక్టుల కింద బ్రాంచ్ కాలువలు, డిస్ట్రిబ్యూటరీలను పూర్తి చేయడం ద్వారా మిగిలిన ఆయకట్టుకు నీళ్లందించే పనులను రూ.971.39 కోట్లతో చేపట్టింది. ఇప్పటికే బ్రాంచ్ కాలువలు, డిస్ట్రిబ్యూటరీల పనులకు టెండర్ల ప్రక్రియను పూర్తి చేసిన జలవనరుల శాఖ అధికారులు తక్కువ ధరకు కోట్ చేసిన కాంట్రాక్టు సంస్థలకు అప్పగిస్తూ ఒప్పందం చేసుకున్నారు. వచ్చే ఏడాది నాటికి పనులను పూర్తి చేసి ఏడు ప్రాజెక్టుల కింద మిగిలిన 73,380 హెక్టార్ల (1,81,326 ఎకరాలు) ఆయకట్టుకు 2022 ఖరీఫ్‌లో నీళ్లందించేలా ప్రభుత్వం సన్నద్ధమైంది. 2009 నాటికే 4.76 లక్షల ఎకరాలకు నీటి సరఫరా.. సత్వర సాగునీటి ప్రయోజన పథకం ద్వారా 2005లో దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి గుండ్లకమ్మ, ముసురుమిల్లి, పుష్కర, తాడిపూడి, తారకరామతీర్థసాగరం, ఎర్రకాల్వ ప్రాజెక్టులను చేపట్టారు. ఇందులో తారకరామతీర్థసాగరం మినహా మిగిలిన ప్రాజెక్టులన్నీ అప్పట్లోనే పూర్తయ్యాయి. ఈ ప్రాజెక్టుల కింద 2,66,110 హెక్టార్లకుగానూ 1,92,730 హెక్టార్ల (4,76,245 ఎకరాలు) ఆయకట్టుకు ఇప్పటికే నీళ్లందించారు. పిల్ల కాలువల (డిస్ట్రిబ్యూటరీ) పనులు పూర్తికాకపోవడం వల్ల మరో 73,380 హెక్టార్ల ఆయకట్టుకు మాత్రం నీళ్లందించలేకపోయారు. 2009 తర్వాత మిగిలిన పనులను పూర్తి చేయడంలో అప్పటి ప్రభుత్వం విఫలం కావడంతో ఆయకట్టు అంతటికీ నీళ్లందించలేని దుస్థితి నెలకొంది. రైతులందరికీ ప్రాజెక్టుల ఫలాలు.. పూర్తయిన ప్రాజెక్టుల కింద మిగిలిపోయిన ఆయకట్టుకు కూడా నీళ్లందించడం ద్వారా రైతులందరికీ జలయజ్ఞం ఫలాలను అందించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఈ క్రమంలో ఏఐబీపీ కింద చేపట్టిన ప్రాజెక్టుల కింద ఆయకట్టుకు పూర్తి స్థాయిలో నీళ్లందించేందుకు చర్యలు చేపట్టాలని జలవనరుల శాఖను ఆదేశించింది. మిగిలిన పనులను పూర్తి చేయడానికి అవసరమైన నిధులను మంజూరు చేయడానికి రాష్ట్ర ప్రభుత్వం అంగీకరించింది. దీంతో వాటిని పూర్తి చేసేందుకు అధికారులు చర్యలు చేపట్టారు. ఆయకట్టు భూమిని చదును చేయడంతోపాటు సూక్ష్మనీటిపారుదల పథకం కింద యాజమాన్య పద్ధతుల ద్వారా నీటిని సరఫరా చేయనున్నారు. నీటి వృథాకు అడ్డుకట్ట వేసి తక్కువ నీటితో ఆయకట్టు అంతటికీ సమృద్ధిగా నీరు సరఫరా చేయడం ద్వారా రైతులకు ప్రయోజనం చేకూర్చనున్నారు. -
కాళేశ్వరానికి సాయం చేయండి
సాక్షి, హైదరాబాద్: ప్రతిష్టాత్మక కాళేశ్వరం ఎత్తిపోతల పథకానికి జాతీయ హోదా అంశంపై కేంద్ర ప్రభుత్వం నుంచి సానుకూల స్పందన లేకపోవడంతో కనీసం కేంద్ర ప్రభుత్వ పథకాల నుంచైనా సాయం తీసుకోవా లని రాష్ట్ర ప్రభుత్వం భావిస్తోంది. బృహత్తర లక్ష్యా లతో చేపట్టిన ప్రాజెక్టు నిర్మాణ పనుల్లో మున్ముందు ఖర్చు చేయాల్సిన నిధుల్లో కొంతైనా కేంద్రం నుంచి రాబట్టుకోవాలనే కృత నిశ్చయంతో ఉంది. ప్రధాన మంత్రి కృషి సించాయ్ యోజన (పీఎంకే ఎస్‌వై)లో భాగంగా ఉన్న సత్వర సాగునీటి ప్రాయోజిత కార్య క్రమం (ఏఐబీపీ)లో అయినా ఈ పథకాన్ని చేర్పించే దిశగా ప్రణాళి కలు రచిస్తోంది. ప్రాజెక్టు పూర్తికి ఇంకా రూ. 28 వేల కోట్ల మేర నిధుల అవసరాలను లెక్కగడుతున్న ప్రభుత్వం... వాటికి ఏమాత్రం కేంద్ర సాయమందించినా రాష్ట్రానికి పెద్ద ఊరటే అంటోంది. జాతీయ హోదా కాకున్నా.. కాళేశ్వరం ప్రాజెక్టుకు జాతీయ హోదా అంశం ఎప్పటి నుంచో ఉంది. రాష్ట్ర పునర్విభజన చట్టంలో తెలంగాణ లోని ఏదైనా ప్రాజెక్టులకు జాతీయ హోదా ఇవ్వాలనే అంశం స్పష్టంగా ఉందని, దానికి అనుగుణంగా కాళేశ్వరానికి జాతీయ హోదా ఇవ్వాలని ముఖ్యమంత్రి కేసీఆర్‌తోపాటు టీఆర్ఎస్, ఇతర పార్టీల ఎంపీలు పార్లమెంటు లోపలా, వెలుపల డిమాండ్ చేస్తున్నారు. జాతీయ హోదా విషయమై పలుమార్లు స్వయంగా సీఎం కేసీఆర్ ప్రదానికి విన్నవించారు. రెండోసారి మోదీ ప్రభుత్వం ఏర్పాటయ్యాక సైతం జరిగిన నీతి ఆయోగ్ భేటీలో రాష్ట్ర ప్రభుత్వం జాతీయ హోదా అంశాన్ని గుర్తుచేసింది. అనంతరం కేంద్ర బడ్జెట్ సందర్భంగా కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌కు దీనిపై వినతులు వెళ్లాయి. అయినా దీనిపై కేంద్రం నుంచి స్పందన రాలేదు. ఈ నేపథ్యంలో ఏఐబీపీ కింద ద్వారా అయినా నిధులు రాబట్టుకోవాలని ఆలోచిస్తోంది. నిజానికి ప్రాజెక్టు మొత్తం వ్యయం రూ. 80,190 కోట్లుగా ఉండగా అందులో ఇప్పటికే తెలంగాణ రూ. 51,666 కోట్ల మేర ఖర్చు చేసింది. మరో రూ. 28 వేల కోట్లు ఖర్చు చేయాల్సి ఉంది. ఈ నిధులకు ఏఐబీపీ కింద సాయం కోరే అవకాశం రాష్ట్రాలకు ఉంది. ఎలాంటి భారీ ప్రాజెక్టు పరిధిలో అయినా ప్రధాన పనుల్లో 50 శాతం పూర్తయితే ఏఐబీపీ కింద సాయం కోరవచ్చు. ప్రస్తుతం ప్రాజెక్టు పరిధిలో 65 శాతం పనులు పూర్తవగా రెండేళ్లలో ప్రాజెక్టును పూర్తి చేస్తామని ప్రభుత్వం చెబుతోంది. ఈ ప్రాజెక్టుకు ఇప్పటికే 9 రకాల అనుమతులు రాగా ఇంకా ఇన్వెస్ట్మెంట్ క్లియరెన్స్ రావాల్సి ఉంది. దీనికి కేంద్ర కేబినెట్ ఆమోదం తెలిపితే ఏఐబీపీ కింద నిధులు అందే అవకాశం ఉంటుంది. -
నీళ్లు పారాలంటే నిధులు రావాలి!
సాక్షి, హైదరాబాద్: కేంద్రం ప్రవేశపెట్టిన సత్వర సాగునీటి ప్రాయోజిక కార్యక్రమం(ఏఐబీపీ)లో చేర్చిన రాష్ట్ర ప్రాజెక్టులకు ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో కేంద్రం మొండిచేయి చూపింది. ప్రాజెక్టులకు ఆర్థికసాయం చేస్తామని అనేకమార్లు ఊదరగొట్టిన కేంద్రం ఏడాదిగా వాటిపై మౌనం వీడలేదు. 11 ప్రాజెక్టులకు రూ.564 కోట్ల మేర సాయం అందిస్తామని చెప్పి చిల్లిగవ్వ కూడా ఇవ్వకుండా సాగునీటి లక్ష్యాలను నీరుగారుస్తోంది. ఏఐబీపీ కింద రాష్ట్రంలోని కొమురంభీం, గొల్లవాగు, ర్యాలివాగు, మత్తడివాగు, పెద్దవాగు, పాలెంవాగు, ఎస్సారెస్పీ–2, దేవాదుల, జగన్నాథ్‌పూర్, భీమా, వరద కాల్వ ప్రాజెక్టులను కేంద్ర జలవనరుల శాఖ గుర్తించింది. ఈ ప్రాజెక్టుల నిర్మాణం కోసం మొత్తంగా రూ.24,719 కోట్లు అవసరం ఉండగా ఇందులో ఇప్పటికే 19,928 కోట్లు ఖర్చు చేశారు. మరో రూ.7,791 కోట్లు ఖర్చు చేయాల్సి ఉంది. ఈ నిధులకై ప్రభుత్వం కేంద్రాన్ని సంప్రదించి ఏఐబీపీ కింద నిధులు సమకూర్చి ఆదుకోవాలని కోరింది. దీనిపై సానుకూలంగా స్పందించిన జల వనరుల శాఖ కేంద్ర సాయం కింద రూ.4,513.19 కోట్లు ఇచ్చేందుకు సమ్మతించగా, ఇందులో 2017–18 ఆర్థిక సంవత్సరం వరకు రూ.3,949.19 కోట్లు విడుదల చేసింది. ఈ ఏడాది రూ.564.70 సాయం అందించాల్సి ఉంది. ఇందులో అధికంగా దేవాదులకు రూ.496 కోట్లు రావాల్సి ఉంది. నేడు రానున్న కేంద్ర బృందం.. ఏఐబీపీ నిధుల బకాయిలు, ప్రాజెక్టుల పురోగతిపై చర్చించేందుకు కేంద్ర జలవనరుల శాఖ కమిషనర్ ఒహ్రా నేతృత్వంలో బృందం గురువారం రాష్ట్రానికి రానుంది. 21 నుంచి 23వ తేదీ వరకు రాష్ట్రంలో పర్యటించి ప్రాజెక్టుల పనులను పరిశీలించనుంది. దీంతో కేంద్రం నుంచి రావాల్సిన నిధులపై అధికారులు కేంద్ర జలవనరుల శాఖ బృందానికి విన్నవించనున్నారు. ఆయకట్టు లక్ష్యాలకు దెబ్బ.. భూసేకరణ సమస్యలు, సహాయ పునరావాసం కొలిక్కి వచ్చినందున ప్రాజెక్టులను వేగంగా పూర్తి చేస్తామని రాష్ట్ర ప్రభుత్వం కేంద్రానికి చెబుతోంది. అయినా నిధులు మాత్రం రావటం లేదు. ఈ ప్రభావం ప్రాజెక్టుల ఆయకట్టు లక్ష్యాలపై పడుతోంది.11 ప్రాజెక్టుల్లో 6.36 లక్షల హెక్టార్లలో ఆయకట్టుకు నీరందించాల్సి ఉండగా, ఇంతవరకు 88,021 హెక్టార్లకే సాగునీరందింది. మరో 3.22 లక్షల హెక్టార్లకు నీరందించేలా పనులు సిద్ధం చేసినా, నీళ్లు రాక ఆయకట్టు సాగుకాలేదు. అయినా ఇంకా 2.26 లక్షల హెక్టార్లకు సాగునీరందించేలా పనులు జరగాల్సి ఉంది. ఇందులో దేవాదుల కిందే .248 లక్షల హెక్టార్లకు సాగునీరు అందించాల్సి ఉన్నా 1.25 లక్షల హెక్టార్లకు నీరందించే పనులు పూర్తయ్యాయి. మిగతా ఆయకట్టుకు ఈ ఖరీఫ్‌లో నీరందించాల్సి ఉన్నా అది అనుమానంగా ఉంది. ఎస్సారెస్పీ–2లోనూ 1.78లోల హెక్టార్లకు సాగునీరందించాల్సి ఉండగా, 1.38 లక్షల హెక్టార్లకు నీరందించే పనులు పూర్తి అయ్యాయి. మిగతా పనులు ఈ జూన్, జూలై నాటికి పూర్తి చేయాల్సి ఉంది. ఈ ప్రాజెక్టుకు కేంద్ర నుంచి 18.10 కోట్ల మేర నిధులు రావాల్సి ఉంది. ఇక భీమా పరిధిలోనే అదే పరిస్థితి నెలకొంది. ఈ నిధులు సకాలంలో అందితేనే వాటి పూర్తిసాధ్యం కానుంది. లేనిపక్షంలో లక్ష్యాలు నీరు గారిపోవడం ఖాయంగా ఉంది. -
నేడు పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీ పర్యటన
పోలవరం ప్రాజెక్టు పనులను పరిశీలించనున్న చైర్మన్, సభ్యులు సాక్షి, అమరావతి: పోలవరం ప్రాజెక్టు పనుల్ని పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీ(జలవనరుల విభాగం) శుక్రవారం క్షేత్రస్థాయిలో పరిశీలించనుంది. హుకుంసింగ్ నేతృత్వంలో 31 మంది సభ్యులతో ఏర్పాటైన ఈ కమిటీ విజయవాడ నుంచి శుక్రవారం ఉదయం 9 గంటలకు పోలవరానికి బయల్దేరనుంది. పోలవరం హెడ్ వర్క్స్(స్పిల్ వే, ఎర్త్ కమ్ రాక్ ఫిల్ డ్యామ్) పనుల్ని క్షేత్రస్థాయిలో పరిశీలించనుంది. అక్కడే అధికారులతో సమీక్ష నిర్వహిస్తుంది. తర్వాత తూర్పుగోదావరి జిల్లా పరిధిలో ఎడమ కాలువ.. పశ్చిమగోదావరి, కృష్ణా జిల్లాల పరిధిలో కుడి కాలువ పనుల్ని పరిశీలించి రాత్రికి విజయవాడకు చేరుకుంటుంది. శనివారం ఉదయం పది గంటలకు సత్వర సాగునీటి ప్రయోజన పథకం(ఏఐబీపీ) కింద చేపట్టిన ప్రాజెక్టులతోపాటు పోలవరం ప్రాజెక్టు పనులపై జలవనరులశాఖ అధికారులతో సమీక్ష నిర్వహిస్తుంది. అనంతరం మధ్యాహ్నం 12.55 గంటలకు ప్రత్యేక విమానంలో విశాఖపట్నానికి బయల్దేరి వెళ్తుంది. అక్కడ తోటపల్లి ప్రాజెక్టు పనులపై సమీక్ష నిర్వహిస్తుంది. రాష్ట్ర పరిధిలో వ్యాప్కోస్(వాటర్ అండ్ పవర్ కన్సల్టెన్సీ సర్వీసెస్) కార్యకలాపాల్ని సమీక్షించి.. శనివారం రాత్రికి విశాఖపట్నంలోనే బస చేస్తుంది. ఆదివారం ఉదయం 7.50 గంటలకు ప్రత్యేక విమానంలో విశాఖ నుంచి ఢిల్లీకి బయల్దేరి వెళ్తుంది. కమిటీలో ఆంధ్రప్రదేశ్ నుంచి ఎంపీలు మాగంటి మురళీమోహన్, ఎస్పీవై రెడ్డి, తెలంగాణ నుంచి బి.వినోద్‌కుమార్‌లు ప్రాతినిధ్యం వహిస్తున్నారు. -
11 ప్రాజెక్టులకు రూ.1,155 కోట్లు!
అంగీకరించిన కేంద్రం... నేడు మంత్రి హరీశ్‌రావు సమీక్ష సాక్షి, హైదరాబాద్: సత్వర సాగునీటి ప్రయోజన ప్రణాళిక (ఏఐబీపీ) కింద రాష్ట్రంలోని 11 సాగునీటి ప్రాజెక్టులకు రూ.1,155 కోట్ల గ్రాంటు ఇచ్చేందుకు కేంద్రం అంగీకరించింది. శ్రీకొమురంభీం, గొల్లవాగు, రల్లివాగు, మత్తడివాగు, నీల్వాయి ప్రాజెక్టు, జగన్నాథ ప్రాజెక్టు, పాలెం వాగు, ఎస్సారెస్పీ రెండో దశ, రాజీవ్ బీమా ఎత్తిపోతల పథకాలను కూడా ఏఐబీపీ కింద చేర్చాలని కేంద్ర జల వనరుల సమన్వయ కమిటీ సభ్యుడిగా ఉన్న మంత్రి హరీశ్‌రావు కేంద్రాన్ని కోరారు. అందుకు కేంద్రం అంగీకరించింది. దీంతో ఆ ప్రాజెక్టులకు గ్రాంటు ఇచ్చేందుకు కేంద్రం ఒప్పుకున్నట్లు హరీశ్ ఒక ప్రకటనలో తెలిపారు. మరోవైపు ఆ 11 ప్రాజెక్టులపై మంత్రి హరీశ్ శుక్రవారం సమీక్ష నిర్వహించనున్నారు. -
ఏఐబీపీ సాయం 60 శాతానికి పెంచాలి
కేంద్రానికి మంత్రి హరీశ్‌రావు విజ్ఞప్తి * తెలంగాణ నుంచి మరో నాలుగు ప్రాజెక్టులను ఏఐబీపీలో చేర్చాలి * జల వనరుల సమన్వయ కమిటీ భేటీకి మంత్రి హాజరు సాక్షి, న్యూఢిల్లీ: కేంద్ర జలవనరుల శాఖ పరిధిలోని సత్వర సాగునీటి ప్రాయోజిత (ఏఐబీపీ) పథకం కింద రాష్ట్రాల నీటి పారుదల ప్రాజెక్టులకు ప్రస్తుతం ఇస్తున్న నిధుల వాటాను 25% నుంచి 60 శాతానికి పెంచాలని రాష్ట్ర నీటి పారుదల శాఖ మంత్రి హరీశ్‌రావు కేంద్రానికి విజ్ఞప్తి చేశారు. అలాగే తెలంగాణలోని మరో నాలుగు ప్రాజెక్టులను ఈ పథకం కింద చేర్చాలని కోరారు. శనివారం కేంద్ర జలవ నరుల శాఖ కార్యాలయంలో తొలిసారిగా జల వనరుల సమన్వయ కమిటీ భేటీ అయింది. దేశవ్యాప్తంగా పీఎంకేఎస్‌వై పథకం అమలు తీరుతెన్నుల పరిశీలన, మెరుగైన విధానాలు తెచ్చేందుకు వీలుగా ఇటీవలే కేంద్రం ఈ కమిటీని ఏర్పాటు చేసింది. ఛత్తీస్‌గఢ్ నీటి పారుదల మంత్రి బ్రిజ్మోహన్ చైర్మన్‌గా ఉన్న ఈ కమిటీలో మహారాష్ట్ర నీటి పారుదల మంత్రి గిరీష్ మహాజన్, మంత్రి హరీశ్‌రావు సభ్యులుగా ఉన్నారు. ప్రాజెక్టులు వేగంగా పూర్తిచేయడం, కేంద్రం నుంచి అందాల్సిన సాయం వంటి అంశాలపై చర్చించేందుకు ఈ సమావేశాన్ని నిర్వహించారు. కేంద్ర జల వనరుల మంత్రి ఉమాభారతి కూడా ఇందులో పాల్గొన్నారు. కాగా ఈనెల 21వ తేదీన మరోసారి భేటీ నిర్వహించనున్నారు. దేశవ్యాప్తంగా నిర్మాణంలో ఉన్న ప్రాజెక్టుల్లో 2016-17, 2017-18లో పూర్తిచేయగలిగే ప్రాజెక్టులను పీఎంకేఎస్‌వై కింద తీసుకుని వేగంగా నిర్మించాలన్న లక్ష్యాన్ని సాధించేందుకు ఈ కమిటీ కేంద్రానికి పలు సిఫారసులు చేసింది. సమావేశం అనంతరం కేంద్ర జలవనరుల శాఖ సలహాదారు శ్రీరాం వెదిరెతో కలసి హరీశ్‌రావు మీడియాతో మాట్లాడారు. కరువు రాష్ట్రాలను ఆదుకోవాలి ‘ఏఐబీపీ కింద గతంలో 90% నిధులను కేంద్రం అందించేది. దాన్ని 60 శాతానికి తగ్గించారు. తెలంగాణలోగానీ, మహారాష్ట్రలోగానీ, అలాగే మరికొన్ని రాష్ట్రాల్లో ఏఐబీపీ సాయం 25 శాతమే ఉంది. నక్సల్స్ ప్రభావిత ప్రాంతాలు, కరువులో ఉన్న రాష్ట్రాలకు సాయం పెంచాల్సిన అవసరాన్ని చెప్పాం. 60 శాతం కేంద్రం, 40 శాతం రాష్ట్రాలు భరించేలా చూడాలని కోరాం. ఉదాహరణకు దేవాదుల, మరికొన్ని ప్రాజెక్టులకు 25 శాతం మాత్రమే ఉంది. అందువల్ల అన్నింటికీ 60 శాతానికి పెంచాలి. కేంద్ర సాయం లేకుండా ప్రాజెక్టులు త్వరితగతిన పూర్తిచేయడం సాధ్యం కాదు. క్లియరెన్స్‌లు ఆలస్యం చేయకుండా సీడబ్ల్యూసీ ప్రాంతీయ కార్యాలయాలను పటిష్టం చేయాలి. రాష్ట్రాల్లో ఉన్న సీడబ్ల్యూసీ అధికారులు ఇఎన్సీలతో ప్రతి నెలా సమీక్ష నిర్వహించాలి. కేంద్రం నుంచి కూడా ప్రతినెలా రాష్ట్రాలతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించాలని సిఫారసు చేశాం’ అని మంత్రి హరీశ్‌రావు తెలిపారు. ‘ 2012లో ఏఐబీపీ కింద చేపట్టిన ప్రాజెక్టులకు ఈరోజు కేవలం 20 శాతం ఎస్కలేషన్‌కు కేంద్రం అనుమతి ఇచ్చింది. అయితే ఆయా ప్రాజెక్టులకు 50 శాతం వరకు ఎస్కలేషన్ అవసరం ఉంది. అందువల్ల నాబార్డు నుంచి రుణం ఇప్పించాలని సూచించాం. ప్రాజెక్టులు మరింత వేగంగా పూర్తిచేసేలా అన్ని రకాలుగా ఆర్థిక వనరులు సమకూర్చాలి. దేవాదులకు ఈ ఏడాది రూ. 112 కోట్లు విడుదల చేయాల్సి ఉంది. దేవాదులతో పాటు శ్రీరాంసాగర్ వరద కాలువ పథకాన్ని, రాజీవ్ భీమా ఎత్తిపోతల పథకాన్ని, పెద్దవాగు(జగన్నాథ్‌పూర్), కొమురం భీం ప్రాజెక్టులను కూడా ఏఐబీపీలో చేర్చాలని కోరాం. కేంద్రం నుంచి రావాల్సిన గ్రాంట్లను ఏడాది చివరలో కాకుండా మొదటి నెలలోనే 50 శాతం విడుదల చేయాలని కూడా సిఫారసు చేశాం’ అని హరీశ్‌రావు తెలిపారు. -
ప్రాజెక్టుల ప్రగతి ఎంత?
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో నిర్మాణంలో ఉన్న సాగునీటి ప్రాజెక్టులకు కేంద్ర పథకాల నుంచి అందిన నిధులతో సాధించిన ప్రగతిపై ప్రధానమంత్రి నరేంద్రమోదీ సమీక్షించనున్నారు. ముఖ్యంగా సత్వర సాగునీటి ప్రయోజన కార్యక్రమం(ఏఐబీపీ), ప్రధాన మంత్రి సహాయ ప్యాకేజీ(పీఎంఆర్ఎఫ్) కింద రాష్ట్రాల్లో అమలు చేస్తున్న సాగునీటి పథకాలు, వాటి కింద ఖర్చు చేసిన నిధులు, అదనపు అవసరాలు, సాగులోకి తెచ్చిన ఆయకట్టు తదితరాలపై రాష్ట్ర ఉన్నతాధికారుల నుంచి వివరాలు తెలుసుకోనున్నారు. ఈ మేరకు ప్రగతి నివేదికలతో సిద్ధం కావాలని, ఈ నెల 27న ప్రధాని వాటిపై వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్షిస్తారని ఇప్పటికే ప్రధానమంత్రి కార్యాలయం(పీఎంవో).. రాష్ట్ర ప్రధాన కార్యదర్శి రాజీవ్‌శర్మకు సమాచారం పంపింది. దీంతో నీటి పారుదల శాఖ ఇప్పటివరకు చేపట్టిన పనులు, పలు ప్రాజెక్టుల పరిధిలో కేంద్రం నుంచి రావాల్సిన బకాయిలు తదితరాలపై సమగ్ర వివరాలను క్రోడీకరించే పనిలో నిమగ్నమైంది. 10 లక్షల ఎకరాల ఆయకట్టు రాష్ట్రాలు చేపట్టిన ప్రాజెక్టుల పరిధిలో 50 శాతం కన్నా ఎక్కువగా పనులు జరిగి ఉంటేనే కేంద్ర జల సంఘం ఆ ప్రాజెక్టును ఏఐబీపీ పథకం కింద చేరుస్తుంది. నిర్ణీత సమయంలో ప్రాజెక్టులను పూర్తి చేయని పక్షంలో గడువును కేవలం రెండుమార్లు మాత్రమే పొడగించి, ఆ తర్వాత జాప్యం చేస్తే నిధుల విడుదలను నిలిపేస్తుంది. రాష్ట్రంలో ఇప్పటికే ఏఐబీపీ, పీఎంఆర్ఎఫ్ కింద 1996-97 నుంచి ఇప్పటివరకు మొత్తంగా 16 ప్రాజెక్టులను చేపట్టారు. ఈ ప్రాజెక్టుల కింద ఖర్చయ్యే నిధులను కేంద్రం, రాష్ట్రం 1:3 నిష్పత్తిలో పంచుకుంటాయి. 16 ప్రాజెక్టులకు మొత్తంగా రూ.18,179 కోట్లు అంచనా వేయగా అందులో గతేడాది వరకు రూ.13,793 కోట్లు వరకు ఖర్చు చేశారు. ఇందులో ఏఐబీపీ కింద రూ.3,886 కోట్లు కేంద్రం అందించగా.. మరిన్ని నిధులు రావాల్సి ఉంది. ఇప్పటిదాకా వెచ్చించిన నిధులతో 4.04 లక్షల హెక్టార్లు (సుమారు 10 లక్షల ఎకరాలు) సాగులోకి వచ్చినట్లుగా అధికార లెక్కలు చెబుతున్నాయి. ఇంకా కొన్ని పనులు కొనసాగుతున్నాయి. వీటన్నింటినీ ప్రభుత్వం ప్రధానికి నివేదించనుంది. బకాయిలు, అదనపు ప్రాజెక్టులపై ఏఐబీపీ కింద చేర్చిన దేవాదుల ప్రాజెక్టుకు కేంద్రం నుంచి రూ.1,626 కోట్ల సాయం రావాల్సి ఉంది. ఇందులో ఇప్పటివరకు రూ.1,204.58 కోట్ల మేర సాయం అందగా మరో రూ.422 కోట్లు అందాల్సి ఉంది. 2012-13 నుంచి ఈ బకాయిలు విడుదల కావాల్సి ఉన్నా కేంద్రం ఆలస్యం చేస్తోంది. వీటిని త్వరగా విడుదల చేయాల్సిన అవసరాన్ని రాష్ట్ర ప్రభుత్వం ప్రధాని దృష్టికి తీసుకువెళ్లే అవకాశం ఉంది. వీటితోపాటు నిజాంసాగర్ ఆధునీకరణ, ఎస్సారెస్పీ వరద కాల్వ, మోదికుంట వాగు వంటి ప్రాజెక్టులను కొత్తగా ఏఐబీపీలో చేర్చాలని విన్నవించనుంది. ఇందులో నిజాంసాగర్ ఆధునీకరణకు రూ.978 కోట్లు, మోదికుంటవాగుకు రూ.456 కోట్లతో రూపొందించిన ప్రతిపాదనలను ప్రధాని దృష్టికి తీసుకెళ్లనుంది. వీటితోపాటే ఇందిరమ్మ వరద కాల్వకు సంబంధించి సవరించిన అంచనా(రూ.5,887 కోట్లు)ను ఆమోదించాలని కోరనుంది. వీటితోపాటు కేంద్రం కొత్తగా చేపడుతున్న ప్రధానమంత్రి కృషి సించాయి యోజన(పీఎంకేఎస్‌వై) కింద ‘ప్రతి సాగుభూమికి నీరు’ పథకంలో.. రాష్ట్రం రూపొందించిన సమగ్ర సాగునీటి ప్రణాళిక ప్రగతిపై ప్రధాని ఆరా తీసే అవకాశం ఉందని నీటిపారుదల వర్గాలు తెలిపాయి.