సాక్షి, హైదరాబాద్: ప్రతిష్టాత్మక కాళేశ్వరం ఎత్తిపోతల పథకానికి జాతీయ హోదా అంశంపై కేంద్ర ప్రభుత్వం నుంచి సానుకూల స్పందన లేకపోవడంతో కనీసం కేంద్ర ప్రభుత్వ పథకాల నుంచైనా సాయం తీసుకోవా లని రాష్ట్ర ప్రభుత్వం భావిస్తోంది. బృహత్తర లక్ష్యా లతో చేపట్టిన ప్రాజెక్టు నిర్మాణ పనుల్లో మున్ముందు ఖర్చు చేయాల్సిన నిధుల్లో కొంతైనా కేంద్రం నుంచి రాబట్టుకోవాలనే కృత నిశ్చయంతో ఉంది. ప్రధాన మంత్రి కృషి సించాయ్ యోజన (పీఎంకే ఎస్‌వై)లో భాగంగా ఉన్న సత్వర సాగునీటి ప్రాయోజిత కార్య క్రమం (ఏఐబీపీ)లో అయినా ఈ పథకాన్ని చేర్పించే దిశగా ప్రణాళి కలు రచిస్తోంది. ప్రాజెక్టు పూర్తికి ఇంకా రూ. 28 వేల కోట్ల మేర నిధుల అవసరాలను లెక్కగడుతున్న ప్రభుత్వం... వాటికి ఏమాత్రం కేంద్ర సాయమందించినా రాష్ట్రానికి పెద్ద ఊరటే అంటోంది.
జాతీయ హోదా కాకున్నా..
కాళేశ్వరం ప్రాజెక్టుకు జాతీయ హోదా అంశం ఎప్పటి నుంచో ఉంది. రాష్ట్ర పునర్విభజన చట్టంలో తెలంగాణ లోని ఏదైనా ప్రాజెక్టులకు జాతీయ హోదా ఇవ్వాలనే అంశం స్పష్టంగా ఉందని, దానికి అనుగుణంగా కాళేశ్వరానికి జాతీయ హోదా ఇవ్వాలని ముఖ్యమంత్రి కేసీఆర్‌తోపాటు టీఆర్‌ఎస్, ఇతర పార్టీల ఎంపీలు పార్లమెంటు లోపలా, వెలుపల డిమాండ్ చేస్తున్నారు. జాతీయ హోదా విషయమై పలుమార్లు స్వయంగా సీఎం కేసీఆర్ ప్రదానికి విన్నవించారు.
రెండోసారి మోదీ ప్రభుత్వం ఏర్పాటయ్యాక సైతం జరిగిన నీతి ఆయోగ్ భేటీలో రాష్ట్ర ప్రభుత్వం జాతీయ హోదా అంశాన్ని గుర్తుచేసింది. అనంతరం కేంద్ర బడ్జెట్ సందర్భంగా కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌కు దీనిపై వినతులు వెళ్లాయి. అయినా దీనిపై కేంద్రం నుంచి స్పందన రాలేదు. ఈ నేపథ్యంలో ఏఐబీపీ కింద ద్వారా అయినా నిధులు రాబట్టుకోవాలని ఆలోచిస్తోంది. నిజానికి ప్రాజెక్టు మొత్తం వ్యయం రూ. 80,190 కోట్లుగా ఉండగా అందులో ఇప్పటికే తెలంగాణ రూ. 51,666 కోట్ల మేర ఖర్చు చేసింది. మరో రూ. 28 వేల కోట్లు ఖర్చు చేయాల్సి ఉంది.
ఈ నిధులకు ఏఐబీపీ కింద సాయం కోరే అవకాశం రాష్ట్రాలకు ఉంది. ఎలాంటి భారీ ప్రాజెక్టు పరిధిలో అయినా ప్రధాన పనుల్లో 50 శాతం పూర్తయితే ఏఐబీపీ కింద సాయం కోరవచ్చు. ప్రస్తుతం ప్రాజెక్టు పరిధిలో 65 శాతం పనులు పూర్తవగా రెండేళ్లలో ప్రాజెక్టును పూర్తి చేస్తామని ప్రభుత్వం చెబుతోంది. ఈ ప్రాజెక్టుకు ఇప్పటికే 9 రకాల అనుమతులు రాగా ఇంకా ఇన్వెస్ట్‌మెంట్ క్లియరెన్స్ రావాల్సి ఉంది. దీనికి కేంద్ర కేబినెట్ ఆమోదం తెలిపితే ఏఐబీపీ కింద నిధులు అందే అవకాశం ఉంటుంది.
Comments
Please login to add a commentAdd a comment