సాక్షి, హైదరాబాద్: రాష్ట్రానికి జీవనాడిగా ఉన్న గోదావరి నదీ జలాలతో వచ్చే వానాకాలంలో సాగును సంబరంచేసే దిశగా ప్రభుత్వం బృహత్ కార్యాచరణ సిద్ధం చేస్తోంది. నీటి లభ్యత పుష్కలంగా ఉన్న ప్రాజెక్టులు, రిజర్వాయర్ల కింద రోహిణి కార్తెలోనే నారుమళ్లకు నీరు విడుదల చేయాలని యోచిస్తోంది. భారీ వర్షాలు కురిసి ప్రాజెక్టులకు నీరు చేరే వరకు వేచిచూడకుండా జూన్ తొలి వారం నాటికే తాగునీటిని పక్కనపెట్టి, సాగుకు నీటిని విడుదలచేసే అంశంపై దృష్టిపెట్టింది. దీంతో పాటే వర్షాలు పుంజుకొని వరద మొదలయ్యే నాటికి వచ్చిన నీటిని వచ్చినట్టు కాళేశ్వరం ద్వారా ఎత్తిపోసి తరలించే ఏర్పాట్లకు సిద్ధమవుతోంది. గోదావరి జలాల సమగ్ర వినియోగం, నీటి విడుదల వంటి అంశాలపై సీఎం కేసీఆర్ ఆదివారం జరిగే విస్తృత స్థాయి సమావేశంలో దిశానిర్దేశం చేయనున్నారు.
నికరం, మిగులు.. ఏదీ వదలొద్దు
రాష్ట్ర తాగు, సాగునీటి అవసరాలకు గోదావరే ప్రధాన నీటి వనరు. గోదావరీ జలాల్లో తెలంగాణకు 954 టీఎంసీల నికర జలాల వాటా ఉంది. ఇందులో ఇప్పటికే నిర్మాణం పూర్తయిన శ్రీరాంసాగర్, సింగూరు, నిజాంసాగర్ వంటి ప్రాజెక్టుల కింద ఏటా వినియోగం సరాసరిన 470 టీఎంసీల మేర ఉంది. మరో 520 టీఎంసీల నీటి వినియోగానికి వీలుగా తెలంగాణ వివిధ ప్రాజెక్టులు చేపట్టింది. ఇందులో ప్రధానంగా కాళేశ్వరం (180 టీఎం సీలు), దేవాదుల (60), తుపాకులగూడెం (100), సీతారామ (60) వంటి ఎత్తిపోతల పథకాలున్నాయి. వీటి ద్వారా 520 టీఎంసీల మేర నీరు వినియోగంలోకి రానుంది.
అయితే కాళేశ్వరం ద్వారా రోజుకు 3 టీఎంసీల మేర నీటిని 200 రోజుల పాటు తరలించి కనీసంగా 600 టీఎంసీల నీటిని ఎత్తిపోయాలని సీఎం పదేపదే చెబుతున్నారు. నీటి కొరత ఉన్న కృష్ణాబేసిన్‌కు వీటినే తరలిద్దామని చెబుతూ వివిధ ప్రణాళికలు సిద్ధం చేశారు. ఈ స్థాయిలో నీటిని తరలించాలంటే ప్రస్తుత నికర జలాల వాటాకు అదనంగా మరో 600 టీఎంసీల మిగులు వాటాను సాధించాలని ఇటీవలి సమీక్ష సందర్భంగా ముఖ్యమంత్రి సూచించిన విషయం తెలిసిందే. మిగులు జలాల వాటా వినియోగంపైనా ఆదివారం ముఖ్యమంత్రి సమీక్షించి, ఈ వాటాల సాధనపై మార్గదర్శనం చేయనున్నారు.
35 లక్షల ఎకరాలకు నెలాఖరు నుంచే నీళ్లు
ఈ వానాకాలంలో గోదావరి బేసిన్‌లో మేజర్, మీడియం, మైనర్ కింద కలిపి మొత్తంగా 35లక్షల ఎకరాలకు నీళ్లిచ్చేలా ప్రణాళిక రచిస్తున్నారు. ఇందులో ఎస్సారెస్పీ–1, 2 కింది ఆయకట్టే 13లక్షల ఎకరాలు ఉండగా, దేవాదుల కింద 2లక్షలు, మిడ్‌మానేరు, ఎల్లంపల్లి కింద లక్ష, కాళేశ్వరం కింద 2–3లక్షలు, వరద కాల్వ కింద మరో 2లక్షలు, కడెం కింద 40వేలు, కొమరంభీం, సాత్నాల, పెద్దవాగు వంటి మధ్యతరహా ప్రాజెక్టుల కింద 3లక్షలు, ఇక చెరువుల కింద ఉన్న 14లక్షల ఎకరాల్లో కనీసంగా 10లక్షల ఎకరాలకు నీళ్లివ్వాలని భావిస్తున్నారు.
ఇందులో ఎస్సారెస్పీలో ప్రస్తుతం 30 టీఎంసీల మేర నీటి లభ్యత ఉంది. ఇక్కడ ఉన్న నీటిలో తాగునీటికి 10 టీఎంసీలు పక్కనపెట్టి, మిగతా 20 టీఎంసీలను వానాకాలం నారుమళ్ల కోసం విడుదల చేయాలని భావిస్తున్నారు. ఈ నెల 25 నుంచి వచ్చే నెల 8 వరకు రోహిణి కార్తె ఉన్నందున అప్పటిలోగా నారుమళ్లకు నీటిని విడుదలచేస్తే మంచిదనే ఆలోచనలో ప్రభుత్వం ఉంది. దీనికి తోడు మిడ్‌మానేరులో 17.36, లోయర్ మానేరులో 9, కడెంలో 3.34 టీఎంసీల మేర నీటి లభ్యత ఉంది. ఇందులో తాగునీటిని పక్కనపెట్టి నారుమళ్లకు ముందే నీటిని విడుదలచేసే అంశమై ఆదివారం జరిగే సమావేశంలో ముఖ్యమంత్రి నిర్ణయం తీసుకునే అవకాశం ఉందని నీటిపారుదల వర్గాలు చెబుతున్నాయి.
వచ్చింది వచ్చినట్టే ఎత్తిపోత
జూన్ మూడో వారం నుంచి గోదావరిలో ప్రవాహాలు మొదలవుతాయి. ఈ నేపథ్యంలో వచ్చిన నీటిని వచ్చినట్టుగా మేడిగడ్డ నుంచి కాళేశ్వరం ద్వారా రోజుకు 2 టీఎంసీలకు తగ్గకుండా ఎత్తిపోసే అంశం సీఎం సమావేశంలో కీలకం కానుంది. ఇప్పటికే 2 టీఎంసీల నీటి ఎత్తిపోతలకు మోటార్లు సిద్ధంగా ఉండగా, ఆగస్టు 15 నుంచి మూడు టీఎంసీలు ఎత్తిపోసేలా పనులు కొనసాగుతున్నాయి.
కనీసంగా ఈ ఏడాది కాళేశ్వరం ద్వారా 200–300 టీఎంసీలు ఎత్తిపోసేలా కార్యాచరణ ఉంటుందని చెబుతున్నారు. ఈ నీటితో బ్యారేజీలు, రిజర్వాయర్లు, చెరువులు నింపుతూ ప్రతి నీటిచుక్క సద్వినియోగమయ్యేలా పక్కా ప్రణాళికను రూపొందించనున్నారు. ఇక కొండపోచమ్మకు జూన్–2న స్వయంగా ముఖ్యమంత్రి కేసీఆర్ నీటిని తరలించే మోటార్ ప్రారంభ కార్యక్రమంలో పాల్గొనే అంశంపైనా సమావేశంలో చర్చిస్తారు.
Comments
Please login to add a commentAdd a comment