స్టార్టప్‌ గుండె చప్పుడు ‘టీ–హబ్‌’ డబ్‌ | Second phase of T-Hub to be launched in Hyderabad by CM KCR | Sakshi
Sakshi News home page

స్టార్టప్‌ గుండె చప్పుడు ‘టీ–హబ్‌’ డబ్‌

Published Tue, Jun 28 2022 1:16 AM | Last Updated on Tue, Jun 28 2022 1:18 PM

Second phase of T-Hub to be launched in Hyderabad by CM KCR - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: వినూత్న ఆవిష్కరణలకు ఊతమిచ్చేందుకు రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన ప్రపంచంలోనే అతిపెద్ద టెక్నాలజీ ఇంక్యుబేటర్‌ ‘టీ–హబ్‌’ రెండో దశను సీఎం కె.చంద్రశేఖర్‌రావు మంగళవారం ప్రారంభించనున్నారు. రూ.400 కోట్లతో 3.62 లక్షల చదరపు అడుగుల వైశాల్యంలో నిర్మించిన ఈ రెండో దశలో.. ఒకే సమయంలో ఏకంగా రెండు వేలకుపైగా స్టార్టప్‌లు కార్యకలాపాలు నిర్వహించేందుకు వీలుండటం గమనార్హం. మంగళవారం సాయంత్రం 5 నుంచి 7 గంటల వరకు ఈ కార్యక్రమం కొనసాగుతుంది.

ఈ మేరకు ఏర్పాట్లను మంత్రి కేటీఆర్, ఐటీ శాఖ ముఖ్యకార్యదర్శి జయేశ్‌ రంజన్, టీఎస్‌ఐఐసీ ఎండీ ఈవీ నర్సింహారెడ్డి, టీ–హబ్‌ సీఈవో ఎం.శ్రీనివాస్‌రావు సోమవారం పరిశీలించారు. అతిపెద్ద టెక్నాలజీ ఇంక్యుబేటర్‌ కావడంతో ఈ కార్యక్రమానికి రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యతనిస్తోంది. మంగళవారం ఉదయమే సీఎం కేసీఆర్‌ టీ–హబ్‌ను ప్రారంభిస్తారని భావించినా.. ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు స్టార్టప్‌ రంగ నిపుణులతో సదస్సులు ఉండటంతో సాయంత్రానికి వాయిదా వేసినట్టు ప్రభుత్వ వర్గాలు చెప్తున్నాయి.

ఇక ప్రారంభోత్సవ కార్యక్రమానికి అడోబ్‌ చైర్మన్‌ శంతను నారాయణ్, సైయంట్‌ వ్యవస్థాపకుడు బీవీఆర్‌ మోహన్‌రెడ్డి, స్కైమోర్‌ వ్యవస్థాపకుడు దేశ్‌పాండ్, అథేరా వెంచర్స్‌ ఎండీ కన్వల్‌ రేఖి తదితరులతోపాటు సిలికాన్‌ వ్యాలీ ప్రముఖులు, పలు యూనికార్న్‌ల ప్రతినిధులు ఇందులో పాల్గొంటారు. ఈ సందర్భంగా కూ యాప్, హెచ్‌డీఎఫ్‌సీ, ఐసీఐసీఐ, హీరో మోటార్స్, పోంటాక్, వెబ్‌ 3.0లతో టీ–హబ్‌ ఎంఓయూలు కుదుర్చుకోనున్నట్టు అధికారులు తెలిపారు. ఉత్తమ స్టార్టప్‌లు, యూనికార్న్‌ల ప్రతినిధులను సన్మానించనున్నట్టు వెల్లడించారు. 

టీ–హబ్‌ భవనం లోపలి దృశ్యం, పరిశీలిస్తున్న కేటీఆర్‌. చిత్రంలో రంజిత్‌రెడ్డి 

టీ–హబ్‌ 2.0 ప్రత్యేకతలివీ.. 
2015లో గచ్చిబౌలిలోని ట్రిపుల్‌ ఐటీ ప్రాంగణంలో 70 వేల చదరపు అడుగుల విస్తీర్ణంలో టీ–హబ్‌ మొదటి దశ నిర్మించిన విషయం తెలిసిందే. అనూహ్య స్పందన లభించడం, అది విజయవంతం కావడంతో.. మరింత భారీగా టీ–హబ్‌ రెండో దశ (టీ–హబ్‌ 2.0)ను రాష్ట్ర ప్రభుత్వ నిధులతో నిర్మించారు. రూ.400 కోట్ల వ్యయంతో 3.70 లక్షల చదరపు అడుగుల విస్తీర్ణంలో నిర్మించిన టీ–హబ్‌ రెండో దశలో ఏకకాలంలో 4 వేల స్టార్టప్‌లకు అవసరమైన వసతి కల్పించవచ్చు.

తొలిదశతో పోలిస్తే ఐదు రెట్లు పెద్దదైన రెండోదశ ప్రపంచంలోనే అతిపెద్ద ఇంక్యుబేటర్‌గా అవతరించనుంది. టీ–హబ్‌ మొదటిదశలో ప్రాథమిక స్థాయి వసతులు అందుబాటులో ఉండగా.. తాజా రెండో దశలో అత్యాధునిక వసతులు జోడించారు. ‘స్పేసెస్‌’ అనే కొరియన్‌ సంస్థ టీ–హబ్‌ రెండో దశ భవనాన్ని అత్యంత సృజనాత్మకంగా ‘శాండ్‌ విచ్‌’ నమూనాలో డిజైన్‌ చేసింది. పది అంతస్తుల్లో టీ–హబ్‌ రెండో దశ నిర్మాణం కాగా.. ప్రస్తుతం ఐదు అంతస్తుల్లో కార్యకలాపాలు మొదలుకానున్నాయి.

ఈ ఏడాది చివర వరకు అదనంగా నెలకో అంతస్తు చొప్పున వినియోగంలోకి తేనున్నారు. ఇందులో కార్యాలయాలు ఏర్పాటు చేయాలనుకునే వెంచర్‌ క్యాపిటలిస్టులు, స్టార్టప్‌లు, ఇతర సంస్థలను నిపుణుల బృందం ఎంపిక చేస్తుంది. స్టార్టప్‌ సంస్కృతిని క్షేత్రస్థాయికి తీసుకెళ్లేందుకు రాబోయే రోజుల్లో వరంగల్, కరీంనగర్, ఖమ్మం, నిజామాబాద్, మహబూబ్‌నగర్‌లో టీ–హబ్‌ రీజినల్‌ సెంటర్లు ఏర్పాటు చేయనున్నారు. ఇక ఆవిష్కరణలకు రూపాన్ని ఇచ్చే ‘టీ–వర్క్స్‌’ను ఈ ఏడాది ఆగస్టులో, ఇమేజ్‌ సెంటర్‌ను మరో ఏడాదిన్నరలో ప్రారంభించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. 
 
రెండో దశలో ఎవరెవరికి అవకాశం 
► మొదటి అంతస్తును వెంచర్‌ క్యాపిటలిస్టుల ఆఫీసుల కోసం పూర్తి ఉచితంగా కేటాయిస్తారు. ఇప్పటివరకు రెండు వీసీలు తమ కార్యాలయాలను ఏర్పాటు చేసేందుకు ముందుకు వచ్చాయి. 
► ప్రస్తుతం ట్రిపుల్‌ ఐటీ ప్రాంగణంలో ఉన్న తెలంగాణ స్టేట్‌ ఇన్నోవేషన్‌ సెల్‌ను ఇక్కడికి తరలించడంతోపాటు ‘సైబర్‌ సెక్యూరిటీ సెంటర్‌ ఆఫ్‌ ఎక్సలెన్స్‌’, హైదరాబాద్‌లో సీఐఐ ఏర్పాటు చేయనున్న ‘సెంటర్‌ ఫర్‌ ఇన్నోవేషన్‌ అండ్‌ ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్‌’కు కార్యాలయ వసతి కల్పిస్తారు. 
► కేంద్ర ప్రభుత్వ ‘స్టార్టప్‌ ఇండియా’ స్టేట్‌ సెంటర్, కేంద్ర శాస్త్ర సాంకేతిక శాఖకు చెందిన ‘అటల్‌ ఇన్నోవేషన్‌ సెంటర్‌’ కూడా ఇక్కడే ఏర్పాటవుతాయి. 
► ప్రస్తుతం ట్రిపుల్‌ ఐటీ ప్రాంగణంలోని టీ–హబ్‌ మొదటి దశకు చెందిన 215 స్టార్టప్‌లను వెంటనే కొత్త ప్రాంగణంలోకి తరలిస్తారు.  
► ఇతర ఇంక్యుబేటర్లతో పోలిస్తే తక్కువ అద్దెకు ఆఫీస్‌ స్పేస్‌ లభిస్తుంది. 
► వ్యక్తిగతంగా లేదా ఒక చిన్న బృందంగా ఏర్పడి సరికొత్త ఆలోచనతో ముందుకొచ్చే వారికి.. వారి ఆలోచన వాణిజ్య రూపం పొందేందుకు అవసరమైన అన్ని హంగులు టీ–హబ్‌ 2లో అందుబాటులో ఉంటాయి. 

(ఫొటో గ్యాలరీ కోసం ఇక్కడ క్లిక్ చేయండి)
 
టీ–హబ్‌ తొలిదశ స్ఫూర్తితో! 
ట్రిపుల్‌ ఐటీ ప్రాంగణంలో 2015లో టీ–హబ్‌ తొలిదశ ఏర్పాటు చేశారు. అంతకుముందు హైదరాబాద్‌లో కేవలం ట్రిపుల్‌ ఐటీ, ఐఎస్‌బీ, జీనోమ్‌ వ్యాలీలో కలిపి మూడు ఇంక్యుబేటర్లు మాత్రమే ఉన్నాయి. టీ–హబ్‌ ఏర్పాటుతో ఆవిష్కరణల వాతావరణం పెరిగి ప్రస్తుతం 57 ఇంక్యుబేటర్లు పనిచేస్తున్నాయి. టీ–హబ్‌ తొలిదశ ప్రారంభం నుంచి ఇప్పటివరకు 1,100 స్టార్టప్‌లు మొదలవగా.. రూ.10 వేల కోట్ల ఫండింగ్‌ అందినట్టు అంచనా.

మూడు యూనికార్న్‌లు (స్టార్టప్‌లుగా ప్రస్థానం మొదలుపెట్టి రూ.8వేల కోట్ల టర్నోవర్‌కు చేరుకున్న సంస్థలు) ఇక్కడి నుంచే ప్రస్థానం ప్రారంభించగా.. అందులో రెండు యూనికార్న్‌లు నేరుగా టీ–హబ్‌తో సంబంధాన్ని కలిగి ఉన్నాయి. తొలిదశలో కృత్రిమ మేథ (ఏఐ) ఆధారిత టెక్నాలజీ స్టార్టప్‌లకు 20శాతం మేర కేటాయించారు. ఇదే తరహాలో రెండో దశలోనూ ఎమర్జింగ్‌ టెక్నాలజీ స్టార్టప్‌లకు ప్రాధాన్యత ఇస్తారు. 
– జయేశ్‌ రంజన్, ఐటీ, పరిశ్రమల శాఖ ముఖ్య కార్యదర్శి 

రెండో దశలో ఎవరెవరికి అవకాశం 
మొదటి అంతస్తును వెంచర్‌ క్యాపిటలిస్టుల ఆఫీసుకు ఉచితంగా కేటాయిస్తారు. ఇప్పటివరకు రెండు వీసీలు తమ కార్యాలయాలను ఏర్పాటు చేసేందుకు ముందుకు వచ్చాయి. 

కేంద్ర ప్రభుత్వ ‘స్టార్టప్‌ ఇండియా’ స్టేట్‌ సెంటర్, కేంద్ర శాస్త్ర సాంకేతిక శాఖకు చెందిన ‘అటల్‌ ఇన్నోవేషన్‌ సెంటర్‌’ కూడా ఇక్కడే ఏర్పాటవుతాయి. 

ప్రస్తుతం ట్రిపుల్‌ ఐటీ ప్రాంగణంలోని టీ–హబ్‌ మొదటి దశకు చెందిన 215 స్టార్టప్‌లను వెంటనే కొత్త ప్రాంగణంలోకి తరలిస్తారు.  

ప్రస్తుతం ట్రిపుల్‌ ఐటీ ప్రాంగణంలో ఉన్న తెలంగాణ స్టేట్‌ ఇన్నోవేషన్‌ సెల్‌ను ఇక్కడికి తరలించడంతోపాటు ‘సైబర్‌ సెక్యూరిటీ సెంటర్‌ ఆఫ్‌ ఎక్సలెన్స్‌’, హైదరాబాద్‌లో సీఐఐ ఏర్పాటు చేయనున్న ‘సెంటర్‌ ఫర్‌ ఇన్నోవేషన్‌ అండ్‌ ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్‌’కు కార్యాలయ వసతి కల్పిస్తారు. 

వ్యక్తిగతంగా లేదా చిన్నబృందంగా ఏర్పడి కొత్త ఆలోచనతో వచ్చే వారికి.. ఆ ఆలోచన వాణిజ్య రూపం పొందేందుకు అవసరమైన హంగులన్నీ ఇక్కడ అందుబాటులో ఉంటాయి. 

ఇతర ఇంక్యుబేటర్లతో పోలిస్తే తక్కువ అద్దెకు ఆఫీస్‌ స్పేస్‌ లభిస్తుంది.  

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement