ఆపద మొక్కులకు ఆగం కావొద్దు! | CM KCR in Sirisilla and Siddipet Public Meetings | Sakshi
Sakshi News home page

ఆపద మొక్కులకు ఆగం కావొద్దు!

Published Wed, Oct 18 2023 1:12 AM | Last Updated on Wed, Oct 18 2023 1:12 AM

CM KCR in Sirisilla and Siddipet Public Meetings - Sakshi

సిద్దిపేట రక్తమే నన్ను ఇంతటివాడిని చేసింది
యావత్‌ దేశం ఆశ్చర్యపడేలా.. తెలంగాణ రాష్ట్రాన్ని అన్ని రంగాల్లో ముందుకు తీసుకుపోతున్నానంటే ఈ గడ్డ పుణ్యమే. సిద్దిపేట నుంచి నాకు దొరికిన రక్తం, మాంసం, బుద్ధి, బలమే నన్ను ఇంతవాణ్ణి చేశాయి. చింతమడకలో అమ్మ చనుబాలు తాగే సమయంలో అమ్మకు ఆరోగ్యం దెబ్బతింటే ఊర్లో ఓ ముదిరాజ్‌ తల్లి నాకు చనుబాలు ఇచ్చి సాదింది. సిద్దిపేటే నన్ను సాది పెద్ద చేసి, చదువు చెప్పింది. రాజకీయంగా జన్మనిచ్చి నాయకుణ్ణి చేయడంతో పాటు తెలంగాణ ముఖ్యమంత్రి అయ్యేంత ఎత్తుకు తీసుకెళ్లింది. ఈ గడ్డ రుణం ఎన్నటికీ తీర్చుకోలేను.      
–కేసీఆర్‌ 

సాక్షి ప్రతినిధి, కరీంనగర్‌/ సాక్షి, సిద్దిపేట: ‘ఎన్నికల సమయంలో కొందరు ఆపద మొక్కులవారు వస్తారు. అలవిగాని హామీలతో మభ్యపెట్టాలని చూస్తారు. వారి మాటలు నమ్మి ఆగం కావొద్దు. మోటార్లకు మీటర్లు పెట్టేవారిని, మత పిచ్చోళ్లను కూడా నమ్మొద్దు. ముఖ్యంగా రైతులంతా అప్రమత్తంగా ఉండాలి. మూడేళ్లు కష్టపడి ధరణిని రూపొందించాం. గతంలో వీఆర్వో నుంచి రెవెన్యూ సెక్రటరీ దాకా ఎవరికి కోపమొచ్చినా రైతుల భూమి మాయమయ్యేది. కానీ ధరణితో రైతుల అనుమతి లేకుండా.. సీఎం కూడా రైతు భూమి జోలికి వెళ్లలేని స్థితి కల్పించాం.

ధరణిని బంగాళాఖాతంలో కలిపేస్తే.. రైతులు భూములపై ఆశలు వదులుకోవాల్సిందే..’ అని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు హెచ్చరించారు. సిద్దిపేట రక్తం, మాంసం, బుద్ధి, బలమే తనను ఇంతవాణ్ణి చేశాయన్నారు. సిరిసిల్లను సోలాపూర్‌లా మారుస్తామని, విద్యా కేంద్రంగా తీర్చిదిద్దుతామని హామీ ఇచ్చారు. మంగళవారం సిరిసిల్ల జిల్లా కేంద్రం, సిద్దిపేటల్లో జరిగిన ప్రజా ఆశీర్వాద సభల్లో ఆయన ప్రసంగించారు. 

కేసీఆర్‌ మొండిపట్టుతోనే 24 గంటల కరెంటు 
‘గత 60 ఏళ్ల కాంగ్రెస్‌ పాలనలో ఎక్కడ చూసినా కరెంటు కోతలు, ఆగిన మగ్గాలు, పాముకాట్లు, తేలు కాట్లతో రైతుల ప్రాణాలు పోవడం తప్ప వారు చేసిందేమీ లేదు. ప్రస్తుతం రైతులకు 24 గంటల ఉచిత కరెంటు ఇస్తున్నాం. కానీ కాంగ్రెస్‌ వాళ్లు 3 గంటలు మాత్రమే చాలు అంటున్నారు. మీకు 24 గంటలు కావాలా? 3 గంటలు కావాలా? (అంతా 24 గంటలు కావాలంటూ కేకలు వేశారు)  ప్రధాని మోదీ సొంత ఊర్లో కూడా 24 గంటల కరెంటు రావడం లేదు. కానీ మనకు అది ఎలా సాధ్యమైంది? కేవలం కేసీఆర్‌ మొండిపట్టు పట్టడం వల్లే.

ఇదొక్కటే కాదు..అన్ని రంగాల్లో తెలంగాణ నంబర్‌ 1గా ఉంది. విద్యుత్తు వినియోగం, ఇంటింటికీ నల్లా కనెక్షన్లలో దేశంలోనే మొదటి స్థానంలో ఉన్నాం. మోటార్లకు మీటర్లు అంటూ బీజేపీ వాళ్లు బెదిరించాలని చూసినా జంకలేదు. హిందు–ముస్లిం అంటూ మత విద్వేషాలు రెచ్చగొట్టే మతపిచ్చిగాళ్లు కూడా వస్తున్నారు. మనం ఏళ్లుగా గంగా జమునా తెహిజీబ్‌లా ఒకే కుటుంబంలా కలిసి ఉన్నాం. మన మధ్య పంచాయితీలు పెట్టేందుకు వచ్చే వారితో జాగ్రత్త..’ అంటూ కేసీఆర్‌ హెచ్చరించారు. 

నిరుపేదలకు సూపర్‌ ఫైన్‌ బియ్యం 
‘బీఆర్‌ఎస్‌ మేనిఫెస్టో గురించి కొత్తగా చెప్పేదేం లేదు. కల్యాణలక్ష్మి కింద తొలుత రూ.50 వేలు ఇచ్చాం. క్రమంగా దాన్ని రూ.లక్షకు పెంచాం. పింఛన్‌ కూడా రూ.1,000 నుంచి రూ.2,000 చేశాం. క్రమంగా దాన్ని రూ.5 వేలు చేస్తాం. కాళేశ్వరం దాని అనుబంధ ప్రాజెక్టుల కారణంగా రాష్ట్రంలో 30 కోట్ల టన్నుల ధాన్యం పండుతోంది. అందుకే నిరుపేదలకు సూపర్‌ ఫైన్‌ సన్న బియ్యం పంపిణీ చేయబోతున్నాం..’ అని తెలిపారు. 

సిరిసిల్లను షోలాపూర్‌గా మారుస్తాం.. 
‘నేను చదువుకుంటున్న రోజుల్లో ఎగువ మానేరు నీటితో కళకళలాడేది. ముస్తాబాద్‌లో పదుల సంఖ్యలో రైస్‌ మిల్లులు కూడా ఉండేవి. కానీ నేను సిద్దిపేట ఎమ్మెల్యే అయ్యాక.. సమైక్య పాలనలో మానేరు నీరు, రైస్‌ మిల్లులు క్రమంగా కనుమరుగయ్యాయి. కానీ తెలంగాణ వచ్చాక పరిస్థితి మారింది. ఒకప్పుడు ఎటుచూసినా కరువు నేలలతో ఉన్న సిరిసిల్ల నేడు నదులు, ప్రాజెక్టుల్లో నీటితో సజీవ జలధారగా మారింది. పచ్చటి పొలాలతో కళకళలాడుతోంది. ఉద్యమ సమయంలో సిరిసిల్లలో ఆత్మహత్యలు కలచివేసేవి.

సిరిసిల్ల ఎమ్మెల్యే, చేనేత మంత్రి కేటీఆర్‌ కావడం మీ అందరి అదృష్టం. చేనేత మగ్గం నడవాలి, నేత కార్మికులకు ఉపాధి రావాలని పట్టుబట్టి ఏటా రూ.300 కోట్ల నుంచి రూ.400 కోట్ల పనులను సిరిసిల్ల చేనేతలకు అప్పగించాడు. అన్ని మతాల పండగల సమయంలో పేదలు కొత్తబట్టలు కట్టుకోవాలన్న ఆశయంతో.. చీరలు పంపిణీ చేసే కార్యక్రమానికి శ్రీకారం చుట్టాం. కానీ కొందరు ఆ చీరలను కాల్చి, కార్యక్రమాన్ని అవమానించారు. భవిష్యత్తులో సిరిసిల్లను షోలాపూర్‌గా మారుస్తాం. విద్యా కేంద్రంగా తీర్చిదిద్దుతాం. కేటీఆర్‌ గురించి నా కంటే బాగా మీకే తెలుసు. మరోసారి ఆశీర్వదించండి..’ అంటూ కేసీఆర్‌ విజ్ఞప్తి చేశారు. 

ఉద్యమ విజయానికి పునాది ఇక్కడే... 
ఈ సభలో నాతో కలిసి పని చేసిన మిత్రులు, సహచరులు ఆత్మీయులు వందలాది మంది ఉన్నారన్నారు. కొండంరాజ్‌పల్లి మాదన్న.. మా నవాబ్‌ సాబ్‌.. నాకు డిపాజిట్‌ కట్టే తోర్నాల చంద్రారెడ్డి బావ ఎక్కడ ఉన్నడో. ఒక్కొక్కటీ జ్ఞాపకం చేసుకుంటే బాధేస్తుంది. తాగునీటి కోసం సిద్దిపేట పడ్డ తిప్పలు చెప్పలేం. లోయర్‌ మానేరు నుంచి నీళ్లు తెచ్చుకొని జలజాతర చేసుకున్నాం. సిద్దిపేట మంచినీళ్ల పథకమే మిషన్‌ భగీరథకు పునాది. దళితబంధుకు ప్రేరణ రామంచ గ్రామం. తెలంగాణ ఉద్యమం విజయం సాధించడానికి పునాది వేసింది కూడా సిద్దిపేట గడ్డనే..’ అని ముఖ్యమంత్రి చెప్పారు. 

ఆరడుగుల బుల్లెట్‌ హరీశ్‌రావు 
‘ఆరు అడుగుల బుల్లెట్‌ హరీశ్‌రావు.. నేను ఊహించిన దానికంటే ఎన్నో రెట్లు, బ్రహా్మండంగా సిద్దిపేటను అభివృద్ధి చేశాడు. హరీశ్‌రావు మీద ఒక జోక్‌ ఉంది. ‘అటు ఇటు తిరుగుతడు.. ఎక్కడన్నా ఓ తట్టెడు పెండ కనబడితే తీసుకుపోయి సిద్దిపేటలో వేసుకుంటడు’ అని చెబుతారు. ఇక్కడికి అన్నీ వచ్చాయ్‌. నీళ్లు, రైళ్లు వచ్చాయి. కన్నీరు కార్చిన సిద్దిపేటలో చెక్‌ డ్యాంలన్నీ పన్నీరు కారినట్టు మత్తళ్లు దుంకుతున్నాయి. ఒక్క ఎయిర్‌పోర్ట్‌ మాత్రమే రావాలి. హరీశ్‌ స్థానంలో నేనున్నా ఇంతలా చేసేవాడిని కాదేమో. అంత అద్భుతంగా పని చేస్తున్నాడు. గత ఎన్నికల రికార్డును తిరగరాసి భారీ మెజార్టీతో హరీశ్‌ను గెలిపించాలి..’ అని సీఎం కోరారు. 

ఎక్కడ నిలబడ్డా కోనాయిపల్లి వెంకటేశ్వస్వామి ఆశీర్వాదం 
‘కరీంనగర్, మహబూబ్‌నగర్‌ ఎంపీగా పోయినా.. గజ్వేల్‌ ఎమ్మెల్యేగా, రేపు కామారెడ్డి ఎమ్మెల్యేగా పోటీ చేస్తున్నా..కోనాయిపల్లి వెంకటేశ్వరస్వామి పాదాల వద్ద నామినేషన్‌ పత్రాలు పెట్టే పోతా అనే విషయం మీకు తెలుసు. బ్రహ్మాండంగా 50 ఏండ్లు కలిసిమెలిసి బతికిన బతుకులు మనవి..’ అని కేసీఆర్‌ పేర్కొన్నారు. సిరిసిల్ల సభలో కేటీఆర్‌ మాట్లాడుతూ.. ఒకప్పుడు కరువు నేలగా ఉన్న సిరిసిల్లను కాళేశ్వరం జలాలతో పచ్చగా మార్చిన ఘనత సీఎం కేసీఆర్‌కే దక్కుతుందని అన్నారు.

సిరిసిల్ల సాధించిన అభివృద్ధి, ఇక్కడి భూగర్భ జలాల గురించి ట్రైనీ ఐఏఎస్‌లు తమ శిక్షణలో భాగంగా తెలుసుకునే స్థాయికి కేసీఆర్‌ చేర్చారని కొనియాడారు. సిద్దిపేట ప్రజలు చూపిస్తున్న అభిమానానికి తన చర్మం వలిచి చెప్పులు కుట్టించినా తక్కువేనని అక్కడి సభలో మాట్లాడుతూ మంత్రి హరీశ్‌రావు అన్నారు. చివరి శ్వాస ఉన్నతం వరకు సీఎం కేసీఆర్‌కు, నియోజకవర్గ ప్రజలకు రుణపడి ఉంటానని చెప్పారు.   

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement