హైదరాబాద్‌లోని హరిత ప్లాజా హోటల్‌లో ప్రజాప్రతినిధులు, పక్కనే ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరిరెడ్డి
సీన్ –1
హైదరాబాద్ బేగంపేటలోని హరిత ప్లాజా..
జనగామ నియోజకవర్గానికి చెందిన బీఆర్‌ఎస్ స్థానిక సంస్థల నేతలు భేటీ అయ్యారు. సిట్టింగ్ ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరిరెడ్డికి వ్యతిరేకంగా.. ఈసారి జనగామ బీఆర్‌ఎస్ టికెట్‌ను ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్‌రెడ్డికి ఇవ్వాలంటూ వారు సమావేశమయ్యారు. ఈ సమాచారం తెలిసిన ఎమ్మెల్యే ముత్తిరెడ్డి నేరుగా హరిత ప్లాజాకు వెళ్లడం, అక్కడి నేతలతో వాగ్వాదం వంటివి జరిగాయి. అసమ్మతి భేటీకి వచ్చినవారిలో ముఖ్య నేతలెవరూ లేరని ముత్తిరెడ్డి ప్రకటించగా.. నియోజకవర్గంలోని మున్సిపల్ చైర్మన్లు, పలువురు సర్పంచ్‌లు, ఇతర ప్రజా ప్రతినిధులు భేటీకి వచ్చినట్టు అసమ్మతి వర్గం తెలిపింది.
సీన్ –2
మంథని నియోజకవర్గంలో..
ఆ నియోజకవర్గానికి చెందిన బీఆర్‌ఎస్ స్థానిక ప్రజాప్రతినిధులు మీడియా సమావేశం పెట్టారు. మంథని మాజీ ఎమ్మెల్యే, పెద్దపల్లి జెడ్పీ చైర్మన్ పుట్ట మధుకు ఈసారి బీఆర్‌ఎస్ టికెట్ ఇవ్వొద్దంటూ బహిరంగంగా డిమాండ్ చేశారు. ఆయన పార్టీ నేతలను పట్టించుకోవడం లేదని ఆరోపించారు. ఇతరులకు ఎవరికి బీఆర్‌ఎస్ టికెట్ ఇచ్చినా గెలిపించుకుంటామని పార్టీ అధిష్టానానికి విజ్ఞప్తి చేశారు. పుట్టమధుకు వ్యతిరేకంగా త్వరలో నియోజకవర్గంలో పాదయాత్ర చేపడతామనీ ప్రకటించారు.
..అసెంబ్లీ ఎన్నికలు దగ్గరపడుతున్నకొద్దీ అధికార బీఆర్‌ఎస్‌లో సిట్టింగ్ ఎమ్మెల్యేలపై అసమ్మతి సెగలు బయటపడుతున్నాయి. ఆయా ఎమ్మెల్యేల తీరుపై అసంతృప్తిగా ఉన్నవారు, టికెట్ ఆశిస్తున్న ఇతర నేతల అనుచరులు బహిరంగంగానే ఈ వ్యతిరేకతను బయటపెడుతున్నారు. ఇప్పటికే కల్వకుర్తి, దేవరకొండ, చొప్పదండి, రామగుండం, నాగార్జున సాగర్, కోదాడ.. ఇప్పుడు జనగామ, మంథని.. ఇలా చాలాచోట్ల అసమ్మతి వ్యక్తమవుతోంది. వీటిపై దృష్టిపెట్టిన బీఆర్‌ఎస్ అధినేత, సీఎం కేసీఆర్.. చక్కదిద్దేందుకు చర్యలు చేపట్టినట్టు పార్టీ వర్గాలు చెప్తున్నాయి.
సాక్షి, హైదరాబాద్: అసెంబ్లీ ఎన్నికలకు పార్టీ అభ్యర్థుల జాబితాను విడుదల చేసేందుకు బీఆర్‌ఎస్ అధినేత, సీఎం కె.చంద్రశేఖర్‌రావు సన్నాహాలు చేస్తున్నారనే సంకేతాలు ఆ పార్టీలో ‘లొల్లి’ రేపుతున్నాయి. సిట్టింగ్ స్థానాల్లో అసమ్మతులు, ఆశావహుల ప్రయత్నాలతో నియోజకవర్గాల్లో నేతల మధ్య విభేదాలు బలంగా తెరపైకి వస్తున్నాయి. సిట్టింగ్ ఎమ్మెల్యేలను తప్పించి తమకు అవకాశం ఇవ్వాలని కొందరు నేతలు నేరుగా కోరుతుండగా.. మరికొందరు తెర వెనుక అసమ్మతిని రాజేస్తున్నారు.
మరికొన్నిచోట్ల ఎమ్మెల్యేలు తమను పట్టించుకోవడం లేదని, పైగా పోలీసు కేసులు, ఇతర రూపాల్లో వేధిస్తున్నారని నియోజకవర్గ స్థాయిలో నాయకులు, కార్యకర్తలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇలాంటి వారిలో తాజా, మాజీ జెడ్పీటీసీలు, ఎంపీపీలు, ఎంపీటీసీలు, సర్పంచ్‌లు, పీఏసీఎస్ చైర్మన్లు, ఇతర గ్రామ, మండల స్థాయి క్రియాశీల నేతలు ఉంటుండటం గమనార్హం. అంతర్గత భేటీలే కాకుండా మీడియా సమావేశాలు పెట్టి మరీ తమ అసమ్మతిని, అసంతృప్తిని వెళ్లగక్కుతున్నారు.
అసమ్మతి పెరిగితే నష్టమనే అంచనాతో..
పార్టీ టికెట్ల కేటాయింపుపై కసరత్తు చేస్తున్న సీఎం కేసీఆర్‌కు రాష్ట్రవ్యాప్తంగా ఏయే నియోజకవర్గాల్లో ఇలాంటి పరిస్థితి ఉందనే నివేదికలు అందుతున్నట్టు సమాచారం. వివిధ సందర్భాల్లో పార్టీలో చేరిన నేతలు, సిట్టింగ్‌లు సహా చాలా మందిపై క్షేత్రస్థాయి నుంచి ఆరోపణలు వస్తున్నాయని.. ఏకపక్ష ధోరణి, బంధుప్రీతి, అవినీతి, గ్రామస్థాయి నుంచి నియోజకవర్గ స్థాయి వరకు అన్ని విషయాల్లో జోక్యం, పోలీసు, రెవెన్యూ అధికారులతో సొంత పార్టీ నేతలనే ఇబ్బందులకు గురిచేయడం వంటి అంశాలు నివేదికల్లో ఉన్నాయని తెలిసింది.
పార్టీ కేడర్‌ను ఎన్నికల దిశగా సన్నద్ధం చేసేందుకు నిర్వహించిన ఆత్మీయ సమ్మేళనాలను విశ్లేషించగా.. చాలాచోట్ల విభేదాలు సమసిపోలేదని గుర్తించినట్టు తెలిసింది. రాష్ట్ర ప్రభుత్వ పాలన, కేసీఆర్ విధానాల పట్ల క్షేత్రస్థాయిలో ‘ఫీల్ గుడ్’ భావన ఉన్నా.. పార్టీ నేతల మధ్య కలహాలు నష్టం చేస్తాయని కేసీఆర్ ఆలోచనకు వచ్చారని పార్టీ వర్గాలు చెప్తున్నాయి.
వీలైనంత త్వరగా టికెట్ కేటాయింపు
అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తున్న కొద్దీ అసమ్మతి కార్యకలాపాలు పెరిగే అవకాశం ఉందని, వీలైనంత త్వరగా చెక్‌పెట్టాలని కేసీఆర్ భావిస్తున్నట్టు సమాచారం. ఎర్రవల్లి ఫామ్‌హౌజ్‌లో ఇటీవల పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, మంత్రులు హరీశ్‌రావు, జగదీశ్‌రెడ్డి తదితరులతో జరిపిన భేటీలో అసమ్మతుల కట్టడికి వ్యూహాన్ని ఖరారు చేసినట్టు తెలిసింది. ‘‘వీలైనంత త్వరగా అభ్యర్థులను నిర్ణయించాలని సీఎం కేసీఆర్‌ను కోరాం.
సిట్టింగ్‌లకు ఇవ్వాలా, అవసరమైన చోట కొత్త వారికి ఇవ్వాలా అనేది పూర్తిగా ఆయనే చూసుకుంటారు. త్వరగా అభ్యర్థులను ప్రకటించడం ద్వారా పార్టీ లో ఉండేదెవరో, వీడేదెవరో అన్నదానిపై స్పష్టత వస్తుంది. తద్వారా అసమ్మతి కట్టడి, ఇతర పార్టీల నుంచి చేరికలు, ప్రచారం తదితర అంశాలపై దృష్టి కేంద్రీకరించేందుకు అవకాశం కలుగుతుందని కేసీఆర్‌కు వివరించాం’’ అని పార్టీ సీనియర్ నేత ఒకరు తెలిపారు.
కేటీఆర్, హరీశ్ సహా కీలక నేతలకు బాధ్యతలు
అసమ్మతులు, అసంతృప్తుల సమస్యను చక్కదిద్దే పనిని మంత్రులు కేటీఆర్, హరీశ్‌రావు, కొప్పుల ఈశ్వర్, గంగుల కమలాకర్, పువ్వాడ అజయ్, ఎమ్మెల్సీ కవిత వంటి కీలక నేతలకు కేసీఆర్ అప్పగించినట్టు తెలిసింది. వేములవాడలో కేటీఆర్, హుస్నాబాద్, మెదక్, జహీరాబాద్‌లో హరీశ్‌రావు, రామగుండంలో కొప్పుల ఈశ్వర్, చొప్పదండిలో గంగుల కమలాకర్, ఉమ్మడి ఖమ్మం జిల్లాలో పువ్వాడ అజయ్, బోధన్, జగిత్యాలలో ఎమ్మెల్సీ కవిత, మానకొండూరులో మాజీ ఎంపీ వినోద్ ఇప్పటికే రంగంలోకి దిగి దిద్దుబాటు చర్యలు ప్రారంభించారు.
వరుసగా.. అసంతృప్తి సెగలు!
► కల్వకుర్తి ఎమ్మెల్యే జైపాల్ యాదవ్‌కు టికెట్ కేటాయించవద్దంటూ ఎమ్మెల్సీ కసిరెడ్డి నారాయణరెడ్డి, మాజీ మంత్రి చిత్తరంజన్‌దాస్, జెడ్పీ వైస్‌చైర్మన్ బాలాజీసింగ్ తదితరులు ఇటీవల సమావేశమై పార్టీ అధిష్టానానికి విజ్ఞప్తి చేశారు.
► దేవరకొండ ఎమ్మెల్యే రవీంద్రకుమార్‌కు టికెట్ ఇవ్వద్దంటూ మున్సిపల్ మాజీ చైర్మన్ వడ్త్యా దేవేందర్ నాయక్, మరో 70 మంది ముఖ్య కార్యకర్తలు డిండి మండలం రుద్రాయిగూడంలో సమావేశమై తీర్మానించారు. ఎమ్మెల్యే తీరుపై విమర్శలు చేశారు.
► చొప్పదండి ఎమ్మెల్యే సుంకె రవిశంకర్‌ను వచ్చే ఎన్నికల్లో అభ్యర్థిగా తప్పించాలంటూ స్థానిక నేతలు కొందరు సీఎంకు ఫిర్యాదు చేశారు.
► రామగుండం ఎమ్మెల్యే కోరుకంటి చందర్‌కు వ్యతిరేకంగా అసంతృప్తి నేతలు ఏకమయ్యారు. కేటీఆర్ స్వయంగా రంగంలోకి దిగి సర్దుబాటు చేసుకోవాలని నచ్చచెప్పినా.. అక్కడ అసమ్మతి నేతలు, ఎమ్మెల్యే మధ్య పంచాయతీ కొనసాగుతూనే ఉంది.
► నాగార్జునసాగర్, కోదాడ, మహబూబాబాద్, మహేశ్వరం, తాండూరు, ఉప్పల్, పెద్దపల్లి, ఇల్లందు, మెదక్ అసెంబ్లీ నియోజకవర్గాల్లోకూడా పార్టీ ఎమ్మెల్యేలపై పార్టీ నేతలే బహిరంగంగా వ్యతిరేకత చూపుతున్నారు.
► కోదాడలో బొల్లం మల్లయ్య యాదవ్‌పై పలు ఆరోపణలు వస్తుండటంతో ఆయనను మార్చాలన్న డిమాండ్ వినిపిస్తోంది. అక్కడ మరో బీసీకి అవకాశం ఇస్తారని, జూలూరి గౌరీ శంకర్ పేరు తెరపైకి వస్తోందని ప్రచారం జరుగుతోంది.
► రాష్ట్రవ్యాప్తంగా మరో 30కి పైగా అసెంబ్లీ నియోజకవర్గాల్లో సిట్టింగ్ ఎమ్మెల్యేలకు వ్యతిరేకంగా సొంత పార్టీలోనే అసమ్మతి వ్యక్తమవుతోంది.
‘పుట్ట మధుకు టికెట్ ఇవ్వొద్దు’
ముత్తారం (మంథని): మంథని మాజీ ఎమ్మెల్యే, పెద్దపల్లి జెడ్పీ చైర్మన్ పుట్ట మధుకు ఈసారి బీఆర్‌ఎస్ నుంచి టికెట్ ఇవ్వొద్దని అసమ్మతి నేతలు డిమాండ్ చేశారు. ఈ మేరకు బుధవారం రామగిరి ఎంపీపీ అరెల్లి దేవక్క, మాజీ జెడ్పీటీసీలు నాగినేని జగన్మోహన్‌రావు, మైదం భారతి, దుర్గం మల్లయ్య, బండం వసంతరెడ్డి, పలువురు సర్పంచులు, మాజీ ఎంపీటీసీలు మీడియాతో మాట్లాడారు.
బీఆర్‌ఎస్ కార్యకర్తలు, నాయకులను పుట్ట మధు పట్టించుకోవడం లేదని, నియంత పోకడలతో అవమానపరుస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఆయన సొంత ఎజెండాను మంథనిలో అమలుపరుస్తూ.. పార్టీ కోసం పనిచేస్తున్న వారిని పక్కన పెడుతున్నారని మండిపడ్డారు. మంథని టికెట్ పుట్ట మధుకు ఇవ్వవద్దని, ఆయనకు తప్ప ఎవరికి ఇచ్చినా భారీ మెజారిటీతో గెలిపించుకుంటామని చెప్పారు. పుట్ట మధుకు వ్యతిరేకంగా త్వరలో నియోజకవర్గంలో పాదయాత్ర చేస్తామన్నారు.
జనగామ ‘టికెట్’ రాజకీయం!
హైదరాబాద్ హరిత ప్లాజాలో ‘పల్లా’ క్యాంపు అసమ్మతి నేతలు
జనగామ: జనగామ నియోజకవర్గం బీఆర్‌ఎస్ టికెట్ లొల్లి హైదరాబాద్‌కు చేరింది. బుధవారం ఇక్కడి బేగంపేటలోని హరిత ప్లాజాలో అసమ్మతి నేతల సమావేశం హాట్‌టాపిక్‌గా మారింది. సిట్టింగ్ ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరిరెడ్డికి వ్యతిరేకంగా నియోజకవర్గంలోని 8 మండలాల నుంచి ప్రజాప్రతినిధులు, ముఖ్య నేతలు ఇందులో పాల్గొన్నారు. ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్‌రెడ్డి పిలుపుమేరకు.. జెడ్పీ చైర్మన్, బీఆర్‌ఎస్ జనగామ జిల్లా అధ్యక్షుడు పాగాల సంపత్‌రెడ్డి నేతృత్వంలో ఈ భేటీ జరిగిందని, పల్లాకు టికెట్ ఇవ్వాలనే డిమాండ్‌తో సీఎంను కలవాలని వారు నిర్ణయించారని విశ్వసనీయ సమాచారం.
వారికి సీఎం అపాయింట్‌మెంట్ కూడా దొరికిందని, ఆయన నుంచి పిలుపు కోసం ఎదురుచూస్తూ హరిత ప్లాజాలో వేచి ఉన్నారని తెలిసింది. అయితే.. ఈ సమావేశం విషయం తెలిసిన ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరిరెడ్డి నేరుగా అక్కడికి వెళ్లారు. అకస్మాత్తుగా సమావేశ గది తలుపులు తీసుకునిలోనికి వెళ్లిన ఆయనను చూసి.. అసమ్మతి నేతలు కొంత ఉలికిపాటుకు గురయ్యారు.
ఇక్కడికి ఎందుకు వచ్చారని నేతలను ఎమ్మెల్యే అడగడంతో.. మంత్రి హరీశ్‌రావును కలిసేందుకు వచ్చామని, రాజకీయమేదీ లేదని చెప్పుకొచ్చారు. దీంతో ముత్తిరెడ్డి స్పందిస్తూ.. ప్రగతిభవన్‌కు తీసుకెళ్తానని, తనతో రావాలని వారితో చెప్పగా, తాము విడిగానే కలుస్తామని పేర్కొన్నట్టు తెలిసింది. ఈ సమయంలో సదరు స్థానిక ప్రజాప్రతినిధులు, ఎమ్మెల్యే మధ్య వాగ్వాదం జరిగినట్టు సమాచారం.
‘పల్లా’కు అనుకూలంగా..
జనగామ నుంచి పల్లా రాజేశ్వర్‌రెడ్డికి అవకాశం కల్పించాలని నియోజకవర్గంలోని కొందరు ముఖ్యనేతలు, ప్రజా ప్రతినిధులు కోరుతున్నారు. ఇందులో భాగంగా నర్మెట పీఏసీఎస్ చైర్మన్ పెద్ది రాజరెడ్డి, రైతు సమన్వయ సమితి జిల్లా అధ్యక్షుడు ఇర్రి రమణారెడ్డి, మద్దూరు ఎంపీపీ బద్దిపడగ కృష్ణారెడ్డి, జనగామ మున్సిపల్ చైర్‌పర్సన్ పోకల జమునలింగయ్య, నాగిళ్ల తిరుపతిరెడ్డి, చేర్యాల మున్సిపల్ చైర్‌పర్సన్ భర్త అంకుగాని శశిధర్‌రెడ్డి, జిల్లా ఆస్పత్రి సూపరింటెండెంట్ పగిడిపాట సుగుణాకర్‌రాజు, జనగామ పీఏసీఎస్ చైర్మన్ నిమ్మతి మహేందర్‌రెడ్డి, కొందరు సర్పంచ్‌లు, నాయకులు హరిత ప్లాజా భేటీకి వెళ్లినట్టు తెలిసింది. కాగా.. హోటల్‌లో గొడవ జరుగుతోందని తెలిసి వెళ్లానే తప్ప, తానే నాయకులను తీసుకువచ్చినట్టు వచ్చిన ఆరోపణల్లో నిజం లేదని జనగామ జెడ్పీ చైర్మన్, బీఆర్‌ఎస్ జిల్లా అధ్యక్షుడు పాగాల సంపత్‌రెడ్డి పేర్కొన్నారు. అధిష్టానం ఎవరికి టికెట్ ఇచ్చినా గెలిపించుకుంటామన్నారు.
ఇలా చేయడం బాధాకరం: ముత్తిరెడ్డి
జనగామ నియోజకవర్గంలోని బీఆర్‌ఎస్ నేతలు, ప్రజా ప్రతినిధులు హరిత ప్లాజాకు వచ్చారనే సమాచారం మేరకు అక్కడికి వెళ్లానని ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరిరెడ్డి తెలిపారు. అక్కడ ముఖ్య కార్యకర్తలు ఎవరూ లేరని, అన్ని మండలాల అధ్యక్షులు తన వెంటే ఉన్నారని పేర్కొన్నారు. అయినా అధిష్టానం ఇటువంటి చర్యలను క్షమించబోదన్నారు. గతంలో పల్లా రాజేశ్వర్‌రెడ్డి తనకు స్వయంగా ఫోన్ చేసి ఇలాంటివి ప్రోత్సహించబోనని చెప్పారని.. ఇప్పుడిలా చేయడం బాధాకరమని వ్యాఖ్యానించారు.
హరీశ్‌రావుతో ‘పల్లా’ వర్గం భేటీ!
హరిత ప్లాజాలో భేటీ అయిన ‘పల్లా’ వర్గీయులు సాయంత్రం ప్రగతిభవన్‌లో మంత్రి హరీశ్‌రావును కలసి పరిస్థితిని వివరించారు. దీనిపై హరీశ్‌రావు స్పందిస్తూ.. జనగామ టికెట్ కోసం ఇద్దరు పోటీ పడుతున్నారని, మరో మూడు రోజుల్లో తేల్చేస్తామని చెప్పినట్టు సమాచారం. ముత్తిరెడ్డితో నెల రోజులక్రితమే మాట్లాడి.. ఆయన కుమార్తెతో వివాదాన్ని పరిష్కరించుకోవాలని చెప్పామని, అయినా సరిదిద్దుకోక ఆయన సీటుకు ఎసరొచ్చే పరిస్థితి వచ్చిందని పేర్కొన్నట్టు తెలిసింది. అయితే పార్టీ ఎవరికి టికెట్ ఇచ్చినా గెలిపించుకోవాల్సిన బాధ్యత అందరిపై ఉందని స్పష్టం చేసినట్టు సమాచారం.
Comments
Please login to add a commentAdd a comment