రాష్ట్ర రాజకీయాలకు కేంద్ర బిందువైన హైదరాబాద్ జిల్లాలో 15 అసెంబ్లీ నియోజకవర్గాలు ఉన్నాయి. పాతనగరం పరిధిలో ఏడు, కొత్త నగరపరిధిలోకి ఎనిమిది అసెంబ్లీ స్థానాలు వస్తాయి. ఈ రెండు ప్రాంతాల్లో సామాజిక, ఆర్థిక, రాజకీయ పరిస్థితులు, ప్రజల ఆలోచనాతీరు భిన్నంగా ఉంటాయి. పాతబస్తీలో రాజకీయాల ఒరవడే వేరుగా ఉంటుంది. మేనిఫెస్టోలు, ప్రచార ఆర్భాటాలు నడవవు. బలమైన ముస్లిం, హిందూత్వ సామాజిక ఎజెండాలే ఇక్కడి పార్టీల ‘జెండా’లవుతాయి.
నిజాం కాలంలో పురుడుపోసుకున్న మజ్లిస్–ఏ–ఇత్తేహదుల్ ముస్లిమీన్ (ఎంఐఎం) తొలి సార్వత్రిక ఎన్నికల నాటి నుంచి నేటి వరకు పాతబస్తీలో రాజకీయ ఆధిపత్యం కొనసాగిస్తూ వస్తోంది. హిందూ, ముస్లిం ఎజెండాలతో మజ్లిస్, బీజేపీ రాజకీయంగా తలపడుతున్నా.. ఫలితం మాత్రం ఒకవైపే మొగ్గు చూపుతోంది. బీజేపీ హిందూ ఎజెండాతో మజ్లిస్ కంచుకోటను ఢీకొట్టేందుకు ప్రతి ఎన్నికల్లో ప్రయత్నిస్తూనే ఉంది.
మజ్లిస్ నుంచి చీలిన ఎంబీటీ కూడా మజ్లిస్‌ను ఢీ కొట్టేందుకు సర్వశక్తులూ ఒడ్డుతూనే ఉంది. పూర్వ వైభవం కోసం కాంగ్రెస్, ఉనికి కోసం బీఆర్‌ఎస్ పోటీ పడుతూనే ఉన్నాయి. ఇప్పటివరకు అధికార బీఆర్‌ఎస్ ఇక్కడి నుంచి ఖాతా తెరవలేదు. ఇక కొత్త నగరంలోని ఎనిమిది అసెంబ్లీ స్థానాల్లో రాజకీయ పరిస్థితులు పూర్తిగా భిన్నంగా ఉంటాయి. ఇక్కడ మత రాజకీయాలు పనిచేయవు. ఆర్థిక బలం. అభివృద్ధి, సంక్షేమం, అభ్యర్ధుల బలాలు, బలహీనతలు, రాజకీయ పార్టీల ప్రాధాన్యతను బట్టి ఓటర్లు మొగ్గు చూపుతూ ఉంటారు.
ఆశలపల్లకీలోబీజేపీ
బీజేపీ గతంలో చేజారిన స్థానాలతో పాటు కొత్తగా మరికొన్నింటిలో పాగా వేసేందుకు వ్యూహాత్మకంగా పావులు కదుపుతోంది. గత ఎన్నికల్లో గోషామహల్‌లో మాత్రమే విజయం సాధించిన బీజేపీ అంబర్‌పేట్, ముషీరాబాద్, ఖైరతాబాద్ సిట్టింగ్ స్థానాలను కోల్పోయింది. మరోవైపు పాతబస్తీలో పాగా వేసేందుకు తీవ్ర ప్రయత్నాలు చేస్తూనే ఉంది.
గోషామహల్ సిట్టింగ్ ఎమ్మెల్యేపై సస్పెన్షన్ సైతం ఎత్తేసి తిరిగి బరిలోకి దింపింది. గతంలో అంబర్‌పేట, ముషీరాబాద్ స్థానాలకు ప్రాతినిధ్యం వహించిన ఇద్దరు సీనియర్ నేతలు ఈసారి పోటీకి దూరంగా ఉన్నారు. ఖైరతాబాద్‌లో మాజీ ఎమ్మెల్యే బరిలో దిగగా, అంబర్‌పేటలో ఇటీవల పార్టీలో చేరిన మరో మాజీ సీనియర్ ఎమ్మెల్యేకు అవకాశం ఇచ్చారు.
పాతబస్తీ దాటి పాగా వేసేనా..?
మజ్లిస్ పార్టీ పాతనగరం దాటి మరో రెండు స్థానాల్లో పోటీ చేయడం ఆసక్తి రేపుతోంది. ఈసారి ఏడు సిట్టింగ్ స్థానాలతో పాటు మరో రెండు స్థానాలను తమ ఖాతాలో వేసుకునేందుకు వ్యూహాత్మంగా ఎత్తుకు పైఎత్తులు వేస్తోంది. ఎప్పుడూ పాతబస్తీకి మాత్రమే పరిమితమయ్యే మజ్లిస్ ఈసారి జూబ్లీహిల్స్, రాజేంద్రనగర్‌లో కూడా బరిలోకి దిగింది. ఏ పార్టీ అధికారంలో ఉంటే మజ్లిస్ దాని చెంతన చేరుతోందన్నది బహిరంగ రహస్యమే.
పదేళ్ల క్రితం వరకు వరకు కాంగ్రెస్‌తో కొనసాగించిన దోస్తానాకు కటీఫ్ చెప్పి..ఆ తర్వాత అధికార బీఆర్‌ఎస్‌కు మిత్రపక్షమైంది. అధికార పార్టీలు కూడా ప్రతి ఎన్నికలప్పుడు మజ్లిస్ సిట్టింగ్ స్థానాల్లో మొక్కుబడిగా అభ్యర్థులను దింపి పరోక్షంగా సహకరించడం ఆనవాయితీగా మారింది. మజ్లిస్ కూడా సిట్టింగ్ స్థానాలను చేజారకుండా పదిలపర్చుకుంటూ వస్తోంది.
సిట్టింగులతోనే...బీఆర్‌ఎస్
కోర్ సిటీలో అధికార బీఆర్‌ఎస్ సిట్టింగ్ స్థానాలు పదిలపర్చుకునేందుకు సంక్షేమం, అభివృద్ధి మంత్రం కలిసి వస్తుందని భావిస్తోంది. సిట్టింగ్‌లకు మరోమారు అవకాశం కల్పించి రంగంలోకి దింపింది. ఒక మంత్రి, ఐదుగురు సిట్టింగ్ ఎమ్మెల్యేలు, ఒక దివంగత ఎమ్మెల్యే కుమార్తె ఎన్నికల బరిలోకి దిగారు. బీజేపీ వహిస్తున్న గోషామహల్ స్థానం కూడా ఈసారి తమ ఖాతాలో వేసుకునేందుకు తీవ్రంగా ప్రయత్నిస్తోంది.
గత ఎన్నికల్లో పాగావేసిన అంబర్‌పేట, ముషీరాబాద్, ఖైరతాబాద్ స్థానాలు ఈసారి బీజేపీకి చిక్కకుండా ఎత్తులకు పై ఎత్తులు వేస్తోంది. సనత్‌నగర్, జూబ్లీహిల్స్, కంటోన్మెంట్‌లలో గత పర్యాయం మాత్రమే పార్టీ పరంగా విజయం సాధించింది. అంతకు ముందు టీడీపీ గుర్తుపై గెలిచిన ముగ్గురు ఎమ్మెల్యేలు గులాబీ కండువా కప్పుకొని గత ఎన్నికల్లో బీఆర్‌ఎస్ అభ్యర్థులుగా పోటీ చేసి గెలుపొందారు. సికింద్రాబాద్ స్థానంలో ఇప్పటికి మూడు పర్యాయాలు టీఆర్‌ఎస్ గెలుపొందింది.
పూర్వ వైభవానికి కాంగ్రెస్ కసరత్తు
కాంగ్రెస్ పూర్వవైభవానికి పడరాని పాట్లు పడుతోంది. ఆరు గ్యారంటీ స్కీంలపై ప్రజలకు అవగాహన కల్పిస్తూ బీఆర్‌ఎస్ ప్రభుత్వ తొమ్మిదేళ్ల వైఫల్యాలను ప్రచారాస్త్రాలుగా మలుచుకుంది. గతంలో చేజారిన స్థానాలతోపాటు మరి కొన్నింటిలో ఖాతా తెరిచేందుకు వ్యూహత్మకంగా పావులు కదుపుతోంది. ఇద్దరు మాజీ ఎంపీలను జూబ్లీహిల్స్, ముషీరాబాద్‌లలో, సెంటిమెంట్ సానుభూతిని అనుకూలంగా మరల్చుకునేందుకు దివంగత నేత పి జనార్దన్‌రెడ్డి, దివంగత గద్దర్ కుమార్తెలను ఖైరతాబాద్, కంటోన్మెంట్ స్థానాల్లో, గోషామహల్‌లో రాష్ట్ర మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలిని ఎన్నికల బరిలోకి దింపింది.
నాంపల్లి నియోజకవర్గంలో మూడు పర్యాయాలు స్వల్ప ఓట్లతో ఓటమి చవిచూసిన అభ్యర్థినే తిరిగి ఈసారి కూడా ఎన్నికల బరిలోకి దింపి సానుభూతి కలిసి వస్తోందని భావిస్తోంది. ఖైరతాబాద్, జూబ్లీహిల్స్, ముషీరాబాద్, కంటోన్మెంట్, నాంపల్లి స్థానాలపై ఆశలు పెంచుకుంది. సనత్‌నగర్, అంబర్‌పేట ,సికింద్రాబాద్ స్థానాల్లో సైతం గట్టి పోటీ ఇచ్చేందుకు అవసరమైన బలాన్ని పెంచుకుంటోంది.
-మహ్మద్ హమీద్ ఖాన్
Comments
Please login to add a commentAdd a comment