సాక్షి, కామారెడ్డి: ‘తెలంగాణలో కాంగ్రెస్ సునామీ సృష్టించింది. బీఆర్‌ఎస్‌కు 25కు మించి సీట్లు రానేరావు. గెలిచే అవకాశమే ఉంటే సీఎం మీడియా ముందుకు వచ్చి గొప్పలు చెప్పేవారు. కానీ కేటీఆర్ వచ్చి అదే బెదిరింపు ధోరణితో మాట్లాడుతున్నాడు. అయితే తెలంగాణ సమాజం చైతన్యవంతమైనదని మరోసారి రుజువైంది.
పదేళ్లుగా తెలంగాణను పట్టి పీడిస్తున్న కేసీఆర్‌ను కామారెడ్డిలో ఓడిస్తున్నందుకు సంతోషంగా ఉంది..’అని టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి అన్నారు. పోలింగ్ ముగిసిన అనంతరం గురువారం సాయంత్రం కామారెడ్డిలో మాజీమంత్రి షబ్బీర్ అలీ నివాసంలో ఏర్పాటు చేసి న విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు.
శ్రీకాంతాచారి త్యాగానికి, ఎన్నికలకు సంబంధం
‘మలి తెలంగాణ ఉద్యమంలో తొలి అమరుడు శ్రీకాంతాచారి త్యాగానికి, ఇప్పుడు జరుగుతున్న ఎన్నికలకు సంబంధం ఉంది. 2009 నవంబర్ 29న ఎల్‌బీనగర్ చౌరస్తాలో శ్రీకాంతాచారి పెట్రోల్ పోసుకుని నిప్పంటించుకుని ఉద్యమాన్ని ఆకాశమంత ఎత్తుకు తీసుకుపోయాడు. మృత్యువుతో పోరాడి డిసెంబర్ 3న తనువు చాలించాడు. ఇప్పుడు నవంబర్ 29న ఎన్నికల ప్రక్రియ మొదలై, డిసెంబర్ 3న ఫలితాలు వెలువడనున్నాయి.
అప్పుడు డిసెంబర్ 9న తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ప్రక్రియ ప్రారంభిస్తున్నట్టు సోనియాగాంధీ ఆదేశాలతో నాటి హోంమంత్రి చిదంబరం ప్రకటన చేశారు. ఇప్పుడు డిసెంబర్ 9న తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారం చేపడుతుంది. ఈ విధంగా యాదృచ్చికమో, దేవుని ఆదేశమో తెలియదు కానీ, శ్రీకాంతాచారి త్యాగానికి, ఇప్పటి ప్రజాతీర్పుకు సంబంధం ఉన్నట్టు అర్థమైంది. శ్రీకాంతాచారికి ఘనంగా నివాళులు అర్పిస్తున్నాం..’అని రేవంత్ అన్నారు.
ఎగ్జిట్ పోల్స్ నిజమైతే క్షమాపణ చెబుతారా?
‘ఓటమి ఎదురవుతుందన్నపుడల్లా నియోజకవర్గం మారడం కేసీఆర్‌కు అలవాటు. అయితే చైతన్యవంతులైన కామారెడ్డి నియోజకవర్గ ప్రజలు కేసీఆర్‌కు తగిన గుణపాఠం చెప్పారు. ప్రజల్లో చైతన్యం వచ్చింది. అధికారం శాశ్వతమనే కేసీఆర్ నమ్మకం వమ్మయ్యింది. ఎగ్జిట్‌పోల్స్ అన్నీ కాంగ్రెస్‌కు మెజారిటీని కట్టబెడుతున్నాయి. కానీ ఎగ్జిట్ పోల్స్ రబ్బిష్ అని కేటీఆర్ అన్నారు. మరి అవే నిజమైతే క్షమాపణలు చెబుతారా? ఎగ్జిట్ పోల్స్ మీద కేసీఆర్ ఎందుకు స్పందించడం లేదు? రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చింది. ఈ రోజు రాత్రి నుంచే కార్యకర్తలు సంబరాలు చేసుకోవాలి..’అని టీపీసీసీ చీఫ్ అన్నారు.
వెంటనే ఆరు గ్యారంటీల అమలు
‘కాంగ్రెస్ పార్టీ అధికారం చేపట్టిన మరుక్షణమే ఆరు గ్యారంటీల అమలుకు తొలి మంత్రివర్గంలో తీర్మానం చేస్తాం. ప్రొఫెసర్ కోదండరాంకు అమరుల కుటుంబాలు, ఉద్యమకారుల సంక్షేమానికి సబంధించిన బాధ్యతలు అప్పగిస్తాం. మేము పాలకులుగా ఉండబోము.. సేవకులుగా ఉంటాం. వెంటనే ప్రజాస్వామిక విలువల్ని పునరుద్ధరిస్తాం. అన్ని వర్గాలకు స్వేచ్ఛ ఉంటుంది. ఎక్కడా అజమాయిషీ చెలాయించబోము. ఎవరినీ ఇబ్బందులకు గురిచేయడం జరగదు. తెలంగాణ ప్రజలకు ఐదేళ్లు సేవ చేయడానికి ప్రయత్నం జరుగుతుంది..’అని రేవంత్ చెప్పారు.
పదవి పార్టీ నిర్ణయిస్తుంది
తాను ఏ పదవిలో ఉండాలన్నది పార్టీ నిర్ణయిస్తుందని రేవంత్‌రెడ్డి అన్నారు. రెండుచోట్లా గెలిస్తే ఏ నియోజక వర్గంలో ఉంటారని ఓ విలేకరి అడిగిన ప్రశ్నకు.. తనకు ఇవి రెండే కాదని, ఎంపీ పదవి కూడా ఉందని, ఇందులో దేనిలో కొనసాగాలన్న దానిపై పార్టీ నిర్ణయం తీసుకుంటుందని, దాన్ని ఆచరిస్తానని చెప్పారు. సమావేంలో మాజీ ఎమ్మెల్యే ఈరవత్రి అనిల్, మాజీ ఎమ్మెల్సీ అరికెల నర్సారెడ్డి, కామారెడ్డి, నిజామాబాద్ జిల్లాల కాంగ్రెస్ అధ్యక్షులు కైలాస్ శ్రీనివాస్, మానాల మోహన్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
కొడంగల్‌లో ఓటేసిన రేవంత్‌రెడ్డి
కొడంగల్: పీసీసీ అధ్యక్షుడు ఎనుముల రేవంత్‌రెడ్డి గురువారం కొడంగల్‌లో ఓటు వేశారు. కుటుంబ సభ్యులతో కలిసి స్థానిక జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలకు చేరుకున్న ఆయన ఓటుహక్కును వినియోగించుకున్నారు.
Comments
Please login to add a commentAdd a comment