మేకల కళ్యాణ్ చక్రవర్తి : 2014, 2018 ఎన్నికల్లో పరాభవం తర్వాత మూడోసారైనా ప్రజలు తమకు పట్టం కట్టబోతారా అనే కోటి ఆశలతో కాంగ్రెస్ పార్టీ ఈసారి ఎన్నికలకు సిద్ధమవుతోంది. రాష్ట్రం ఇచ్చిన పార్టీగా రెండు ఎన్నికల్లోనూ ఓటమిపాలైనా త్వరలో జరిగే ఎన్నికల కురుక్షేత్రంలో విజయతీరాలకు చేరడం ద్వారా రాష్ట్రం ఏర్పాటు చేసిన సోనియాగాందీకి బహుమానంగా అధికారాన్ని అప్పగించాలని కలలు కంటోంది.
పదేళ్లుగా అధికారానికి దూరం కావడం ద్వారా ఏర్పడిన నైరాశ్యానికి తోడు పార్టీలో ముదిరిన అంతర్గత విభేదాలు వెరసి మళ్లీ పాత ఫలితాలే పునరావృతమవుతాయేమో అనే సందేహాలు లేకపోలేదు. కానీ నేతలు వెళ్లినా పార్టీని విడిచి వెళ్లని కేడర్ భుజాలపై ఎక్కి ప్రభుత్వ వ్యతిరేకత అనే తూటాలను పేల్చుకుంటూ పవర్ ‘అ్రస్తాన్ని’ దక్కించుకునేందుకు పాట్లు పడుతోంది కాంగ్రెస్ పార్టీ.
ముంచిన ‘మహా కూటమి’...
రాష్ట్రం ఇచ్చిన పార్టీగా ఎదుర్కొన్న తొలి ఎన్నికల్లో ఓటమిపాలైన కాంగ్రెస్ రెండోసారి కూడా వ్యూహం లేక చతికిలబడిపోయింది. కాంగ్రెస్ అంచనాలకు అందకుండా ప్రభుత్వాన్ని రద్దు చేసి ముందస్తుకు వెళ్లడం ద్వారా కేసీఆర్ ఆ పార్టీని చావుదెబ్బ కొట్టారు.
ఇతర పార్టీలతో పొత్తులు 2018 ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ కొంపముంచాయి. టీడీపీ పొత్తుతో రాష్ట్ర వ్యాప్తంగా కాంగ్రెస్ కుదేలైంది. చంద్రబాబు ఎంట్రీ వరకు ఓటర్లలో ఎంతోకొంత సానుకూలత వ్యక్తమైనా, ’బాబుగోరు’ ప్రచారం ప్రారంభించిన నాటి నుంచే కాంగ్రెస్ గెలుపు అవకాశాలు పతనమయ్యాయి. సీపీఐ, టీజేఎస్ లాంటి పార్టీల తోడ్పాటు ఏ మాత్రం లభించకపోవడంతో కేవలం 19 స్థానాల్లో గెలుపొంది మరోమారు విజయానికి ఆమడ దూరంలో నిలిచింది.
‘చేతి’లో సత్తువ లేకుండానే...
వరుసగా రెండు ఎన్నికల్లో ఓటమితో రాష్ట్ర వ్యాప్తంగా కాంగ్రెస్ పార్టీ కుదేలైంది. పదేళ్లు అధికారంలో లేకపోవడంతో పార్టీ కేడర్ తీవ్ర నిరాశ, నిస్పృహల్లో కూరుకుపోయింది. చెప్పుకోదగిన పార్టీ నేతలు బీఆర్‌ఎస్‌లో చేరిపోయారు. దీంతో హస్తం పార్టీ చేతిలో సత్తువ లేదనే స్థాయికి వెళ్లిపోయింది. అయితే, నాయకులు, ఎమ్మెల్యేలు పార్టీలు వీడి వెళ్లినా కేడర్ మాత్రం మిగిలే ఉందని ఆ పార్టీ అంచనా వేస్తోంది. పార్టీ కేడరే శ్రీరామరక్షగా బీఆర్‌ఎస్ పట్ల ప్రజల్లో ఉన్న వ్యతిరేకత గెలిపిస్తుందన్న ధీమాతో ఈసారి 2023లో ఎన్నికలను కాంగ్రెస్ పార్టీ ఎదుర్కోబోతోంది.
2014లో అలా...!
రాష్ట్ర ఏర్పాటు ముందు కాంగ్రెస్ పార్టీ చాలా హడావుడి చేసింది. పార్లమెంటులో బిల్లు ఆమోదం నుంచి రాష్ట్ర ఏర్పాటు తేదీ వరకు నానా హంగామా చేసినా ఆనాడు టీఆర్‌ఎస్ దూకుడు ముందు నిలవలేకపోయింది. కేసీఆర్ ఆర్భాటానికి తోడు దేశవ్యాప్తంగా కాంగ్రెస్‌పై వెల్లువెత్తిన వ్యతిరేకతతో 2014లో ఊహించని పరాభవాన్ని మూటగట్టుకుంది. రాష్ట్రంలో 21 సెంబ్లీ స్థానాల్లోనే గెలుపుతో సరిపెట్టుకుంది.
కచ్చితంగా గెలుస్తామనే ధీమాతోనే ఉన్న కాంగ్రెస్ పార్టీకి ఆ ఎన్నికల ఫలితాలు షాక్ ఇచ్చాయి. చాలా మంది కాంగ్రెస్ ప్రముఖులు కూడా ఓటమి పాలయ్యారు. అదే సమయంలో జరిగిన పార్లమెంటు ఎన్నికల్లో మరింత కంగుతింది. రెండు ఎంపీ స్థానాలను మాత్రమే గెలుచుకోగలిగింది. ఇక, తెలంగాణ ఏర్పాటయిన తర్వాత మళ్లీ అసెంబ్లీ ఎన్నికలు జరిగేంతవరకు నిర్వహించిన దాదాపు అన్ని స్థానిక ఎన్నికల్లోనూ కాంగ్రెస్ పార్టీకి చేదు ఫలితాలే వచ్చాయి.
గతంలో ఎన్నడూ లేని విధంగా...
ఇక ఇప్పుడు.. పార్టీ కేడర్ చెక్కుచెదరలేదని, కర్ణాటక రాష్ట్రంలో గెలుపుతో వచ్చిన కొత్త ఉత్సాహంతో బీజేపీని వెనక్కునెట్టి అధికారం దక్కించుకునే రేసులోకి కాంగ్రెస్ పార్టీ వచ్చిందనే చర్చ రాజకీయ వర్గాల్లో ఉంది. అయితే, ఆ పార్టీకి ఎప్పటిలాగే వర్గపోరు శాపంగా మారే అవకాశాలు కూడా స్పష్టంగా కనిపిస్తున్నాయి. అంతర్గత ప్రజాస్వామ్యం పేరుతో కలహాలు, కీచులాటలకు కేరాఫ్ అడ్రస్‌గా గుర్తింపు పొందిన కాంగ్రెస్ పార్టీలో గతంలో ఎన్నడూ లేని విధంగా గొడవలు ముదిరి పాకాన పడ్డాయి.
టీపీసీసీ అధ్యక్షుడిగా రేవంత్‌రెడ్డికి బాధ్యతలు అప్పగించిన తర్వాత సమీకరణలు ఒక్కసారిగా మారిపోయాయి. సీనియర్లు, జూనియర్లనే విభేదాలకు తోడు నివురుగప్పిన నిప్పులా ఉన్న అసమ్మతి, నేతల మధ్య తీవ్ర విభేదాలు వెరసి ఇప్పటివరకు టికెట్లను కూడా ప్రకటించలేని పరిస్థితి కాంగ్రెెస్‌లో నెలకొంది. ఎట్టిపరిస్థితుల్లోనూ చెక్కుచెదరని కేడర్‌ను ముందు నడిపిస్తూ బీఆర్‌ఎస్‌పై ప్రజల్లో ఉన్న వ్యతిరేకతను సొమ్ము చేసుకుంటూ, ఆరు గ్యారంటీ పథకాలతో విజయానికి బాటలు వేసుకుని ఈసారైనా అధికార పీఠం ఎక్కాలనేది కాంగ్రెస్ లక్ష్యం.
Comments
Please login to add a commentAdd a comment