చట్టసభలకు జరిగే ఎన్నికల్లో జయాపజయాలు ప్రధానంగా రాజకీయ పార్టీల వ్యవహార శైలిపైనే ఆధారపడతాయి. ప్రజల్లో ఆయా పార్టీల పట్ల ఉన్న విశ్వసనీయతకుతోడు పోటీ చేస్తున్న అభ్యర్థుల వైఖరితో గెలుపోటములను ఓటర్లు నిర్ధారిస్తారు. అసెంబ్లీ లేదా లోక్‌సభ ఎన్నికల వేళ ఓటర్లను ఆకర్షించేందుకు, ప్రజల్లో ఊపును తీసుకొచ్చేందుకు కొత్తగా రాజకీయ పార్టీలు పుట్టుకొస్తుంటాయి. గత రెండున్నర దశాబ్దాల కాలంలో తెలుగు రాష్ట్రాల్లో కొత్త రాజకీయ పార్టీలు ఇబ్బడిముబ్బడిగా పుట్టుకురాగా మెజారిటీ పార్టీలు కాలగమనంలో కలసిపోయాయి. కానీ ఒకట్రెండు మాత్రం నిలదొక్కుకొని రాజ్యాధికారం దిశగా దూసుకువెళ్లాయి.
ఉద్ధండులు... కొత్త పార్టీలు
రాజకీయ పార్టీని స్థాపించడం..నిర్వహించడం ఆషామాషీ కాదు. పార్టీని స్థాపించే వ్యక్తికి ప్రజాక్షేత్రంలో చరిష్మా అత్యంత కీలకం. మాటలతో ప్రజలను మంత్రముగ్ధుల్ని చేయగలిగే సత్తా ఉండాలి. ప్రజలు వాటిని విశ్వసించేలా వ్యవహరించాలి. ఉమ్మడి రాష్ట్రంలో విస్తృత ప్రజాదరణ చూరగొన్న పలువురు నేతలు తమ రాజకీయ ఎజెండాలకు అనుగుణంగా సొంత పార్టీలను స్థాపించారు.
ముఖ్యంగా తెలంగాణ సాధనే లక్ష్యంగా 2001లో తెలంగాణ రాష్ట్ర సమితిని కేసీఆర్ ఏర్పాటు చేశారు. ఆ తర్వాత 2001లోనే ఆలె నరేంద్ర ఆధ్వర్యంలో తెలంగాణ సాధన సమితి పుట్టుకొచ్చింది. 2005లో ప్రముఖ నటి విజయశాంతి సైతం తెలంగాణ ఉద్యమ నేపథ్యంలో తల్లి తెలంగాణ పార్టీని స్థాపించారు. 2006 అక్టోబర్‌లో జయప్రకాశ్ నారాయణ ఆధ్వర్యంలో లోక్‌సత్తా పార్టీ ఆవిర్భవించింది. తెలుగుదేశం పార్టీలో అత్యంత కీలక నేతగా వెలుగొందిన తూళ్ల దేవేందర్‌గౌడ్ సారథ్యంలో 2008లో నవ తెలంగాణ పార్టీ (ఎన్‌టీపీ) ఏర్పాటైంది.
జాతీయస్థాయిలో గుర్తింపు పొందిన ప్రముఖ సినీనటుడు చిరంజీవి 2008 ఆగస్టులో ప్రజా రాజ్యం పార్టీ (పీఆర్‌పీ)ని స్థాపించారు. దివంగత ముఖ్యమంత్రి వై.ఎస్.రాజశేఖరరెడ్డి కుమారుడు వై.ఎస్.జగన్‌మోహన్‌రెడ్డి ఆధ్వర్యంలో 2011లో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఏర్పాటైంది. ప్రముఖనటుడు పవన్ కల్యాణ్ ఆధ్వర్యంలో 2014 మార్చిలో జనసేన ఆవిర్భవించింది. ఆ తర్వాత 2018 ఎన్నికల సమయంలో తెలంగాణ ఉద్యమ నేత ప్రొఫెసర్ కోదండరాం ఆధ్వర్యంలో తెలంగాణ జన సమితి (టీజేఎస్) ఏర్పాటైంది.
విలీనాలతో తెరమరుగు..
ఒకే లక్ష్యం దిశగా సాగుతున్న నేపథ్యంలో ఆలె నరేంద్రకు చెందిన తెలంగాణ సాధన సమితి 2002లో, విజయశాంతికి చెందిన తల్లి తెలంగాణ పార్టీ 2009లో అప్పటి టీఆర్‌ఎస్‌లో విలీనమయ్యాయి. లోక్‌సత్తా పార్టీ తరఫున 2009 అసెంబ్లీ ఎన్నికల్లో ఆ పార్టీ అధ్యక్షుడు జయప్రకాశ్ నారాయణ ఒక దఫా ఎమ్మెల్యేగా గెలుపొందగా... ఆ తర్వాత ఆ పార్టీ అభ్యర్థులెవరూ విజయం సాధించలేదు.
దేవేందర్‌గౌడ్ తన నవ తెలంగాణ పార్టీని 2009 ఫిబ్రవరిలో ప్రజారాజ్యంలో విలీనం చేస్తున్నట్లు ప్రకటించారు. పీఆర్‌పీ 2011 ఫిబ్రవరిలో కాంగ్రెస్‌లో విలీనమైంది. మరోవైపు తెలంగాణ జన సమితి ప్రధాన పార్టీలకు ఇప్పటివరకు ఎక్కడా గట్టి పోటీ ఇవ్వలేదు. ఇక చిన్నాచితకా పార్టీలు ఎప్పటికప్పుడు అలా వచ్చి పోటీ చేయడం తప్ప విజయం సాధించి నిలదొక్కుకున్న దాఖలాలు లేవు.
బరిలో బోలెడు రిజిస్టర్డ్ పార్టీలు..
1999 అసెంబ్లీ ఎన్నికల వేళ ఉమ్మడి రాష్ట్రంలో పోటీ చేసిన పార్టీలు 27 మాత్రమే. ఇందులో 6 జాతీయ పార్టీలుండగా..ప్రాంతీయ పార్టీ ఒకటి మాత్రమే ఉండేది. అలాగే 12 రిజిస్టర్డ్ పార్టీలు ఉండగా పొరుగు రాష్ట్రాలకు చెందిన పార్టీలు 8 ఉండేవి. ఆ తర్వాత కాలంలో జరిగిన ఎన్నికల్లో జాతీయ, రాష్ట్ర పార్టీల సంఖ్య పెద్దగా మారనప్పటికీ కొత్తగా పుట్టుకొచ్చే పార్టీలు మాత్రం భారీగా పెరిగాయి. 2018 అసెంబ్లీ ఎన్నికల్లో 93 పార్టీలు ఎన్నికల బరిలో నిలిచాయి. ఇందులో పోటీ చేసిన రిజిస్టర్డ్ పార్టీల సంఖ్య ఏకంగా 77. రెండున్నర దశాబ్దాల్లో రిజిస్టర్డ్ పార్టీల సంఖ్య ఆరు రెట్లకుపైగా పెరగడం గమనార్హం.
అధికారంలోకి రెండే పార్టీలు..
కొత్త పార్టీల్లో కేవలం టీఆర్‌ఎస్, వైఎస్సార్‌సీపీలు మాత్రమే ఎగిసిన కెరటంలా ఎదిగాయి. తెలంగాణలో టీఆర్‌ఎస్ 2014 నుంచి వరుసగా రెండుసార్లు అధికారం చేపట్టింది. అంచెలంచెలుగా ఎదుగుతూ జాతీయ స్థాయి పార్టీ బీఆర్‌ఎస్‌గా అవతరించింది.
ప్రత్యేక రాష్ట్ర ఉద్యమంతో మొదలైన ఈ పార్టీ ఇప్పుడు ఇతర రాష్ట్రాల్లోనూ ఎన్నికల బరిలో నిలిచేందుకు సిద్ధమవుతోంది. ఇప్పటికే మహారాష్ట్రలోని పలు ప్రాంతాల్లో సీఎం కేసీఆర్ ఎన్నికల ప్రచార కార్యక్రమాల్లోనూ పాల్గొన్నారు. మరోవైపు ఏపీలో వైఎస్సార్‌సీపీ 2014 ఎన్నికల్లో ప్రధాన ప్రతిపక్షంగా నిలిచి 2019 అసెంబ్లీ ఎన్నికల్లో ఘన విజయం సాధించింది.
-చిలుకూరి అయ్యప్ప
Comments
Please login to add a commentAdd a comment