
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల నిర్వహణ కోసం ఎన్నికల సంఘం వడివడిగా అడుగులేస్తోంది. ఈ క్రమంలో కేంద్ర ఎన్నికల సంఘం మూడు రోజులపాటు ఎన్నికల సన్నాహాక భేటీలు వరుసగా నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే. మరోవైపు తెలంగాణ రాష్ట్ర ఎన్నికల సంఘం నేడు తుది ఓటర్ల జాబితా విడుదల చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి.
ఈసీ డేటా ప్రకారం సెప్టెంబర్ 18వ తేదీ వరకు.. కొత్త ఓటర్ల నమోదుకు 13.06 లక్షల దరఖాస్తులు వచ్చాయి. ఇందులో వివరాల సవరణ కోసం 7.77 లక్షల దరఖాస్తులు ఉండగా.. పేర్ల తొలగింపునకు 6.26 లక్షల దరఖాస్తులు వచ్చినట్లు సమాచారం. తెలంగాణలో మొత్తం 3.13 కోట్ల ఓటర్లు ఉన్నారు. అయితే రాజకీయ పార్టీలు మాత్రం ఓటర్ దరఖాస్తులన్నీ పరిష్కరించాకే.. తుది జాబితా విడదలు చేయాలని కోరుతున్నాయి. ఈ విజ్ఞప్తిని ఈసీ స్పందన ఏంటన్నది తెలియాల్సి ఉంది.
మరోవైపు కేంద్ర ఎన్నికల సంఘం రెండో రోజు సమావేశాలు హైదరాబాద్‌లో కొనసాగుతున్నాయి. జిల్లా ఎన్నికల అధికారులు - ఎస్పీలు, సీపీలతో ఇప్పటికే EC మీటింగ్ మొదలైంది. ఇవాళ రెండు సెషన్లుగా ఈ భేటీ జరగనుంది. మొదటి సెషన్‌లో అధికారులు చెప్పే అంశాల్ని కేంద్ర బృందం విననుంది. ఇక రెండో సెషన్‌లో అధికారులకు ఈసీ దిశానిర్దేశం చేస్తుంది. మరోవైపు.. రాష్ట్ర ఎన్నికల సంఘం ఆయా జిల్లాలో నిర్వహించిన అవగాహన కార్యక్రమాల ఫోటో ఎగ్జిబిషన్‌ను కేంద్రం ఎన్నికల సంఘ బృందం పరిశీలించింది.
Comments
Please login to add a commentAdd a comment