New Political Parties
-
ఎన్నికలల పార్టీలు!
చట్టసభలకు జరిగే ఎన్నికల్లో జయాపజయాలు ప్రధానంగా రాజకీయ పార్టీల వ్యవహార శైలిపైనే ఆధారపడతాయి. ప్రజల్లో ఆయా పార్టీల పట్ల ఉన్న విశ్వసనీయతకుతోడు పోటీ చేస్తున్న అభ్యర్థుల వైఖరితో గెలుపోటములను ఓటర్లు నిర్ధారిస్తారు. అసెంబ్లీ లేదా లోక్‌సభ ఎన్నికల వేళ ఓటర్లను ఆకర్షించేందుకు, ప్రజల్లో ఊపును తీసుకొచ్చేందుకు కొత్తగా రాజకీయ పార్టీలు పుట్టుకొస్తుంటాయి. గత రెండున్నర దశాబ్దాల కాలంలో తెలుగు రాష్ట్రాల్లో కొత్త రాజకీయ పార్టీలు ఇబ్బడిముబ్బడిగా పుట్టుకురాగా మెజారిటీ పార్టీలు కాలగమనంలో కలసిపోయాయి. కానీ ఒకట్రెండు మాత్రం నిలదొక్కుకొని రాజ్యాధికారం దిశగా దూసుకువెళ్లాయి. ఉద్ధండులు... కొత్త పార్టీలు రాజకీయ పార్టీని స్థాపించడం..నిర్వహించడం ఆషామాషీ కాదు. పార్టీని స్థాపించే వ్యక్తికి ప్రజాక్షేత్రంలో చరిష్మా అత్యంత కీలకం. మాటలతో ప్రజలను మంత్రముగ్ధుల్ని చేయగలిగే సత్తా ఉండాలి. ప్రజలు వాటిని విశ్వసించేలా వ్యవహరించాలి. ఉమ్మడి రాష్ట్రంలో విస్తృత ప్రజాదరణ చూరగొన్న పలువురు నేతలు తమ రాజకీయ ఎజెండాలకు అనుగుణంగా సొంత పార్టీలను స్థాపించారు. ముఖ్యంగా తెలంగాణ సాధనే లక్ష్యంగా 2001లో తెలంగాణ రాష్ట్ర సమితిని కేసీఆర్ ఏర్పాటు చేశారు. ఆ తర్వాత 2001లోనే ఆలె నరేంద్ర ఆధ్వర్యంలో తెలంగాణ సాధన సమితి పుట్టుకొచ్చింది. 2005లో ప్రముఖ నటి విజయశాంతి సైతం తెలంగాణ ఉద్యమ నేపథ్యంలో తల్లి తెలంగాణ పార్టీని స్థాపించారు. 2006 అక్టోబర్‌లో జయప్రకాశ్ నారాయణ ఆధ్వర్యంలో లోక్‌సత్తా పార్టీ ఆవిర్భవించింది. తెలుగుదేశం పార్టీలో అత్యంత కీలక నేతగా వెలుగొందిన తూళ్ల దేవేందర్‌గౌడ్ సారథ్యంలో 2008లో నవ తెలంగాణ పార్టీ (ఎన్టీపీ) ఏర్పాటైంది. జాతీయస్థాయిలో గుర్తింపు పొందిన ప్రముఖ సినీనటుడు చిరంజీవి 2008 ఆగస్టులో ప్రజా రాజ్యం పార్టీ (పీఆర్పీ)ని స్థాపించారు. దివంగత ముఖ్యమంత్రి వై.ఎస్.రాజశేఖరరెడ్డి కుమారుడు వై.ఎస్.జగన్మోహన్రెడ్డి ఆధ్వర్యంలో 2011లో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఏర్పాటైంది. ప్రముఖనటుడు పవన్ కల్యాణ్ ఆధ్వర్యంలో 2014 మార్చిలో జనసేన ఆవిర్భవించింది. ఆ తర్వాత 2018 ఎన్నికల సమయంలో తెలంగాణ ఉద్యమ నేత ప్రొఫెసర్ కోదండరాం ఆధ్వర్యంలో తెలంగాణ జన సమితి (టీజేఎస్) ఏర్పాటైంది. విలీనాలతో తెరమరుగు.. ఒకే లక్ష్యం దిశగా సాగుతున్న నేపథ్యంలో ఆలె నరేంద్రకు చెందిన తెలంగాణ సాధన సమితి 2002లో, విజయశాంతికి చెందిన తల్లి తెలంగాణ పార్టీ 2009లో అప్పటి టీఆర్ఎస్లో విలీనమయ్యాయి. లోక్‌సత్తా పార్టీ తరఫున 2009 అసెంబ్లీ ఎన్నికల్లో ఆ పార్టీ అధ్యక్షుడు జయప్రకాశ్ నారాయణ ఒక దఫా ఎమ్మెల్యేగా గెలుపొందగా... ఆ తర్వాత ఆ పార్టీ అభ్యర్థులెవరూ విజయం సాధించలేదు. దేవేందర్‌గౌడ్ తన నవ తెలంగాణ పార్టీని 2009 ఫిబ్రవరిలో ప్రజారాజ్యంలో విలీనం చేస్తున్నట్లు ప్రకటించారు. పీఆర్పీ 2011 ఫిబ్రవరిలో కాంగ్రెస్‌లో విలీనమైంది. మరోవైపు తెలంగాణ జన సమితి ప్రధాన పార్టీలకు ఇప్పటివరకు ఎక్కడా గట్టి పోటీ ఇవ్వలేదు. ఇక చిన్నాచితకా పార్టీలు ఎప్పటికప్పుడు అలా వచ్చి పోటీ చేయడం తప్ప విజయం సాధించి నిలదొక్కుకున్న దాఖలాలు లేవు. బరిలో బోలెడు రిజిస్టర్డ్ పార్టీలు.. 1999 అసెంబ్లీ ఎన్నికల వేళ ఉమ్మడి రాష్ట్రంలో పోటీ చేసిన పార్టీలు 27 మాత్రమే. ఇందులో 6 జాతీయ పార్టీలుండగా..ప్రాంతీయ పార్టీ ఒకటి మాత్రమే ఉండేది. అలాగే 12 రిజిస్టర్డ్ పార్టీలు ఉండగా పొరుగు రాష్ట్రాలకు చెందిన పార్టీలు 8 ఉండేవి. ఆ తర్వాత కాలంలో జరిగిన ఎన్నికల్లో జాతీయ, రాష్ట్ర పార్టీల సంఖ్య పెద్దగా మారనప్పటికీ కొత్తగా పుట్టుకొచ్చే పార్టీలు మాత్రం భారీగా పెరిగాయి. 2018 అసెంబ్లీ ఎన్నికల్లో 93 పార్టీలు ఎన్నికల బరిలో నిలిచాయి. ఇందులో పోటీ చేసిన రిజిస్టర్డ్ పార్టీల సంఖ్య ఏకంగా 77. రెండున్నర దశాబ్దాల్లో రిజిస్టర్డ్ పార్టీల సంఖ్య ఆరు రెట్లకుపైగా పెరగడం గమనార్హం. అధికారంలోకి రెండే పార్టీలు.. కొత్త పార్టీల్లో కేవలం టీఆర్ఎస్, వైఎస్సార్సీపీలు మాత్రమే ఎగిసిన కెరటంలా ఎదిగాయి. తెలంగాణలో టీఆర్ఎస్ 2014 నుంచి వరుసగా రెండుసార్లు అధికారం చేపట్టింది. అంచెలంచెలుగా ఎదుగుతూ జాతీయ స్థాయి పార్టీ బీఆర్ఎస్గా అవతరించింది. ప్రత్యేక రాష్ట్ర ఉద్యమంతో మొదలైన ఈ పార్టీ ఇప్పుడు ఇతర రాష్ట్రాల్లోనూ ఎన్నికల బరిలో నిలిచేందుకు సిద్ధమవుతోంది. ఇప్పటికే మహారాష్ట్రలోని పలు ప్రాంతాల్లో సీఎం కేసీఆర్ ఎన్నికల ప్రచార కార్యక్రమాల్లోనూ పాల్గొన్నారు. మరోవైపు ఏపీలో వైఎస్సార్సీపీ 2014 ఎన్నికల్లో ప్రధాన ప్రతిపక్షంగా నిలిచి 2019 అసెంబ్లీ ఎన్నికల్లో ఘన విజయం సాధించింది. -చిలుకూరి అయ్యప్ప -
జాబితాలో కనిపించని ‘జనసేన’
దేశవ్యాప్తంగా 100 ! ఎన్నికల తర్వాత పుట్టుకొచ్చిన వైనం జాబితాలో కనిపించని ‘జనసేన’ హైదరాబాద్: దేశవ్యాప్తంగా సార్వత్రిక ఎన్నికలు ముగిశాయో లేదా అప్పుడే కొత్త రాజకీయ పార్టీలు పుట్టుకొస్తున్నాయి. ఏప్రిల్, మే నెలల్లో లోక్‌సభ సార్వత్రిక ఎన్నికలు, పలు రాష్ట్రాల శాసనసభ ఎన్నికలు ముగిసి నాలుగు నెలలు తిరక్కముందే ఏకంగా వంద కొత్త రాజకీయ పార్టీలు కేంద్ర ఎన్నికల సంఘం వద్ద నమోదయ్యాయి. నాలుగు మాసాల కింద ఎన్నికలు జరిగినప్పుడు ఈసీ వద్ద రిజిస్టరైన పార్టీల సంఖ్య 1,593 గా ఉంది. ఈసీ తాజాగా విడుదల చేసిన గణాంకాల మేరకు ఆ సంఖ్య 1,699 కి చేరింది. కొత్తగా రిజిస్టరైన రాజకీయ పార్టీల్లో అత్యధికంగా ఉత్తరప్రదేశ్‌లో 31 ఏర్పాటయ్యాయి. ఆ తర్వాత హర్యానా (14), మహారాష్ట్ర (13)లో కొత్త పార్టీలు ఏర్పాటు కాగా ఆంధ్రప్రదేశ్‌లో 9 రాజకీయ పార్టీలు ఏర్పాటయ్యాయి. అయితే ఇవన్నీ ఎన్నికలకు ముందు దరఖాస్తు చేసుకున్న పార్టీలే. సార్వత్రిక ఎన్నికల అనంతరం రాజకీయ పార్టీగా రిజిస్ట్రేషన్ కోసం దరఖాస్తు చేసుకున్న సినీనటుడు పవన్ కల్యాణ్ జనసేన పార్టీ పేరు మాత్రం తాజాగా ఈసీ విడుదల చేసిన జాబితాలో లేదు!.. రాష్ట్రం విడిపోక ముందు దరఖాస్తు చేసిన ఈ పార్టీలన్నింటినీ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో నమోదైన పార్టీలుగానే ఎన్నికల సంఘం పరిగణించింది. రెండు రాష్ట్రాల్లో గుర్తింపు పార్టీగా వైఎస్సార్ కాంగ్రెస్... గడచిన సార్వత్రిక ఎన్నికల్లో ఆరు పార్టీలు (బీజేపీ, కాంగ్రెస్, బీఎస్పీ, సీపీఎం, సీపీఐ, ఎన్సీపీ) మాత్రమే జాతీయ పార్టీలుగా కేంద్ర ఎన్నికల సంఘం గుర్తింపు పొందాయి. అలాగే ఆయా రాష్ట్రాల్లో గుర్తింపు పొందిన రాజకీయ పార్టీలు 54 ఉన్నాయి. ఎన్నికల ఫలితాల అనంతరం గుర్తింపు పొందిన రాష్ట్ర పార్టీల జాబితాలో మరికొన్ని పార్టీలు చేరారు. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ గుర్తింపు పొందిన రాజకీయ పార్టీగా అవతరించగా, తెలంగాణలో ఏఐఎంఐఎం, బీహార్‌లో రాష్ట్రీయ లోక్ సమతా పార్టీ, పంజాబ్‌లో ఆమ్ ఆద్మీ పార్టీ, సిక్కింలో సిక్కిం క్రాంతి మోర్చా, కేరళలో రెవెల్యూషనరీ సోషలిస్ట్ పార్టీ, త్రిపురలో తృణమూల్ కాంగ్రెస్ పార్టీలు రాష్ట్ర పార్టీలుగా గుర్తింపు పొందాయి. జాతీయ, రాష్ట్ర పార్టీలుగా గుర్తింపు పొందినవి మినహాయిస్తే 16 వందల పైచిలుకు పార్టీలు కేవలం ఎన్నికల సంఘం వద్ద రిజస్టరైన పార్టీలుగానే ఉండటం గమనార్హం. -
పార్టీలే కొత్త..అభ్యర్థులు వారే !
శ్రీకాకుళం సిటీ,న్యూస్‌లైన్: జిల్లాలో మరికొద్ది రోజుల్లో జరగనున్న సార్వత్రిక ఎన్నికల్లో పలు నియోజకవర్గాల నుంచి పోటీ చేసే అభ్యర్థుల్లో పెద్దగా మార్పులు చోటుచేసుకోకపోయినప్పటికీ, వారి వారి పార్టీలు మాత్రం మారిపోయాయి. గతంలో పోటీచేసిన పార్టీలకు బదులుగా కొందరు పార్టీలు మారి అవే స్థానాల నుంచి పోటీల్లో దిగారు. శ్రీకాకుళం నుంచి 2009 ఎన్నికల్లో కాంగ్రెస్ నుంచి ధర్మాన ప్రసాదరావు, టీడీపీ నుంచి గుండ అప్పలసూర్యనారాయణ లు పోటీచేయగా,తాజా ఎన్నికల్లో వైఎస్సార్సీపీ నుంచి ధర్మా న, టీడీపీ నుంచి గుండ భార్య లక్ష్మీదేవి బరిలో ఉన్నారు. ఆమదాలవలసలో గత ఎన్నికల్లో పీఆర్పీ తరఫున మాజీ మంత్రి తమ్మినేని సీతారాం, ఆయన మేనల్లుడు కూన రవికుమార్ టీడీపీ తరఫున, కాంగ్రెస్ నుంచి బొడ్డేపల్లి సత్యవతిలు పోటీచేశారు. ఇప్పుడు వైఎస్సార్సీపీ నుంచి తమ్మినేని సీతారాం బరిలో ఉండగా, మిగిలిన ఇద్దరూ అవే పార్టీల నుంచి బరిలో ఉన్నారు. రాజాంలో కూడా 2009లో పీఆర్పీ తరపున కంబాల జోగులు, టీడీపీ నుంచి కావలి ప్రతిభాభారతి, కాంగ్రెస్ నుంచి కొండ్రు మురళీ మోహన్‌లు పోటీపడగా, తాజాగా వైఎస్సార్సీపీ నుంచి కంబాల జోగులు బరిలో ఉండగా, మిగిలిన ఇద్దరూ అవే పార్టీల నుంచి బరిలో ఉన్నారు. పాతపట్నంలో 2009 ఎన్నికల్లో కాంగ్రెస్ నుంచి శత్రుచర్ల విజయరామరాజు, టీడీపీ తరఫున కలమట మోహనరావులు పోటీపడగా, తాజాగా టీడీపీ నుంచి శత్రుచ ర్లవిజయరామరాజు, వైఎస్సార్సీపీ నుంచి కలమట వెంకటరమణలు పోటీ పడుతున్నారు. పాలకొండలో 2009 ఎన్నికల్లో టీడీపీ నుంచి నిమ్మక గోపాలరావు, కాంగ్రెస్ తరఫున నిమ్మక సుగ్రీవులు, పీఆర్పీ నుంచి విశ్వాసరాయి కళావతిలు పోటీ చేయగా, తాజా ఎన్నికల్లో టీడీపీ నుంచి దివంగత గోపాలరావు తనయుడు నిమ్మక జయకృష్ణ, కాంగ్రెస్ నుంచి సుగ్రీవులు, వైఎస్సార్సీపీ నుంచి విశ్వాసరాయి కళావతిలు పోటీలో ఉన్నారు. పలాసలో 2009 ఎన్నికల్లో పీఆర్పీ నుంచి వంకా నాగేశ్వరరావు, కాంగ్రెస్ నుంచి జుత్తు జగన్నాయకులు, టీడీపీ నుంచి గౌతు శివాజీలు పోటీ చేయగా, తాజా ఎన్నికల్లో కాంగ్రెస్ నుంచి వంకా నాగేశ్వరరావు, టీడీపీ నుంచి గౌతు శివాజీలు బరిలో ఉన్నారు. గతంలో కాంగ్రెస్ తరఫున ఎమ్మెల్యేగా పోటీ చేసిన వజ్జ బాబూరావు నేడు వైఎస్సార్సీపీ నుంచి పోటీ చేస్తున్నారు.టెక్కలిలో 2009లో కాంగ్రెస్ నుంచి కొర్ల భారతి, టీడీపీ నుంచి కింజరాపు అచ్చెన్నాయుడు, పీఆర్పీ నుంచి దువ్వాడ శ్రీనివాస్‌లు పోటీ చే యగా, తాజా ఎన్నికల్లో వైఎస్సార్సీపీ నుంచి దువ్వాడ శ్రీనివాస్, జైసమైక్యాంధ్ర పార్టీ నుంచి కొర్ల భారతిలు బరిలో ఉన్నారు. ఇచ్ఛాపురంలో 2009లో కాంగ్రెస్ తరఫున నరేష్కుమార్ అగర్వాలా (లల్లూ), పీఆర్పీ నుంచి నర్తు రామారావులు పోటీపడగా, తాజాగా వైఎస్సార్సీపీ తరఫున నర్తు రామారావు పోటీ చేస్తుండగా, లల్లూ మాత్రం కాంగ్రెస్ టిక్కెట్‌పైనే పోటీ చేస్తున్నారు. శ్రీకాకుళం పార్లమెంట్ స్థానానికి 2009లో కాంగ్రెస్ తరఫున కి ల్లి కృపారాణి, టీడీపీ నుంచి కింజరాపు ఎర్రన్నాయుడులు పోటీ చేయగా, తాజా ఎన్నికల్లో కాంగ్రెస్ నుంచి కృపారాణి, టీడీపీ నుంచి దివంగత ఎర్రన్నాయుడుకుమారుడు రామ్మోహన్నాయుడులు బరిలో ఉన్నారు. కొత్తగా వైఎస్సార్ సీపీ తరఫున రెడ్డి శాంతి బరిలోకి దిగారు.