జాబితాలో కనిపించని ‘జనసేన’
దేశవ్యాప్తంగా 100 ! ఎన్నికల తర్వాత పుట్టుకొచ్చిన వైనం
జాబితాలో కనిపించని ‘జనసేన’
హైదరాబాద్: దేశవ్యాప్తంగా సార్వత్రిక ఎన్నికలు ముగిశాయో లేదా అప్పుడే కొత్త రాజకీయ పార్టీలు పుట్టుకొస్తున్నాయి. ఏప్రిల్, మే నెలల్లో లోక్‌సభ సార్వత్రిక ఎన్నికలు, పలు రాష్ట్రాల శాసనసభ ఎన్నికలు ముగిసి నాలుగు నెలలు తిరక్కముందే ఏకంగా వంద కొత్త రాజకీయ పార్టీలు కేంద్ర ఎన్నికల సంఘం వద్ద నమోదయ్యాయి. నాలుగు మాసాల కింద ఎన్నికలు జరిగినప్పుడు ఈసీ వద్ద రిజిస్టరైన పార్టీల సంఖ్య 1,593 గా ఉంది. ఈసీ తాజాగా విడుదల చేసిన గణాంకాల మేరకు ఆ సంఖ్య 1,699 కి చేరింది.
కొత్తగా రిజిస్టరైన రాజకీయ పార్టీల్లో అత్యధికంగా ఉత్తరప్రదేశ్‌లో 31 ఏర్పాటయ్యాయి. ఆ తర్వాత హర్యానా (14), మహారాష్ట్ర (13)లో కొత్త పార్టీలు ఏర్పాటు కాగా ఆంధ్రప్రదేశ్‌లో 9 రాజకీయ పార్టీలు ఏర్పాటయ్యాయి. అయితే ఇవన్నీ ఎన్నికలకు ముందు దరఖాస్తు చేసుకున్న పార్టీలే. సార్వత్రిక ఎన్నికల అనంతరం రాజకీయ పార్టీగా రిజిస్ట్రేషన్ కోసం దరఖాస్తు చేసుకున్న సినీనటుడు పవన్ కల్యాణ్ జనసేన పార్టీ పేరు మాత్రం తాజాగా ఈసీ విడుదల చేసిన జాబితాలో లేదు!.. రాష్ట్రం విడిపోక ముందు దరఖాస్తు చేసిన ఈ పార్టీలన్నింటినీ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో నమోదైన పార్టీలుగానే ఎన్నికల సంఘం పరిగణించింది.
రెండు రాష్ట్రాల్లో గుర్తింపు పార్టీగా వైఎస్సార్ కాంగ్రెస్...
గడచిన సార్వత్రిక ఎన్నికల్లో ఆరు పార్టీలు (బీజేపీ, కాంగ్రెస్, బీఎస్‌పీ, సీపీఎం, సీపీఐ, ఎన్‌సీపీ) మాత్రమే జాతీయ పార్టీలుగా కేంద్ర ఎన్నికల సంఘం గుర్తింపు పొందాయి. అలాగే ఆయా రాష్ట్రాల్లో గుర్తింపు పొందిన రాజకీయ పార్టీలు 54 ఉన్నాయి. ఎన్నికల ఫలితాల అనంతరం గుర్తింపు పొందిన రాష్ట్ర పార్టీల జాబితాలో మరికొన్ని పార్టీలు చేరారు.
ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ గుర్తింపు పొందిన రాజకీయ పార్టీగా అవతరించగా, తెలంగాణలో ఏఐఎంఐఎం, బీహార్‌లో రాష్ట్రీయ లోక్ సమతా పార్టీ, పంజాబ్‌లో ఆమ్ ఆద్మీ పార్టీ, సిక్కింలో సిక్కిం క్రాంతి మోర్చా, కేరళలో రెవెల్యూషనరీ సోషలిస్ట్ పార్టీ, త్రిపురలో తృణమూల్ కాంగ్రెస్ పార్టీలు రాష్ట్ర పార్టీలుగా గుర్తింపు పొందాయి. జాతీయ, రాష్ట్ర పార్టీలుగా గుర్తింపు పొందినవి మినహాయిస్తే 16 వందల పైచిలుకు పార్టీలు కేవలం ఎన్నికల సంఘం వద్ద రిజస్టరైన పార్టీలుగానే ఉండటం గమనార్హం.