కేజ్రీవాల్‌కు ఈసీ తాఖీదు
బీజేపీపై వ్యాఖ్యలతో సీరియస్
న్యూఢిల్లీ: దేశ రాజధాని నగరంలో మత హింసను రెచ్చగొట్టేందుకు బీజేపీ ప్రయత్నిస్తోందని ఆరోపిస్తూ చేసిన వ్యాఖ్యల ద్వారా ఆమ్ ఆద్మీ పార్టీ కన్వీనర్ అరవింద్ కేజ్రీవాల్ ఎన్నికల నియమావళిని ప్రాథమికంగా ఉల్లంఘించారంటూ కేంద్ర ఎన్నికల కమిషన్ ఆయనకు శనివారం షోకాజ్ నోటీసు జారీ చేసింది. ఈ నోటీసుకు ఈ నెల 20వ తేదీ (వచ్చే మంగళవారం) మధ్యాహ్నం 3 గంటల లోపు సమాధానం ఇవ్వాలని గడువు విధించింది.
గడువులోగా సమాధానం ఇవ్వని పక్షంలో.. ఎన్నికల నియామవళి ఉల్లంఘన అంశంపై ఆయనను సంప్రదించకుండానే నిర్ణయం తీసుకుంటామని స్పష్టం చేసింది. కేజ్రీవాల్ ఇటీవల మీడియాతో మాట్లాడుతూ.. ఢిల్లీలో మత హింసను ప్రేరేపించేందుకు బీజేపీ ప్రయత్నిస్తోందని, త్రిలోక్‌పురి, నందగిరిల్లో మత హింసను రెచ్చగొట్టిందని ఆరోపించారని పేర్కొంటూ బీజేపీ రాష్ట్ర చీఫ్ సతీష్ ఉపాధ్యాయ్ చేసిన ఫిర్యాదును ఈసీ తన నోటీసులో ఉటంకించింది.
ఢిల్లీలో చర్చిలపై దాడులకు కూడా బీజేపీ కారణమని కేజ్రీవాల్ చేసినట్లు చెప్తున్న వ్యాఖ్యలను నూ ప్రస్తావించింది. అలాగే.. తనపైన, బీజేపీ ఢిల్లీ కార్యవర్గంలోని మరో నేతపైన కేజ్రీవాల్ తప్పుడు ఆరోపణలు చేశారని సతీష్ ఉపాధ్యాయ్ చేసిన మరో ఫిర్యాదుపై కూడా సమాధానం ఇవ్వాలని ఈసీ తన నోటీసులో అడిగింది. ఢిల్లీ శాసనసభ ఎన్నికలకు ఈసీ షెడ్యూలు విడుదల చేయడంతో ఈ నెల 12 నుంచి రాజధాని నగరంలో ఎన్నికల నియమావళి అమలులోకి వచ్చిన విషయం తెలిసిందే.