మీ వల్ల కాకుంటే సీఈసీకి అప్పగిస్తాం
జీహెచ్‌ఎంసీ ఎన్నికలపై ప్రభుత్వానికి స్పష్టం చేసిన హైకోర్టు
ఎన్నికల నిర్వహణకు 249 రోజులెందుకు?
ఆ గడువును ఎలా సమర్థించుకుంటారో చెప్పండి
ఏజీకి ఆదేశం.. విచారణ సోమవారానికి వాయిదా
హైదరాబాద్: గ్రేటర్ హైదరాబాద్ మునిసిపల్ కార్పొరేషన్ (జీహెచ్‌ఎంసీ) ఎన్నికల నిర్వహణ కోసం ఏకంగా 249 రోజుల గడువు కోరడంపై హైకోర్టు గురువారం తెలంగాణ ప్రభుత్వంపై అసంతృప్తి వ్యక్తం చేసింది. ఎన్నికల నిర్వహణకు అంత సమయం ఎందుకని ప్రశ్నించింది. ‘మీకు (ప్రభుత్వం) అవసరం కాబట్టి సాధారణ ఎన్నికలను, ఉప ఎన్నికలను ఆగమేఘాలపై నిర్వహిస్తారు. కాని చట్టబద్ధంగా నిర్వహించాల్సిన జీహెచ్‌ఎంసీ ఎన్నికలను నిర్వహించేందుకు గడువు కావాలంటారు. అసాధారణ అలసత్వాన్ని మాత్రం ఎట్టి పరిస్థితుల్లో సహించేది లేదు. మీరు (ప్రభుత్వం) ఎన్నికలు పెట్టకుంటే ఆ పనిని మేం కేంద్ర ఎన్నికల సంఘం (సీఈసీ)కు అప్పజెబుతాం’ అని ఘాటుగా వ్యాఖ్యానించింది. 249 రోజుల గడువు కోరడాన్ని ఎలా సమర్థించుకుంటారో చెప్పాలని అడ్వొకేట్ జనరల్ (ఏజీ) కె.రామకృష్ణారెడ్డిని ఆదేశించింది. తదుపరి విచారణను ఈ నెల 20కి వాయిదా వేసింది. ఈ మేరకు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ కల్యాణ్‌జ్యోతి సేన్‌గుప్తా, న్యాయమూర్తి జస్టిస్ పి.వి.సంజయ్‌కుమార్‌లతో కూడిన ధర్మాసనం ఉత్తర్వులు జారీ చేసింది.
జీహెచ్‌ఎంసీకి ఎన్నికలు నిర్వహించకపోవడాన్ని రాజ్యాంగ విరుద్ధంగా ప్రకటించడంతో పాటు స్పెషల్ ఆఫీసర్ల నియామకానికి అవకాశం కల్పిస్తున్న జీహెచ్‌ఎంసీ చట్టంలోని సెక్షన్ 70జి చట్ట విరుద్ధంగా ప్రకటించాలంటూ ఫోరం ఫర్ గుడ్ గవర్నెన్స్ కార్యదర్శి ఎం.పద్మనాభరెడ్డి హైకోర్టులో ఇటీవల ప్రజా ప్రయోజన వ్యాజ్యం (పిల్) దాఖలు చేసిన విషయం తెలిసిందే. ఈ వ్యాజ్యాన్ని ఇప్పటికే పలుమార్లు విచారించిన ధర్మాసనం గురువారం దానిని మరోసారి విచారించింది. ప్రభుత్వం తరఫున ఏజీ కె.రామకృష్ణారెడ్డి వాదనలు వినిపిస్తూ, జీహెచ్‌ఎంసీ వార్డుల సంఖ్యను 200కు పెంచామని, ఇందుకు సంబంధించి ప్రభుత్వం జీవో కూడా జారీ చేసిందన్నారు. ఈ జీవోను పరిశీలించిన ధర్మాసనం, జీవోను జారీ చేయడానికి 30 రోజుల గడువు ఎందుకు తీసుకున్నారని ప్రశ్నించింది. అధికారుల సంఖ్య తక్కువగా ఉండటం వల్ల నిర్ణయాలు తీసుకోవడంలో ఆలస్యం జరుగుతోందని ఏజీ చెప్పారు. ఈ సందర్భంగా ఎన్నికల నిర్వహణకు సంబంధించి ప్రభుత్వం సమర్పించిన షెడ్యూల్‌ను పరిశీలించిన ధర్మాసనం, పలు అంశాలపై వివరణ కోరింది. ‘అవసరమైతే ఎన్నికల నిర్వహణ బాధ్యతలను కేంద్ర ఎన్నికల సంఘానికి అప్పజెబుతాం. జీహెచ్‌ఎంసీకి ఎన్నికలు పెట్టి తీరాల్సిందే. మీరు ఈ విధంగా 249 రోజులు అంటూ అసాధారణ గడువు కోరడం సరికాదు. మిగులు నిధులున్న మీ రాష్ట్రంలోనే జీహెచ్‌ఎంసీ ఎన్నికలు పెట్టకుంటే ఎలా..?’ అని వ్యాఖ్యానించింది. దీనికి ఏజీ స్పందిస్తూ, మిగులు నిధులన్నది మీడియా ప్రచారమేనంటూ కొట్టిపారేసే ప్రయత్నం చేశారు. దీనికి ధర్మాసనం స్పందిస్తూ, మీడియా గాల్లో నుంచి రాయదు కదా. అధికారులు చెబితేనే వారు రాసేది అంటూ వ్యాఖ్యానించింది. 249 రోజుల గడువును ఎలా సమర్థించుకుంటారో చెప్పాలని ఏజీకి స్పష్టం చేస్తూ విచారణను సోమవారానికి వాయిదా వేసింది.