పతకాలు సాధిస్తూ కొందరు.. స్ఫూర్తిగా మరికొందరు
జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో చిన్నారుల ప్రతిభ
మార్షల్ ఆర్ట్స్‌పై నగరవాసులకు ఆసక్తి
సాధనతో రాటుదేలుతున్న పలువురు క్రీడాకారులు
కుంగ్ ఫూ శిక్షణ.. జీహెచ్‌ఎంసీ గ్రౌండ్స్ వేదికగా అభ్యాసన
ఆత్మ రక్షణ క్రీడలైన కుంగ్ ఫూ, మార్షల్ ఆర్ట్స్ పై నగర వాసులకు ఆసక్తి పెరుగుతోంది. నగరంలోని జీహెచ్‌ఎంసీ గ్రౌండ్స్ వేదికగా అభ్యాసన చేస్తున్నారు పలువురు క్రీడాకారులు. దీంతో పాటు పతకాలు సాధిస్తూ కొందరు.. స్ఫూర్తిగా మరికొందరు ఈ మార్షల్ ఆర్ట్స్ పట్ల ఆకర్షితులవుతున్నారు నగరవాసులు. అంతేకాకుండా జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో పలువురు క్రీడాకారులు ప్రతిభను కనబరుస్తూ పతకాలు సాధిస్తున్నారు. – సనత్‌నగర్
నగరంలో ఇటీవలికాలంలో మార్షల్ ఆర్ట్స్ శిక్షణకు ఆదరణ పెరుగుతోంది. తల్లిదండ్రుల్లో ఈ మిక్స్‌డ్ మార్షల్ ఆర్ట్స్ పట్ల పెరుగుతున్న అవగాహనే ఇందుకు కారణం. పైగా చిన్నతనం నుంచి ఇటువంటి శిక్షణలో పాల్గొనడంతో ఆత్మస్థైర్యం కూడా పెరుగుతుందని విశ్లేషకులు చెబుతున్న మాట. దీంతో చిన్నారులు కూడా ఈ తరహా శిక్షణ తీసుకునేందుకు కఠోర దీక్షతో అభ్యాసన చేస్తున్నారు. అంతేకాకుండా జీహెచ్‌ఎంసీ గ్రౌండ్స్‌లో నిర్వహించే శిక్షణా శిబిరాలను సద్వినియోగం చేసుకుంటూ రాటుదేలుతున్నారు.
ఆ‘శక్తి’ని గమనించి..
కోచ్‌లు సైతం పిల్లల్లోని ఆ‘శక్తి’ని గమనించి కుంగ్‌ఫూలో ఉన్నత శిక్షణను అందిస్తూ వివిధ పోటీల్లో పాల్గొనేలా ప్రోత్సహిస్తున్నారు. బేగంపేట ఓల్డ్ పాటిగడ్డలోని జీహెచ్‌ఎంసీ గ్రౌండ్, బ్రాహ్మణవాడీ, మాసబ్ ట్యాంక్, విజయనగర్ కాలనీల్లో కుంగ్ ఫూ – మార్షల్ ఆర్ట్స్‌లో గ్రాండ్ మాస్టర్ కంటేశ్వర్, డిప్యూటీ గ్రాండ్ మాస్టర్ కళ్యాణ్, జీహెచ్‌ఎంసీ కోచ్ చందు నిరంతరం శిక్షణను అందిస్తున్నారు. 2010 జనవరి 1 నుంచి వీరు శిక్షణ కొనసాగిస్తుండగా ఇప్పటి వరకూ వందలాది మంది కుంగ్ ఫూలో శిక్షణ పొందారు.
చదవండి: లగ్జరీ అపార్ట్‌మెంట్‌ను అమ్మేసిన సోనాక్షి సిన్హా, లాభం భారీగానే!
పలు పోటీల్లో...
నగరంలో ఎల్బీ స్టేడియం, కోట్ల విజయ భాస్కర్‌రెడ్డి స్టేడియం, సరూర్‌నగర్, బాలయోగి స్టేడియం తదితర ప్రాంతాల్లో ఎక్కడ పోటీలు జరిగినా ఇక్కడి చిన్నారులు పాల్గొంటూ ప్రతిభను కనబరుస్తున్నారు. ఒక్క నగరానికే పరిమితం కాకుండా రాష్ట్రంలోని వరంగల్, సిర్పూర్ కాగజ్ నగర్, బెల్లంపల్లి, మందమర్రి, ఖాజీపేటతో పాటు ఒడిస్సా, మహారాష్ట్ర, గోవా తదితర రాష్ట్రాల్లో జరిగిన జాతీయ, అంతర్జాతీయ పోటీల్లో పాల్గొని పతకాలను సాధించారు.
నాలుగేళ్ల చిన్నారుల నుంచి..
మానసిక, శారీరక దృఢత్వం, ఏకాగ్రత కోసం నాలుగేళ్ల చిన్నారి నుంచి 23 ఏళ్ల యువకుల వరకూ ఇక్కడ శిక్షణ పొందుతున్నారు. శిక్షణ తీసుకున్న వారిలో చాలామంది వెళ్లిపోగా, ప్రస్తుతం ఆయా కేంద్రాల వేదికగా 70 మంది వరకూ శిక్షణ పొందుతున్నారు. చిన్నతనం నుంచే కుంగ్ ఫూలో శిక్షణ పొందడం వల్ల ఎన్నో ప్రయోజనాలు చేకూరతాయని మాస్టర్లు పేర్కొంటున్నారు.
ఇదీ చదవండి : లూపస్ వ్యాధి గురించి తెలుసా? చికిత్స లేకపోతే ఎలా?!
కుంగ్ ఫూతో మేలు..
కుంగ్ ఫూ, మార్షల్ ఆర్ట్స్ ఆరోగ్యపరంగా ఎంతో మేలు చేస్తాయి. శారీరక, మానసిక దృఢత్వం పెరిగి, ఆత్మరక్షణతో పాటు ఆత్మస్థైర్యం పెంపొందుతుంది. మా చిన్నారులు ప్రతిభ కనబరుస్తూ.. పతకాలు సాధించడం ఎంతో ఆనందాన్ని కలిగిస్తోంది.
– కంటేశ్వర్, కళ్యాణ్, చందు, కంగ్ ఫూ మాస్టర్లు
మాస్టర్ల ప్రోత్సాహమే..
కుంగ్ ఫూలో నేను బ్లాక్ బెల్ట్ సాధించాను. మాస్టర్లు, కోచ్‌ల ప్రోత్సాహంతో ఇప్పటి వరకూ ఎన్నో పోటీల్లో పాల్గొన్నాను. మొత్తం 30 బంగారు, 25 వెండి, 15 కాంస్య పతకాలను సాధించానంటే.. అది వారి శిక్షణ ఫలితమే.
– వాసు, కుంగ్ ఫూ క్రీడాకారుడు
Comments
Please login to add a commentAdd a comment