Kung Fu
-
మన చందు ‘బంగారం’
సాక్షి, బచ్చన్నపేట(వరంగల్): ప్రతిభకు పేదరికం అడ్డురాదు. లక్ష్యం.. పట్టుదలకు కఠోర దీక్ష తోడైతే ఏదైనా సాధించవచ్చని నిరూపించాడు జనగామ జిల్లా బచ్చన్నపేట మండల కేంద్రం అంజయ్యనగర్‌కు చెందిన బొలుగుల చందు. ఇటీవల అంతర్జాతీయ స్థాయిలో జరిగిన ఐదో ఇంటర్నేషనల్ యూత్ నేపాల్ హీరో కప్ (అండర్–19) కరాటే కుంగ్ ఫూ పోటీల్లో పాల్గొని ప్రథమ స్థానంలో నిలిచి గోల్డ్‌మెడల్ సాధించాడు. తండ్రి ఆటో డ్రైవర్.. తల్లి కంకుల విక్రయం బొలుగుల యాదగిరి, సునీత దంపతులకు ముగ్గురు కుమారులు. వీరిలో రెండో కుమారుడు చందు. నిరుపేద కుటుంబానికి చెందిన యాదగిరి రోజూ ఆటో నడుపుతుండగా.. భార్య సునీత మొక్కజొన్న కంకులు విక్రయించి వచ్చిన ఆదాయంతో కుటుంబాన్ని పోషించుకుంటున్నారు. చందు 5వ తరగతి వరకు స్థానిక ప్రైవేట్ పాఠశాలలో, ఆరో తరగతి నుంచి ఇంటర్మీడియట్ వరకు మండల కేంద్రంలో చదువుకున్నాడు. ప్రస్తుతం వరంగల్ జిల్లా నర్సంపేటలో డిగ్రీ ఫస్టియర్ చేస్తున్నాడు. చిన్నప్పటి నుంచి మార్షల్ ఆర్ట్స్‌పై ఆసక్తి ఉన్న చందు ఎనిమిదవ ఏట కరాటే కుంగ్‌ఫూ నేర్చుకున్నాడు. యాదాద్రి భువనగిరి జిల్లా ఆలేరు మండలానికి చెందిన దొడ్డి శ్రీనివాస్ మాస్టర్ బచ్చన్నపేటకు వచ్చి కుంగ్‌ఫూ నేర్పించేవారు. దేశ, రాష్ట్ర ఖ్యాతిని ఇనుమడించేలా.. ఇంటర్నేషనల్ యూత్ నేపాల్ హీరో కప్ కుంగ్‌ఫూ పోటీల్లో 14 దేశాలు పాల్గొనగా.. భారతదేశం నుంచి బొలుగుల చందు బరిలోకి దిగాడు. పలు దేశాల క్రీడాకారులతో తలపడి విజయం సాధించిన చందు ఫైనల్స్‌లో కొరియా ప్లేయర్‌పై 5–4 తేడాతో అద్భుత విజయం సాధించాడు. అంతకుముందు జరిగిన తొలిరౌండ్లో భూటాన్‌పై 5–3, సెమీ ఫైనల్లో నేపాల్ ప్లేయర్‌పై 5–3 తేడాతో విజయాలను సొంతం చేసుకున్నాడు. అంతర్జాతీయ వేదికపై దేశ, రాష్ట్ర ఖ్యాతిని ఇనుమడింపజేసేలా రాణించిన చందు పసిడి పతకం దక్కించుకున్నాడు. దాతల సాయంతో నేపాల్‌కు.. ఫైనల్ పోటీలకు ఎంపికైన చందు నేపాల్‌కు వెళ్లడానికి ఆర్థిక పరిస్థితులు అడ్డంకిగా మారాయి. కనీసం రవాణా చార్జీలకు సైతం చేతిలో డబ్బులు లేకపోవడంతో మండల కేంద్రానికి చెందిన పలువురు దాతలు, అలాగే మంత్రి కేటీఆర్ సహాయంతో నేపాల్ వెళ్లాడు. అంతర్జాతీయ స్థాయిలో ఓ మెరుపు మెరిసిన చందును ప్రతి ఒక్కరూ అభినందిస్తున్నారు. -
కుంగ్ ఫూ నన్స్
హిమాలయాల్లో గ్రామాల వెంట ఎర్రటి దుస్తుల్లో తిరిగే బౌద్ధ సన్యాసినులు కనిపిస్తారు. వీరు కొండ ప్రాంత ప్రజలకు కోవిడ్ గురించి తీసుకోవాల్సిన జాగ్రత్తలను ప్రచారం చేస్తారు. సహాయం అందిస్తారు. వ్యాధిగ్రస్తుల వైద్యానికి సాయం చేస్తారు. అవసరమైతే రక్షణగా నిలుస్తారు. వీరు కుంగ్ ఫూ నన్స్. గతంలో కేవలం బౌద్ధ స్త్రీ సేవాదళంగా ఉండేవారు. ఇప్పుడు కుంగ్ ఫూ కూడా నేర్చి తమను తాము రక్షించుకోవడమే కాదు ఏ చెడు పైన అయినా పంచ్ విసరడానికి సిద్ధంగా ఉంటారు. కోవిడ్–19 మీద ప్రభుత్వాలు పోరాటం చేస్తున్నాయి. స్వచ్ఛంద సంస్థలు, పోలీసులు, ఆరోగ్య సిబ్బంది అందరూ పోరాటం చేస్తున్నారు. అయితే హిమాలయ పర్వత ప్రాంతాలలో దాదాపు 800 మంది బౌద్ధ మహిళా భిక్షువులు కూడా పోరాటం చేస్తున్నారని చాలా కొద్దిమందికే తెలుసు. ఈ బౌద్ధ మహిళా భిక్షువులను ‘కుంగ్ ఫూ నన్స్’ అంటారు. ఎందుకంటే వీరికి కుంగ్ ఫూ వచ్చు కాబట్టి. కావి రంగు బట్టల్లో, శిరో ముండనం చేసుకుని, గంటల తరబడి చేసిన ధ్యానం వల్ల వచ్చిన ప్రశాంత వదనాలతో ఈ మహిళా భిక్షువులు ‘సాటి మనిషిని ప్రేమించుటకే జీవించు’ అనే బౌద్ధ తత్వాన్ని సాధన చేస్తుంటారు. ప్రస్తుతం కోవిడ్ రోజుల్లో ప్రజలను చైతన్యవంతం చేయడానికి హిమాలయ పర్వత సానువుల్లో వీరు తిరుగుతూ ఉంటే మంచు మీద పూసిన ఎర్రపూల వలే కనిపిస్తారు దూరం నుంచి. 2015 నుంచి వార్తల్లోకి బౌద్ధంలోని అనేక శాఖలలో మహిళా భిక్షువులకు ప్రవేశం లేదు. కాని స్త్రీలకు చదువు అబ్బకపోవడం, వారికి సహాయకులు లేకపోవడం, మార్గదర్శకుల లేమి... ఇవన్నీ గమనించిన ‘ద్రుక్పా’ అనే బౌద్ధ శాఖ స్త్రీలకు ప్రత్యేకంగా ప్రవేశం కల్పించింది. అందుకే వీరిని ద్రుక్పా బౌద్ధులు అంటారు. వీరు ప్రధానంగా శాంతి కొరకు, సేవ కొరకు పని చేయాల్సి వచ్చినా వీరికి వ్యాయామం నిషిద్ధమే అయినా 2015లో వచ్చిన వీరి గురువు వీరికి కుంగ్ ఫూ నేర్చుకునే అనుమతిని ఇచ్చాడు. దానికి కారణం పర్వత ప్రాంతాలలో అమాయక ఆడపిల్లలు ట్రాఫికింగ్ కు గురి కావడం వల్లే. ‘మీరూ నేర్చుకోండి... ఆడ³ల్లలకూ నేర్పండి’ అని లడాక్‌లో ఉన్న వీరి ప్రధాన కార్యాలయం ఆదేశం ఇవ్వగానే ఈ నన్స్ కుంగ్ ఫూ నేర్చుకుని భారత్–నేపార్ సరిహద్దుల్లోని గ్రామాల్లో ఆడపిల్లలకు కుంగ్ ఫూ నేర్పడం మొదలుపెట్టారు. ఇది అంతర్జాతీయ మీడియా ను ఆకర్షించి మెచ్చుకోళ్లు వచ్చాయి. వీరి మంచి పనికి సహాయం కూడా అందసాగింది. ‘మేము కుంగ్ ఫూ నేర్చుకోవడం ఇతర బుద్ధిస్ట్ శాఖలకు నచ్చదు. మా పని ప్రార్థించడం, వంట చేయడం, శుభ్రం చేయడం అని భావిస్తారు. కాని మేము సేవతో పాటు రక్షణకు కూడా కట్టుబడ్డాం. జనం మమ్మల్ని మెచ్చుకుంటున్నారు’ అని అంటారు వీరు. వీరి అందరి పేర్ల చివర ‘జిగ్మే’ అని పెట్టుకుంటారు. జిగ్మే అంటే భయం లేనిది అని అర్థం. సహాయమే మతం ‘ఇతరులకు సహాయం చేయడమే మా మతం’ అంటారు కుంగ్‌ఫూ నన్స్. ప్రస్తుతం భారతదేశంలో అంటే టిబెట్ చుట్టుపక్కల 8 సంవత్సరాల నుంచి 80 సంవత్సరాల వయసు ఉన్న 800 మంది కుంగ్ ఫూ నన్స్ ఉన్నారు. కోవిడ్ సమయంలో లాక్డౌన్ వల్ల ప్రజలు పడే ఇబ్బందులు వీరు గమనించారు. ‘ప్రకృతి మాత కాలుష్యం నుంచి బయటపడేందుకు చేసిన ప్రయత్నంలా అనిపించింది ఇది. అయితే ప్రజల కష్టాలను మేము చూడలేకపోయాం. సహాయం కోసం ఎదురు చూడటం కంటే మనమే సహాయంగా మారాలని అనుకున్నాం’ అని ఈ నన్స్ అన్నారు. లాక్డౌన్ సమయంలో లాక్డౌన్ తర్వాత కూడా వీరు సరిహద్దు గ్రామాల వెంట ఉన్న దాదాపు 2000 కుటుంబాలను వీరు రేషన్ అందించారు. దేశ విదేశాల నుంచి అందిన విరాళాలు ఇందుకు సాయపడ్డాయి. పరిశీలకులు గమనించింది ఏమిటంటే హిమాయాల పొడవున ఆహారం లేక అలమటించిన పశువులకు కుంగ్ ఫూ నన్‌లు మేత ఏర్పాటు చేశారు. లేకుంటే అనాథ పశువులు ఎన్నో ఇప్పటికి చనిపోయి ఉండేవి. చైతన్యం... సాధనం కోవిడ్ ఎంత ప్రమాదమో కుంగ్ ఫూ నన్‌లకు అర్థమైంది. కాని కొండ ప్రాంత ప్రజలకు దాని తీవ్రత అర్థం కాదు. ‘మేము వారికి పదే పదే చైతన్యం కలిగించాల్సి వచ్చింది. వారికి అది కేవలం జలుబు అనే అభిప్రాయం ఉంది. కాని వారికి భౌతిక దూరం గురించి, మాస్కుల గురించి చెప్పాం. వాటిని మేము కుట్టి పంచాం. దాని బారిన పడ్డ వారికి వైద్య సహాయం అందేలా చూశాం’ అంటారు ఈ కుంగ్ ఫూ నన్‌లు. కోవిడ్ ప్రచారంలో దిగాక వీరికి స్త్రీల ఇతర సమస్యలు కూడా తెలిసి వచ్చాయి. ‘శానిటరీ నాప్కిన్స్ సమస్య తీవ్రంగా ఉంది. హిమాయాల స్త్రీలకు వీటిని అందుబాటులోకి తేవడానికి పని మొదలుపెడతాం’ అంటున్నారు వారు. స్త్రీల శక్తి అపారం. యుద్ధ విద్యలు నేర్చిన స్త్రీల శక్తి మరింత దృఢం. ఈ దృఢమైన సేవ స్త్రీలకు తప్పక మేలు చేస్తుంది. సహాయక చర్యలు చేపట్టిన కుంగ్‌ఫూ నన్స్ కుంగ్‌ఫూ సాధన – సాక్షి ఫ్యామిలీ -
పాడు చేతుల నుంచి కాపాడుకో
అననుకూల ప్రదేశాలనీ, సమయాలనీ, ముందు జాగ్రత్తలతో ప్రయాణాలనీ, ఇలా ఎన్ని తరాలని భయాలను వెంటేసుకుని దినదిన గండంగా మసులుకోవాలి? ‘మీటూ’ వంటి ఉద్యమాలు మహిళల్లో చైతన్యం పెరుగుతున్న విషయాన్నీ, అదే సమయంలో మహిళలపై వేధింపుల తీవ్రత, లోతుల్ని తెలియజేస్తున్న నేపథ్యంలో వేధింపుల గురించి చెప్పడానికి ధైర్యం చేసిన మహిళలు ఎదుర్కోవడానికీ మరింత ధైర్యంగా సిద్ధం కావాలి. స్వీయరక్షణ నేర్వాలి. అకస్మాత్తుగా, అనూహ్యంగా వేధింపులకు గురైన మహిళ అచేతనురాలు అవుతుంది. నెర్వస్నెస్, భయం, నిస్సత్తువ ఆవరిస్తాయి. ఆత్మవిశ్వాసం నీరుగారిపోతుంది. ఇవన్నీ ఆ పరిస్థితిని ఎదుర్కునే శక్తియుక్తుల్ని మరింతగా తగ్గించివేస్తాయి. అందుకే కొన్ని స్వీయరక్షణ మెళకువలు, మార్షల్ ఆర్ట్స్ నేర్చుకోవడం తప్పనిసరి. ప్రస్తుతం ఇదే ఆలోచనతో పలువురు మహిళలు, కార్పొరేట్ ఉద్యోగినులు మార్షల్ ఆర్ట్స్ ఎంచుకుంటున్నారు. ఇటీవలి కాలంలో వీరు బాగా ఆసక్తి చూపుతున్న స్వీయరక్షణ శైలిగా వింగ్‌చున్ కుంగ్‌ఫూ పేరొందింది. ఎందుకంటే... అన్నీ అనువైనవి కావు ప్రపంచవ్యాప్తంగా ఎన్నో యుద్ధ కళలు, శైలులు అందుబాటులో ఉన్నాయి. కొన్ని మార్షల్ ఆర్ట్స్ మిలటరీ శిక్షణ తరహాలో కఠినంగా ఉంటాయి. ఇటుకరాళ్లు పగుల గొట్టడం వంటివి అందరూ సాధన చేయగలిగినవి కావు. దాదాపుగా అన్ని యుద్ధ కళలూ పురుషుల చేత, పురుషుల కోసం రూపొందించినవే కావడం దీనికో కారణం. మహిళల చేత.. మహిళల కోసం దాదాపు 300 ఏళ్ల చరిత్ర కలిగిన వింగ్ చున్ కుంగ్ ఫూ మాత్రమే ప్రపంచంలో మహిళ సృష్టించిన యుద్ధ కళ. కొంగ, పాముల మధ్య పోరాటాన్ని చూసిన తర్వాత వచ్చిన స్ఫూర్తితో, దీన్ని ఎంగ్ మ్యూ అనే షావొలిన్ బుద్ధిస్ట్ మఠాధిపతి హోదాలో ఉన్న చైనీస్ మహిళ.. వాటి కదలికల్ని చైనీస్ కుంగ్ ఫూ రూపంలో మేళవించి రూపొందించారని చెబుతారు. ఆ తర్వాత ఆమె యిమ్ వింగ్ చున్ అనే శిష్యురాలికి ఈ కళను ధారాదత్తం చేశారట. ఎంతో అందమైన ఆ యువతి తనను పెళ్లాడమని వేధిస్తున్న దృఢకాయుడిని ఓడించేందుకు ఈ కళనే ఆధారం చేసుకుందట. నిజానికి ఆమె అందగత్తే కాబట్టే పురుషుల అవాంఛనీయ వేధింపుల నుంచి రక్షించుకోవడానికే ఎంగ్ మ్యూ ఈ కళను నేర్పిందంటారు. ఈ యుద్ధ కⶠవింగ్ చున్గా ప్రాచుర్యంలోకి వచ్చి ఆ తర్వాత తర్వాత యిమ్ వింగ్ చున్గా మారింది. దీన్ని మహిళే డిజైన్ చేసినప్పటికీ... బ్రూస్లీ గురువు, గ్రాండ్ మాస్టర్ ఐపి మ్యాన్ దీన్ని ప్రాచుర్యంలోకి తీసుకొచ్చారు. ప్రస్తుతం కోట్లాది మంది వింగ్ చున్ను ప్రపంచవ్యాప్తంగా సాధన చేస్తున్నారు. శక్తి ప్రదర్శన కోసం కాదు ఒక వేధింపు పరిస్థితి నుంచి పుట్టిన ఈ యిమ్ వింగ్ చున్.. సంపూర్ణమైన స్వీయ రక్షణాత్మక యుద్ధకళ. అంతే తప్ప తన శారీరక శక్తిని ప్రదర్శించుకోవడానికి కాదు. మహిళల్లోని అత్యంత నిగూఢమైన శక్తి యుక్తుల్ని ఇది వెలికి తీస్తుంది. ప్రత్యర్ధి అంతరంగం లో ఉద్దేశాలనూ పసిగట్టేందుకూ ఉపకరిస్తుంది. కొంగ చూపే ఉగ్రతత్వం, ఏకాగ్రత పూర్వక దాడి, సర్పంలా మెలికలు తిరిగే గుణం.. ఇవన్నీ దీనిలో కలిసి ఉంటాయి. ఎటువంటి ప్రత్యేక వస్త్రధారణగాని అవసరం లేదు. మగవాళ్లు / మహిళలు నేర్చుకోవచ్చు. ఏ రకమైన శరీర తత్వం అయినా ఓకే. ఎలివేటర్స్, వాష్ రూమ్స్, మెట్లు, ఇరుకు గల్లీలు, సన్నని కారిడార్స్... వంటి ఇరుకైన ప్రదేశాల్లో సమర్ధంగా పోరాడేందుకు వీలు కల్పించడం వింగ్ చున్ ప్రత్యేకత. తగిన వెలుతురు లేకపోయినా లేదా పూర్తి అంధకారంలో కూడా మనల్ని మనం కాపాడుకోవచ్చు. ఎక్కడ నేర్పిస్తారు? స్వీయరక్షణ సామర్ధ్యాలను మహిళలకు అందించే లక్ష్యంతో పనిచేస్తున్న ఎన్జిఓ ‘స్వరక్షణ్ ట్రస్ట్ ఇండియా వింగ్ చున్ అకాడమీ’ (ఐడబ్లు్యసిఎ) స్కూల్స్ నిర్వహిస్తూ వింగ్ చున్ కుంగ్ ఫూను కార్పొరేట్స్‌కి, ఎన్జిఓలకు నేర్పుతోంది. అలాగే ఉమెన్స్ సెల్ఫ్ డిఫెన్స్ వర్క్‌షాప్స్ నిర్వహిస్తోంది. గత పదేళ్లుగా ముంబయి, ఢిల్లీ, పుణేలలో నిర్వహిస్తూ ఇటీవలే హైదరాబాద్‌లో శిక్షణా కేంద్రం స్థాపించింది. రెండేళ్లు సాధన... ► ఇది ఆధునిక యుగానికి నప్పే అత్యంత ప్రాక్టికల్ శైలి. అత్యంత జనసమ్మర్దం కలిగిన నగర వాతావరణ పరిస్థితులకు అనుగుణంగా రూపొందింది. ► కనీసం 10 సంవత్సరాలు అంతకన్నా ఎక్కువ సమయం పట్టే ఇతర మార్షల్ ఆర్ట్స్‌తో పోలిస్తే దీనిని తక్కువ సమయంలో నేర్చుకోవచ్చు. సరైన పద్ధతిలో సాధన చేస్తే రెండేళ్లు చాలు. ► అన్ని రకాల పరిమాణంలో, షేప్స్‌లో ఉన్న అందరూ దీన్ని సాధన చేయవచ్చు. ► శక్తి కన్నా స్ట్రక్చర్‌ని, వేగం కన్నా టైమింగ్‌ని అధికంగా ఉపయోగించుకుంటుంది. సాధారణ మానవ శరీరపు తీరుపై ఆధారపడుతుంది కాబట్టి జంతువుల కదలికలను అనుసరించక్కర్లేదు. సాధకులకు అసాధారణ ఫ్లెక్సిబులిటీ, క్రీడా నైపుణ్యం అవసరం ఉండదు. ► ప్రాధమికంగా ఇది ఖాళీ చేతులను కదిపే శైలి. మనల్ని మనం రక్షించుకోవడానికి ఉద్దేశించింది కాబట్టి నిరాయుధులుగా ఉన్నా ఉపయోగించవచ్చు. ► అకస్మాత్తుగా జరిగే దాడుల నుంచి రక్షించుకునేందుకు వీలైన శిక్షణ ఇందులో ప్రధానం. వేధింపులను సమర్ధవంతంగా ఎదుర్కునే కళను నేర్చుకుంటున్న యువతులు – ఎస్.సత్యబాబు -
బాహుబలి దెబ్బకు కుంగ్ ఫూ మటాష్
న్యూఢిల్లీ: ప్రపంచవ్యాప్తంగా సంచలనం సష్టిస్తున్న బాహుబలి–2 (ది కక్లూజన్) సినిమా దెబ్బకు ప్రేక్షకాధారణ పొందుతున్న అస్సామీస్ చిత్రం సీక్వెల్ ‘లోకల్ కుంగ్ ఫూ–2’ తీవ్రంగా దెబ్బతిన్నది. బాహుబలి చిత్రం ప్రదర్శన కోసం బాగా నడుస్తున్న తమ చిత్రాన్ని అర్ధాంతరంగా థియేటర్ల నుంచి తొలగించి తమకు అన్యాయం చేశారని నిర్మాత కెన్నీ బాసుమత్రే వాపోతున్నారు. ఆయన లోకల్ కుంగ్ ఫూను 2015లో తీశారు. ఆ సినిమా బాగా నడవడంతో ఇప్పుడు దానికి సీక్వెల్ తీశారు. ఈ సీక్వెల్ 19వ తేదీన విడుదలైంది. అస్సామీస్ యుద్ధ కళలను కామెడీ పద్ధతిలో చూపించడం వల్ల తమ చిత్రం ప్రేక్షకాధరణ ఊహించినట్లే పెరిగిందని చెప్పారు. సాధారణంగా చిన్న బడ్జెట్లో తీసే అస్సామీస్ చిత్రాలు రెండో వారంలో ఊపందకుంటాయని ఆయన చెప్పారు. రెండో వారంలో దాదాపు సినిమా హాళ్లు నిండుతున్న సమయంలో తమ సినిమాను ఎత్తేసి బాహుబలి–2 హిందీ వర్షన్‌కు థియేటర్లు అవకాశం ఇవ్వడం వల్ల తమకు అన్యాయం జరిగిందని ఆయన ఆరోపించారు. మొదటి భాగం హిట్టయిన కారణంగా కొంచెం ఎక్కువ బడ్జెట్‌తోనే సినిమాను తీశామని, మరో వారం ఆడితేగానీ తాము పెట్టిన పెట్టుబడి తిరిగి రాదని ఆయన అన్నారు. తమిళనాడు, మహారాష్ట్ర రాష్ట్రాల్లోలాగా స్థానిక సినిమాలకు రక్షణ కల్పిస్తూ ప్రభుత్వం చట్టం తీసుకరావాలని ఆయన డిమాండ్ చేశారు. తప్పనిసరిగా స్థానిక సినిమాలకు కొన్ని స్క్రీన్లను కేటాయిస్తూ తమిళనాడు, మహారాష్ట్రలో ప్రత్యేక రాష్ట్ర చట్టాలున్నాయి. ఇంతకుముందు షారూక్ ఖాన్ నటించిన రాయీస్ చిత్రం విడుదల సందర్భంగా కూడా బాగా నడుస్తున్న ఓ అస్సామీ సినిమాను అర్ధంతరంగా ఎత్తివేశారు. దీనిపై ఆ సినిమా దర్శకుడు హిమాంషు ప్రసాద్ ఏకంగా మైన్మార్‌లో తలదాచుకున్న అల్ఫా నాయకుడు పరేశ్ బారువాకు ఓ లేఖ రాశారు. దాంతో బారువా ఓ స్థానిక టీవీ ముందుకొచ్చి అస్సామీ సినిమాల ప్రదర్శనకు ప్రాధాన్యత ఇవ్వకపోతే అంతు చూస్తానని థియేటర్ యజమానులను హెచ్చరించారు. ఈ నేపథ్యంలోనే రాష్ట్ర ప్రభుత్వం కూడా ముందుకొచ్చి తమిళనాడు, మహారాష్ట్ర తరహాలో ప్రత్యేక చట్టం తీసుకొచ్చేందుకు థియేటర్ యజమానుల సంఘంతో చర్చలు జరిపింది. ఆ చర్చలు ఓ కొలిక్కి రాకపోవడంతో ఆ సమస్య అలాగే ఉండి పోయింది. అస్సామీ చిత్రాలు ఏడాదికి దాదాపు 40 చిత్రాలు విడుదలవుతాయని, అవన్ని చిన్న బడ్జెట్ చిత్రాలవడం, ప్రజలు కూడా వాటికన్నా హిందీ చిత్రాలను చూసేందుకు ఇష్ట పడడం వల్ల తమకు అసలు లాభాలు రావని, తమ థియేటర్ల నిర్వహణకు, సిబ్బంది జీతాలు చెల్లించేందుకే తాము హిందీ సినిమాలపై ఆధారపడాల్సి వస్తోందని థియేటర్ యజమానులు చెబుతున్నారు. ఈ విషయాన్ని మరోసారి మీడియా ప్రభుత్వం దష్టికి తీసుకెళ్లగా త్వరలోనే ఈ చట్టం తీసుకొస్తామని ప్రభుత్వం హామీ ఇచ్చింది. -
విజేతలు పాషా, సుభాష్
జాతీయ కుంగ్-ఫు చాంపియన్‌షిప్ సాక్షి, హైదరాబాద్: జాతీయ కుంగ్-ఫు-వుషూ చాంపియన్‌షిప్‌లో ఎస్వీ మోడల్ స్కూల్ విద్యార్థులు సత్తా చాటారు. నాసిక్‌లో జరిగిన ఈ చాంపియన్‌షిప్‌లో రెండు స్వర్ణాలు, రెండు రజతాలు, రెండు కాంస్యాలు సహా ఆరు పతకాలను సాధించారు. అండర్-14 విభాగంలో 45-50 కేజీ కేటగిరీలో అబ్దుల్ పాషా... 41-45 కేజీ కేటగిరీలో పీఆర్‌ఎస్‌వీ సుభాష్ విజేతలుగా నిలిచి పసిడి పతకాలను కై వసం చేసుకున్నారు. 35-40 కేజీ కేటగిరీలో కేశవ్ రజత పతకాన్ని దక్కించుకున్నాడు. అండర్-15 విభాగంలో నరేశ్ (50-55కేజీ) రజతాన్ని సంపాదించగా... వెంకటేశ్ (65-75కేజీ), మొహమ్మద్ ఖాజా పాషా (50-55 కేజీ) కాంస్య పతకాలను గెలుచుకున్నారు. -
ఈ ఊరోళ్లు... కుంగ్ ఫూ కింగ్‌లు!
పర్యాటక ఆసక్తికి భౌగోళిక అందాలు, విశిష్టతలు మాత్రమే కాదు...‘ప్రత్యేకతలు’ కూడా ప్రాముఖ్యత వహిస్తాయని చైనాలోని చిరు గ్రామం గంక్సీ డొంగ్ చెప్పకనే చెబుతుంది. ఒక్కరు కాదు... ఇద్దరు కాదు... ఆడా మగా తేడా లేదు... ఆ ఊరు ఊరంతా కుంగ్ ఫూలో నిపుణులే! సెంట్రల్ చైనాలోని పచ్చటి తీయాంఝా కొండల మధ్యలో రహస్యంగా దాచినట్లుగా ఉంటుంది గంక్సీ డొంగ్. డొంగ్ తెగకు చెందిన ప్రజలు ఈ గ్రామంలో నివసిస్తుంటారు.డొంగ్ ప్రజలు అనగానే వ్యవసాయంతో పాటు రకరకాల చేతికళా వృత్తులు గుర్తుకు వస్తాయి. చిత్రకళలో కూడా వీరికి మంచి ప్రావీణ్యం ఉంది. దైవం మీద ఎంత నమ్మకం ఉందో దెయ్యం, దుష్టశక్తుల మీద కూడా అంతే నమ్మకం ఉంది వీరికి. ప్రకృతి విలయాలు సంభవించినప్పుడు ‘ఇది దుష్టశక్తి కుట్ర’ అనుకుంటారు వాళ్లు. ఆర్కిటెక్చర్లో అందమైన ప్రయోగాలు చేసే డొంగ్ ప్రజలకు తమవైన ప్రత్యేక పండగలు ఉన్నాయి. అయితే చైనాలోని మిగిలిన ప్రాంతాల్లో నివసించే డొంగ్ ప్రజలకు లేని ప్రత్యేకత... గంక్సీలో నివసించే డొంగ్లకు ఉంది. అదే కుంగ్ ఫూ! గంక్సీ గ్రామంలో నివసించే ప్రతి ఒక్కరూ కుంగ్ ఫూ నేర్చుకుంటారు. అయితే ప్రత్యేకతలో ప్రత్యేకత ఏమిటంటే, అందరూ ఒకేరకంగా కుంగ్ ఫూ చేయరు. ఒక్కొక్కరిదీ ఒక్కో స్టైల్. ఇక్కడా అక్కడా అనే తేడా లేదు... ఏ ప్రదేశంలో అయినా సరే కుంగ్ ఫూ సాధన చేస్తారు. కొన్నిసార్లు ఆ సాధన బహిరంగ ప్రదేశాల్లో ఉండొచ్చు, కొన్నిసార్లు జలజల పారుతున్న సెలయేటి నీటిలో ఉండొచ్చు, పచ్చటి కొండలపై కూడా ఉండొచ్చు! కుంగ్ ఫూ విద్యకు తమదైన సృజననాత్మకను అద్దుతున్నారు ఈ గ్రామస్తులు. అడవిలో నివసించే ఈ అడవి బిడ్డలు... పాము కదలికల్లో నుంచి, పులి పరుగుల నుంచి స్ఫూర్తి పొందుతూ... కుంగ్ ఫూలో ఎప్పటికప్పుడు సరికొత్త మార్పులు చేస్తున్నారు. నిజానికి గ్రామస్తుల ప్రధానవృత్తి వ్యవసాయమే అయినప్పటికీ... కుంగ్ ఫూయే తమ జీవనాధారం అన్నంతగా సాధన చేస్తారు. ‘‘ప్రకృతి శక్తిని, ప్రకృతిలోని అందాలను, కుంగ్ ఫూలోని సమస్త వైవిధ్యాలనూ కలిపి ఒక్కచోటే చూడాలంటే ఈ గ్రామాన్ని సందర్శించాల్సిందే’’ అంటున్నాడు అమెరికాకు చెందిన హ్యారిసన్ అనే పర్యాటకుడు. కుంగ్ ఫూ అంటే ఈ గ్రామస్తులకు ఎందుకంత ఇష్టం, ఈ ఇష్టం, ఆసక్తి, అంకితభావం వెనుక ఉన్న అసలు కారణమేమిటి అనేదానికి రకరకాల కారణాలు వినిపిస్తాయి. అందులో ప్రధానమైనవి రెండు. మొదటిది: ఒకప్పుడు గ్రామంలోకి క్రూర జంతువులు ప్రవేశించి తీవ్రమైన ఆస్తి నష్టం, ప్రాణనష్టం కలిగించేవట. అలాంటి సమయంలో గ్రామపెద్దలు ఒక యువ దళాన్ని తయారుచేసి, కుంగ్ ఫూలో శిక్షణ ఇప్పించారు. నాటి నుంచీ గ్రామ రక్షణ బాధ్యతలను ఆ యువదళం తీసుకుంది. అడవి జంతువుల నుంచి గ్రామానికి ఎలాంటి నష్టం కలుగకుండా ఈ దళం కాపాడసాగింది. కాలక్రమంలో ఈ యువదళ సభ్యుల కుంగ్ ఫూ నైపుణ్యం... ఊళ్లోని ఆబాల గోపాలన్నీ ఆకట్టుకుంది. దాంతో అందరూ కుంగ్ ఫూ నేర్చుకోవడమే కాదు... ఆ విద్యలో తమదైన ప్రత్యేకతను ప్రదర్శించడం ప్రారంభించారు. రెండవది: డొంగ్ ప్రజలు గ్రామాన్ని నిర్మించు కుంటోన్న తొలిరోజుల్లో తరచూ దొంగల బారిన పడేవారట. ఈ దొంగల బెడదను తట్టుకోలేక వేరే ప్రాంతం నుంచి ఇద్దరు కుంగ్ ఫూ నిపుణులను రప్పించుకొని ఊళ్లో అందరూ కుంగ్ ఫూలో శిక్షణ తీసుకున్నారట. ఆ పరంపరే ఇప్పటికీ కొనసాగుతుందనేది ఒక కథనం. కుంగ్ ఫూ నేర్చుకోడానికి కారణాలు ఏవైనా... ప్రపంచంలో ఎక్కడెక్కడి నుంచో పర్యాటకులు పనిగట్టుకుని ఈ చిట్టి గ్రామాన్ని వెతుక్కుంటూ రావడానికి కారణం మాత్రం కుంగ్ ఫూయే! -
ఊరంతా వీరులే!
మన దేశంలో కరాటే, కుంగ్‌పూ లాంటి ఆత్మరక్షణకు ఉపయోగపడే విద్యలను అభ్యసించేవారి సంఖ్య తక్కువనే చెప్పాలి. ఎవరైనా ఇలాంటి విద్యలో ప్రావీణ్యం ప్రదర్శిస్తుంటే మనం వారిని చాలా గొప్పగా, ఆశ్చర్యంగా చూస్తాం. కానీ చైనాలోని ఒక గ్రామంలో చిన్నాపెద్దా అనే తేడా లేకుండా ఊరుఊరంతా కుంగ్‌పూ విద్యలో తమదైన నైపుణ్యం ప్రదర్శిస్తున్నారు. వారేదో ఆర్మీలో చేరేందుకో మరేదైనా ఉద్దేశంతోనో ఈ విద్యను అభ్యసిస్తున్నారనుకుంటే మీరు పొరబడ్డారన్నమాటే. మొదట్లో ఆత్మరక్షణ కోసం ప్రారంభించిన ఈ విద్య, ప్రస్తుతం ఆ గ్రామంలో ఒక సంప్రదాయంగా మారింది. చైనాలోని టియాంఝ పర్వతాల్లో ఉన్న ఈ గ్రామం పేరు 'గంజి డోంగ్' ఈ రోజు ఆ ప్రత్యేక గ్రామం విశేషాల గురించి తెలుసుకుందాం..! రోజూ సాధన.. యువకుల నుంచి ముసలివారి దాకా రోజూ క్రమం తప్పకుండా కుంగ్‌ఫూ సాధన చేస్తుంటారు. మహిళలు కూడా ఇందులో ఉత్సాహంగాపాల్గొనడం విశేషం. సుమారు 120 కుటుంబాలు ఉన్న ఈ గ్రామం దట్టమైన అటవీ ప్రాంతంలో ఉంది. వీరంతా చిన్నచిన్న గుడిసెల్లో జీవనం సాగిస్తున్నారు. వ్యవసాయం వీరి ప్రధాన వృత్తి. ఎవరి స్టైల్ వారిదే.. ఇలా సాధన చేసేటప్పుడు అందరూ ఒకే రకమైన విన్యాసాలను అభ్యసించరు. ఒక్కో కుటుంబానిది ఒక్కో రకమైన శైలి కుంగ్‌పూ. దినచర్యలో భాగంగా వాడే వస్తువులే వారికి ఆయుధాలు. ఎటువంటి ఆయుధాలు లేకుండా చేతులతోనే పోరాడే యోధులు కూడా ఉన్నారు. కొన్ని తరాలుగా ఈ నైపుణ్యాలను అభివృద్ధి చేసుకుంటూ పటిష్టమైన యుద్ధ కళను కాపాడుకుంటున్నారు గ్రామస్తులు. ఒంటరిగా తమదైన శైలిలో సాధన చేస్తూనే మరోశైలి వారిపై కయ్యానికి కాలుదువ్వుతుంటారు. ఇవన్నీ స్నేహపూర్వక పందాలే అయినప్పటికీ పోరాటం మాత్రం యుద్ధాన్ని తలపిస్తుంది. వైరమనేదే కనిపించదు.. ఎన్ని పోరాటాలు జరిగినా ఏ కుటుంబానికీ మరో కుటుంబంతో వైరమనేదే ఉండదు. గ్రామం మొత్తం ఒక కుటుంబంగా కుంగ్‌ఫూ అభివృద్ధికి తోడ్పడుతోంది. చైనాలో కనిపించే 56 సంప్రదాయక జాతుల్లో ఈ గ్రామం వారిది ఒక తెగ. కుంగ్‌ఫూలోని కొన్ని ప్రత్యేకమైన విన్యాసాలను కేవలం ఈ గ్రామంలో మాత్రమే చూడగలమని కుంగ్‌ఫూ నిపుణులు అంటున్నారు. సాధన కోసం గ్రామస్తులు ఎంత కష్టమైనా వెనుకాడరు. అడవి, కొండలు, గుహలు, లోయలు, కాలువలు, పొలాలు.. ఇలా ప్రతిచోట ఎదురయ్యే సవాళ్లనే తమ సాధనకు అనుకూలంగా మార్చుకుంటారు. ఎలా మొదలైంది..? ఈ ఊరి ప్రజలంతా కుంగ్‌ఫూ నేర్చుకోవడం వెనుక రెండు కథలు ప్రచారంలో ఉన్నాయి. ఈ గ్రామం అరణ్య ప్రాంతంలో ఉండటంతో క్రూర మృగాలు నిత్యం గ్రామస్తులపై దాడి చేసి గాయపరిచేవి. వారికి జీవనాధారమైన పెంపుడు జంతువులను చంపేసేవి. దాంతో ఇంటికొక యువకుడు చొప్పున ఒక బృందంగా ఏర్పడ్డారు. క్రూర మృగాల బారినుంచి వారి గ్రామాన్ని కాపాడుకోవడానికి యువకులంతా ఈ విద్యను అభ్యసించడం మొదలు పెట్టారు. కాలక్రమేణా ఇదే వారి సంప్రదాయంగా మారింది. మరో కథనం ప్రకారం మొదటగా కొన్ని కుటుంబాలు ఆ ఊరికి వచ్చి నివాసం ఏర్పర్చుకున్నాయి. అయితే దోపిడీ దొంగల బెడద ఎక్కువవడంతో ఆ గ్రామ ప్రజలు ఇద్దరు మార్షల్ ఆర్ట్స్ నిపుణుల్ని సంప్రదించి వారి ఆధ్వర్యంలో ఆ యుద్ధవిద్యను నేర్చుకున్నారు. వాళ్లు నేర్చుకున్న ఆ కళను మిగిలిన వారికి కూడా నేర్పించడం మొదలు పెట్టారట. -
అంతర్జాతీయ కుంగ్‌ఫూ పోటీలకు తాండూరు విద్యార్థి
తాండూరు, న్యూస్‌లైన్: అంతర్జాతీయ కుంగ్‌ఫూ పోటీల్లో పాల్గొనే అవకాశం తాండూరు విద్యార్థి వంశీకృష్ణకు దక్కింది. వచ్చే ఏడాది జనవరి 24వ తేదీ నుంచి 26వ తేదీ వరకు అమెరికాలోని వాషింగ్టన్(డీసీ) హోస్టన్ సిటీలో ఇంటర్నేషనల్ చైనీస్ మార్షల్ అకాడమీ(ఐసీఎంఏ) ఆధ్వర్యంలో లోన్‌స్టార్ చైనీస్ మార్షల్ ఆర్ట్స్ చాంపియన్ షిప్‌పోటీలు నిర్వహించనున్నారు. పోటీల్లో పాల్గొనేందుకు ఇండియన్ కుంగ్‌ఫూ అసోసియేషన్ వంశీకృష్ణను ఎంపిక చేసినట్లు మహబూబ్‌నగర్ జిల్లా కుంగ్‌ఫూ అసోసియేషన్ మాస్టర్ వెంకటేశం శుక్రవారం ‘న్యూస్‌లైన్’కు తె లిపారు.