మన దేశంలో కరాటే, కుంగ్‌పూ లాంటి ఆత్మరక్షణకు ఉపయోగపడే విద్యలను అభ్యసించేవారి సంఖ్య తక్కువనే చెప్పాలి. ఎవరైనా ఇలాంటి విద్యలో ప్రావీణ్యం ప్రదర్శిస్తుంటే మనం వారిని చాలా గొప్పగా, ఆశ్చర్యంగా చూస్తాం. కానీ చైనాలోని ఒక గ్రామంలో చిన్నాపెద్దా అనే తేడా లేకుండా ఊరుఊరంతా కుంగ్‌పూ విద్యలో తమదైన నైపుణ్యం ప్రదర్శిస్తున్నారు. వారేదో ఆర్మీలో చేరేందుకో మరేదైనా ఉద్దేశంతోనో ఈ విద్యను అభ్యసిస్తున్నారనుకుంటే మీరు పొరబడ్డారన్నమాటే. మొదట్లో ఆత్మరక్షణ కోసం ప్రారంభించిన ఈ విద్య, ప్రస్తుతం ఆ గ్రామంలో ఒక సంప్రదాయంగా మారింది. చైనాలోని టియాంఝ పర్వతాల్లో ఉన్న ఈ గ్రామం పేరు 'గంజి డోంగ్' ఈ రోజు ఆ ప్రత్యేక గ్రామం విశేషాల గురించి తెలుసుకుందాం..!
రోజూ సాధన..
యువకుల నుంచి ముసలివారి దాకా రోజూ క్రమం తప్పకుండా కుంగ్‌ఫూ సాధన చేస్తుంటారు. మహిళలు కూడా ఇందులో ఉత్సాహంగాపాల్గొనడం విశేషం. సుమారు 120 కుటుంబాలు ఉన్న ఈ గ్రామం దట్టమైన అటవీ ప్రాంతంలో ఉంది. వీరంతా చిన్నచిన్న గుడిసెల్లో జీవనం సాగిస్తున్నారు. వ్యవసాయం వీరి ప్రధాన వృత్తి.
ఎవరి స్టైల్ వారిదే..
ఇలా సాధన చేసేటప్పుడు అందరూ ఒకే రకమైన విన్యాసాలను అభ్యసించరు. ఒక్కో కుటుంబానిది ఒక్కో రకమైన శైలి కుంగ్‌పూ. దినచర్యలో భాగంగా వాడే వస్తువులే వారికి ఆయుధాలు. ఎటువంటి ఆయుధాలు లేకుండా చేతులతోనే పోరాడే యోధులు కూడా ఉన్నారు. కొన్ని తరాలుగా ఈ నైపుణ్యాలను అభివృద్ధి చేసుకుంటూ పటిష్టమైన యుద్ధ కళను కాపాడుకుంటున్నారు గ్రామస్తులు. ఒంటరిగా తమదైన శైలిలో సాధన చేస్తూనే మరోశైలి వారిపై కయ్యానికి కాలుదువ్వుతుంటారు. ఇవన్నీ స్నేహపూర్వక పందాలే అయినప్పటికీ పోరాటం మాత్రం యుద్ధాన్ని తలపిస్తుంది.
వైరమనేదే కనిపించదు..
ఎన్ని పోరాటాలు జరిగినా ఏ కుటుంబానికీ మరో కుటుంబంతో వైరమనేదే ఉండదు. గ్రామం మొత్తం ఒక కుటుంబంగా కుంగ్‌ఫూ అభివృద్ధికి తోడ్పడుతోంది. చైనాలో కనిపించే 56 సంప్రదాయక జాతుల్లో ఈ గ్రామం వారిది ఒక తెగ. కుంగ్‌ఫూలోని కొన్ని ప్రత్యేకమైన విన్యాసాలను కేవలం ఈ గ్రామంలో మాత్రమే చూడగలమని కుంగ్‌ఫూ నిపుణులు అంటున్నారు. సాధన కోసం గ్రామస్తులు ఎంత కష్టమైనా వెనుకాడరు. అడవి, కొండలు, గుహలు, లోయలు, కాలువలు, పొలాలు.. ఇలా ప్రతిచోట ఎదురయ్యే సవాళ్లనే తమ సాధనకు అనుకూలంగా మార్చుకుంటారు.
ఎలా మొదలైంది..?
ఈ ఊరి ప్రజలంతా కుంగ్‌ఫూ నేర్చుకోవడం వెనుక రెండు కథలు ప్రచారంలో ఉన్నాయి. ఈ గ్రామం అరణ్య ప్రాంతంలో ఉండటంతో క్రూర మృగాలు నిత్యం గ్రామస్తులపై దాడి చేసి గాయపరిచేవి. వారికి జీవనాధారమైన పెంపుడు జంతువులను చంపేసేవి. దాంతో ఇంటికొక యువకుడు చొప్పున ఒక బృందంగా ఏర్పడ్డారు. క్రూర మృగాల బారినుంచి వారి గ్రామాన్ని కాపాడుకోవడానికి యువకులంతా ఈ విద్యను అభ్యసించడం మొదలు పెట్టారు. కాలక్రమేణా ఇదే వారి సంప్రదాయంగా మారింది. మరో కథనం ప్రకారం మొదటగా కొన్ని కుటుంబాలు ఆ ఊరికి వచ్చి నివాసం ఏర్పర్చుకున్నాయి. అయితే దోపిడీ దొంగల బెడద ఎక్కువవడంతో ఆ గ్రామ ప్రజలు ఇద్దరు మార్షల్ ఆర్ట్స్ నిపుణుల్ని సంప్రదించి వారి ఆధ్వర్యంలో ఆ యుద్ధవిద్యను నేర్చుకున్నారు. వాళ్లు నేర్చుకున్న ఆ కళను మిగిలిన వారికి కూడా నేర్పించడం మొదలు పెట్టారట.
ఊరంతా వీరులే!
Published Sat, Sep 26 2015 12:09 PM | Last Updated on Sun, Sep 3 2017 10:01 AM
Advertisement
Advertisement