village
-
జనసేన నేతల గ్రామ బహిష్కరణ
పిఠాపురం: కాకినాడ జిల్లా పిఠాపురం నియోజకవర్గం కొత్తపల్లి మండలం పొన్నాడ శివారు కోనపాపపేటలో జనసేనకు చెందిన నాలుగు కుటుంబాలను గ్రామ బహిష్కరణ చేస్తూ టీడీపీ ఆధ్వర్యాన గ్రామస్తులు తీసుకున్న నిర్ణయం సంచలనం సృష్టించింది. కొత్తపల్లి మండలం కోనపాపపేట వద్ద కేఎస్‌ఈజెడ్‌లో ఇటీవల ఒక కంపెనీ నిరి్మస్తున్న పైప్‌లైన్‌వల్ల తమ ఉపాధి దెబ్బతింటోందని స్థానిక మత్స్యకారులు కొన్నాళ్లుగా ఆందోళన చేస్తున్నారు. ఈ నేపథ్యంలో.. కొందరు జనసేన నేతలు కంపెనీ వద్ద రూ.6 కోట్లు తీసుకున్నట్లు టీడీపీ నేతలు ప్రచారం చేశారు. ఈ మేరకు గ్రామంలో గురువారం సమావేశం ఏర్పాటుచేసి, ఆరోపణలు ఎదుర్కొంటున్న జనసేనకు చెందిన పల్లేటి బాపన్నదొర, పల్లేటి దారకొండ, పల్లేటి నాగేశ్వరరావు, పల్లేటి శ్రీనుతో పాటు వారి కుటుంబ సభ్యులకు జరిమానా విధించారు. దీంతో కోపోద్రిక్తులైన ఆరుగురు వ్యక్తులు టీడీపీ నేతలపై దాడికి దిగగా ఇద్దరికి గాయాలయ్యాయి. గాయపడిన వారి తరఫున టీడీపీ నేతలు కొత్తపల్లి పోలీసుస్టేషన్లో ఫిర్యాదు చేశారు. అయితే, దాడిచేసిన వారిపై పోలీసులు ఎలాంటి చర్యలూ తీసుకోకపోవడంతో కోనపాపపేటలో ఆరోపణలు ఎదుర్కొంటున్న నాలుగు కుటుంబాలను గ్రామం నుంచి బహిష్కరించినట్లు గ్రామస్తుల పేరుతో శుక్రవారం మైక్‌లో ప్రచారం చేశారు. అలాగే, వారి ఫొటోలతో గ్రామంలో ఫ్లెక్సీలు సైతం ఏర్పాటుచేశారు. ఈ నాలుగు కుటుంబాల వారితో ఎవరైనా మాట్లాడినా, వారికి సహకరించినా, వారి దుకాణాల వద్ద ఏ విధమైన వస్తువులు కొన్నా, వారికి చేపలు అమ్మినా, కొన్నా రూ.లక్ష జరిమానా విధించనున్నట్లు బహిరంగంగా ప్రచారం చేశారు. విషయం తెలుసుకున్న గ్రామ సచివాలయ సిబ్బంది అధికారులకు సమాచారమిచ్చారు. దీంతో అధికారులు ఆ గ్రామానికి చేరుకుని గ్రామ బహిష్కరణ ప్రచారాన్ని నిలుపుదల చేశారు. గ్రామ బహిష్కరణ చేసిన వారిపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని, బాధిత కుటుంబాలు అధికారులకు ఫిర్యాదు చేయగా.. తమపై దాడిచేసిన వారిని వెంటనే అరెస్టుచేయాలని టీడీపీ నేతలూ పోలీసులను డిమాండ్ చేస్తున్నారు. ఈ పరిణామాల నేపథ్యంలో గ్రామంలో తీవ్ర ఉద్రిక్తత నెలకొనడంతో కొత్తపల్లి పోలీసులు గ్రామంలో పహారా ఏర్పాటు చేశారు. కొండెవరంలో టీడీపీ–జనసేన కుమ్ములాట.. మరోవైపు.. కొత్తపల్లి మండలం కొండెవరం గ్రామంలో టీడీపీ–జనసేన నేతలు శుక్రవారం కుమ్ములాటలకు దిగారు. గ్రామంలో జరుగుతున్న ఏ కార్యక్రమాలూ తనకు తెలియడంలేదని, ప్రొటోకాల్ పాటించడంలేదని టీడీపీకి చెందిన ఎంపీటీసీ సభ్యుడు దుళ్ల సత్తిబాబు ఇటీవల ఎంపీడీవో రవికుమార్‌కు ఫిర్యాదు చేశారు. దీంతో ఎంపీడీఓ శుక్రవారం కొండెవరం గ్రామ సచివాలయానికి వచ్చి విచారణ చేపట్టారు. దీనికి ఎంపీటీసీ సభ్యుడ్ని ఆహ్వానించగా.. ఆయన టీడీపీ నేతలను వెంటబెట్టుకుని సచివాలయానికి వెళ్లారు. విషయం తెలుసుకున్న జనసేన నేతలూ గ్రామ సచివాలయానికి చేరుకున్నారు. సచివాలయంలో మీకు పనేంటి.. వెంటనే వెళ్లిపోవాలని టీడీపీ నేతలు హుకుం జారీచేయడంతో ఇరువర్గాల మధ్య వివాదం చెలరేగింది. విషయం తెలుసుకున్న అధికారులు, పోలీసులు ఇరువర్గాలనూ అక్కడి నుంచి పంపించి వేశారు. ఈ సంఘటనపై టీడీపీ నేతలు నిరసన తెలిపారు. -
మాంసం ముట్టని వెజిటేరియన్ విలేజ్!
ఎక్కడైనా శాకాహారులు.. మాంసాహారులు ఉంటారు. అందులోనూ ఇప్పుడూ వెరైటీ వంటకాల ఘుమఘమలు విభిన్నమైనవి రావడంతో.. చాలావరకు మాంసాహారులే ఉంటున్నారు. దీంతో నిపుణులు మొక్కల ఆధారిత భోజనమే మంచిదంటూ ఆరోగ్య స్ప్రుహ కలిగించే యత్నం చేస్తున్నారు. ఇక్కడ అలాంటి అవగాహన కార్యక్రమలతో పనిలేకుండానే స్వచ్ఛంధంగా రెండు ఊర్ల ప్రజలంతా శాకాహారులుగా జీవిస్తున్నారట. నమ్మశక్యంగా లేకపోయిన ఆ రెండు ఊర్లలోని ప్రజలు మాంసం జోలికిపోరు. ఒకవేళ ఎవరైనా నాన్ వెజ్ తిన్నట్లు తెలిస్తే ఇక అంతే.. ! సదరు వ్యక్తులకు కఠిన శిక్షలు తప్పవు. వాళ్లంతా ఈ నియామానికి కట్టుబడి ఉండి శాకాహారులగానే ఉండటం విశేషం. ఎక్కడ ఉన్నాయంటే ఆ ఊర్లు..ఒకటి మహారాష్ట్రలో ఉండగా, ఇంకొకటి బిహార్‌లో ఉంది. అందుకోసమే శాకాహారులుగా..బిహార్‌లోని గయ జిల్లాలో బిహియా అనే ఊరుంది. అక్కడ మూడు శతాబ్దాలుగా ప్రజలు నియమ నిష్ఠలతో, సాంస్కృతిక, ఆధ్యాత్మిక ఆచారాలను పాటిస్తూ వస్తున్నారు. దాదాపు 400 కుటుంబాలు ఉన్న ఈగ్రామంలో 300 ఏళ్ల నుంచి అందరూ శాకాహారులుగానే కొనసాగుతున్నారు. వీరు పూజించే బ్రహ్మ బాబా ఆగ్రహానికి గురికాకుండా ఉండాలంటే శాకాహార జీవన విధానాన్నే అవలంబించాలన్నది అక్కడ వారి నమ్మకం.ఎప్పటి నుంచో వస్తున్న ఈ ఆచారాన్ని ప్రస్తుత తరాలవారు కూడా పాటించడం విశేషం. ఇక్కడి వారిని పెళ్లి చేసుకుని వచ్చే వారు కూడా ఇదే జీవనశైలిని పాటించాల్సిందే. ఇక్కడ ప్రజలు కనీసం ఉల్లి, వెల్లుల్లి కూడా తినరు. ఈగ్రామంతో పాటు మరో గ్రామం కూడా పూర్తి శాఖాహార గ్రామంగా ఉంది. అది మహారాష్ట్రాలో ఉంది.మరొక ఊరు..మహారాష్ట్ర.. సాంగ్లీ జిల్లాలోని ఖానాపూర్ తాలూకాలో రేనవి అనే గ్రామంలో ప్రజలు స్వచ్ఛమైన శాకాహారాలుగా జీవిస్తున్నారు. ఇక్కడ కూడా గయ గ్రామం మాదిరిగా వందల సంవత్సరాలుగా శాకాహారులుగా కొనసాగుతున్నారు. ఇక్కడ కూడా ఎవ్వరూ..మాంసాన్ని ముట్టరు. ఊళ్లోకి తీసుకురారు. ఈ గ్రామంలో ప్రసిద్ధ, పవిత్రమైన రేవణసిద్ధ దేవాలయం ఉంది. అందువల్ల ప్రజలు తరతరాలుగా శాకాహారం మాత్రమే తింటున్నారు.రావణుడి మహిమ వల్లే..అంతే కాదు ఇక్కడి అమ్మాయిలను కాని.. అబ్బాయిలను కాని పెళ్ళాడాలి అంటే వాళ్లుకూడా ఆ ఆచారాన్ని పాటించాల్సిందే. పెళ్లి తర్వాత శాకాహారులుగా మారాకే ఈ ఊళ్లో అడుగు పెడతారు. పెళ్లికి ముందే తప్పనిసరిగా ఈ నిబంధన గురించి చెబుతారట. దీనికి అంగీకరిస్తేనే..పెళ్లి జరుగుతుందట. దాదాపు 3 వేలకు పైగా జనాబా ఉన్న ఈగ్రామంలో శ్రీ రేవణసిద్ధ నాథుని పవిత్ర స్థలం నవనాథులలోని ఏకనాథుడు స్వయంభువుగా ఇక్కడ వెలిశారు. అన్ని కులాలు, మతాల వారు నివసిస్తున్న ఈగ్రామంలో ప్రజలంతా.. ఇక్కడి ఆచార వ్యవహారాలను ఇప్పటి వరకు పాటిస్తూ వస్తుండటం విశేషం.ఈ ప్రదేశం భక్తుల రద్దీతో నిత్యం కళకళలాడుతూ ఉంటుంది. ఈ దేవాలయం ప్రతిజ్ఞ చేసే ప్రదేశంగా పేరుగాంచింది. వృద్ధులు కూడా విశ్వాసంతో ఇక్కడికి వస్తుంటారు. రావణుడి మహిమ కారణంగా ఈ గ్రామం పూర్తిగా శాకాహారంగా మారింది. హిందువులు, ముస్లింలతో సహా అన్ని మతాల ప్రజలు ఈ ఊళ్లో నివసిస్తున్నా.. వారు కూడా శాకాహారులుగానే ఉంటున్నారు.(చదవండి: తేనెటీగల కోసం కృత్రిమపూలు..!) -
పండుగలకే పండుగ!
నాగాలాండ్‌లో జరిగే ‘హార్న్‌బిల్ ఫెస్టివల్’ను అక్కడి ప్రజలు ‘పండుగలకే పండుగ’గా అభివర్ణిస్తారు. పది రోజుల పాటు అత్యంత అట్టహాసంగా జరిగే పండుగ ఇది. ప్రతి ఏటా డిసెంబర్ 1 నుంచి 10వ తేదీ వరకు జరిగే ఈ పండుగ నాగాలాండ్ కళా సాంస్కృతిక వైవిధ్యానికి అద్దం పడుతుంది. పదిహేడు తెగలకు చెందిన ప్రజలు ఈ వేడుకలో పాల్గొంటారు. నాగాలాండ్ రాజధాని కోహిమాకు చేరువలోని కిసామా హెరిటేజ్ విలేజ్‌లో పది రోజుల పాటు రకరకాల ప్రదర్శనలు, పోటీలు జరుగుతాయి. ఈ వేడుకలలో పాల్గొనే పదిహేడు తెగల ప్రజలు ఇక్కడ తమ తమ సంప్రదాయ రీతుల్లో గుడారాలను వేసుకుని ఉంటారు. ఉదయం వేళల్లో ఆరుబయట మైదానంలోను, వీథుల్లోను వివిధ రీతులకు చెందిన సంప్రదాయ సంగీత నృత్య ప్రదర్శనలు, ఊరేగింపులు వంటి కార్యక్రమాలు జరుగుతాయి. మధ్యాహ్నం వేళ ఆరుబయట విందు భోజనాలు జరుగుతాయి. ఈ వేడుక జరిగినన్ని రోజులూ ఆహార మేళాలు ఉంటాయి. రాష్ట్రంలోని వివిధ తెగలకు చెందిన ప్రజల మధ్య సాంస్కృతిక స్నేహబాంధవ్యాలను పెంపొందించే ఉద్దేశంతో నాగాలాండ్ ప్రభుత్వం 2000 సంవత్సరం నుంచి రాష్ట్ర పర్యాటక శాఖ, కళా సాంస్కృతిక శాఖల ఆధ్వర్యంలో ఈ వేడుకలను నిర్వహించడం ప్రారంభించింది. ఈ వేడుకల్లో భాగంగా హస్తకళల ప్రదర్శనలు, స్థానిక పోరాట విద్యల ప్రదర్శనలు, రకరకాల ఆటల పోటీలు కూడా జరుగుతాయి. వేడుకలు జరిగే మైదానంలో ఆహారశాలలు, వనమూలికల విక్రయశాలలు, హస్తకళల ప్రదర్శనశాలలు వంటివి ఏర్పాటవుతాయి.ఈ వేడుకల్లో ప్రతిరోజూ సాయంత్రం నుంచి రాత్రి వరకు ఆరుబయట ఏర్పాటు చేసిన వేదికలపైన సంప్రదాయ, ఆధునిక సంగీత, నృత్య ప్రదర్శనలు, నాటక ప్రదర్శనలు వంటి సాంస్కృతిక కార్యక్రమాలు, ‘మిస్ నాగాలాండ్’ అందాల పోటీలు జరుగుతాయి. ఈ వేడుకల్లో భాగంగా ‘హార్న్‌బిల్ ఇంటర్నేషనల్ రాక్ ఫెస్టివల్’ కూడా జరుగుతుంది. ఇందిరాగాంధీ స్టేడియంలో జరిగే ఈ వేడుకల్లో స్థానిక, అంతర్జాతీయ రాక్ బ్యాండ్ బృందాలు వేడుక జరిగే పదిరోజులూ కచేరీలు చేస్తారు. నాగాలాండ్ ప్రభుత్వం ‘హార్న్‌బిల్ ఫెస్టివల్’ నిర్వహణను ప్రారంభించిన తర్వాత రాష్ట్ర పర్యాటక ఆదాయం గణనీయంగా పెరిగింది. -
‘అమ్మో’ అన్నవారే ‘ఆహా’ అంటున్నారు! ఇతిషా మహిమే!
అస్సాంలోని గౌహతికి చెందిన ఇతిషా సారా పుణెలోని ‘సింబయాసిస్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ’లో చదువుకుంది. దిల్లీలోని అంబేద్కర్ యూనివర్సిటీలో ‘సోషల్ డిజైన్’ కోర్సు చేసింది. ‘ఈ కోర్సు వల్ల తరగతి బయట అడుగు పెట్టడానికి, ప్రజలతో నేరుగా మాట్లాడడానికి, రోజువారీ సమస్యలకు పరిష్కారాలను కనుక్కోవడానికి నాకు అవకాశం వచ్చింది’... గతాన్ని గుర్తు చేసుకుంటుంది ఇతిషా.తన పరిశోధన అంశానికి ఈ–వ్యర్థాలను ఎంచుకుంది. ఆ సమయంలో ఎలక్ట్రానిక్ వ్యర్థాలపై పరిశోధనలు చేసిన వారు తక్కువ. ఈ–వ్యర్థాలకు సంబంధించి ఎన్నో పుస్తకాలు చదవడంతో పాటు దిల్లీ చుట్టుపక్కల ఎలక్ట్రానిక్ వ్యర్థాలు రీసైకిలింగ్ జరుగుతున్న ప్రదేశాలకు వెళ్లి పరిశీలించేది. ఈ క్షేత్రస్థాయి అధ్యయనంలో ఎన్నో విషయాల గురించి అవగాహన చేసుకుంది. ‘రీసైకిలింగ్’పై ఇతిషాకు ఉన్న అవగాహన సాంగ్టీని మార్చడానికి ఉపయోగపడింది.అరుణాచల్‌ప్రదేశ్‌లోని సాంగ్టీలో అద్దె ఇంట్లో ఉంటూ, హిమాలయ ప్రాంతాల్లో పర్యావరణ స్పృహను రేకెత్తించ డానికి గ్రామస్తులతో కలిసి పనిచేసింది. వ్యర్థాలు ఎక్కడ పడితే అక్కడ పడి ఉండకుండా ఒకేచోట ఉండేలా వెదురుతో ప్రత్యేక నిర్మాణాలు చేయించింది.కమ్యూనిటీల నిర్వహణలోని ‘వేస్ట్ మేనేజ్మెంట్ గ్రూప్’ లతో సాంగ్టీ ప్రాంతంలో ఎంతో మార్పు వచ్చింది. ఈ గ్రూప్‌లు స్థానిక సంస్కృతి, సాహిత్యాలను ప్రతిబింబించే మ్యూజిక్ ఫెస్టివల్స్‌ను కూడా నిర్వహిస్తున్నాయి. అంతా సవ్యంగా జరుగుతుందనుకుంటున్న కాలంలో కోవిడ్ దెబ్బతో పరిసరాల పరిశుభ్రత, వేస్ట్ మేనేజ్మెంట్ మూలన పడ్డాయి. లాక్డౌన్ తరువాత ఈ ప్రాంతానికి తిరిగి వచ్చిన ఇతిషా వేస్ట్ మేనేజ్మెంట్ కార్యక్రమాలను పునరుద్ధరించడానికి కష్టపడాల్సి వచ్చింది. అదే సమయంలో కమ్యూనిటీ గ్రూప్‌లలో ఉత్సాహవంతులైన కొత్త సభ్యులను చేర్చుకున్నారు.ఇళ్ల నుంచి వ్యర్థాల సేకరణను పర్యవేక్షించేందుకు నలుగురు మహిళలు, నలుగురు పురుషులతో కమిటీని ఏర్పాటు చేశారు. కమిటీ సభ్యులు వంతుల వారీగా వ్యర్థాలను సేకరించి మెటీరియల్ రికవరీ ఫెసిలిటీ(ఎంఆర్ఎఫ్) సెంటర్లకు తరలిస్తారు. ఒకప్పుడు సాంగ్టీ పేరు వినబడగానే ‘బాబోయ్’ అనుకునేవారు. ఇప్పుడు అలాంటి గ్రామం ‘జీరో వేస్ట్ విలేజ్’గా మారి ఎన్నో గ్రామాలకు స్ఫూర్తిని ఇస్తోంది. వారిలో ఒకరిగా...అప్పుడప్పుడూ వస్తూ, పోతూ పని చేయడం కంటే సాంగ్టీలోనే ఉండి పనిచేయాలనుకున్నాను. ఆ గ్రామస్థులలో ఒకరిగా కలిసి పనిచేయడం వల్ల అందరూ సహకరించారు. నన్ను వారిలో ఒకరిగా చూసుకున్నారు. ‘జీరో వస్ట్ విలేజ్’గా సాంగ్టీని నిలబెట్టే క్రమంలో ఎన్నో సవాళ్లు, సమస్యలు ఎదురయ్యాయి. అయినా సరే వెనకడుగు వేయలేదు. వేస్ట్ మేనేజ్మెంట్కు సంబంధించి ప్రతి ఇంటిలో అవగాహన కలిగించడంలో విజయం సాధించాం. - ఇతిషా సారా View this post on Instagram A post shared by Northeast Waste Collective (@northeastwastecollective) -
ఒక డాలరుకే ఇల్లు.. ట్రంప్ నచ్చని వాళ్లు వచ్చేయండి!
అమెరికా అధ్యక్ష ఎన్నికలు యావత్ ప్రపంచం దృష్టిని ఆకర్షించాయి. రిపబ్లికన్ పార్టీ అభ్యర్థి డొనాల్డ్ ట్రంప్ విజయం సాధించారు. రెండో పర్యాయం పదవీకాలాన్ని వచ్చే జనవరి 20న ప్రారంభించబోతున్నారు.అమెరికన్లు ఎన్నికల ఫలితాలపై మిశ్రమ భావోద్వేగాలతో ఉన్నారు. ఈసారి ట్రంప్ పరిపాలన ఎలా ఉండబోతుందో అన్న ఆందోళన కొంత మందిలో ఉంది. చాలా మంది డెమొక్రాట్ మద్దతుదారులు ఇప్పుడిప్పుడే ఎన్నికల షాక్ నుండి బయటపడుతున్నారు. ఈ పరిస్థితిని అదనుగా తీసుకుని ఇటాలియన్ ద్వీపం సార్డినియాలోని ఒక గ్రామం జనాభాను పెంచుకోవడానికి వినూత్న ఆఫర్‌తో ముందుకొచ్చింది.వార్తా సంస్థ సీఎన్ఎన్ ప్రకారం.. యూఎస్ ఎన్నికల ఫలితాలతో కలత చెందిన అమెరికన్లకు ఒక డాలర్‌కే గృహాలను అందిస్తోంది. గ్రామీణ ఇటలీలోని అనేక ఇతర ప్రదేశాల మాదిరిగానే ‘ఒల్లోలై’ గ్రామం కూడా తీవ్రమైన జనాభా కొరతను ఎదుర్కొంటోంది. పునరుద్ధరణ కోసం బయటి వ్యక్తులను ఆకర్షించడానికి చాలా కాలంగా ప్రయత్నిస్తోంది. శిథిలావస్థకు చేరిన ఇళ్లను కేవలం ఒక డాలర్ ధరకే విక్రయిస్తోంది.రాజకీయాలతో అలసిపోయారా?ఇటీవల అమెరికా అధ్యక్ష ఎన్నికల ఫలితాల అనంతరం అమెరికన్ నిర్వాసితులను లక్ష్యంగా చేసుకుని వెబ్‌సైట్‌ను ప్రారంభించింది. కొత్త పాలనతో ఆందోళన ఉన్నవారిని తమ గ్రామానికి ఆకర్షిస్తూ చౌకగా గృహాలను అందిస్తోంది. "మీరు ప్రపంచ రాజకీయాల వల్ల అలసిపోయారా? కొత్త అవకాశాలను పొందుతూ మరింత సమతుల్య జీవనశైలిని స్వీకరించాలని చూస్తున్నారా?" అంటూ వెబ్సైట్ అమెరికన్ల దృష్టిని ఆకర్షిస్తోంది.అధ్యక్ష ఎన్నికల నేపథ్యంలో అమెరికన్ ఓటర్లను ఆకర్షించేందుకు ఈ వెబ్‌సైట్‌ను ప్రత్యేకంగా రూపొందించినట్లు మేయర్ ఫ్రాన్సిస్కో కొలంబు సీఎన్ఎన్తో చెప్పారు. ఇతర దేశాల నుండి వచ్చేవారిని కూడా తాము వద్దనమని, అయితే అమెరికన్లకు ఫాస్ట్-ట్రాక్ విధానం ఉంటుందని పేర్కొన్నారు.క్రూయిజ్ కూడా..ఈ ఇటాలియన్ గ్రామంతో పాటు అమెరికా ఎన్నికల ఫలితాలతో అసంతృప్తిగా ఉన్న అమెరికన్లు ట్రంప్ కొత్త పాలన నుంచి దూరంగా వెళ్లేందుకు క్రూయిజ్ లైన్ కూడా అందుబాటులోకి వచ్చింది. "స్కిప్ ఫార్వర్డ్" పేరుతో సర్వీస్ ప్రారంభమైంది. దీంతో దేశంలో ట్రంప్ పాలన ముగిసే వరకు 140 దేశాలలో 425 పోర్టులు తిరిగి రావచ్చు. -
Maharashtra: తొలిసారి ఆ గ్రామంలో ఎన్నికల పండుగ
నాందేడ్: మన దేశానికి స్వాతంత్య్రం వచ్చి ఇన్నేళ్లు దాటినా కొన్ని ప్రాంతాల్లో ఇంకా వెనుకబాటుతనం కనిపిస్తుంది. ఈ కోవలోకే వస్తుంది మహారాష్ట్రలోని నాందేడ్ జిల్లా కిన్వాట్ తాలూకాలోని వాగ్దారి గ్రామం. ఈ గ్రామంలో 300 జనాభా ఉంది. భూ రెవెన్యూ మ్యాప్‌లో ఈ గ్రామం పేరు కూడా లేకపోవడంతో ఇన్నాళ్లూ ఈ గ్రామానికి చెందిన వారు తమ గ్రామంలో ఓటు వేయలేకపోయారు.తాజాగా ఈ సమస్యకు పరిష్కారం దొరికింది. దీంతో గ్రామంలో పోలింగ్ బూత్ ఏర్పాటు కానుంది. నవంబర్ 20న జరగనున్న మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో ఈ గ్రామ ప్రజలు తొలిసారిగా తమ గ్రామంలో ఓటు వేయనున్నారు. ఇప్పటి వరకు ఈ గ్రామంలోని ఓటర్లు సమీపంలోని పోలింగ్ కేంద్రమైన జలధారకు వెళ్లేవారు. వీరు ఇక్కడికి చేరుకోవడానికి రెండు గంటల సమయం పట్టేది. అయితే అడవి గుండా వెళ్లాల్సిన రావడంతో క్రూర మృగాల భయం వారిని వెంటాడేది. తాజాగాకిన్వాట్ నియోజకవర్గం పరిధిలోని వాగ్దారీలో పోలింగ్ స్టేషన్ ఏర్పాటు చేయాలని ఎన్నికల సంఘం నిర్ణయం తీసుకుంది. దీంతో ఈ గ్రామంలోని 190 మంది ఓటర్లు స్థానికంగానే ఓటు వేయనున్నారు. గ్రామానికి పోలింగ్ బూత్ రావడంతో త్వరలో ఇక్కడ మౌలిక సదుపాయాలు ఏర్పడతాయని గ్రామస్తులు భావిస్తున్నారు.ఈ ప్రాంతంలోని చారిత్రక సరిహద్దులను దృష్టిలో ఉంచుకుని గ్రామంలోని భూమికి కొలతలు నిర్వహించి, పూణేలోని అధికారులకు ప్రతిపాదనలు పంపినట్లు స్థానిక అధికారులు తెలిపారు. దీంతో రాబోయే కొద్ది నెలల్లో గ్రామస్తులకు భూమి యాజమాన్యపు రుజువు లభిస్తుందని భావిస్తున్నారు. ఎన్నికల సంఘం ఏర్పాటు చేసిన ఈ పోలింగ్ కేంద్రం గ్రామస్తుల్లో కొత్త ఆశను నింపింది. ఎన్నికల్లో తమ గళం వినిపించాలని, అప్పుడే ప్రభుత్వం తమ కనీస అవసరాలను తీరుస్తుందని గ్రామస్తులు అంటున్నారు. ఇది కూడా చదవండి: మావోయిస్టులు కూడా అంతర్మథనం చేసుకుని.. -
కమల పూర్వీకుల గ్రామంలో సందడి
కమలా హారిస్ పూర్వీకుల గ్రామం తమిళనాడులోని మన్నార్గుడి జిల్లా తులసేంద్రపురంలో సందడి నెలకొంది. మంగళవారం స్థానిక ధర్మ శాస్త శ్రీ కేశవ పెరుమాళ్ ఆలయంలో జరిగిన అభిషేకం, అర్చన కార్యక్రమాల్లో అమెరికా, యూకేల నుంచి వచి్చన ముగ్గురు మహిళా అభిమానులు పాల్గొనడం విశేషం. వీరిని చూసి గ్రామస్తులంతా ఆశ్చర్యం వ్యక్తం చేశారు. వీరిలో ఒకరు అమెరికాలోని లాస్‌వెగాస్ నుంచి వచ్చినట్లు తెలిపారు. కమలా హారిస్ గెలవాలని కోరుకుంటున్నామన్నారు. ఈ ఆలయ దేవత కమల తాత గోపాలన్ కుటుంబం కుల దైవమని ఆలయ పూజారి సెంథిల్ కుమార్ తెలిపారు. గోపాలన్ కుటుంబ సభ్యులు గతంలో ఆలయానికి రూ.లక్ష విరాళమిచ్చారంటూ అక్కడి శిలా ఫలకంపైన పేర్లను చూపించారు. 2014లో కమలా హారిస్ పేరిట జరిగిన కుంభాభిషేకం కోసం రూ.5 వేలు ఇచ్చారన్నారు. గోపాలన్ కుటుంబ సభ్యులెవరూ ప్రస్తుతం గ్రామంలో ఉండటం లేదన్నారు. గోపాలన్ బ్రిటిష్ ప్రభుత్వంలో అధికారిగా పనిచేశారు. ఆయన కుమార్తె శ్యామలే కమల తల్లి. 2021లో కమలా హారిస్ అమెరికా ఉపాధ్యక్షురాలయ్యారు. ఆ సమయంలో కమల కోసం ఆమె పిన్ని, శ్యామల చెల్లెలు చిట్టి ఇదే ఆలయంలో పూజలు చేశారని పూజారి సెంథిల్ కుమార్ చెప్పారు. అమెరికా అధ్యక్షురాలిగా కమల గెలిస్తే ఊళ్లో అన్నదానం జరిపించేందుకు ఏర్పాట్లు చేస్తున్నామని స్థానిక కౌన్సిలర్ అరుల్ మోళి తెలిపారు. -
సాయంత్రాల్లేని గ్రామం.. ‘క’ సినిమాతో మరోసారి వార్తల్లోకి..
ఈ ఊరేంటి చాలా విచిత్రంగా ఉంది.. మధ్యాహ్నం మూడు గంటలకే చీకటి పడిపోతోంది’.. అని హీరో ప్రశ్నిస్తాడు.. ‘మా ఊరు చుట్టూతా ఎత్తయిన కొండలున్నాయి.. కొండల మధ్య మా ఊరు ఉంది.. మధ్యాహ్నం మూడు అయ్యేసరికి సూర్యుడు కొండల వెనక్కి వెళ్లిపోయి ఆ నీడ మా ఊరి మీద పడి.. మూడింటికల్లా చీకటి పడిపోతుంది అబ్బాయి..‘ఒక పెద్దాయన సమాధానమిస్తాడు. ఈ సంభాషణ ‘క’సినిమాలోనిదని మీకీ పాటికే అర్థమై ఉంటుంది. దీంతో అలాంటి ఊరు ఎక్కడుందంటూ సోషల్‌మీడియాలో ట్రెండింగ్‌గా మారింది. ఆ ఊరే పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్ మండలం కొదురపాక గ్రామం. రీల్స్, వీడియోలతో ఇప్పుడా ఊరు నెట్టింట సందడి చేస్తోంది. – సాక్షి, పెద్దపల్లినాలుగు గుట్టల మధ్య.. శతాబ్దాల చరిత్ర కలిగిన ఈ గ్రామం నాలుగు గుట్టల మధ్య.. హుస్సేనిమియా వాగు చెంత.. పచ్చని ప్రకృతి నిలయంగా ఉంటుంది. ఈ గ్రామానికి తూర్పున గొల్లగుట్ట, పడమరన రంగనాయకులు గుట్ట, ఉత్తరాన నంబులాద్రి గుట్ట, దక్షిణాన పాంబండ గుట్టలున్నాయి. ఇక్కడి వైవిధ్య భౌగోళిక పరిస్థితులను గమనించిన శాతవాహనులు ఈ ఊరు వెలుపల నంబులాద్రీశ్వరస్వామి, రాజరాజేశ్వరస్వామి ఆలయాలు నిర్మించారు. గ్రామ ప్రత్యేకతను శిలాఫలకంపై చెక్కించారు. ఆలస్యంగా ఉదయం.. తొందరగా సాయంత్రం.. సాధారణంగా 3 గంటలకు ఒక్కజాము చొప్పున రోజులో మొత్తం 8 జాములుంటాయి. పగటిపూట నాలుగు, రాత్రిపూట నాలుగు జాములుగా లెక్కిస్తారు. తూర్పున ఉన్న గొల్లగుట్ట ఈ గ్రామానికి అడ్డుగా ఉండటంతో ఇక్కడ ఆలస్యంగా సూర్యోదయం అవుతుంది. ఇక సాయంత్రం 4 గంటల ప్రాంతంలో సూర్యుడు గ్రామ పడమర దిక్కునున్న రంగనాయకులు గుట్ట వెనక్కి వెళ్తాడు. దీంతో కొండల నీడతో ఈ గ్రామాన్ని చీకటి తొందరగానే అలుముకుంటుంది. ఇలా ఉదయం, సాయంత్రం రాత్రితో కలిసిపోతుండటంతో పగటి సమయం తగ్గిపోతోంది. దీంతో ఈ గ్రామాన్ని మూడు జాముల కొదురుపాకగా పిలుస్తున్నారు. ఆ ఊరికి సాయంత్రం జాము లేకపోవడంతో.. సాయంత్రం 4 గంటలకే ఇళ్లలో దీపాలు, వీధి దీపాలు వెలిగించాల్సి వస్తోంది. దేవుడు లేని ఆలయం ఈ గ్రామానికి మరో ప్రత్యేకత ఉంది. రంగనాయకులు గుట్టకు దిగువన నిర్మించిన ఆలయంలో దేవుడి విగ్రహం ఉండదు. దీంతో ప్రతీ దసరాకు పక్కనే ఉన్న దేవునిపల్లి గ్రామం నుంచి నంబులాద్రి నరసింహస్వామిని రథయాత్రతో తీసుకొచ్చి.. ఈ ఆలయంలో ఒకరోజు ఉత్సవాలు జరుపుతారు. ఆ తర్వాత తిరిగి దేవునిపల్లికి తీసుకెళ్తారు. దీంతో ఏడాదిలో ఆ ఒక్కరోజే ఆ గుడిలో వేడుకలు నిర్వహిస్తారు.పర్యాటకంగా అభివృద్ధి చేయాలి మా గ్రామాన్ని చూడటానికి ఎంతోమంది ఎక్కడినుంచో వచ్చి పోతున్నారు. వచ్చిపోయే వారికి గ్రామంలో సౌకర్యాలు కల్పించి, పర్యాటక ప్రాంతంగా అభివృద్ధి చేస్తే స్థానికంగా ఉపాధి అవకాశాలు పెరుగుతాయి. – బాలాజీరావు, స్థానికుడు నలుదిక్కులా గుట్టలు మా ఊరుకు నలుదిక్కులా గుట్టలు ఉండటంతో ఉదయం ఆలస్యంగా సూర్యుడు వస్తాడు. తొందరగానే సూర్యుడు అస్తమిస్తాడు. దీంతో సాయంత్రం 4 గంటలు దాటిందంటే ప్రతీ ఇంట దీపం వెలిగించుకోవలసిందే. – రాజగౌడ్, స్థానికుడు -
‘బిర్యానీలో ఈగ’ వ్యవహారంలో బిగ్ ట్విస్ట్!
సాక్షి, నల్గొండ జిల్లా: చిట్యాల మండలం పెద్ద కాపర్తి శివారులో విలేజ్ ఆర్గానిక్ హోటల్ బిర్యానీలో ఈగ వ్యవహారంలో ట్విస్ట్ చోటుచేసుకుంది. ఫుల్లుగా తిని బిల్లు ఎగ్గొట్టేందుకు బిర్యానీలో ఈగ అంటూ నలుగురు బ్యాచ్ నాటకం ఆడారు. తినడం పూర్తయ్యాక పథకం ప్రకారం వెంట తీసుకెళ్లిన నూనెలో ఫ్రై చేసిన ఈగను బిర్యానీలో పెట్టారు. ఆ తర్వాత బిర్యానీలో ఈగ అంటూ నాటకానికి తెరలేపారు. ఫుడ్ సెక్యూరిటీ అధికారులకు ఫోన్ చేసి నానా హంగామా సృష్టించారు. వాట్సాప్ గ్రూపులో వీడియోను ఆ బ్యాచ్ షేర్ చేసింది.హోటల్ పై విమర్శలు రావడంతో సిబ్బంది... సీసీ ఫుటేజ్ పరిశీలించారు. ఈగను బయటకు తీసి బిర్యానీ వేసి కలుపుతున్నట్లు ఫుటేజీలో స్పష్టమైంది. గతంలోనూ పలు హోటల్స్ లో ఇదే రకంగా నాటకాలు ఆడినట్లు బ్యాచ్‌పై ఆరోపణలు ఉన్నాయి. సూర్యాపేట సమీపంలో ఓ ప్రముఖ హోటల్లోనూ ఇదేవిధంగా బిల్లు ఎగ్గొట్టినట్లు సమాచారం.ఇదీ చదవండి: ‘వారి పేర్లు డైరీలో రాసి పెట్టుకుంటున్నాం’ -
అమర జవాను చితికి నిప్పంటించిన నాలుగేళ్ల చిన్నారి
సిర్సా: కశ్మీర్‌లోని బారాముల్లాలోగల గుల్మార్గ్లో జరిగిన ఉగ్రదాడిలో హర్యానాకు చెందిన 28 ఏళ్ల ఆర్మీ జవాను జీవన్ సింగ్ వీరమరణం పొందారు. ఆయన భౌతికకాయం ఆయన స్వస్థలమైన ఘరాకు చేరుకోగా, సైనిక లాంఛనాలతో అంత్యక్రియలు జరిగాయి. అమరవీరుడు జీవన్‌సింగ్ మృతదేహం అతని ఇంటికి చేరుకోగానే ఒక్కసారిగా కుటుంబ సభ్యుల రోదనలు మిన్నంటాయి. ఆ అమరవీరునికి నివాళులర్పించేందుకు స్థానికులు పెద్దఎత్తున తరలివచ్చారు.కశ్మీర్‌లోని గుల్మార్గ్లోని బూటా-పత్రి ప్రాంతంలో ఆర్మీ కాన్వాయ్‌పై ఉగ్రవాదులు జరిపిన దాడిలో రైఫిల్‌మెన్ జీవన్ సింగ్ రాథోడ్ వీరమరణం పొందారు. ఈ దాడిలో ఇద్దరు జవాన్లు సహా నలుగురు మృతి చెందగా, జీవన్ సింగ్ అంత్యక్రియలు పూర్తయ్యాయి. ఈ సందర్భంగా పెద్ద సంఖ్యలో ప్రజలు ఆయనకు నివాళులర్పించారు. నలుగురు సోదరీమణులకు జీవన్ సింగ్ ఏకైక సోదరుడు. ఆయనకు భార్య, ఇద్దరు కుమార్తెలు, తల్లిదండ్రులు ఉన్నారు.జీవన్ సింగ్ 2016లో సైన్యంలో చేరి, రాజ్‌పుతానా రైఫిల్స్‌లో విధులు నిర్వహిస్తున్నాడు. ఇంటికి చేరుకున్న తండ్రి మృతదేహాన్ని చూసి, అతని కుమార్తెలు అనన్య, భీషా బోరున విలపించడం అక్కడున్న అందిరినీ కంట తడిపెట్టించింది. గ్రామంలోని శ్మశాన వాటికలో జీవన్ సింగ్ పెద్ద కుమార్తె తండ్రి చితికి నిప్పంటించింది. దీనిని చూసిన అందరూ కన్నీటి పర్యంతమయ్యారు.ఇది కూడా చదవండి: ఈ నెల 28న భూమి సమీపానికి భారీ గ్రహశకలం -
గ్రామాలకు సోలార్ వెలుగులు
సాక్షిప్రతినిధి, ఖమ్మం/మధిర: గ్రీన్ ఎనర్జీ ఉత్పత్తి లక్ష్యంగా రాష్ట్ర ప్రభుత్వం మొదటి అడుగు వేసింది. పర్యావరణ హితమైన సౌర విద్యుత్‌ను అందరూ వినియోగించేలా ప్రభుత్వం ప్రణాళికలు సిద్ధం చేస్తోంది. ఈ క్రమంలోనే రాష్ట్రంలోని మూడు గ్రామాలను పూర్తి స్థాయిలో సౌర విద్యుత్ గ్రామాలుగా తీర్చిదిద్దేందుకు పైలెట్ ప్రాజెక్టు కింద ఎంపిక చేసింది. ఆయా గ్రామాల్లో గృహాలు ఎన్ని, జనాభా ఎంత, గృహ, వ్యవసాయ కనెక్షన్లు ఎన్ని, సోలార్ విద్యుత్ పరికరాలు ఏర్పాటు చేసేందుకు రూఫ్‌టాప్‌లు అనుకూలంగా ఉన్నాయా.. తదితర అంశాలపై విద్యుత్ శాఖ ద్వారా సర్వే చేయించి ఉన్నతాధికారులకు నివేదిక పంపించారు. టెండర్లు పిలిచిన అనంతరం టీజీ రెడ్కో (తెలంగాణ రెన్యూవబుల్ ఎనర్జీ డెవలప్మెంట్ కార్పొరేషన్ లిమిటెడ్) ఆధ్వర్యంలో సౌర విద్యుత్ యూనిట్లు ఏర్పాటు చేస్తారు. మోడల్ సోలార్ విలేజ్..గత బడ్జెట్ సమావేశాల్లో కేంద్ర ప్రభుత్వం ప్రధానమంత్రి సూర్యఘర్ యోజన పథకాన్ని ప్రకటించింది. ఇందులో భాగంగా రాష్ట్రం మోడల్ సోలార్ విలేజ్ కార్యక్రమాన్ని తీసుకుంది. ఒక్కో జిల్లాకు ఒక్కో గ్రామాన్ని ఎంపిక చేసి ప్రతీ ఇల్లు, కార్యాలయం, వ్యవసాయ బోర్లు సహా అన్నింటికీ సోలార్ విద్యుత్ ఏర్పాటు చేస్తారు. పైలట్ ప్రాజెక్టులుగా సీఎం రేవంత్‌రెడ్డి స్వగ్రామమైన కొండారెడ్డిపల్లి, మంచిర్యాల జిల్లాలోని దండేపల్లి మండలం వెలగనూరు, ఖమ్మం జిల్లాలో డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క ప్రాతినిధ్యం వహిస్తున్న మధిర మండలం సిరిపురం గ్రామాలను ఎంపిక చేసింది. ఈ మూడు గ్రామాల్లో విద్యుత్ శాఖ అధికారుల సర్వే పూర్తయింది.అంతా సోలార్మయంపైలట్ ప్రాజెక్టు కింద ఎంపికైన మూడు గ్రామాల్లో గృహ, వ్యవసాయ కనెక్షన్లకు పూర్తి స్థాయిలో సోలార్ విద్యుత్ అందించనున్నారు. ఉదయం సమయంలో సౌర విద్యుత్, రాత్రి సమయాన సాధారణ విద్యుత్‌ను వినియోగిస్తారు. గృహాలపై సోలార్ రూఫ్ టాప్‌లు, వ్యవసాయ పంపుసెట్లకు సోలార్ ప్లాంట్లు ఏర్పాటు చేస్తారు. పైలట్ ప్రాజెక్టుగా చేపట్టిన గ్రామాల్లో వీటి ఏర్పాటులో ప్రజలపై ఆర్థిక భారం పడకుండా ప్రభుత్వమే యూనిట్లు ఏర్పాటు చేయనుంది. అంతేకాక మిగులు విద్యుత్‌ను గ్రిడ్‌కు యజమానులే విక్రయించుకునే వెసులుబాటు ఉంటుంది. ఒక్కో ఇంటిపై 2 నుంచి 3 కిలోవాట్ల సోలార్ ప్యానళ్లు.. వ్యవసాయ పంపుసెట్లకు 5 హెచ్‌పీ మోటారుకు 7.5 కిలోవాట్ల సామర్థ్యం కలిగిన ప్యానల్‌ను అమరుస్తారు. బహుళ ప్రయోజనాలు..సోలార్ విద్యుత్ వినియోగంతో బహుళ ప్రయోజనాలను పొందే అవకాశం ఉంది. ఈ ప్రాజెక్టు ఏర్పాటు ద్వారా గ్రామీణ ప్రాంతాల్లో పునరుత్పాదక శక్తిని ప్రోత్సహించడానికి వీలవుతుంది. మిగులు విద్యుత్‌ను విక్రయించడం ద్వారా స్థానికులకు ఆర్థిక లబ్ధి చేకూరుతుంది. విద్యుదుత్పత్తి కోసం బొగ్గు తదితర శిలాజ ఇంధనాల వినియోగం ద్వారా పర్యావరణానికి హాని కలగడమే కాకుండా.. ప్రకృతి వైపరీత్యాలకు దారితీస్తుంది. ఇలాంటి దుష్పరిణామాలను నివారించడానికి సౌరవిద్యుత్ దోహదం చేస్తుంది. సిరిపురంలో సర్వే పూర్తిమధిర నియోజకవర్గంలోని సిరిపురం గ్రామంలో ఈనెల 4న సౌర విద్యుత్ ప్రాజెక్టు అమలు నిమిత్తం విద్యుత్‌శాఖ అధికారులు సర్వే పూర్తి చేశారు. అంతేకాక గ్రామస్తులు, రైతులకు పైలట్ ప్రాజెక్టు గురించి వివరించారు. సర్వే అనంతరం సిరిపురం వచ్చిన ఎన్పీడీసీఎల్ సీఎండీ కర్నాటి వరుణ్‌రెడ్డి సోలార్ విద్యుత్‌పై అవగాహన కల్పించారు. ఈ గ్రామంలో మొత్తం 5,428 మంది జనాభా ఉండగా, 1,024 గృహ సర్వీసులు, 510 వ్యవసాయ కనెక్షన్లు ఉన్నాయి. గృహ విద్యుత్‌ను 1,007 మంది 200 యూనిట్లలోపు వినియోగిస్తున్నారు.సోలార్ విద్యుత్.. రైతులకు ఉపయోగంమా గ్రామంలో సోలార్ విద్యుత్ ఏర్పాటుతో వ్యవసాయ పంపు సెట్లు ఉన్న రైతులకు ఉపయోగంగా ఉంటుంది. ఇటీవల డిప్యూటీ సీఎం మల్లు భట్టివిక్రమార్క అవగాహన కల్పించారు. అధికారులు కూడా బ్యాంక్ ఖాతాల వివరాలు తెలుసుకున్నారు. మిగులు విద్యుత్‌కు డబ్బు చెల్లిస్తారని తెలిసింది. విద్యుత్ ఉన్నా, లేకున్నా సోలార్ విద్యుత్ పంపుసెట్లతోపంట సాగుకు ఇబ్బంది ఉండదు. – వేమిరెడ్డి లక్ష్మారెడ్డి, రైతు, సిరిపురం, మధిర మండలం, ఖమ్మం జిల్లాబిల్లుల భారం తగ్గి, ఆదాయం వస్తుంది..ప్రభుత్వం 200 యూనిట్లలోపు గృహావసరాలకు ఉచిత విద్యుత్ అందిస్తోంది. దీనికి మించి ఒక్క యూనిట్ ఎక్కువైనా బిల్లు మొత్తం చెల్లించాల్సి వస్తోంది. ఇప్పుడు సోలార్ విద్యుత్ వల్ల బాధలు తప్పుతాయి. మా గ్రామాన్ని ఇందుకోసం ఎంపిక చేసిన డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్కకు కృతజ్ఞతలు. సోలార్ విద్యుత్‌తో బిల్లుల భారం తగ్గి, ఆదాయం కూడా వస్తుంది. – చీదిరాల వెంకటేశ్వరరావు, సిరిపురం, మధిర మండలం, ఖమ్మం జిల్లారుణపడి ఉంటాం..మా గ్రామంలో ఎక్కువగా దళిత కుటుంబాలే ఉంటాయి. సోలార్ విద్యుత్‌ను గృహ, వ్యవసాయ అవసరాలకు వినియోగించుకో వడం వల్ల ఆర్థికంగా కలిసొస్తుంది. మిగిలిన విద్యుత్‌ను విక్రయించుకునే అవకాశం ఉండటం సంతోషంగా ఉంది. మా గ్రామాన్ని అభివృద్ధి చేస్తున్న డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్కకు రుణపడి ఉంటాం. ఇప్పటికే రోడ్లు, వైరా నదిపై చెక్‌డ్యామ్ నిర్మాణానికి నిధులు మంజూరు చేశారు. – నండ్రు విజయారావు, సిరిపురం, మధిర మండలం, ఖమ్మంజిల్లా -
తెలంగాణ సర్కార్ కీలక ఆదేశాలు.. ఆ గ్రామాల్లో రిజిస్ట్రేషన్లకు బ్రేక్
సాక్షి, హైదరాబాద్: హెచ్ఎండీఏ పరిధిలోని గ్రామాల రిజిస్ట్రేషన్లకు తెలంగాణ సర్కార్ బ్రేక్ వేసింది. హెచ్ఎండీఏ పరిధిలోని గ్రామాల్లో లేఔట్ల రిజిస్ట్రేషన్లు చేయొద్దని ఆదేశాలు జారీ చేసింది. హెచ్ఎండీఏ పరిధిలోకి ఈ మధ్య కాలంలో ప్రభుత్వం కొత్తగా గ్రామాలను చేర్చింది. హెచ్ఎండీఏ పరిధిలోని గ్రామాల్లో ఇప్పటికే పలు ఫామ్‌హౌస్‌లకు గ్రామ పంచాయితీలు అనుమతులు ఇచ్చాయి. జాన్వాడ కేటీఆర్ ఫామ్ హౌస్, ఎమ్మెల్సీ పట్నం మహేందర్ రెడ్డి ఫామ్ హౌస్‌లకు గ్రామ పంచాయితీ అనుమతినిచ్చింది. హైడ్రా తెర మీదకు రావడంతో గ్రామ పంచాయితీల్లో రిజిస్ట్రేషన్లు నిలిపివేయాలని సర్కార్ నిర్ణయించింది.కాగా, వాస్తవానికి గత ప్రభుత్వ హయాంలోనే గ్రామ పంచాయతీ (జీపీ) లేఔట్ల రిజిస్ట్రేషన్లను నిలిపివేశారు. కానీ, తాజాగా రేవంత్ సర్కారు జీపీ లేఔట్లను నిషేధిత జాబితాలో చేర్చింది. ఈమేరకు హైదరాబాద్ మహానగర అభివృద్ధి సంస్థ (హెచ్ఎండీఏ) రంగారెడ్డి, మెదక్, మహబూబ్‌నగర్ జిల్లాల్లోని అనధికార లేఔట్ల సర్వే నంబర్లను నిషేధిత జాబితా 22–ఏ (1)(ఈ) కిందకు బదలాయించింది.దీంతో భవిష్యత్తు అవసరాలకు ఉపయోగపడుతుందని కొనుగోలు చేసిన ప్లాట్లను విక్రయించుకోలేక సామాన్య, మధ్యతరగతి ప్రజలు కష్టాలు పడుతున్నారు. సాధారణంగా సామాన్య, మధ్య తరగతి ప్రజలు పైసా పైసా కూడబెట్టుకొని ప్లాట్ కొనుగోలు చేస్తుంటారు. కూతురు పెళ్లి కోసమో, కొడుకు ఉన్నత చదువుల కోసమో అత్యవసర సమయంలో ఉపయోగపడుతుందనుకుంటారు.ఇదీ చదవండి: ఒకటే చట్టం... ఒకటే మాడ్యూల్నగదు అవసరమైనప్పుడు ప్లాట్ అమ్మితే సొమ్ము వస్తుందనే భరోసాతో ఉంటారు. కానీ, తాజాగా ప్రభుత్వం సామాన్య, మధ్య తరగతి ప్రజల నడ్డి విరిచింది. ఎంపిక చేసిన సర్వే నంబర్లలోని జీపీ లేఔట్లు, అందులోని ఓపెన్ ప్లాట్లను నిషేధిత జాబితాలోకి చేర్చింది. దీంతో ఆయా స్థలాలకు రిజిస్ట్రేషన్లు జరగకుండా అడ్డుకట్ట వేశారు. ఫలితంగా స్థల యజమానులు ప్లాట్లను విక్రయించుకోలేరు. రిజిస్ట్రేషన్లు జరగకపోతే కొనుగోలుదారులెవరూ ముందుకు రారు. దీంతో భవిష్యత్తు అవసరాల కోసమని కొనుగోలు చేసిన ప్లాట్ ఎందుకూ పనికిరాకుండా మిగిలిపోయినట్టయింది. -
శాకాహారుల గ్రామం.. ఉల్లి, వెల్లుల్లి కూడా ముట్టరు
జెహనాబాద్: బీహార్‌లోని జెహనాబాద్ జిల్లా హులాస్‌గంజ్ బ్లాక్‌లోని ఓ గ్రామంలోని వారంతా విచిత్రమైన నిబంధనలు పాటిస్తుంటారు. జిల్లా కేంద్రానికి 30 కిలోమీటర్ల దూరంలో ఉన్న త్రిలోకి బిఘా గ్రామంలోని వారు మాంసం, మద్యం ముట్టరు. పైగా ఇక్కడి వృద్ధులు ఉల్లి, వెల్లుల్లి కూడా తినరు. గ్రామంలో ఎవరైనా ఈ నిబంధనలకు విరుద్ధంగా వెళితే వారి ఇంటిలో అనర్థం జరుగుతుంది స్థానికులు నమ్ముతుంటారు.మీడియాకు అందిన వివరాల ప్రకారం ఇక్కడ ఎవరింటికి కొత్త కోడలు వచ్చినా ఇక్కడి నిబంధనలు పాటించాల్సిందే. గ్రామంలోని యువత ఈ మధ్య కాలం నుంచే ఉల్లి, వెల్లుల్లి తింటున్నారు. అయితే వారు మాంసం, చేపలను అస్సలు ముట్టుకోరు. కొన్ని శతాబ్దాలుగా తమ గ్రామంలో మాంసం, చేపలు తినకూడదనే ఆచారం కొనసాగుతోందని గ్రామస్తులు తెలిపారు.ఈ నియమాన్ని తమ పూర్వీకులు రూపొందించారని పేర్కొన్నారు. ఈ నియమాన్ని ఉల్లంఘించి గతంలో కొందరు ఇక్కట్ల పాలయ్యారని, గ్రామంలో మద్యం కూడా ఎవరూ ముట్టరని తెలిపారు. ఈ గ్రామానికి చెందిన ఏ యువతికైనా వివాహం జరిగి, అత్తవారింటి వెళ్లాక కూడా ఆమె మాంసాహారం తినదు.ఇది కూడా చదవండి: ట్రెండ్: 12 రోజుల్లో పెళ్లి.. పది నిమిషాల్లోనే ముగించేశారు! -
ఉత్తమ వారసత్వ పర్యాటక గ్రామంగా ఆండ్రో, ఎక్కడుందో తెలుసా?
మణిపూర్‌లోని ఆండ్రో గ్రామం. ఈ యేడాది ఉత్తమ వారసత్వ పర్యాటక గ్రామంగా ఎంపికైంది. అంతటి ప్రత్యేకత ఆ గ్రామానికి ఏముందో తప్పక తెలుసుకోవాల్సిందే! మణిపూర్ పర్యాటక మంత్రిత్వ శాఖ ఇటీవల ఉత్తమ పర్యాటక గ్రామాలపోటీని నిర్వహించింది. దీనిలో ఆండ్రో విలేజ్‌కు వారసత్వ విభాగంలో అత్యుత్తమ పర్యాటక గ్రామంగా ప్రతిష్టాత్మక అవార్డు లభించింది. ప్రపంచ పర్యాటక దినోత్సవం 2024 వేడుకల సందర్భంగా న్యూఢిల్లీలోని విజ్ఞాన్ భవన్‌లోని ప్లీనరీ హాల్లో జరిగిన కార్యక్రమంలో మణిపూర్ టూరిజం అధికారులు ఆండ్రో విలేజ్ ప్రతినిధులకు మంత్రిత్వ శాఖ ఈ అవార్డును అందజేసింది. ఆండ్రో గ్రామం ప్రత్యేక సాంస్కృతిక వారసత్వం, సాంప్రదాయ పద్ధతులు ఉత్తమ పర్యాటక గ్రామంగా ఎంపిక కావడానికి ప్రధాన కారకంగా నిలిచాయి. ఎన్నో వారసత్వ ప్రత్యేకతలు : అండ్రో గ్రామంలో గొప్ప సాంస్కృతిక, చారిత్రక వారసత్వానికి నిదర్శనంగా స్థానిక జానపద కథలను కళ్లకు కట్టే ఒక ఆలయం ఉంది. ఈ ఆలయంలో శతాబ్దాల నాటి నుంచి వారసత్వంగా అగ్ని ఆరాధనను కొనసాగిస్తూ వస్తున్నారు. వేల ఏళ్లుగా అఖండదీపం ఆరకుండా వెలుగుతూనే ఉండటం ఈ గ్రామం ప్రత్యేకత. ఇది ప్రపంచంలోని వివిధ ప్రాంతాల నుండి పర్యాటకులను ఆకర్షిస్తోందిది. ఇక్కడ ప్రకృతి అందాలతోపాటు మటువా బహదూర్ మ్యూజియం, వివిధ గిరిజన∙తెగలకు సంబంధించిన కుటీరాలు, కుండల తయారీ.. ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తున్నాయి. పర్యాటకుల ద్వారా స్థానిక ప్రజలకు ఆదాయం, ఉపాధి కల్పనకు దోహదం చేస్తుంది. ఆండ్రో గ్రామస్తులు తమ వారసత్వాన్ని కొనసాగించడంలోనూ, నిలబెట్టు కోవడంలో స్థానికులను నిమగ్నం చేయడానికి అనేక వ్యూహాలను అను సరిస్తున్నారు. అదే సమయంలో వారిని పర్యాటక కార్యకలాపాలో కూడా భాగస్వాములను చేస్తున్నారు. ఈ విశేషాలతోనే ఈ గ్రామం ఉత్తమ వారసత్వ పర్యాటక గ్రామంగా మొదటి ప్లేస్‌లో నిలిచింది. -
ఉత్తమ పర్యాటక గ్రామంగా రాజస్థాన్ గ్రామం! అక్కడ మద్యం, మాంసం ముట్టరట!
రాజస్థాన్‌లోని బీవర్ జిల్లాలోని దేవమాలి గ్రామం భారతదేశంలోని ఉత్తమ పర్యాటక గ్రామంగా ఎంపికయ్యింది. నవంబర్ 27న ఢిల్లీలో జరిగే కార్యక్రమంలో కేంద్ర ప్రభుత్వం ఈ అవార్డుని ప్రదానం చేయనుంది. భారతదేశంలోని రాష్ట్రాలలో ఎన్నో గొప్ప విశిష్టత గల గ్రామలున్నాయి. వాటన్నింటిని వెనక్కినెట్టి రాజస్థాన్‌లోని ఈ గ్రామమే ఉత్తమ పర్యాటక గ్రామంగా ఎలా ఎంపికయ్యిందో వింటే ఆశ్చర్యపోతారు. ఈ గ్రామానికి ఉన్న స్పెషాలిటీ తెలిస్తే.. ఈ రోజుల్లో కూడా ఇలా నియబద్ధంగా ఎవరు ఉంటున్నారు అని ఆశ్చర్యపోతారు. రాజస్తాన్‌లోని బీవర్ జిల్లాలోని దేవమాలి గ్రామం పేరుకి తగ్గట్టుగానే చక్కటి జీవనశైలితో దేదీప్యమానంగా ఉంటుంది. అక్కడ ఉన్న ప్రజలెవ్వరూ కూడా మాంసం, చేపలు, మద్యం ముట్టరట. ఇలా అందరూ నియమబద్ధంగా ఉండటం అంత ఈజీ కాదు గదా..!. అలాగే అక్కడ వేప కలపను ఎవ్వరూ కాల్చడం వంటివి చేయరట. అంతేగాదు కిరోసిన్ ఉపయోగించడం కూడా నిషిద్ధం. ఆ గ్రామంలో దేవ్‌నారాయణ్ ఆలయం ప్రసిద్ధ ఆలయంగా పూజలందుకుంటోంది. ప్రతి ఏడాది లక్షలాదిమంది పర్యాటకులు సందర్శించడానికి వస్తుంటారట. మసుదా ఉపవిభాగంలోని ఆరావళి కొండల మధ్య ఉన్న ఈ గ్రామం సుమారు మూడు వేల ఎకరాల్లో విస్తరించి ఉంది. ఇక్కడ సిమ్మెంట్, కలపతో చేసిన పక్కా ఇళ్లు కూడా ఉండవు. అన్ని మట్టితో చేసిన ఇళ్లే ఉంటాయి. అయితే కొండపై వెలసిన దేవనారాయణుని అందమైన ఆలయం ఈ గ్రామానికి ప్రధాన ఆకర్షణగా ఉంటుంది. ఇక ఈ ఉత్తమ పర్యాటక గ్రామ పోటీని పర్యాట మంత్రిత్వ శాఖ నిర్వహించింది. పర్యాటకాన్ని అభివృద్ధి చేస్తూ గొప్ప సంస్కృతిని కొనసాగిస్తున్న గ్రామాలను గుర్తించి మరీ ఆ గ్రామాన్ని ఎంపిక చేశారు.. ముఖ్యంగా సమతుల్య జీవన విధానం, పర్యావరణం వంటి అంశాలను ఆధారంగా చేసుకుని ఉత్తమ పర్యాట గ్రామలను ఎంపిక చేసినట్లు మంత్రిత్వ శాఖ పేర్కొంది. వాటన్నింటి ఆధారంగానే 'దేవమాలి గ్రామం' ఉత్తమ పర్యాటక గ్రామంగా ఎంపికయ్యిందని మంత్రిత్వ శాఖ జాయింట్ డైరెక్టర్ జనరల్ అరుణ్ శ్రీవాస్తవ తెలిపారు. ఈ వ్యాఖ్యలపై రాజస్థాన్ ఉపముఖ్యమంత్రి దియా కుమారి కూడా సోషల్ మీడియా వేదికగా స్పందించారు. "రాజస్థాన్ గర్వించదగ్గ ఘట్టం!. ఈ గ్రామం సుసంపన్నమైన సంస్కృతి, సంప్రదాయాలు, ప్రకృతి అందాలకు ప్రసిద్ధి చెందింది." అని సోషల్ మీడియా ఎక్స్‌లో పేర్కొన్నారు. అలాగే కేంద్ర సాంస్కృతిక పర్యాటక శాఖ మంత్రి గజేంద్ర సింగ్ షెకావత్ ఈ దేవమాలి గ్రామాన్ని అత్యుత్తమ పర్యాటక గ్రామంగా ఎంపిక చేయడం అనేది రాజస్థాన్‌కి ఎంతో గర్వకారణం అన్నారు. (చదవండి: అసామాన్య వనిత 'అంబికా పిళ్లై'!..ఓ పక్క కేన్సర్‌తో పోరాటం మరోవైపు..!) -
తండ్రి చితికి నిప్పు పెట్టేంతలో కుమారుని మృతి
బివార్: విధి రాతను ఎవరూ తప్పించలేరని అంటారు. కొన్ని ఉదంతాలు చూసినప్పుడు ఇది ముమ్మాటికీ నిజం అనిపిస్తుంది. రాజస్థాన్‌లోని బివార్ జిల్లాలో గల జాలియా గ్రామంలో విధి ఆడిన వింత నాటకం స్థానికులను కంటతడి పెట్టించింది. తండ్రి మృతదేహాన్ని స్మశాన వాటికవరకూ తీసుకెళ్లిన కుమారుడు హఠాత్తుగా కన్నుమూశాడు.వివరాల్లోకి వెళితే జాలియా గ్రామంలోని బ్రహ్మపురి ప్రాంతంలో నివసిస్తున్న రాధాకృష్ణ నాగ్లా అనే వృద్ధుడు మృతిచెందాడు. తండ్రి మరణంతో అతని కుమారుడు మహావీర్ ప్రసాద్ తీవ్ర ఆవేదనకు గురయ్యాడు. బంధువుల సహాయంతో తండ్రి మృతదేహాన్ని శ్మశానవాటికకు తీసుకువెళ్లాడు. తండ్రి చితికి నిప్పు పెట్టేంతలో స్పృహ తప్పిపడిపోయాడు. అతనిని గమనించినవారు వెంటనే ఆస్పత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ మహావీర్ ప్రసాద్ మృతి చెందాడు. విషయం తెలుసుకున్న బంధువులంతా షాకయ్యారు. చివరికి వారే తొలుత రాధాకృష్ణకు, ఆ తరువాత మహావీర్ ప్రసాద్‌కు అంత్యక్రియలు నిర్వహించారు. మహావీర్ ప్రసాద్ సోదరుడు రాజ్ కుమార్ నాలుగేళ్ల క్రితం మృతి చెందాడు. ఇప్పుడు రాధాకృష్ణ, మహావీర్ ప్రసాద్‌లు మృతిచెందడంతో వారి కుటుంబం పెద్ద దిక్కును కోల్పోయి అనాథగా మారింది. -
Jammu Kashmir: ఉగ్రవాదులను తరిమికొడుతున్న గ్రామీణులు
జమ్ముకశ్మీర్‌లో ఇటీవలి కాలంలో తరచూ ఉగ్రదాడులు చోటుచేసుకుంటున్నాయి. ఈ నేపధ్యంలో అటు భద్రతా బలగాలు, ఇటు పోలీసులు అప్రమత్తమయ్యారు. తాజాగా వివిధ గ్రామాలకు చెందిన ప్రజలు కూడా ఉగ్రవాదులను తరిమికొట్టే పనిలో పడ్డారు.జమ్ముకశ్మీర్‌లోని మారుమూల గ్రామీణ ప్రాంతాల్లో ఉగ్రవాదులతో పోరాడేందుకు విలేజ్ సెక్యూరిటీ గ్రూప్ (వీడీజీ) సభ్యులు రంగంలోకి దిగారు. ఉగ్రవాదులకు బుద్ధి చెప్పేందుకు సామాన్య ప్రజలకు కూడా పోలీసులు ఆధునిక ఆయుధాలు అందజేస్తున్నారు. గ్రామస్తులను పోలీస్ స్టేషన్‌కు పిలిచి ఎస్ఎల్ఆర్ (సెల్ఫ్ లోడింగ్ రైఫిల్)లను పోలీసులు ఇస్తున్నారు. మారుమూల గ్రామీణ ప్రాంతాల్లో ఉగ్రవాదులు దాడికి ప్రయత్నించినపక్షంలో వారికి గ్రామస్తులు ధీటుగా సమాధానం ఇస్తున్నారు. గత కొన్ని రోజులుగా వీడీజీ సభ్యులతో పాటు మైనార్టీ వర్గాలకు చెందిన వారిని ఆయా ప్రాంతాల్లోని పోలీస్ స్టేషన్లకు పిలిపించి వారికి ఎస్ఎల్ఆర్ రైఫిళ్లను అందజేస్తున్నారు.ఉగ్రవాదులతో ధైర్యంగా పోరాడేందుకు మానసికంగా సిద్ధమయ్యేలా గ్రామస్తుల్లో ధైర్యం, మనోధైర్యాన్ని వీడీజీ సభ్యులు పెంచుతున్నారు. ఈ సందర్భంగా ధార్ సక్రికి చెందిన చైన్ సింగ్, జస్వంత్ సింగ్, గబ్బర్, రొమేష్ కుమార్, విజయ్ కుమార్ తదితరులు మాట్లాడుతూ ఉగ్రవాదులు తమ గ్రామాల్లోని పలువురిని చంపేశారన్నారు. ఆ తర్వాత గ్రామ భద్రతా కమిటీలు తమకు త్రీ నాట్ త్రీ రైఫిల్స్ అందజేశాయన్నారు. -
ఆసియాలోనే అత్యంత సంపన్న గ్రామం, మనదేశంలోనే.. ఎక్కడుందంటే?
ప్రపంచంలో అంత్యంత సంపన్న వ్యక్తులు, దేశాలు, నగరాల గురించి మీరు వినే ఉంటారు. మరి సంపన్న గ్రామం గురించి మీరెప్పుడైనా విన్నారా? అవును మీరు విన్నది నిజమే. మనదేశంలోని ఓ రాష్ట్రానికి చెందిన గ్రామం ఆసియాలోని అత్యంత సంపన్న గ్రామంగా అవతరించింది. ఇంతకి ఆ గ్రామం ఎక్కడుంది? ఆ ఊరు విశేషాలేంటో తెలుసుకుందాం? పదండి. ఒక్క భారత్‌లోనే కాదు. ప్రపంచంలోనే వ్యాపారం చేయడంలో గుజరాతీలను మించిన వారు లేరని అంటారు. కాబట్టే మన దేశంతో పాటు ప్రపంచ వ్యాపారం రంగంలో వీరే అగ్రస్థానంలో ఉంటారు. తాజాగా గుజరాత్ రాష్ట్రం, కఛ్ జిల్లా, భుజ్ తాలూకాలో మధాపర్ గ్రామం మొత్తం ఆసియాలోనే అత్యంత సంపన్న గ్రామంగా ప్రసిద్ధి చెందింది. ఈ గ్రామ వాసుల డిపాజిట్లు మొత్తం రూ.7,000 కోట్లకు పైమాటే. గణాంకాల ప్రకారం.. మధాపర్ జనాభా 2011లో 17,000 నుండి దాదాపు 32,000గా ఉంది. ఈ ఊరిలోనే హెచ్డీఎఫ్సీ, ఎస్బీఐ, పీఎన్బీ, యాక్సిస్ బ్యాంక్, ఐసీఐసీఐ, యూనియన్ బ్యాంక్‌తో పాటు మొత్తం ప్రభుత్వ, ప్రైవేట్ బ్యాంకులు అన్నీ కలిపి 17కి పైగా ఉన్నాయి. అయినప్పటికీ, ఇతర బ్యాంకులు సైతం ఈ ఊరిలో తమ బ్రాంచీలను ప్రారంభించేందుకు సిద్ధంగా ఉన్నట్లు స్థానికులు చెబుతున్నారు. సంపన్న గ్రామంగా అవతరించడానికి కారణంమధాపర్ సంపన్న గ్రామంగా అవతరించడానికి ఎన్ఆర్ఐలే కారణమని తెలుస్తోంది. విదేశాల్లో నివసిస్తున్న ఆ ఊరి ప్రజలు గ్రామంలో కార్యకలాపాలు నిర్వహిస్తున్న బ్యాంకుల్లో ప్రతిఏటా కోట్ల మొత్తంలో డబ్బులు డిపాజిట్లు చేస్తుంటారు. విదేశాల్లో ఎక్కువగా ఆఫ్రికన్ దేశాల్లో నివసిస్తున్నారు. సెంట్రల్ ఆఫ్రికాలోని నిర్మాణ వ్యాపార రంగాల్లో గుజరాతీలు ఆధిపత్యం చెలాయిస్తున్నారు. ఈ ఊరిలో మిగిలిన వారు యూకే,ఆస్ట్రేలియా,అమెరికా, న్యూజిలాండ్‌లో నివసిస్తున్నారు.ఊరికి ఏదో ఒకటి చేయాలనిఈ సందర్భంగా చాలా మంది గ్రామస్తులు విదేశాలలో నివసిస్తున్నారు. పని చేస్తున్నప్పటికీ, వారు తమ గ్రామ అభివృద్దికి అండగా నిలుస్తున్నారని, వారు నివసించే ప్రదేశంలో కాకుండా మధాపర్ గ్రామంలో ఉన్న బ్యాంకుల్లో డబ్బును డిపాజిట్ చేసేందుకు ఇష్టపడతారని జిల్లా పంచాయతీ మాజీ అధ్యక్షుడు పరుల్బెన్ కారా తెలిపారు.సకల సౌకర్యాలకు నిలయంగాగ్రామంలోని జాతీయ బ్యాంకు స్థానిక బ్రాంచ్ మేనేజర్ మాట్లాడుతూ భారీగా డిపాజిట్లు రావడంతో అభివృద్ధి చెందుతుందన్నారు. నీరు, పారిశుధ్యం, రహదారి వంటి అన్ని ప్రాథమిక సౌకర్యాలు ఉన్నాయి. బంగ్లాలు, ప్రభుత్వ, ప్రైవేట్ పాఠశాలలు, సరస్సులు, దేవాలయాలు ఉన్నాయని మేనేజర్ చెప్పారు. -
ఆ గ్రామంలో రెండు రోజుల పాటు రక్షాబంధన్
దేశంలో రక్షాబంధన్ సందడి నెలకొంది. వాడవాడలా రాఖీ దుకాణాలు కనిపిస్తున్నాయి. సాధారణంగా రక్షాబంధన్‌ను ఒకరోజు జరుపుకుంటారు. అయితే ఆ గ్రామంలో మాత్రం రెండు రోజుల పాటు రక్షాబంధన్ చేసుకుంటారు. ఈ సంవత్సరం రక్షాబంధన్ పండుగను ఆగస్టు 19వ తేదీ సోమవారం జరుపుకుంటున్నారు.ఛత్తీస్‌గఢ్‌లోని జంజ్‌గిర్ చంపా జిల్లాలోని బహెరాడీ గ్రామంలో రక్షాబంధన్‌ను ప్రతీయేటా రెండురోజుల పాటు జరుపుకుంటారు. ఇక్కడి రైతులు, మహిళలు విద్యార్థులు రక్షాబంధన్ పండుగకు ఒక రోజు ముందు పర్యావరణ పరిరక్షణ కోరుతూ చెట్లకు, మొక్కలకు రాఖీలు కడతారు. ప్రకృతిని కాపాడాలని ప్రజలకు సందేశం ఇస్తుంటారు. ఈ కార్యక్రమంలో సామాజిక కార్యకర్తలు, పర్యావరణ ప్రేమికులు, అధికారులు, ఉద్యోగులు కూడా పాల్గొంటారు. ఆ మర్నాడు రక్షాబంధన్ రోజున గ్రామంలోని మహిళలు తమ సోదరులకు రాఖీ కట్టి, ఆనందంగా నృత్యాలు చేస్తారు.స్థానికుడు దీనదయాళ్ యాదవ్ మీడియాతో మాట్లాడుతూ ఈ ప్రాంతంలో హెర్బల్ రాఖీలను తయారుచేస్తారని, వాటిని వివిధ ప్రాంతాలకు కూడా పంపిస్తారని తెలిపారు. ప్రధానమంత్రి, ముఖ్యమంత్రి, కలెక్టర్లకు ఇక్కడి మహిళా సంఘం సభ్యులు రాఖీలను పంపిస్తుంటారన్నారు. -
Catherine Tresa: విలేజ్‌లో చక్కర్లు కొడుతున్న హీరోయిన్ కేథరిన్ (ఫొటోలు)
-
నలభై ఏళ్లుగా మద్యానికి దూరం.. కాట్రేవ్
చౌటుప్పల్ రూరల్: ఇప్పుడు ఏ పల్లెలో చూసినా బెల్ట్ షాపుల జోరుతో మద్యం ఏరులై పారుతోంది. కానీ యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్ మండలం కాట్రేవ్ గ్రామంలో మాత్రం మద్యం జాడే కనిపించదు. గ్రామంలో నాలుగు దశాబ్దాలుగా సంపూర్ణ మద్య నిషేధం అమలవుతోంది. అప్పట్లో గ్రామ పెద్దలు నిర్ణయించిన కట్టుబాటును ఇప్పటికీ కొనసాగిస్తూ.. తమ ప్రత్యేకతను నిలుపుకొంటున్నారు కాట్రేవ్ గ్రామ ప్రజలు. రాష్ట్రవ్యాప్తంగా మరికొన్ని గ్రామాల్లోనూ కొన్నేళ్లు మద్యం విక్రయాలు, వినియోగంపై నిషేధం పెట్టుకోవడం గమనార్హం. కాట్రేవ్లో అయితే సుదీర్ఘకాలం నుంచి కొనసాగుతోంది.గ్రామ యువత కూడా దూరమే..కాట్రేవ్ గ్రామం ఒకప్పుడు ఆరెగూడెం గ్రామ పంచాయతీ పరిధిలో ఉండేది. ఐదేళ్ల కింద నూతన గ్రామ పంచాయతీగా ఏర్పాటైంది. సుమారు 700కుపైగా జనాభా ఉన్న ఈ గ్రామంలో అంతా రైతులే. రోజంతా వ్యవసాయ పనుల్లో మునిగిపోతారు. సాయంత్రానికి ఇంటికొచ్చి సేదతీరుతారే తప్ప మద్యం జోలికి వెళ్లరు. ఈ గ్రామం నుంచి బయట పట్టణాల్లో ఉద్యోగం, ఉపాధి, చదువు కోసం వెళ్లిన యవత కూడా.. ఈ గ్రామానికి ఎప్పుడూ మద్యం తీసుకురారు. ఇక్కడ వినియోగించరు. మద్య నిషేధమేకాదు.. అభివృద్ధిలోనూ కాట్రేవ్ గ్రామం ఆదర్శంగా నిలుస్తోంది. పక్కనే ఉన్న దివిస్ పరిశ్రమ అందించే ‘కార్పొరేట్ సామాజిక బాధ్యత (సీఎస్ఆర్)’ నిధులతో గ్రామంలో ప్రతి వీధిలో సీసీ రోడ్లు, ఎల్ఈడీ లైట్లు, ప్రతి ఇంటికి శుద్ధిచేసిన సురక్షిత నీరు అందించేలా ఏర్పాటు చేసుకున్నారు. పక్కనే ఉన్న ఆరెగూడెంలోనూ రెండు దశాబ్దాలుగా మద్యం విక్రయాలు లేవు.గ్రామ పంచాయతీ కార్యాలయం గ్రామస్తుల సహకారంతోనే కొనసాగిస్తున్నా..నాకు ఊహ తెలిసినప్పటి నుంచీ గ్రామంలో మద్యపానం అలవాటు లేదు. 40 ఏళ్ల కింద పెద్దలు పెట్టుకున్న కట్టుబాటును.. గ్రామస్తుల సహకారంతో కొనసాగిస్తున్నాం. అభివృద్ధిలోనూ ముందుకెళ్తున్నాం.– బచ్చ రామకృష్ణ మాజీ సర్పంచ్, కాట్రేవ్ -
ఆ ఊరి పేరు ఐఏఎస్ ఫ్యాక్టరీ... స్త్రీ విద్యతో ఆ ఊరి పేరే మారింది!
ఒకప్పుడు ఆ ఊరి పేరు వినబడగానే ‘వామ్మో’ అనుకునేవారు. దొంగతనాలు, అక్రమ మద్యం వ్యాపారానికి పేరు మోసిన రాజస్థాన్‌లోని నయాబస్ గ్రామం ఇప్పుడు పూర్తిగా మారిపోయి ఆదర్శ గ్రామం అయింది. అమ్మాయిల చదువుకు అధిక ప్రాధాన్యత ఇస్తోంది. దీనికి కారణం ఈ గ్రామానికి చెందిన మహిళలు ఐపీఎస్ నుంచి జడ్జీ వరకు ఉన్నత ఉద్యోగాలు ఎన్నో చేయడం. జడ్జీగా ఎంపికైన అభిలాష జెఫ్ విజయాన్ని ఊరు ఊరంతా సెలబ్రెట్ చేసుకుంది. ఇప్పుడు ఎంతోమంది అమ్మాయిలకు అభిలాష రోల్ మోడల్...ఒక ఇంట్లో పెద్ద ఉద్యోగం వస్తే... ఆ సంతోషం ఆ ఇంటికి మాత్రమే పరిమితమైపోతుంది. కానీ అభిలాష జెఫ్ విషయంలో మాత్రం అలా జరగలేదు. ఆమె జడ్జీగా ఎంపికైన సందర్భం ఊరంతటికీ పండగ అయింది. అభిలాషను వీధుల్లో ఊరేగిస్తూ డీజే, డ్యాన్స్‌లతో ఆమె విజయాన్ని గ్రామస్థులు సెలబ్రెట్ చేసుకున్నారు. ఈ ఊరేగింపులో సంప్రదాయ రాజస్థానీ దుస్తులు ధరించిన మహిళలు ఎక్కువగా ఉన్నారు.ఈ ఊరేగింపులో పాల్గొన్న సరితా మీనా ఇలా అంటుంది... ‘మా అమ్మాయిని పెద్ద చదువులు చదివిస్తాను. ఏదో ఒకరోజు మా అమ్మాయి అభిలాషలాగే పెద్ద ఉద్యోగం చేస్తుంది’ సరితా మీనాలాగే కలలు కన్న తల్లులు, ఎన్ని కష్టాలు వచ్చినా తమ కూతుళ్లను పెద్ద చదువులు చదివిస్తామని ప్రతిజ్ఞ చేసిన తల్లులు ఆ ఊరేగింపులో ఎంతోమంది ఉన్నారు. రాజస్థాన్‌లోని నీమ్ కా ఠాణా జిల్లాలోని నయాబస్ గ్రామంలోని యువతులకు ఆ సంతోషకరమైన రోజు ఒక మలుపు.‘అభిలాషలాంటి అమ్మాయిల వల్ల ఊరికి జరిగిన మేలు ఏమిటంటే ప్రతి ఒక్కరూ తమ కూతుళ్లను పెద్ద చదువులు చదివించాలనుకుంటారు. పది చాలు, పై చదువులు ఎందుకు అనే ఆలోచన ధోరణిలో మార్పు వచ్చింది’ అంటుంది కర్ణిక అనే గృహిణి.అభిలాషకు ముందు అల్కా మీనాను కూడా ఇలాగే ఊరేగించారు. ఈ గ్రామానికి చెందిన అల్కా మీనా ఐపీఎస్ పంజాబ్‌లో డిఐజీగా విధులు నిర్వహిస్తోంది. అల్కా మీనా నుంచి అభిలాష వరకు ఎంతోమంది మహిళలు ఎన్నో అడ్డంకులను అధిగమించి ఉన్నత స్థాయికి చేరుకున్నారు. విశేషం ఏమిటంటే నయాబస్ను ఇప్పుడు ‘ఐఏఎస్ ఫ్యాక్టరీ’ అని కూడా పిలుస్తున్నారు. ఈ ఊరి నుంచి ఐఏఎస్‌లాంటి ఉన్నత సర్వీసులకు ఎంపికైన వారు కూడా ఉన్నారు.ఇప్పుడు గ్రామంలో ఎటు చూసినా అల్కా మీనా, అభిలాషలాంటి విజేతల పోస్టర్లు కలర్ ఫుల్‌గా కనిపిస్తాయి. కోచింగ్ సెంటర్ల వారు అంటించిన ఈ పోస్టర్లలో ‘ఇలాంటి విజేతలు మీ ఇంట్లో కూడా ఉన్నారు’ అని ఉంటుంది.ఈ గ్రామంలో ఉన్న గొప్పతనం ఏమిటంటే ఉన్నత ఉద్యోగాలు చేస్తున్న వారు వారి ప్రపంచంలో మాత్రమే ఉండిపోకుండా ఎప్పుడూ ఊరితో టచ్‌లో ఉంటారు. ముఖ్యంగా అమ్మాయిల చదువుకు సంబంధించి చొరవ తీసుకుంటారు. ఒకప్పుడు ఈ ఊళ్లో ఒకే స్కూల్ ఉండేది. అమ్మాయిల సంఖ్య అంతంత మాత్రమే. ఇప్పుడు మాత్రం ‘బాలికల పాఠశాల’తో కలిసి మూడు స్కూల్స్ ఉన్నాయి.చదువు వల్ల నయాబస్ ఆదర్శగ్రామం కావడం ఒక కోణం అయితే, స్త్రీ సాధికారత మరో కోణం. చదువు వల్ల అమ్మాయిలు తమ హక్కుల గురించి తెలుసుకోవడం నుంచి ఆర్థిక భద్రత, ఉన్నత ఉద్యోగం వరకు ఎన్నో విషయాలపై అవగాహన ఏర్పర్చుకుంటున్నారు. తమ కలలను నిజం చేసుకుంటున్నారు.ఆటల్లోనూ...ఉన్నత చదువు, ఉద్యోగాలలోనే కాదు ఆటల్లో రాణిస్తున్న వారు కూడా నయాబస్లో ఎంతోమంది ఉన్నారు. దీనికి ఉదాహరణ... సలోని మీనా. గత ఏడాది ఇండో–నేపాల్ అంతర్జాతీయ తైక్వాండో చాంపియన్‌షిప్‌లో ఇరవై ఏళ్ల మీనా మూడోసారి స్వర్ణం గెలుచుకొని ఊళ్లో సంబరం నింపింది. రాబోయే ఒలింపిక్స్‌లో భారత్ తరఫున ఆడాలనేది తన లక్ష్యం అని చెబుతుంది మీనా. భవిష్యత్‌కు సంబంధించి సలోని మీనాకు భారీ ప్రణాళికలు ఉన్నాయి. ఊరు అండ ఉంది. ఇంకేం కావాలి! చదువు అనేది వజ్రాయుధం, తిరుగులేని మహా ఉద్యమం అని మరోసారి నయాబస్ గ్రామం విషయంలో నిరూపణ అయింది. ఇల్లే ప్రపంచంగా మారిన ఎంతోమంది అమ్మాయిలు చదువుల తల్లి దయ వల్ల ప్రపంచాన్ని చూస్తున్నారు. ఉన్నత ఉద్యోగాల్లో వెలిగిపోతున్నారు. -
మీకు తెలుసా! ఆ ఊరికి లైఫ్ లైబ్రరీనే!
కరెంటు.. రోడ్డు.. మంచినీళ్ల వసతి .. గ్రామాభివృద్ధికి చిహ్నాలు! గ్రంథాలయం.. ఆ ఊరి చైతన్యానికి నిదర్శనం! ఈ డిజిటల్ వరల్డ్‌లో అలాంటి చైతన్యంతో ప్రత్యేకంగా కనిపిస్తోంది పశ్చిమగోదావరి జిల్లాలోని కుముదవల్లి.. 127 ఏళ్ల ఘన చరిత్ర కలిగిన కందుకూరి విరేశలింగం కవిసమాజ గ్రంథాలయానికి చిరునామాగా నిలిచి! 1890వ దశకంలోకి వెళితే.. కుముదవల్లిలోని మధ్యతరగతి రైతుకుటుంబానికి చెందిన తిరుపతిరాజుకు పుస్తక పఠనం అంటే ప్రాణం. దానికి కారణం.. ఆ ఊరికే చెందిన పడ్రంగి చిన్నమారాజు.అప్పట్లో ఆయన తన దగ్గరున్న 50 పుస్తకాలను తిరుపతిరాజు తండ్రి లచ్చిరాజుకిచ్చి లైబ్రరీ ఏర్పాటుకు సాయపడ్డారు. తిరుపతిరాజులో పఠనాసక్తిని కలిగించింది ఆ గ్రంథాలయమే. అందులోని పుస్తకాల వల్లే స్వాతంత్య్ర సమరం గురించి తెలిసింది ఆయనకు. అలా తను చదివిన విషయాలన్నీ తన ఊళ్లోని వాళ్లకూ తెలియాలని.. తమ ఊరూ స్వాతంత్య్ర సమరంలో పాల్గొనాలని తపించారు తిరుపతి రాజు.ఆ చైతన్యం తన ఊరి ప్రజల్లో రావాలంటే తన తండ్రి ఏర్పాటు చేసిన ఆ చిన్న లైబ్రరీని మరిన్ని పుస్తకాలు, పత్రికలతో అభివృద్ధిపరచాలని నిర్ణయించుకున్నారు. అలా 1897 నవంబర్ 28న ఆ ఊళ్లో చిన్న గుడిసె వేసి ‘కందుకూరి వీరేశలింగం కవి సవూజ గ్రంథాలయం’ను ఏర్పాటు చేశారు. పుస్తకాలు, గ్రంథాలు, పత్రికలు కొనుగోలు చేయడానికి తిరుపతిరాజు తనకున్న ఎకరం భూమిని విరాళంగా ఇచ్చేశారు. ఈ గ్రంథాలయాన్ని స్వయంగా సంఘసంస్కర్త కందుకూరి వీరేశలింగం పంతులే ప్రారంభించారు.గ్రంథాలయంలో పుస్తక పఠనం చేస్తున్న గ్రామస్థులు, అలనాటి పుస్తకాలుతిరుపతిరాజు.. కోరుకున్నట్టే స్థానికులు స్వాతంత్య్ర పోరాటానికి సంబంధించిన సమాచారాన్ని గ్రంథాలయానికి వచ్చే పత్రికల్లో చదివి స్ఫూర్తిపొందారు. ఆ గ్రామం నుంచి దాదాపు 24 మంది స్వాతంత్య్ర పోరాటంలో పాల్గొని జైలు శిక్షను అనుభవించారు. అలా ఆ గ్రంథాలయం దేశ స్వాతంత్య్ర ఉద్యమంలో తన వంతు పాత్రను పోషించింది. 1934లో గ్రంథాలయోద్యమానికీ పట్టుగొమ్మగా నిలిచింది కుముదవల్లి. ఈ లైబ్రరీ గురించి విరేశంలింగం పంతులు స్వదస్తూరీతో ఇక్కడి మినిట్స్ బుక్‌లో రాసి, చేసిన సంతకం ఇప్పటికీ భద్రంగా ఉంది. రూథర్‌ఫర్డ్ రాసిన అభిప్రాయమూ అందులో కనపడుతుంది.పూరిగుడిసె నుంచి పక్కా భవనం.. కాలక్రమంలో ఈ లైబ్రరీ పూరిగుడిసె నుంచి పెంకుటిల్లుగా, దాన్నుంచి అధునాతన వసతుల భవంతిగా మారింది. అక్షరాస్యత వ్యాప్తి, స్త్రీ విద్య, వితంతు వివాహాలు, సహకార పరపతి సంఘం తదితర ప్రజోపయోగ అంశాలకు వైదికయింది. విజ్ఞాన గని.. ఇందులో.. ఎందరో మహామహులు రచించిన గ్రంథాలు, ప్రవుుఖుల చేతిరాత ప్రతులు వంటి అవుూల్యమైన అక్షర సంపద పోగై ఉంది.ఆత్మకథలు, వచనాలు, నవలలు, ఆధ్యాత్మిక, ఆయుర్వేదం, భారతి, ఆంధ్రపత్రిక, శారద, విజ్ఞానం, గృహలక్ష్మి, కృష్ణాపత్రిక, బాల వ్యాకరణం, వేదాంతసారం వంటి 17 వేల పుస్తకాలు కనిపిస్తాయిక్కడ. కోస్తా జిల్లాలోని విద్యార్థులు తెలుగుభాష, చరిత్రపై పీహెచ్డీ చేసేందుకు ఇది ఎంతో దోహదపడుతోంది. దేశోద్ధారక కాశీనాథుని నాగేశ్వరరావు పంతులు, ఉన్నవ లక్ష్మీనారాయణ, అయ్యంకి వెంకటరమణయ్య, చిలకవుర్తి లక్ష్మీనర్సింహం, దుగ్గరాల బలరామకృష్ణయ్య, అడివి బాపిరాజు, జంధ్యాల పాపయ్యశాస్త్రి, డాక్టరు సి నారాయణరెడ్డి, నండూరి కృష్ణవూచార్యులు వంటి పెద్దలు ఈ గ్రంథాలయానికి వస్తూపోతూండేవారట.ప్రత్యేకతలెన్నో..పుస్తక పఠనాన్ని ఈ గ్రామస్థుల జీవనశైలోలో భాగం చేసిన ఆ గ్రంథాలయాభివృద్ధి కోసం కుముదవల్లి ఓ సంప్రదాయాన్ని పాటిస్తోంది. అక్కడ ఎవరి పెళ్లి జరిగినా ఎంతోకొంత డబ్బును ఆ లైబ్రరీకి విరాళంగా ఇస్తూ! ఇప్పటికీ ఆ లైబ్రరీని దేవాలయంగా భావిస్తారు కుముదవల్లి వాసులు. పాదరక్షలతో లోనికి వెళ్లరు. ప్రస్తుతం ఈ గ్రంథాలయానికి లైబ్రేరియన్‌గా పెనుమత్స సూర్యసుగుణ సేవలందిస్తున్నారు. ఆధునిక సాంకేతికతకనుగుణంగా ఆ లైబ్రరీలోని పుస్తకాల డిజిటలైజషన్ ప్రక్రియా మొదలైంది. – విజయ్‌కుమార్ పెనుపోతుల -
దారి ఇలా.. పాఠశాలకు వెళ్లేది ఎలా?
జనగామ జిల్లా, చిల్పూరు: దారి ఇలా ఉంటే తాము పాఠశాలకు ఎలా వెళ్లేదంటూ విద్యార్థులు సోమవారం నిరసన చేపట్టగా తల్లిదండ్రులు, నాయకులు సహకరించారు. మండలంలోని ఫత్తేపూర్ గ్రామ ప్రభుత్వ ప్రాథమికోన్నత పాఠశాలలో చదివే విద్యార్థులు వెళ్లే రహదారిలో గ్రామంలోని మురుగు నీరు పాఠశాల సమీపంలో నిలుస్తోంది.చిరుజల్లులకే కుంటలా మారుతోంది. గతంలో గ్రామ ప్రత్యేకాధికారి, పంచాయతీ కార్యదర్శికి విన్నవించినా పట్టించుకోలేదని వాపోయారు. ఇప్పటికైనా అధికారులు స్పందించకుంటే పాఠశాల వద్ద ఆందోళనలు చేస్తామని హెచ్చరించారు.అధికారులకు చెప్పినా పట్టించుకోవడం లేదుగతంలో ఎన్నో సార్లు అధికారులకు విన్నవించాం. అయినా పట్టించుకోవడం లేదు. మన ఊరు మన బడి, అమ్మ ఆదర్శ పాఠశాల అంటూ పనులు చేస్తున్నారే తప్ప పాఠశాలకు పిల్లలు వచ్చే రోడ్డు ఎందుకు పట్టించుకోరు. త్వరగా సమస్య తీర్చాలి.– బానోత్ బాలరాజు, గ్రామస్తుడుబురదలోనే నడుస్తున్నాంప్రతీ రోజు చెప్పులు చేతపట్టుకుని బురదలో నడిచి పాఠశాలకు వెళ్తున్నాం. మధ్యాహ్న భోజనం తినే సమయంలో వాసన భరించలేక పోతున్నాం. అధికారులు స్పందించాలి.– హరిప్రసాద్, విద్యార్థిఒక్కోసారి బురదలో జారిపడుతున్నాం..పుస్తకాల బ్యాగుతో నడిచి వస్తుంటే ఒక్కోసారి జారి బురదలో పడుతున్నాం. దీంతో తిరిగి ఇంటికి వెళ్తుంటే ఆ వాసన భరించలేక వాంతులు చేసుకున్న సంఘటనలు ఉన్నాయి. మా బడి వరకు రోడ్డు నిర్మించాలి.– సాత్విక, విద్యార్థిని -
విలేజి టెక్నాలజీ
రాజీగళ్ల భూపాల్..మూడుచింతలపల్లి మండలంలోని పోతారం, కొల్తూర్ గ్రామాల్లో గేటెడ్ కమ్యూనిటీలకు దీటుగా పైప్‌లైన్ ద్వారా వంట గ్యాస్ సరఫరా జరుగుతోంది. ఇక్కడికి సమీపంలోని జీనోమ్ వ్యాలీలో ఉన్న ఫార్మా కంపెనీలకు ఎల్పీజీ గ్యాస్ సరఫరా చేసేందుకు మెగా గ్యాస్ కంపెనీ పోతారంలో సబ్‌స్టేషన్ (కంప్రెసర్) ఏర్పాటు చేసింది. తమ గ్రామంలో సబ్‌స్టేషన్ పెట్టిన నేపథ్యంలో.. ఇక్కడి ఇళ్లకు పైప్‌లైన్ ద్వారా వంటగ్యాస్ సరఫరా చేయాలని గ్రామస్తులు కోరడంతో ఆ ఏర్పాట్లు చేసింది. వినియోగదారులు రూ.6 వేలు చెల్లిస్తే.. వారి ఇంటికి వంటగ్యాస్ పైప్‌లైన్ కనెక్షన్ ఇస్తారు. దానికి ఒక మీటర్‌ను అమర్చుతారు. ప్రతి నెలా కంపెనీ సిబ్బంది వచ్చి మీటర్ వద్ద స్కాన్ చేసి.. వినియోగించిన గ్యాస్‌కు సంబంధించిన బిల్లు ఇస్తారు. అచ్చు కరెంటు బిల్లు తరహాలో నెలనెలా బిల్లు కట్టేస్తే సరిపోతుంది.సిలిండర్ల కోసం ఇబ్బంది తప్పింది పైప్‌లైన్ ద్వారా వంటగ్యాస్ సరఫరా చేయడం గ్రామస్తులకు ఉపయోగకరంగా ఉంది. గతంలో సిలిండర్ అయిపోతే రెండు, మూడు రోజుల వరకు ఇబ్బంది ఎదుర్కోవాల్సి వచ్చేది. దానికితోడు గ్యాస్ సిలిండర్లు ఇచి్చనప్పుడు డెలివరీ చార్జ్‌లు, సరీ్వస్ చార్జ్‌లు అంటూ అదనంగా డబ్బులు తీసుకునేవారు. ఇప్పుడు ఎలాంటి ఇబ్బంది లేకుండా.. నిరంతరాయంగా వంట గ్యాస్ సరఫరా అవుతోంది. వాడుకున్న మేర బిల్లు చెల్లిస్తే సరిపోతోంది. – హరిమోహన్‌రెడ్డి, పోతారం మాజీ సర్పంచ్ ఉద్దమర్రి గ్రామంలో స్మార్ట్ కార్డులుమూడుచింతలపల్లి మండలం ఉద్దమర్రిలోని వాటర్ ఫిల్టర్ కేంద్రం (సామాజిక నీటి శుద్ధి కేంద్రం)లో సిబ్బంది లేకుండానే ప్రజలు నీటిని కొని తీసుకెళ్లేలా ఏర్పాటు చేశారు. తాజా మాజీ సర్పంచ్ యాంజాల అనురాధ పట్టభద్రురాలు కావడం, డిజిటల్ విధానంపై అవగాహన ఉండటంతో.. స్మార్ట్‌కార్డు విధానం ఏర్పాటుకు నిర్ణయించారు. దీనిపై గ్రామస్తులకు అవగాహన కల్పించారు.ఈ వాటర్ ఫిల్టర్ నిర్వాహకులకు ముందుగా రూ.50 చెల్లిస్తే ఒక 20 లీటర్ల వాటర్ క్యాన్‌తోపాటు యాక్టివేట్ చేసిన స్మార్ట్ కార్డును వినియోగదారులకు ఇస్తారు. తర్వాత వినియోగదారులు నగదు ఇచ్చి స్మార్ట్ కార్డును రీచార్జ్ చేసుకోవచ్చు. వాటర్ ప్లాంట్ వద్ద ఉన్న మిషన్ సెన్సర్ వద్ద స్మార్ట్ కార్డును స్కాన్ చేస్తే కార్డులో నుంచి రూ.5 కట్ అయి.. వారు నాజిల్ దగ్గర పెట్టిన వాటర్ క్యాన్ నిండుతుంది. ఇలా స్మార్ట్‌కార్డు వినియోగించిన ప్రతిసారీ రూ.5 చొప్పున కట్ అయి.. వాటర్ బాటిల్ నిండుతుంది. ఫిల్టర్ వాటర్ కేంద్రం 24 గంటలూ ఆన్‌లో ఉంటుంది. ఎప్పుడు కావాలన్నా వెళ్లి నీళ్లు తెచ్చుకోవచ్చు.కావాల్సినప్పుడల్లా తెచ్చుకుంటున్నాం.. స్మార్ట్ కార్డ్‌తో మంచి ప్రయోజనం ఉంది. రోజూ నీళ్లు తెచ్చుకోవాలంటే చేతిలో డబ్బులు, చిల్లర ఉండకపోవచ్చు. నెల మొదటి వారంలో డబ్బు ఉన్నపుడు రీచార్జి చేయించుకుంటే చాలు. ఈ కేంద్రం 24 గంటలూ అందుబాటులో ఉంటోంది. అవసరమైనప్పుడల్లా నీటిని తెచ్చుకుంటున్నాం. –జూపల్లి పద్మ, ఉద్దమర్రి