స్వర్గం ఎంత అందంగా ఉంటుందో మనం అనేక కథల రూపంలో వినేవుంటాం. స్వర్గం నుంచి దిగివచ్చే అప్సరసలు కంటిమీద కునుకులేకుండా చేస్తుంటారని కొందరు అంటుంటారు. అయితే మీరు ఎప్పుడైనా స్వర్గం నుంచి దిగివచ్చిన వృక్షం గురించి విన్నారా? అవును.. ఇప్పుడు మనం స్వర్గపు వృక్షం అంటే పారిజాత వృక్షం గురించి తెలుసుకోబోతున్నాం. ఈ దివ్య వృక్షం ఉత్తరప్రదేశ్‌లోని ఒక గ్రామానికి గర్వకారణంగా నిలిచింది.
ఈ వృక్షానికి ప్రతిరాత్రి రంగురంగుల పూలు వికసిస్తాయి. అవి ఉదయానికి రాలిపోతాయి. ఈ దివ్య వృక్షాన్ని చూసేందుకు సుదూర ప్రాంతాల నుంచి ప్రజలు ఇక్కడికి తరలివస్తుంటారు. పౌరాణిక గాథల ప్రకారం సాగరాన్ని మథించినప్పుడు అమృతంతో పాటు పారిజాత వృక్షం కూడా వెలికి వచ్చిందని చెబుతారు. శ్రీకృష్ణుడు ఈ పారిజాతాన్ని తన తన భార్య సత్యభామ కోరిక మేరకు స్వర్గం నుండి భూమికి తీసుకువచ్చాడని చెబుతారు. అర్జునుడు మహాభారత కాలంలో ద్వారకా నగరంలోని ఈ వృక్షాన్ని కింతూర్ గ్రామానికి తీసుకువచ్చాడని స్థానికులు చెబుతుంటారు.
ఈ పారిజాత వృక్షం ఉత్తరప్రదేశ్‌లోని బారాబంకి జిల్లాలో గల కింతూర్ గ్రామంలో ఉంది. ఈ పారిజాత వృక్షానికి స్థిరమైన పేరు లేదు. దీనిని హర్సింగర్, షెఫాలీ, ప్రజక్త అనేక ఇతర పేర్లతో పిలుస్తారు. పారిజాతంనకు బెంగాల్ రాష్ట్ర పుష్పం హోదా కూడా ఉంది. ఈ భారీ పారిజాత వృక్షం ఈ గ్రామంలో మాత్రమే కనిపిస్తుంది. ప్రతి రాత్రి ఈ చెట్టుకు చాలా అందమైన పూలు వికసిస్తాయి. ఉదయం కాగానే ఈ పూలన్నీ నేలరాలిపోతాయి.
యూపీలోని బారాబంకి జిల్లాకు 38 కిలోమీటర్ల దూరంలో ఉన్న కింతూర్ గ్రామం మహాభారత కాలంలో నిర్మితమయ్యిందని చెబుతారు. పాండవుల తల్లి అయిన కుంతి పేరు మీదుగా ఈ గ్రామం ఏర్పడిందంటారు. పాండవులు అజ్ఞాతవాసంలో ఉన్నప్పుడు వారు ఈ గ్రామంలోనే ఉన్నారట. కుంతీమాత ప్రతిరోజూ శివునికి పూలు సమర్పించవలసి వచ్చినప్పుడు, అర్జునుడు పారిజాత వృక్షాన్ని స్వర్గం నుంచి ఇక్కడకు తీసుకువచ్చారని చెబుతారు. గ్రామంలో కుంతీమాత నెలకొల్పిన కుంతేశ్వరాలయం కూడా ఉంది.
ఇతర పూలతో పోలిస్తే పారిజాతం పూలు ప్రత్యేక సమయంలో మాత్రమే వికసిస్తాయి. దీని వెనుక ఇంద్రుని శాప వృత్తాంతం దాగి ఉంది. ప్రపంచం మొత్తంలో పూలు ఉదయం పూస్తుండగా, పారిజాతం పూలు రాత్రి పూట వికసించి, చూపరులకు అందాలను అందిస్తాయి. సత్యభామ ఈ పూలతో తన కురులకు అలంకరించుకునేదని, రుక్మణి ఈ పూలను పూజకు ఉపయోగించేదని చెబుతుంటారు.ఈ తరహా పారిజాత వృక్షం భారతదేశంలోని కింతూర్ గ్రామంలో మాత్రమే కనిపించడం విశేషం.
ఇది కూడా చదవండి: తండ్రి బకాయి కోసం.. కుమార్తెతో 52 ఏళ్ల వ్యక్తి పెళ్లి.. తుపాకీ చూపించి..
Comments
Please login to add a commentAdd a comment