అసోంలోని బార్పేట జిల్లాలో వేలాది పక్షులు ఉన్నట్టుండి మృతి చెందిన విషయం కలకలం రేపుతోంది. వాటికి విషం పెట్టి చంపేశారని పలువురు భావిస్తున్నారు. ఈ చర్యకు బాధ్యులైన అరాచక శక్తులపై వెంటనే చర్యలు తీసుకోవాలని సంబంధిత అధికారులను బయోడైవర్సిటీ కన్జర్వేషన్ గ్రూప్ అరణ్యక్ డిమాండ్ చేసింది.
పంటపొలాల్లో చచ్చిపడి..
విషప్రయోగంతో వేలాది పక్షులు మృతి చెందాయనే వార్త తెలియగానే పర్యావరణ సంరక్షణాభిషులు, పక్షిప్రేమికులు ఆవేదన వ్యక్తం చేశారు. స్థానికంగా ఉంటున్న పర్యావరణ ప్రేమికుడొకరు మాట్లాడుతూ అసోంలోని బార్పేట్ జిల్లాలోని జానియా గ్రామంలో వేలాది పక్షులకు విషం ఇచ్చారని, అవి పంటపొలాల్లో చచ్చిపడివున్నాయని తెలిపారు.
‘కఠిన చర్యలు తీసుకోవాలి’
సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఒక వీడియోలో ఉన్న సమాచారం ప్రకారం ఆ పక్షులు పంటపొలాల్లోని ధాన్యపు గింజలను తిన్నాక మృతి చెందాయి. పంటపొలాల నుంచి పక్షులను తరిమివేసేందుకే ఎవరో ఈ దుశ్చర్యకు పాల్పడి ఉంటారని భావిస్తున్నారు. ఈ ఉదంతం గురించి తెలుసుకున్న అరణ్యక్ సిఈఓ డాక్టర్ విభాబ్ కుమార్ ఆవేదన వ్యక్తం చేస్తూ, విషం కారణంగా వేల సంఖ్యలో పక్షులు మృతి చెందడం తనను ఎంతో కలచివేస్తున్నదన్నారు. ఈ దుశ్చర్యకు పాల్పడినవారిపై కఠిన చర్యలు తీసుకోవాలని కోరారు. జిల్లా అధికారులు ఈ విషయంపై వెంటనే స్పందించాలన్నారు.
పంటలకు పక్షులు చేసే మేలు ఇదే..
యంత్రాలతో పోల్చిచూస్తే పక్షులు పంట దిగుబడికి ఎంతో సాయపడతాయని డాక్టర్ విభాబ్ కుమార్ అన్నారు. పంటలకు నష్టం కలిగించే కీటకాలు,పురుగులను పక్షులు తింటాయని, ఫలితంగా పంటనష్ట నివారణ జరుగుతుందన్నారు. అదేవిధంగా పక్షుల కారణంగా పంటపొలాల్లో రసాయన మందుల వాడకం తగ్గుతుందన్నారు. పక్షులు పంటపొలాల్లో తిరుగాడుతూ.. పరపరాగ సంపర్కం చేస్తాయని, ఫలితంగా మొక్కల జాతుల ఉత్పత్తి మరింత సులభమవుతుందన్నారు. అందుకే ప్రతీఒక్కరూ పక్షులను కాపాడాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు.
ఇది కూడా చదవండి: గుడ్లను యూరిన్‌లో ఉడికించి, ఉప్పుకారం జల్లి..
Comments
Please login to add a commentAdd a comment