
లేహ్‌లో అచ్చుపోసిన ఇండియన్ ఆర్మీ
సాయపడిన ఐఐటీ హైదరాబాద్, సింప్లీఫోర్జ్ క్రియేషన్స్
బెంగళూరు: భారత రక్షణ మౌలిక వసతుల, నిర్మాణ రంగంలో నూతన అధ్యయనానికి శ్రీకారం చుడుతూ ప్రపంచంలోనే తొలిసారిగా 3డీ ముద్రిత సైనిక బంకర్‌ను లేహ్‌లో నిర్మించారు. సముద్రమట్టానికి 11,000 అడుగుల ఎత్తులో అసాధారణ పరిస్థితులను తట్టుకునేలా పటిష్టవంతంగా మిలటరీ బంకర్‌ను పోతపోయడం విశేషం. అప్పటికప్పుడు తయారుచేసిన ప్రత్యేక కాంక్రీట్ మిక్సర్‌ను ముందే డిజైన్ చేసిన విధంగా 3డీ విధానంలో నిర్మాణాన్ని పూర్తిచేశారు.
ఇండియన్ ఆర్మీ తరఫున అరుణ్ కృష్ణన్, ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ(ఐఐటీ)హైదరాబాద్‌తోపాటు హైదరాబాద్ కేంద్రంగా పనిచేస్తున్న బహుళ సాంకేతికతలు, ఉత్పత్తుల అంకుర సంస్థ సింప్లీఫోర్జ్ క్రియేషన్స్ సంయుక్తంగా ‘ప్రబల్’ ప్రాజెక్ట్‌లో భాగంగా ఈ బంకర్‌ను నిర్మించారు. సముద్రమట్టానికి అత్యంత ఎత్తు, అత్యల్ప ఆక్సిజన్(హ్యాలో) పరిస్థితుల్లో ప్రపంచంలో నిర్మించిన తొలి బంకర్ ఇదేనని ప్రబల్ ప్రాజెక్ట్‌కు సారథ్యం వహించిన ఐఐటీ హైదరాబాద్ ప్రొఫెసర్ కేవీఎల్ సుబ్రహ్మణ్యం చెప్పారు.
‘‘అత్యంత మారుమూల ప్రదేశానికి ఈ ప్రింటర్‌ను తీసుకురావడం కూడా పెద్ద సవాల్‌గా మారింది. ఇంత ఎత్తులో దాదాపు కేవలం 40–50 శాతం ఆక్సీజన్ అందుబాటులోనే మేం, మా ప్రింటర్ పనిచేయాల్సి వచ్చింది. శత్రుసైన్యం బుల్లెట్లను తట్టుకునేలా అధునాతన డిజైన్‌లో పటిష్టంగా, పరిసరాల్లో కలిసిపోయే రంగులో బంకర్‌ను నిర్మించాం’’ అని ఆయన వెల్లడించారు. గతంలో తెలంగాణలోని సిద్ధిపేట జిల్లాలోని బురుగుపల్లి గ్రామంలో ప్రపంచంలోనే తొలిసారిగా 3డీ ప్రింటెండ్ హిందూ ఆలయాన్ని సైతం ఇదే సింప్లీఫోర్జ్ క్రియేషన్స్ నిర్మించింది.