![Hyderabad man dies after falling into Karnataka's Hebbe falls](/styles/webp/s3/article_images/2024/06/11/karnataka-man-died.jpg.webp?itok=vWWPPX2R)
బెంగళూరు: కర్ణాటకలోని హెబ్బే జలపాతం వద్ద హైదరాబాద్‌కు చెందిన 25 ఏళ్ల యువకుడు ప్రమాదవశాత్తు నీటిలో జారిపడి ప్రాణాలు కోల్పోయాడు. మృతుడిని హైదరాబాద్‌కు చెందిన శ్రవణ్‌గా గుర్తించాడు. స్నేహితులతో కలిసి సరదాగా విహార యాత్రకు వెళ్లి గడపాలనుకున్న శ్రవణ్ కథ.. ఎవరూ ఊహించని విధంగా విషాదంతంగా మారింది. ఈ ఘటన రాష్ట్రంలోని లింగడహళ్లి పోలీస్‌స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది.
వివరాలు.. హైదరాబాద్‌కు చెందిన శ్రవణ్ తన స్నేహితుడితో కలిసి చిక్కమగళూరు పర్యటనకు వెళ్లాడు. వీరిద్దరూ బైక్ అద్దెకు తీసుకుని కొన్ని పర్యటక ప్రాంతాలను సందర్శించారు. సోమవారం కెమ్మనగుండిలోని హెబ్బె జలపాతం వద్దకు చేరుకున్నారు. గత కొన్ని రోజులుగా ఇక్కడ వర్షాలు కురుస్తుండటంతో జలపాతం వద్ద నీరు ఉద్ధృతంగా ప్రవహిస్తోంది.
ఈక్రమంలో జలపాతం దగ్గర సెల్ఫీ తీసుకునే ప్రయత్నంలో.. శ్రవణ్, అతని స్నేహితుడు ఇద్దరూ కాలుజారి నీటిలో పడిపోయారు. గమనించిన స్థానికులు వీరిని రక్షించి బయటకు తీసుకొచ్చారు. అయితే, నీటిలో శ్రవణ్ తలకు బండరాయి తగిలి తీవ్రంగా గాయపడ్డాడు. చికిత్స నిమిత్తం అతడిని సమీపంలోని ఆసుపత్రికి తరలించగా.. అప్పటికే మృతిచెందినట్లు వైద్యులు వెల్లడించారు.
అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వాస్పత్రికి తరలించారు. మృతుడు హైదరాబాద్‌లోని ఓ ప్రముఖ ఈ-కామర్స్ సంస్థలో సిస్టమ్ అనలిస్ట్‌గా పనిచేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment