
Anjani Kumar was threatened by a man on Whatsapp: నగర పోలీసు కమిషనర్ అంజనీకుమార్‌ను ఫోన్ ద్వారా దూషించి, బెదిరించిన వ్యక్తి కర్ణాటకలో ఉన్నట్లు సిటీ సైబర్ క్రైమ్ పోలీసులు గుర్తించారు.
సాక్షి, హైదరాబాద్: నగర పోలీసు కమిషనర్ అంజనీకుమార్‌ను ఫోన్ ద్వారా దూషించి, బెదిరించిన వ్యక్తి కర్ణాటకలో ఉన్నట్లు సిటీ సైబర్ క్రైమ్ పోలీసులు గుర్తించారు. మంగళవారం చోటు చేసుకున్న ఈ వ్యవహారంపై కేసు నమోదు చేసుకున్న అ«ధికారులు సాంకేతికంగా ముందుకు వెళ్తున్నారు. నిందితుడిని పట్టుకోవడానికి దర్యాప్తు ముమ్మరం చేశారు. సీపీ అంజనీకుమార్ గత శుక్రవారం నుంచి సైదాబాద్ కేసులో తలమునకలై ఉన్నారు. ఇది లా ఉండగా..మంగళవారం ఉదయం ఆయనకు రెండు నెంబర్ల నుంచి ఫోన్లు వచ్చాయి.
అవతలి వ్యక్తి అభ్యంతరకంగా, బెదిరించే ధోరణిలో మాట్లాడారు. దీంతో ఆయన సదరు వ్యక్తి ఏదో ఇబ్బందిలో ఉండి ఉంటాడని భావించి, సహాయం అందించాల్సిందిగా సూచిస్తూ ప్రధాన కంట్రోల్ రూమ్‌కు ఆ రెండు నెంబర్లు పంపారు. ఆ సమయంలో విధుల్లో ఉన్న కానిస్టేబుల్ కె.మురళి ఆ నెంబర్లతో సంప్రదించి విషయం తెలుసుకునే ప్రయత్నం చేయగా అవతలి వ్యక్తి అభ్యంతరకరంగా బదులిచ్చారు. దీంతో ఐపీసీలోని 189, 506, ఐటీ యాక్ట్‌లోని 67 సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. ఆ వ్యక్తి కర్ణాటకలో ఉన్నట్లు గుర్తించారు.