![Telugu People Passed Away In Madhya Pradesh Jabalpur Accident Full Details Here](https://www.sakshi.com/styles/webp/s3/article_images/2025/02/11/Jabalpur-Accident.jpg.webp?itok=5twcNWAU)
హైదరాబాద్, సాక్షి: మధ్యప్రదేశ్‌లో ఘోర రోడ్డు ప్రమాదం తెలుగువారిని బలిగొంది. మంగళవారం ఉదయం హైవేపై ఓ మినీ బస్సును ట్రక్కు ఢీ కొట్టింది. ఈ ప్రమాదంలో ఏడుగురు అక్కడికక్కడే మృతి చెందగా.. మరొకరు ఆస్పత్రిలో చికిత్స పొందుతూ కన్నుమూశారు. మరొకరికి తీవ్ర గాయాలవ్వగా.. చికిత్స అందుతోంది. మృతులంతా హైదరాబాద్ నాచారం ప్రాంతానికి చెందినవాళ్లుగా నిర్ధారణ అయ్యింది.
హైదరాబాద్ నాచారంలోని కార్తికేయ నగర్, రాఘవేంద్ర నగర్‌లకు చెందిన స్థానికులు మూడు మినీ బస్సుల్లో మహా కుంభమేళా యాత్రకు వెళ్లారు. అయితే తిరుగు ప్రయాణంలో అందులోని ఓ బస్సును.. రాంగ్ రూట్‌లో వచ్చిన సిమెంట్‌లోడ్ ట్రక్కు ఢీ కొట్టింది. ఈ ప్రమాదంలో ఏడుగురు అక్కడికక్కడే చనిపోయారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. గాయపడిన వాళ్లను ఆస్పత్రులకు తరలించారు.
జబల్‌పూర్(Jabalpur) సిహోరా దగ్గర జాతీయ రహదారి 30పై మంగళవారం ఉదయం 9 గంటల ప్రాంతంలో ఈ ఘోరం చోటు చేసుకుందని కలెక్టర్ దీపక్ కుమార్ సక్సేనా మీడియాకు తెలిపారు. ప్రమాదానికి గురైన మినీ బస్ నెంబర్ AP29 W1525 అని తెలిపారు. ఘటనపై నాచారం పోలీసులకు సమాచారం అందించినట్లు తెలిపారు. అలాగే.. మృతుల వివరాలను ఆయన మీడియాకు వివరించారు.
మృతుల వివరాలు
- బాలకృష్ణ శ్రీరామ్,
- సంతోష్ ఖాన్సారీ,
- శశికాంత్ ఖాన్సారీ,
- ఆనంద్ ఖాన్సారీ
- టీవీ ప్రసాద్
- మల్లా రెడ్డి
- రవి వైశ్య,
- నవీన్
గాయపడ్డవాళ్లు
- వీ సంతోష్
మృతుల్లో.. సాఫ్ట్‌వేర్ ఇంజినీర్‌గా పని చేసే శశికాంత్ కుటుంబ సభ్యులే ఉన్నట్లు సమాచారం. ఏడుగురి మృతితో ఆ కుటుంబంలో తీవ్ర విషాద ఛాయలు అలుముకున్నాయి.
హైదరాబాద్‌వాసులే
ప్రమాదంలో మరణించినవాళ్లంతా ఏపీ వాసులంటూ తొలుత ప్రచారం జరిగింది. అయితే.. వాళ్లంతా హైదరాబాద్ నాచారం ప్రాంతానికి చెందిన వాళ్లుగా తర్వాత అధికారులు నిర్ధారించుకున్నారు. ప్రమాద సమయంలో అందులో 9 మంది ఉన్నట్లు అక్కడి పోలీసులు వెల్లడించారు.
సీఎం రేవంత్ దిగ్భ్రాంతి
మధ్యప్రదేశ్ లోని జబల్‌పూర్ సమీపంలో జరిగిన రోడ్డు ప్రమాదంపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఈ దుర్ఘటనలో హైదరాబాద్ నాచారం ఏరియాకు చెందిన వారు చనిపోయినట్లు సమాచారం అందటంతో వెంటనే అధికారులను అప్రమత్తం చేశారు. గాయపడిన వారికి మెరుగైన వైద్య సాయం అందేలా ఏర్పాట్లు చేయాలని, అవసరమైన సహాయక చర్యలు చేపట్టాలని ముఖ్యమంత్రి ఆదేశించారు.
కేంద్రమంత్రి కిషన్ రెడ్డి దిగ్భ్రాంతి
జబల్‌పూర్ ప్రమాదంపై కేంద్ర బొగ్గు, గనుల శాఖ మంత్రి, బీజేపీ తెలంగాణ రాష్ట్ర శాఖ అధ్యక్షుడు జి.కిషన్ రెడ్డి దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఘటన సమాచారం తెలిసిన వెంటనే.. మధ్యప్రదేశ్ ప్రభుత్వ అధికారులతో మాట్లాడారు. మృతుల కుటుంబాలకు అవసరమైన అన్ని రకాల సహాయ, సహకారాలను అందించాలని, గాయపడిన ఇద్దరికి సరైన చికిత్సనందించాలని కేంద్రమంత్రి సూచించారు. రంగారెడ్డి, మేడ్చల్ మల్కాజ్‌గిరి జిల్లాల కలెక్టర్ల తోనూ మాట్లాడి, ఆయా కుటుంబాలకు అవసరమైన సహాయాన్ని అందించాలని ఆదేశించారు. బాధిత కుటుంబసభ్యులనూ ఫోన్‌లో కేంద్రమంత్రి పరామర్శించారు.
Jabalpur, MP: A bus from Andhra Pradesh returning from Prayagraj collided with a truck near Sihora on NH-30, killing seven people. The accident occurred around 9:15 AM near Mohla-Bargi. Officials, including the Collector and SP, have reached the site pic.twitter.com/j6uQD592Wl
— IANS (@ians_india) February 11, 2025
Comments
Please login to add a commentAdd a comment