
కంటి సమస్యలను అధిగమించడమే లక్ష్యంగా సీసీఎంబీ, ఎల్‌వీపీఐలతో కలిసి ఐఐటీహెచ్‌లో పరిశోధనలు
కుందేళ్లు, ఇతర జంతువులపై ప్రయోగాలు
మంచి ఫలితాలనిచ్చాయంటున్న పరిశోధకులు
సాక్షిప్రతినిధి, సంగారెడ్డి : కంటిలో కీలకభాగమైన కార్నియా లోపంతో చూపును కోల్పోతున్న వారిసంఖ్య రోజురోజుకు పెరుగుతోంది. ఎవరైనా కళ్లు దానమిస్తే.. ఆ కంటిని అవయవ మార్పిడి చేసి కార్నియాతో చూపు కోల్పోయిన వారికి వైద్యులు చూపును ప్రసాదిస్తారు. ఇప్పుడు కళ్లను దానం చేసే వారిసంఖ్య పరిమితంగా ఉండగా, కార్నియా అవసరమున్న రోగుల సంఖ్య ఎక్కువగా పెరుగుతోంది. ఈ సమస్యలను అధిగమించడమే లక్ష్యంగా ఐఐటీ హెచ్‌లో (ఇండియన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ హైదరాబాద్)లో ప్రత్యేక పరిశోధన ప్రాజెక్టు కొనసాగుతోంది.
త్రీడీ ప్రింటింగ్ సాంకేతికతతో ఈ కార్నియాను బయోప్రింటింగ్ చేయడంపై పరిశోధనలు చేస్తున్నారు. ఎల్‌వీ ప్రసాద్ ఐ ఇనిస్టిట్యూట్, సీసీఎంబీ (ది సెంటర్ ఫర్ సెల్యులార్ అండ్ మోలిక్యులర్ బయోలజీ)లతో కలిసి ఐఐటీహెచ్‌లోని బయోమెడికల్ ఇంజనీరింగ్ విభాగం ఈ పరిశోధన ప్రాజెక్టును చేపట్టింది. ఇది సత్ఫలితాలిస్తుందని ఐఐటీహెచ్ బయోమెడికల్ ఇంజనీరింగ్ విభాగ ఫ్రొఫెసర్ డాక్టర్ ఫాల్గుణి పఠి ‘సాక్షి’కి తెలిపారు.
ఈ పరిశోధనల్లో రూపుదిద్దుకున్న త్రీడీ బయో ప్రింటింగ్ కార్నియాను ముందుగా జంతువులపై ప్రయోగిస్తున్నారు. ఇప్పటికే కుందేళ్లపై చేసిన ప్రయోగం మంచి ఫలితాలిచ్చిoది. రానున్న రోజుల్లో ఈ త్రీడీ బయో ప్రింటెడ్ కార్నియాను మనుషులపై ప్రయోగించనున్నారు. దీనిపై ప్రభుత్వం నుంచి అనుమతులు పొందనున్నారు.
బయోఇంక్‌తో త్రీడీ ప్రింటింగ్
రోగుల కళ్ల నుంచి బయోఇంక్ (జెల్ లాంటి పదార్థం)ను సేకరిస్తారు. దీనికి కొన్ని రకాల సెల్‌లను యాడ్ చేసి త్రీడీ ప్రింటింగ్ టెక్నాలజీని ఉపయోగించి కార్నియాను ప్రింట్ చేస్తున్నారు. సాధారణంగా కార్నియా అనేది 10.8 మిల్లీమీటర్ల నుంచి 12.8 మిల్లీ మీటర్ల సైజులో ఉంటుంది. ఇటీవల కాలంలో 3డి ప్రింటింగ్ టెక్నాలజీ ప్రాధాన్యం పెరుగుతోంది.
భవనాలతోపాటు, జ్యువెలరీ, మానవులు, ఇతర జీవుల అవయవాలు.. ఇలా అనేక రకాల వస్తువులను త్రీడీ ప్రింటింగ్ టెక్నాలజీతో రూపొందిస్తున్నారు. ఈ క్రమంలోనే సూక్ష్మస్థాయిలో 10 మి.మీల నుంచి 12 మిల్లీమీటర్ల సైజులో ఉండే ఈ అతి చిన్న మానవ అవయవాన్ని ఇదే త్రీడీ ప్రింటింగ్ టెక్నాలజీ ద్వారా రూపొందించడం గమనార్హం.
4.9 బిలియన్ మందికి అంధత్వం
ప్రపంచంలో సుమారు 4.9 బిలియన్ మంది అంధత్వంతో బాధపడుతున్నట్టు గణాంకాలు చెబుతున్నాయి. ఇందులో నాలుగో వంతు కంటిలోని కార్నియాలోపంతోనే అంధత్వం వస్తున్నట్టు తేలింది. ఈ సమస్యకు కంటి దానమే ఇప్పటి వరకు ఉన్న పరిష్కారం. అయితే కళ్లను దానం చేసేవారు తక్కువగా ఉంటున్నారు. అవసరమున్న వారి సంఖ్య ఎక్కువగా ఉంటోంది. దీంతో చాలామంది చూపు లేకుండానే జీవితాన్ని వెళ్లదీస్తున్నారు. ఈ సమస్యలను అధిగమించడమే లక్ష్యంగా ఈ పరిశోధనలు చేస్తున్నట్టు పరిశోధకులు చెబుతున్నారు.
కళ్ల సేకరణలో ఇబ్బందులు
కళ్లు దానమిచ్చిన వారినుంచి కంటి సేకరణ ప్రస్తుతం క్లిష్టతరంగా ఉంది. చనిపోయిన వ్యక్తి శరీరం నుంచి నిరీ్ణత సమయంలో కళ్లను సేకరించాలి. సేకరించిన కళ్లను భద్రపరచడం వంటి ప్రక్రియ కొంత వ్యయ ప్రయాసలతో కూడుకున్నది. తగిన వైద్య నిపుణుల అవసరం ఉంటుంది. ఈ క్రమంలో వివిధ కారణాలతో ఒక్కోసారి సేకరించిన కళ్లు పాడైపోయి.. వృథాగా పోతున్న ఘటనలు కూడా ఉంటున్నాయి. ఇలాంటి సవాళ్లకు ఈ పరిశోధనలు కొంత మేరకు పరిష్కారం లభిస్తుందనే అభిప్రాయం వ్యక్తమవుతోంది.
కార్నియా దెబ్బతినడానికి ఇవీ కారణాలు..
» ప్రధానంగా ఏమైనా ప్రమాదాలు జరిగి కంటికి గాయాలైతే ఈ కార్నియా దెబ్బతింటుంది.
» కంటి ఇన్‌ఫెక్షన్‌తో కూడా కార్నియా చెడిపోతుంది.
» షుగర్ వ్యాధిగ్రస్తులతోపాటు, బీపీ ఉన్న వారికి కూడా క్రమంగా కార్నియాపై ప్రభావం పడుతుంది. దీంతో చూపుమందగించడం వంటి సమస్యలు ఉత్పన్నమవుతుంటాయని డాక్టర్లు చెబుతున్నారు.