పీజీ చేసినా పెరటి మొక్క పేరు తెలియని విద్యార్థులు శాస్త్రీయ నామాలకే నేటి తరం పరిమితం..ఫార్మా పరిశ్రమలకు తగ్గుతున్న పరిశోధనలు బొటానికల్ ఇండియా సర్వేలో తేలిన వాస్తవాలు
సాక్షి, హైదరాబాద్: పెరట్లో మొక్కలు.. వాటి పేర్లు, ఉపయోగాల గురించి చిన్నప్పుడు నాయనమ్మో.. అమ్మమ్మో చెబితే నేర్చుకునేవాళ్లు. బడికి వెళ్లాక టీచర్ మొక్కల శాస్త్రీయ నామాలు చెబుతుంటే.. ‘ఓ అదా.. మా పెరట్లోని జిల్లేడు చెట్టు.. పొలం మధ్యలో వావిలాల చెట్టు’ అని తేలికగా గుర్తుపట్టేవాళ్లు. ఇప్పుడు కాలం మారింది. వృక్ష శాస్త్రంలో పీజీ చేసిన విద్యారి్థకి కూడా ఇంట్లోని మందార చెట్టు పేరు తెలియడం లేదు. బొటానికల్ ఇండియా ఇటీవల చేసిన సర్వేలో అనేక ఆశ్చర్యకరమైన విషయాలు బయటపడ్డాయి. విద్యార్థుల వైఖరి ఇలాగే కొనసాగితే వారిలో శాస్త్రీయ కోణమే లోపిస్తుందని బొటానికల్ ఇండియా శాస్త్రవేత్తలు కేంద్ర ప్రభుత్వం దృష్టికి తెచ్చారు. పాఠశాల స్థాయి నుంచే మొక్కలపై అవగాహన పెంచాలని సూచించారు.
సర్వేలోని కీలక విషయాలు
⇒ సర్వేలో భాగంగా పీజీ పూర్తిచేసిన 867 మందిని పెరటి మొక్కలపై ప్రశ్నలు అడిగితే.. సొంత ఊరిలో కనిపించే ఔషధ మొక్కల గురించి కూడా కనీస సమాచారం ఇవ్వలేకపోయారు. జిల్లేడు, తిప్పతీగ, బంతి మొక్కలను చూపిస్తే వంద మందిలో 28 మంది మాత్రమే తెలుగు పేర్లు చెప్పారు. మిగతా వాళ్లతా శాస్త్రీయ నామాలే చెప్పారు. కుండీల్లో పెరిగే మొక్కల గురించి ప్రశ్నలు వేసినప్పుడు వందకు 20 శాతం మంది వాటి ఉపయోగాలను వెల్లడించలేకపోయారు.
⇒ నాగజెముడును అనేక ఔషధాల్లో వినియోగిస్తున్నాయి. పల్లె వాకిట్లో తేలికగా దొరికే ఈ మొక్క గురించి వృక్షశాస్త్రంలో డిగ్రీ చేసిన 428 మందిని ప్రశి్నస్తే, 48 శాతం దీని ఆనవాలు తెలియదన్నారు. 26 శాతం ఇదో ఔషధ మొక్క... విదేశాల్లో పండిస్తారని చెప్పారు. 18 శాతం మంది మాత్రమే భారతీయ పల్లె పెరిగే మొక్కగా గుర్తించారు.
⇒ పదేళ్ల క్రితం వరకూ పల్లెల్లో విరివిగా కనిపించిన మంగళగిరి కంచె గురించి 60 శాతం బోటనీ విద్యార్థులకు అవగాహనే లేదు. కార్బన్–డై–ఆక్సైడ్‌ను నియంత్రించడంలో దీని పాత్ర గురించి అసలే చెప్పలేకపోయారు.
⇒ వైద్య రంగంలో ఉన్నవారికి కూడా ఉమ్మెత్త మొక్క గొప్పతనం తెలియడం లేదు. ఇంటర్లో బైపీసీ చదివిన 250 మందిని ఈ మొక్క గురించి ప్రశి్నస్తే.. 186 మంది అదేం మొక్క? అని ఎదురు ప్రశ్నించారు. ఫొటో చూశాక శాస్త్రీయ నామం చెప్పగలిగారు.
⇒ బతకమ్మ సందడి వల్ల తెలుగు విద్యార్థులు తంగేడు చెట్టును గుర్తుపడుతున్నారు. నూటికి 80 శాతం మంది ఇది తంగేడు పూల మొక్క అని చూడగానే చెప్పారు.
⇒ రకరకాల షాంపూల గురించి «గుక్క తిప్పుకోకుండా చెప్పగలిగే ప్రస్తుత యువతరంలో 78 శాతం మందికి కుంకుడు చెట్టు గురించి ఇసుమంతైనా తెలియటంలేదు. ఈ చెట్టు ఆకులు ఎలా ఉంటాయో సర్వేలో పాల్గొన్న 92 శాతం మందికి తెలియలేదు.
కాల గర్భంలో ఎన్నో మొక్కలు (బాక్స్)
విరిగిన ఎముకలు కట్టుకోవడానికి వాడే నల్లేరు.. కఫంతో ఊపిరి ఆగిపోయే పరిస్థితి నుంచి కాపాడే కరక్కాయ.. ప్రాణం పోయేలా అనిపించే తలనొప్పిని సైతం తగ్గించే శొంఠి.. కురుపు ఏదైనా ఆకుతోనే నయం చేసే జిల్లేడు.. చర్మవ్యాధుల పనిపట్టే మారేడు.. సర్వ రోగ నివారణి తులసి వంటి ఎన్నో అద్భుత ఔషధ మొక్కలు మన పెరటి వైద్యం నుంచి కని్పంచకుండా పోతున్నాయి.
ఇలా అయితే కష్టం
మొక్కలు, వాటి ప్రయోజనాలు తెలుసుకునే ఆసక్తి విద్యార్థి దశ నుంచే ఏర్పడాలి. లేకపోతే ఔషధ రంగం ఇతర దేశాల చేతుల్లోకి వెళ్తుంది. ఇప్పటివరకు 3.5 లక్షల మొక్క జాతులను వృక్ష శాస్త్రవేత్తలు గుర్తించారు. ఇందులో 2.78 లక్షల మొక్కలపై ప్రపంచవ్యాప్తంగా పరిశోధనలు జరిగాయి. వీటిల్లో చాలా వరకు మన పల్లెల్లో ఒకప్పుడు కని్పంచినవే. –నవీన్ చావ్లా (ఫార్మా రంగ నిపుణుడు)
విద్యలో మార్పు తేవాలి
నేడు అందరూ కంప్యూటర్ సైన్స్ వైపు వెళ్తున్నారు. వృక్షశాస్త్ర ప్రాధాన్యత తగ్గుతోంది. మొక్కల ప్రాధాన్యతను భావి తరాలకు చెప్పే బయో డైవర్సిటీ బోర్డులకు అత్యంత ప్రాధాన్యం ఇవ్వాలి. అప్పుడే ఈ పరిస్థితిలో మార్పు వస్తుంది. – డాక్టర్ కె తులసీరావు, డైరెక్టర్, గ్లోబల్ బయోడైవర్సిటీ.
Comments
Please login to add a commentAdd a comment