వాష్‌రూంలో టూత్‌బ్రష్‌.. మీ పళ్లు మటాష్‌!! | Bacteria in washrooms are getting onto toothbrushes | Sakshi
Sakshi News home page

వాష్‌రూంలో టూత్‌బ్రష్‌.. మీ పళ్లు మటాష్‌!!

Published Fri, Jan 31 2025 1:34 AM | Last Updated on Fri, Jan 31 2025 1:34 AM

Bacteria in washrooms are getting onto toothbrushes

సిద్దిపేట ప్రభుత్వ డిగ్రీ కళాశాల విద్యార్థుల తాజా అధ్యయనంలో వెల్లడి 

వాష్‌రూంలలోని బ్యాక్టీరియా టూత్‌బ్రష్‌లపై చేరుతోందని స్పష్టీకరణ

బ్రష్‌ల వినియోగంలో జాగ్రత్తలు తీసుకోకపోతే అనారోగ్యం తప్పదని హెచ్చరిక

‘మీ టూత్‌పేస్ట్‌లో ఉప్పుందా?’.. అంటూ వచ్చే టీవీ యాడ్‌ను చూసే ఉంటారుగా.. దృఢమైన దంతాలు, చిగుళ్ల కోసం ఉప్పున్న తమ పేస్ట్‌నే వాడాలంటూ ఓ ప్రముఖ టూత్‌పేస్ట్‌ కంపెనీ చేసుకొనే ప్రచారం అది. మరి మీ టూత్‌బ్రష్‌లు వాష్‌రూంలో ఉంటాయా? బ్రష్‌ చేసుకొని తిరిగి వాటిని అక్కడే ఉంచుతారా? అయితే మీకు పంటి సమస్యలు తప్పవని తాజా అధ్యయనం తేల్చిచెబుతోంది!! 

సాక్షి, సిద్దిపేట: దంతాలు ఆరోగ్యంగా ఉండాలంటే సరైన టూత్‌పేస్ట్‌ను ఎంపిక చేసుకోవడం ఒక్కటే సరిపోదని.. టూత్‌బ్రష్‌లను సరైన చోట ఉంచడం కూడా ముఖ్యమని సిద్దిపేట ప్రభుత్వ డిగ్రీ కళాశాల విద్యార్థులు చేపట్టిన పరిశోధన తేల్చిచెబుతోంది. టూత్‌బ్రష్‌లపై ప్రధానంగా మూడు రకాల బ్యాక్టీరియాలు ఉంటున్నాయని.. బ్రష్‌ల వినియోగంలో తగిన జాగ్రత్తలు తీసుకోకపోతే అనారోగ్యాలకు గురికావాల్సి వస్తుందని హెచ్చరిస్తోంది. 

వాష్‌రూంలలో ఉంచితే అంతే.. 
అటాచ్డ్‌ వాష్‌రూంలు ఉన్న ఇళ్లలో నివసించే వారిలో చాలా మంది తమ టూత్‌బ్రష్‌లను భద్రపరుస్తుండటం సహజమే. అయితే అలా వినియోగిస్తున్న టూత్‌బ్రష్‌లపై భారీగా సూక్ష్మజీవులు పేరుకుపోతున్నాయని సిద్దిపేట ప్రభుత్వ డిగ్రీ కళాశాల విద్యార్థుల అధ్యయనంలో తేలింది. 

టూత్‌ బ్రష్‌లను వాష్‌రూంలో ఉంచడం వల్ల ఫ్లష్‌ చేసిన ప్రతిసారీ కమోడ్‌ నుంచి నీటితుంపర్లు ఎగిరిపడతాయని.. తద్వారా కమోడ్‌లో ఉండే బ్యాక్టీరియా నీటితుంపర్ల ద్వారా గాల్లో వ్యాపిస్తూ అక్కడ ఉండే బ్రష్‌లపైకి ఎక్కువగా చేరుతున్నాయని నిర్ధారణ అయింది. 

అదే వాష్‌రూంకు దూరంగా, కాస్త గాలి, ఎండ తగిలే చోట టూత్‌బ్రష్‌లను ఉంచిన చోట సూక్ష్మక్రిములు నశిస్తున్నట్లు పరిశోధనలో వెల్లడైంది. అలాగే ఇంట్లోని అందరి టూత్‌బ్రష్‌లను కూడా ఒకే దగ్గర పెట్టడం అంత సురక్షితం కాదని నిరూపితమైంది. 

45 రోజులపాటు సాగిన పరిశోధన 
టూత్‌ బ్రష్‌ల శుభ్రత, సూక్ష్మక్రిముల నుంచి సంరక్షణ అనే అంశంపై సిద్దిపేట ప్రభుత్వ డిగ్రీ కళాశాల మైక్రోబయాలజీ విభాగం ఆధ్వర్యంలో ద్వితీయ, తృతీయ సంవత్సరం విద్యార్థులు పరిశోధన చేపట్టారు. 

కళాశాల సూక్ష్మ జీవశాస్త్ర ఇన్‌చార్జి, అసిస్టెంట్‌ ప్రొఫెసర్‌ డాక్టర్‌ మదన్‌ మోహన్‌ పర్యవేక్షణలో 45 రోజులపాటు పరిశోధన చేశారు. కళాశాలకు చెందిన విద్యార్థులు, ఆధ్యాపకులు వినియోగిస్తున్న టూత్‌బ్రష్‌ల నుంచి 100 నమూనాలను శ్వాబ్‌ల ద్వారా సేకరించారు. వాటిలో బ్యాక్టీరియా ఉందా? ఉంటే ఏయే రకాల సూక్ష్మక్రిములు ఉన్నాయనే దానిపై పరిశోధన చేపట్టారు. 

మూడు రకాల బ్యాక్టీరియాల గుర్తింపు 
శాంపిల్స్‌ సేకరించిన టూత్‌బ్రష్‌లలో ప్రధానంగా మూడు రకాల బ్యాక్టీరియాలు ఉన్నట్లు విద్యార్థులు గుర్తించారు. స్ట్రెప్టోకోకస్‌ మ్యుటాన్స్‌ రకం బ్యాక్టీరియా 50 శాతం, స్టెఫైలోకోకస్‌ ఆర్యస్‌ 40 శాతం, ఎస్చెరిషియా కోలి (ఈ–కొలి) బ్యాక్టీరియా 20 శాతం ఉన్నట్లుగా తేల్చారు. 

పిప్పిపళ్లు, దంతాల క్షీణత, అరుగుదలకు స్ట్రెప్టోకోకస్‌ మ్యుటాన్స్‌ బ్యాక్టీరియా కారణమవుతుందని చెప్పారు. అలాగే స్టెఫైలోకోకస్‌ ఆర్యస్‌ వల్ల గొంతు సమస్యలు, మౌత్‌ అల్సర్, ఈ–కోలి బ్యాక్టీరియా వల్ల జీర్ణసంబంధ సమస్యలు వచ్చే అవకాశం ఉంటుందన్నారు.

యూవీ లైట్‌తో బ్యాక్టీరియా మాయం
బ్యాక్టీరియా ఉన్న బ్రష్‌లను ఆయా విద్యార్థులు సొంతంగా తయారు చేసిన యూవీ లైట్‌బాక్స్‌లో పెట్టి పరీక్షించగా వాటిపై ఎలాంటి క్రిములు లేవని తేలింది. టూత్‌ బ్రష్‌లను వినియోగించే ముందు యూవీ లైట్‌ బాక్స్‌లో 5 నుంచి 10 నిమిషాలపాటు ఉంచడం ద్వారా బ్రష్‌ శానిటైజ్‌ అవుతుందన్నారు. 

మరోవైపు ఒకవేళ బ్రష్‌లను ఒకేచోట పెట్టాల్సి వస్తే వాటికి క్యాప్‌లను పెట్టాలని ఈ ప్రయోగంలో పాలుపంచుకున్న విద్యార్థులు సూచిస్తున్నారు. ప్రతిరోజూ వేడినీటితో బ్రష్‌ను శుభ్రం చేశాకే వాడాలని.. మూడు నెలలకోసారి టూత్‌ బ్రష్‌ను తప్పనిసరిగా మార్చాలని చెబుతున్నారు. 

ప్రజలకు అవగాహన కల్పించేందుకే 
ప్రిన్సిపాల్‌ సునీత సూచనలతో సూక్ష్మజీవశాస్త్ర విభాగాధిపతి డాక్టర్‌ మదన్‌మోహన్‌ పర్యవేక్షణలో టూత్‌బ్రష్‌ల శుభ్రత, సూక్ష్మక్రిముల నుంచి సంరక్షణపై పరిశోధన చేశాం. ప్రజలకు అవగాహన కల్పించాం. యూవీ బాక్స్‌ను సైతం తయారు చేశాం.     – విద్యార్థినులు.. మౌనిక, షారోన్, నాగలక్ష్మి, సిద్ద, స్నేహ, సుష్మిత 

ప్రభుత్వ జిజ్ఞాస పోటీలకు పంపుతాం.. 
ప్రతి సంవత్సరం ఏదో ఒక అంశంపై పరిశోధన చేస్తాం. రాష్ట్ర స్థాయిలో ప్రభుత్వం నిర్వహించే జిజ్ఞాస పోటీలకు పంపిస్తున్నాం. టూత్‌ బ్రష్‌ల ద్వారా బ్యాక్టీరియా వ్యాప్తి చెందుతోందన్న విషయమై ప్రజలకు అవగాహన కల్పించేందుకు పరిశోధన చేపట్టాం.  – డాక్టర్‌ మదన్‌ మోహన్, సూక్ష్మజీవశాస్త్ర విభాగాధిపతి

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement