![High Throughput Phenotyping Facility Center at ICRISAT](https://www.sakshi.com/styles/webp/s3/article_images/2024/12/29/corn.jpg.webp?itok=TC9r5Nf5)
ప్రపంచంలో ఎక్కడి నుంచైనా పరిశోధనకు వీలు
శాస్త్రవేత్తలు పొలాల్లోకి రావాల్సిన అవసరం లేదు
ఇక్రిశాట్‌లో ‘హైథ్రోపుట్ ఫినోటైపింగ్ ఫెసిలిటీ’సెంటర్
పంటలపై పరిశోధనకు ఆధునిక సాంకేతికత
సాక్షి ప్రతినిధి, సంగారెడ్డి: వ్యవసాయ శాస్త్రవేత్తలు తమ పరిశోధనల కోసం పంట పొలాల్లో తిరగాల్సి ఉంటుంది. ప్రత్యక్షంగా వెళ్లి మొక్కల తీరును పరిశీలించి డేటాను సేకరించాలి. కానీ, పంటలను ప్రపంచంలో ఎక్కడి నుంచైనా అధ్యయనం చేయ గల ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని ఇక్రిశాట్‌లో ఉన్న ప్రత్యేక పరిశోధన క్షేత్రంలో వినియోగిస్తున్నా రు.
పంటల వద్దకు వెళ్లకుండానే తామున్న చోట నుంచే పంటల తీరును పరిశీలించేందుకు వీలుండే ఆధునిక సాంకేతికతను వినియోగిస్తున్నారు. ‘హై థ్రోపుట్ ఫినోటైపింగ్ ఫెసిలిటీ’అనే అధునాతన ల్యా బ్ ద్వారా ఇతర దేశాల్లో ఉన్న సైంటిస్టులు కూడా ఇక్కడి పంటల తీరును ఎప్పటికప్పుడు తెలుసుకునే వీలు కలుగుతోంది. ప్రస్తుతానికి ఈ ఆధునిక ప్రయోగశాలలో జొన్న పంటపై పరిశోధన జరుగుతోంది.
అంతర్జాతీయ పంటల పరిశోధన సంస్థ..
ఇక్రిశాట్ ప్రధాన కార్యాలయం హైదరాబాద్‌లోని రామచంద్రాపురంలో ఉన్నప్పటికీ.. దీని ప్రాంతీయ కార్యాలయాలు కెన్యా, మాలి, నైజీరియా, మలావీ, ఇథియోఫియా, జింబాబ్వే తదితర ఆఫ్రికా దేశాల్లో ఉన్నాయి. ఆయా దేశాల్లో ఉన్న శాస్త్రవేత్తలు సైతం ఇక్కడి పరిశోధన క్షేత్రంలో పెరుగుతున్న మొక్కలను వీక్షించేందుకు, పరిశీలించేందుకు ఈ ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని వాడుతున్నారు.
మొక్క ప్రతిస్పందనపై క్షణక్షణం నిఘా
హైథ్రోపుట్ ఫినోటైపింగ్ ఫెసిలిటీ కేంద్రంలో ప్రస్తుతం జొన్న పంటకు సంబంధించి ఐదు వేల మొక్కలను పెంచుతున్నారు. ఈ సెంటర్ మొక్క ప్రతి స్పందనను క్షణక్షణం రికార్డు చేస్తుంది. ఈ డేటాను ఆన్‌లైన్‌లో నిక్షిప్తం చేస్తుంది. మొక్క పత్రహరితానికి సంబంధించిన ఫ్లోరోసెన్స్, మొక్క 3డీ మాడలింగ్, ఆర్‌జీబీ ఇమేజింగ్, హైపర్ స్పెక్ట్రల్ ఇమేజింగ్, థర్మల్ ఇమేజింగ్.. ఇలా మొక్కను పూర్తిస్థాయిలో స్కాన్ చేయగల ఆధునిక సాంకేతికతను వినియోగిస్తున్నారు.
నీటి వాడకానికీ లెక్క ఉంటుంది..
మొక్క ఎప్పడు ఎంత నీటిని వాడుకుంటుందనే వివరాలు కూడా ఈ ల్యాబ్‌లో రికార్డు అవుతాయి. మొక్క ట్రే కింద ప్రత్యేకంగా లోడ్ సెన్సార్ ఉంటుంది. మొక్కకు పట్టిన నీళ్లు ఎన్ని ఆవిరయ్యాయి? ఎంత వినియోగమైంది? అనే వివరాలను సేకరిస్తుంది. వాతావరణంలో వచ్చిన మార్పుల కారణంగా మొక్క ఎంత ఒత్తిడికి గురవుతుంది? మొక్కల ఎదుగుదల ఎలా ఉంటుంది? అనే అంశాలను ఇమేజ్, వీడియో రూపంలో కూడా రికార్డు చేస్తుంది.
మొక్కలు ఎంత నీళ్లు ఇస్తే తట్టుకోగలవు. నీళ్లు లేకపోతే ఎంత మేరకు అనుగడ సాధించగలవు? అనే అంశాలను పరిశీలించేందుకు వీలుంటుంది. తద్వారా నీటి కొరతను తట్టుకునే వెరైటీలు, అధిక వర్షాలకు తట్టుకునే వెరైటీలను కనుగొనే అవకాశం ఉంటుందని ఇక్రిశాట్ రిసెర్చ్ స్కాలర్ కల్పన తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment